Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 35

   

    "అలాగే నీ ఇష్టం" అంది కిరణ్మయి. అనూరాధని బయటకు వెళ్ళకుండా ఆపడమెలాగో ఆమెకు అర్ధంకాలేదు. గట్టిగా అడిగితే మొండికేసే రకం ఆ అమ్మాయి. కిరణ్మయి ఏం చెయ్యాలోనని ఆలోచిస్తున్నంతలోనే రమణి విసురుగా గదిలోకి వచ్చింది.
   
    "మీరొకసారి బయటకు వెళతారా? నేను రాధతో మాట్లాడాలి" అంది కిరణ్మయితో. అనూరాధ మొహం వాడిపోయింది. తెగించిన ధైర్యంతో గట్టిగా "వెళ్ళొద్దు - కిరణ్మయి! నువ్విక్కడే వుండు" అంది కోపంగా.
   
    కిరణ్మయి షాక్ తిన్నదానిలా ఇద్దరివైపూ మార్చి మార్చి చూస్తోంది.
   
    రమణి మరింత కోపంతో ఏదో అనబోయి తమాయించుకుని "ఆ లాయర్ వచ్చినప్పుడు నువ్వు నా గదిలోనే వుండాలి. నా ఎదురుగానే ఆయనకి సమాధానాలు చెప్పాలి" అంది.
   
    "నేను నీ గదికి చస్తేరాను. వాళ్ళకెలాంటి సమాధానాలు చెప్పాలో నువ్వు నాకు చెప్పనక్కరలేదు" అంది అనూరాధ.
   
    "తిక్కవేషాలు వేయకు. నువ్వు వాళ్ళకేం చెప్పేది నాకు తెలియకపోదు. అనచ్సర విషయాలు మాట్లాడావంటే ముందు నీ విషయాలే బయటపడేట్లు చేస్తాను" బెదిరింపుగా అని వెళ్ళిపోయింది రమణి.
   
    అనూరాధ ముఖం కోపంతో ఎర్రబడింది. ఏదో అనబోయి ఆగిపోయింది. గుమ్మంలో వార్డెన్ నిలబడుంది.
   
    "రాధంటే నువ్వేగా.....చూడమ్మా! ఇన్నాళ్ళూ మీ దారికి నేను అడ్డురాలేదు. ఇకముందు రానుకూడా! ఇలాంటి సమయంలోనే మీరంతా కో-ఆపరేట్ చేయాలి. లేకపోతే మనందరం ఇబ్బందులు పాలవుతాం. అవసరమైనంత వరకు మనకెలాంటి మాట రాకుండా జవాబులివ్వండి" అంది.

    "మాడమ్, నేను బయటకు వెళ్ళాలి. అర్జెంటు పనుంది" అంది అనూరాధ.
   
    "అలా వెళ్ళడానికి కుదరదు. వాళ్ళు వచ్చి వెళ్ళనీ. అందులో ముఖ్యమ్గా నీ పేరు అడిగి నిన్ను వుండమని చెప్పమన్నారుట" కఠినంగా అంది వార్డెన్. అనూరాధ ముఖం మ్లానమయింది.
   
    కిరణ్మయి ఇదంతా ప్రేక్షకురాలిలా గమనిస్తోంది. తను వత్తి వెలిగించింది. ఇక బాంబు పేలాలి. ఆమె వేచి వుంది. ఇప్పుడు కాదు. ఇంకా తాడు బలంగా బిగుసుకోవాలి.....
   
    ఆమె అనూరాధ దగ్గిరకి వచ్చింది.
   
    "మన ప్రోగ్రాం కాన్సిల్ అయిందిగా. నేను వెళతాను రాధా" అంది. రాధ రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుని సన్నగా రోధిస్తోంది. కిరణ్మయి ఆమె దగ్గిరగా వెళ్ళి భుజం మీదుగా చెయ్యివేసి దగ్గరకు తీసుకుంది. వంటరితనం రాధ నిప్పుడు భయపెడుతోంది. ఆ భయాన్ని దూరం చేసుకోవడానికి తనతో స్నేహం చేస్తోంది. ఆ విషయం కిర్నంయి మొదట్లోనే గమనించింది.
   
