"గుసగుసలాడటం లేదుగురూ! పెద్దగానే మాట్లాడుకుంటున్నాము" కోళ్ళదొంగ అన్నాడు.
"మరోసారి నన్ను గురూ అన్నావంటే నాలుక చీరేస్తాను...నీపని యిప్పుడు కాదులే. గోపన్నతో పాటు నిన్నూ లాక్కెళ్ళి...ఛీ...ఛీ... బుద్దిలేని గాడిదలు....మరోసారి నోరు మెదిపి మాత్రం సాబ్ వచ్చిందాకా ఆగేపని లేదు చావగొడతాను" అంటూ రుసరుసలాడుతూ వెళ్ళాడు వన్ నాట్ వన్.
"నేను గోపన్నలాంటివాడ్ని అయితే కదా అనవసరంగా వళ్ళు వాయ కొట్టించుకోడానికి, అయిదు కోళ్ళని మాత్రమే దొంగిలించానని న్యాయంగా చెప్పాను" కోళ్ళ దొంగఅన్నాడు.
"గోపన్నని కొడుతున్నారా?" పాపన్న అడిగాడు.
"రోజుకి రెండుసార్లు కొడుతున్నారు, విషయమేమిటో మనకి సరీగా తెలియదనుకో"
"రేపటినుంచీ ఆ అవసరం రాదులే" తగ్గు స్వరంతో అన్నాడు పాపన్న.
"అంటే?" ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి అడిగాడు కోళ్ళదొంగ.
"రాత్రికి చెబుతాను"
"అంటే?"
"లోతుగా ఆలోచించు నీకే అర్ధమవుతుంది."
కోళ్ళదొంగ ఆలోచించాడు ఏదో అర్ధమైంది "ఆ...తెలిసిపోయింది తెలిసిపోయింది...." ఆనందంగా అన్నాడు.
"నాకేం అర్ధంకాలేదు..." చీరలదొంగ అన్నాడు.
"చీరలు దొంగతనం చేస్తే అంతే ఆడాళ్ళు శాపనార్ధాలు పెడతారు...దాంతో శాపం తిలి బుర్రా పనిచేయదు నామాటవిని ఈపై చీరలు దొంగిలించటం మానేసి హాయిగా నాలాగా కోళ్ళని చూసుకో"
"ముందు యిక్కడనుంచి బయటపడితే చూసుకోటం గీసుకోటం తర్వాతమాట...ఇందాక ఏదో తెలిసిందన్నావు అదేమిటో చెప్పు" కోళ్ళదొంగకి దగ్గరగా చీరలదొంగ జరుగుతూ అడిగాడు.
"వచ్చేటప్పుడు వంటరిని పోయేటప్పుడు పంచపాండవులు. అంతేనా తమ్ముడూ!" కోళ్ళదొంగ అడిగాడు.
అవునన్నట్లు పాపన్న నవ్వాడు.
చీరలదొంగకి అర్ధమైంది "ఈ రాత్రికేనా" సంతోషంగా అడిగాడు.
"మనం మాటలు మార్చాలి." పాపన్న సీరియస్ గా అన్నాడు.
"దాందేముంది తమ్ముడూ! నరంలేని నాలుకే కదా మన నోటిలో వుంది అలాగే" అన్నాడు చీరలదొంగ.
వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే గోపన్న మాత్రం వీళ్ళలో కలవలేదు.....ఓ మూలగ ముణగదీసుకుని కూర్చున్నాడు.
ఇంకోమూల పడుకొని అప్పటిదాకా నిద్రపోతున్న మరో చిన్న దొంగ అప్పుడే నిద్రలేచి కూర్చున్నాడు...పెద్దగా ఆవులించి పాపన్నని చూస్తూ అడిగాడు. "మనకు తోడుగా మరో చిట్టితమ్ముడు వచ్చినట్లున్నాడు కత్తెర పనివాడా కత్తి పనివాడా?"
"పట్టుబడి రాలేదు పనిబడి వచ్చాడు" కోళ్ళదొంగ గూడార్ధంగా అన్నాడు.
అవునన్నట్లు తలాడించాడు పాపన్న.
22
రాత్రి పదిగంటల పదినిమిషాలు.
ఇన్ స్పెక్టర్ పోలీసు స్టేషన్ లో కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
వన్ నాట్ వన్ భయంతో బిగుసుకుపోయి నిలబడ్డాడు.
చేస్తున్న పచార్లు ఆపి "ఇప్పుడు నా పరువేమి కాను?" అన్నాడు ఇన్ స్పెక్టర్ కన్నారావు.
దానికి సమాధానం వన్ నాట్ వన్ దగ్గరలేదు... అందుకే బిక్కముఖం వేసుకుని నిలబడ్డాడు.
"వాళ్ళనికాదు. డొక్క చీరేయాల్సింది..."ఆపై మాట దిగమింగి మళ్ళీ పచార్లు మొదలుపెట్టాడు.
అసలు విషయం__
ఆ తెల్లవారు ఝామున పోలీసు స్టేషన్ లో ఘోరం జరిగిపోయింది....ఓ ఖైదీ అర్జంటుగా లావెట్రీ కెళ్ళాలని లేచాడు...కానిస్టేబుల్ లేచి విసుక్కుంటూ వెళ్ళి తాళం తీశాడు....ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు.
గోపన్న పాపన్న కోళ్ళదొంగ చీరలదొంగ సామాన్లదొంగ అయిదుగురూ మాయం అయిపోయారు. ఎవరికీ గాయాలు తగలకుండా, ఒక్క రక్తపుబొట్టు చిన్ధకుండా రెండో కంటికి తెలియకుండా అదృశ్యం అయ్యారు.
తెల్లారి ఊరు మేలుకుంది పోలీస్ స్టేషన్ మేలుకుంది. ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక సెంట్రీ తెలివితప్పి నేలకు కర్చుకుని హాయిగా నిద్రపోతున్నారు.
అదీ జరిగింది.
ఆ విషయం తెలియగానే.
ఇన్ స్పెక్టర్ ముందు జాగ్రత్త వహించాడు.
ఈ విషయం రెండో కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు....అదిమాత్రం సామాన్య విషయమా! అయిదుగురు ఖైదీలు అవలీలగా తప్పించుకు పోయారు. ఈ సంగతి బ్యటికి పొక్కితే పోలీసుల పరువేమి కావాలి! ముందు ఇన్ స్పెక్టర్ ని సస్పెండ్ చేస్తారు.