Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 36

   

    "అపురూపలక్ష్మి గుర్తొచ్చిందా? నీకు మంచి స్నేహితురాలు కూడా కదూ. ఊరుకో రాధా జరిగిపోయినదానికి విచారిస్తూ కూర్చుని లాభంలేదు" అంది కిరణ్మయి ఓదార్పుగా.
   
    "అదికాదు కిరణ్. వీళ్ళంతా కలిసి చివరకు లక్ష్మిని ఎంత నీచంగా చిత్రీకరిస్తున్నారు? అది నిజం కాదు అన్నీ అబద్దాలు. వాళ్ళకు తెలియకుండానే ఆమెనో తిరుగుబోతుగా వర్ణించారు. చచ్చిపోయిన వాళ్ళ గురించి తెలిసినా చెడుగా మాట్లాడకూడదంటారు. వీళ్ళేమో లేని కథలన్నీ అల్లేస్తున్నారు. ఆ లాయర్ అయితే మరీ! తన క్లయింటుని కాపాడుకోవాలని లక్ష్మిని కాల్ గర్ల్ గా చిత్రీకరిస్తున్నాడు. లక్ష్మి ఎంత మంచిపిల్లో నాకు తెలుసు" అంది వెక్కుతూనే.
   
    "మరి ఆ విషయం అందర్లో గట్టిగా చెప్పివుండాల్సింది."
   
    "ఎలా చెప్పను? పోస్టుమార్టం రిపోర్టులో ఆమె కన్యకాదని తెలిసిందట. ఆ పాయింట్ పట్టుకుని నానా మాటలు అంటున్నారు. దానికి నేనేం సమాధానం చెప్పను?" ఆమెకు దుఃఖం మళ్ళీ ముంచుకొచ్చింది. కిరణ్మయి ఆమె పక్కనే కూర్చుని ఆప్యాయంగా తల నిమురుతూ అంది-
   
    "నీ మనసులో ఎలాంటి అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయో నేను అర్ధం చేసుకోగలను రాధా కాని అవి నీలోనే దాచుకున్నంతకాలం నిన్ను బాధపెడుతూనే ఉంటాయి. నాకు చెప్పమని అడగను కాని మంచి స్నేహితులకెవరికైనా చెపితే ఇంత వేదన వుండదు. అప్పటిక్కాని నీకు ఉపశమనం కలగదు."
   
    అనూరాధ చాలా సేపు మాట్లాడలేదు. మళ్ళీ తన 'సెల్'లోకి వెళ్ళిపోతుందా. ఇప్పుడు బయటపడకపోతే ఇక ఆమెనించి ఏదీ ఆశించకూడదు.
   
    "నీకు అపురూపలక్ష్మి గురించి తెలుసుకోవాలనందా కిరణ్మయి?" హఠాత్తుగా అడిగింది అనూరాధ.
   
    "ఉంది. ఎన్నిసార్లు ఆ ప్రస్తావన తెచ్చినా నువ్వు మాట మార్చే దానివి. అందుకే తరచి తరచి అడగడం లేదు. ఆమె జీవితం ఎందుకిలా అయిందో తెలుసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను."
   
    అనూరాధ మంచంమీద నుంచి లేచి సూట్ కేస్ తాళం తెరచి, రెండు పుస్తకాలు బయటకు తీసింది. మళ్ళీ వెంటనే తాళం వేసేసింది. కిరణ్మయి టెన్షన్ తో చూస్తోంది.
   
    "ఇవి లక్ష్మి డైరీలు చదివితే ఆమె ఎలాంటిదో ఆమె మానసిక పరిస్థితి ఎలాంటిదో తెలుస్తుంది. ఆ తరువాత నాకు తెలిసింది నేను చెప్తాను. కాని ఒక్కమాట. లక్ష్మి డైరీలు నా దగ్గరున్నట్టు ఎవరికీ తెలియకూడదు. నేనెందుకిలా చెప్తున్నానో అని చైద్వాక నీకే అర్ధమవుతుంది.
   
    "అలాగే కాని ఇవి నీ దగ్గరే ఎందుకుంచుకున్నావు? వాళ్ళ తల్లితండ్రులు వచ్చినప్పుడు యివ్వలేదెందుకు?"
   