    "నీ బాధ ఏమిటో నాకు తెలియదు రాధా. నీ మనస్సు విప్పి చెప్పమని అడగను. 'నీ సంతోషాన్ని పదిమందికి పంచు. బాధని మాత్రం నీలో నువ్వేదాచుకో' అనే సూత్రాన్ని నేనూ పాటిస్తాను. కాని నా దృష్టిలో స్నేహం అనేది సంతోషంకంటే దుఃఖాన్ని పంచుకున్నప్పుడే తృప్తినిస్తుంది. ఎవరితోనూ పంచుకోలేని రహస్యం నీలో వుండొచ్చు. కాని అది బయటపెట్టడం ద్వారా నీకు ఉపశమనం కలిగిస్తుందనుకుంటే నాతో చెప్పు. అది నన్ను దాటిపోదని నీకు నమ్మకం కలిగిపోతే సుమా."
   
    రాధ కాస్త తేరుకుంది. "నీతో ఎన్నో చెప్పాలనుకుంది కిరణ్. కాని యిప్పుడు కాదు యీ గొడవ అయిపోనీ" అంది.
   
    "అలాగే, నీ యిష్టం! దీని గురించి నేను మళ్ళీ అడగను. నీకెప్పుడూ చెప్పాలనిపిస్తే అప్పుడు నిరభ్యంతరంగా నన్ను పిలువు" చెప్పి తన గదికి వచ్చింది కిరణ్మయి. అక్కడా అదే డిస్కషన్ జరుగుతోంది.
   
    "ఇది ఈ రోజుతో కూడా ఆగేది కాదు ఇందూ. ఆ కేసేదో తేలేవరకు మనకీ తిప్పలు తప్పవు" అంటోంది నీలూ.
   
    "అసలేమిటి విషయం? ఒక చిన్న ఎంక్వయిరీ కోసం ఇంత ఆర్భాటం దేనికి? మీకు కేసుతో సంబంధం లేకపోయినా బయటకు వెళ్ళే హక్కు లేదా?" అడిగింది కిరణ్మయి. లాయర్ వెంకటరత్నం ఈ రోజు ఇక్కడికి రావటానికి కారణం తనే అని తెలిస్తే ఎలావుంటుందో వూహించుకుంటూ.
   
    "ఈ హత్య గురించి కంటే ఈ హాస్టల్ విషయాలు బయటపడతాయని అధికారుల భయం. జరిగినన్ని రోజులు స్వేచ్చగా నీ బాదరబందీ లేకుండా గడిపారు. ఇప్పుడు వచ్చేది లాయర్. ఏ మాత్రం నోరుజారినా పట్టేస్తాడు. హాస్టల్లో అవకతవకల గురించి అతడికి ముందే కొంత తెలిసుంటుంది. అది రుజువుచేసి పదిమందిలో పెడితే గొడవయిపోతుందని భయం. అందుకే బహుశ ఈ లాయర్ రావటానికి కూడా అనుమతి ఇచ్చి వుంటారు హాస్టల్ వాళ్ళు."
   
    "కాని జరుగుతున్న విషయం ఒకసారి బయట పెడితేనేగా హాస్టల్ బాగుపడేది" అడిగింది కిరణ్మయి.
   
    "ఏం బాగుపడుతుంది? హాస్టల్లో వుండేవాళ్ళలో కొద్దిమందికి తప్ప ఎవరికీ ఈ స్వేచ్చని వదులుకోవడం యిష్టంలేదు. ఏ పేపర్ కయినా ఈ విషయాలన్నీ తెలిస్తే ముందుగా వాళ్ళ తల్లిదంద్రులే భయపడి, చదువు మాన్పించి తీసుకుపోతారని చాలామంది భయం."
   
    "అపురూపలక్ష్మి హత్య జరిగినప్పుడు కూడా ఈ విషయాలు పేపర్లో కెక్కలేదా? ఎవరికీ తెలియకుండా ఎలాగుంది?" కిరణ్మయి రెట్టించింది.
   
    "ఈ హాస్టల్ అని, ఇక్కడి పరిస్థితులింత ఘోరంగా వున్నాయని ఏ పేపర్లలోనూ రాలేదు. ఆ హంతకుడి గురించి బయటకు వచ్చిందిగాని ఆ నేరం జరిగిన ప్రదేశానికి, వాతావరణానికి ఎవరూ ప్రాముఖ్యత నివ్వలేదు. ఈ విషయంలో ఎవరో మంత్రులు కలగజేసుకున్నారని అనుకున్నారు. నిజం ఏమిటో ఎవరికీ తెలియదు" అంది ఇందూ.
   
    రాయన్న పబ్లిక్ ఫిగర్. 'అతడు హత్య చేశాడు, హంతకుడు' అనే వార్తకిచ్చిన చౌకబారు ప్రాముఖ్యం; నేరం జరగడానికి కారణం, ఇతర పరిస్థితులకి పత్రికలు కూడా ఇవ్వలేదు. చనిపోయిన అమ్మాయిపట్ల జాలితప్ప ఆమె కారెక్టరుపట్ల పరిశీలన, ప్రాముఖ్యం అసలుండవు. ఒక పబ్లిక్ ఫిగర్ మీద క్యాష్ చేసుకోవడం తేలిక అని పత్రికల వాళ్ళకీ తెలుసు.
   
    "రేఖ హంతకుడిని స్వయంగా చూసిందటకదా. ఆ అమ్మాయిచేత చెప్పించేస్తే సరిపోతుందిగా అందర్నీ ఆపడం దేనికీ?" అడిగింది కిరణ్మయి ఏమీ తెలియనట్టు.
       
    ఇందూ ఏదో అనబోయింది.
   
    అంతలో లాయర్ వచ్చాడన్న వార్త రావడంతో వాళ్ళ సంభాషణకి బ్రేక్ పడింది.
   
    ఈ రోజు హాస్టల్లో అంతవరకు లేనంత డిసిప్లిన్ కనిపించింది. ఏమీ తెలియని వాళ్ళకయితే తమ పిల్లల్ని ఆ హాస్టల్లోనే వుంచి చదివించాలన్నంత కోరిక పుట్టేటట్లుగా వుందా వాతావరణం. వార్డెన్ తో సహా అందరూ డీసెంట్ గా ప్రవర్తించారు. హాస్టలు పిల్లలంతా చాలా మంచివాళ్ళని, అపురూపలక్ష్మి లాంటి ఒకరిద్దరు పిల్లలవల్ల అందరికీ చెడ్డపేరు వస్తోందన్నట్లుగా మాట్లాడారు. రాయన్న లాంటివాళ్ళు ఆడపిల్లలను మోసంచేసే కీచకుల్లాంటి వారన్నారు. దాదాపు రెండున్నర గంటలసేపు వెంకటరత్నం అన్నిరకాలుగా అందర్నీ ప్రశ్నించాడు. రమణి, అనూరాధ, రేఖలతో విడివిడిగా మాట్లాడాడు. వెళ్ళేముందు హాల్లోనిలబడి అందర్నీ ఉద్దేశించే మాట్లాడాడు.
   
    "ఈ హాస్టల్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను వెళ్ళాక ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. మీరేం చెప్పలేదని నేను నిందించడంలేదు. ఇక్కడి పరిస్థితేమిటో నాకు తెలుసు. కానీ మీలో ఎవరికయినా, ఏమయినా చెప్పవలసింది వుంటే నా ఆఫీసుకి వచ్చి చెప్పవచ్చు. వాళ్ళపేర్లుగాని, వాళ్ళు చెప్పిన విషయాలు గాని బయటకు రాకుండా కేసు నడుపుతానని హామీ ఇస్తున్నాను" అని ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం వ్యాపించింది.
   
                                *    *    *
   
    సరీగ్గా పది నిముషాల తరువాత కిరణ్మయి ఇరవై రెండో నెంబరు గదిలో ప్రవేశించింది.
   
    ఆమె వూహించినట్టే అనూరాధ బాగా అప్ సెట్ అయివుంది.
   
    అలా చెయ్యమని లాయర్ వెంకటరత్నానికి ఆమె సూచించింది. ఇనుము వంగాలంటే బాగా కాల్చాలి.
   
    వెంకటరత్నం అనూరాధని అపురూపలక్ష్మి గురించి రకరకాల ప్రశ్నలు వేసి వేధించాడు. ఇలా ప్రశ్నలు వేయటం వల్ల ఎవరూ నిజం చెప్పరని అతనికి తెలుసు. కానీ, న్యాయశాస్త్రం చెయ్యలేని పనిని ఒక్కోసారి మనస్తత్వ శాస్త్రం చేస్తుంది.
   
    ఇప్పుడామె చేయబోతున్నధి అదే.
   
    ఆ సమయంలో అనూరాధకి తన బాధని పంచుకునే తోడుకావాలి. మనసు విప్పి చెప్పుకోవటానికి ఒక స్నేహితురాలు కావాలి.
   
    ఇదంతా కిరణ్మయికి తెలుసు.
   
    కిరణ్మయి వూహించినట్టే రాధ నిద్రపోవటంలేదు. మంచంమీద పడుకుని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూంది. అలికిడికి తలతిప్పి చూసింది. ఆమె కళ్ళనిండా నీళ్ళు-
   
    "రాధా, ఏడుస్తున్నావా? ఏం జరిగింది?" కిరణ్మయి ఆదుర్దా నటిస్తూ అడిగింది. రాధ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

 Previous Page Next Page