    "చెప్పాగా, అది చదివాక నీకే తెలుస్తుందని. స్నేహితులకి చెప్పుకోగల సంగతులు తల్లిదండ్రులకు, అక్కచెల్లెళ్ళకి కూడా చెప్పుకోలేనివి ప్రతి మనిషికీ వుంటాయి. ఇవి చదివి వాళ్ళు బాధపడతారని తెలిసినప్పుడు, తెలిసి వాళ్ళను బాధపెట్టడం దేనికి? అందుకే ఇవ్వలేదు. ఇవ్వదలచుకోలేదు కూడా. నీకు లక్ష్మి జీవితంలో ఎలాంటి సంబందం లేదు. కాబట్టి నువ్వు చదివినా లక్ష్మి ఆత్మశాంతికి భంగం కలగదు. తన గురించి నీతో మాట్లాడితే నువ్వన్నట్లు నాకూ మనశ్శాంతిగా వుంటుంది" అంది అనూరాధ.
   
    కిరణ్మయి తటపటాయించింది. తనెవరో తెలిశాక రాధ తనను క్షమిస్తుందా? 'ఇది నమ్మకద్రోహం అవదూ' అనుకుంది. మళ్ళీ మరో ఆలోచన. తను చేసేది మంచిపనే! ఒక ప్రాణం కాపాడ్డానికి తను నిజం తెలుసుకోవాలనుకుంటోంది. అంతే ఈ డైరీలవల్ల రాయన్న అపరాధీ అని తెలిస్తే తనుకూడా అతడిని క్షమించలేదు. ఇక ఆలోచన దేనికి! డైరీలు పక్కన పెట్టి, "అనూరాధ నేను అడిగిన ఒక ప్రశ్నకు జవాబు చెప్తావా?" అంది.
   
    "ఏమిటి? సందేహం దేనికి, అడుగు" అంది రాధ.
   
    "రాయనన నీకు బాగా తెలుసా? అతడి గురించి నీ అభిప్రాయం ఏమిటి?"
   
    'నాకు అతను బాగా తెలుసు. అందరం కలసి డిన్నర్లకి వాటికీ వెళ్ళేవాళ్ళం. అతను నాతో కంటే లక్ష్మితో ఎక్కువ చనువుగా వుండేవాడు. నాకు తెలిసినంత వరకు వాళ్ళమధ్య మరో రకమైన సంబంధం లేదు. కాని ఆ చివరి రోజుల్లో ఏం జరిగిందో అది నాకు తెలియదు. లక్ష్మి చివరి డైరీ దొరికితే అన్నీ బయట పడేవి. కాని అది నాకు దొరకలేదు. ఏమైందో అర్ధంకావడంలేదు."
   
    "వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళారేమో?"
   
    "లేదు నా ఎదురుగానే వాళ్ళు డైరీల కోసం వెతికారు. ఏవీ కనిపించలేదు. ఇవయితే లక్ష్మి నా దగ్గరే దాచిందనుకో. కాని ఆ చివరిది ఎక్కడ పెట్టేసిందో మరి. బహుశా హంతకుడి చేతిలో పడుతుంది."
   
    "లక్ష్మి వస్తువులన్నీ ఏమయ్యాయి? వాళ్ళు తీసుకెళ్ళిపోయారా?"
   
    "లేదు అన్నీ ఆ గదిలోనే వున్నాయి. అవేమీ తీసుకెళ్ళం ఎవరికైనా యిచ్చేయండని వార్డెన్ కి చెప్పి వెళ్ళారు. వాటిని చూస్తున్నా వాళ్ళకూ బాధే కదా! ఆ గదిలో వుండడానికి ఎలాగూ ఎవరూ వప్పుకోవడంలేదు. కాబట్టి అక్కడే వుండిపోయాయి."
   
    కిరణ్మయికి కాస్త రిలీఫ్ అనిపించింది. అక్కడే కూర్చుని లక్ష్మి డైరీల్లో మొదటిది తీసింది.
   
    లక్ష్మికి డైరీ రాసే అలవాటు చిన్నప్పటినించిలేదు. పదో తరగతి చదివేటప్పుడు మొదలుపెట్టింది. అందుకే మొదటి డైరీలో అప్పటివరకు జరిగిన తన జీవితాన్ని, గుర్తున్న విషయాలన్నింటినీ వ్రాసుకుంది.
   
   
   
                                                                 --* * *--

 Previous Page Next Page