Previous Page Next Page 
పాదాభివందనం పేజి 35

"అమ్మాయ్" ఆయనేదో చెప్పబోయాడు.

"సవరించుకొండి , మాష్టారు! నేను మీ స్టూడెంట్ ని కాదు. ఆఫ్ కోర్స్ , నాకు ఆ అదృష్టం లేదు. ఉంటే కధలే చెప్పేవారో, కామశాస్తమె నేర్పేవారో!

స్పష్టంగా విన్పించింది అయన పళ్ళు కొరకటం.

"మాష్టారు- మీకు శాండోజు టాబ్లెట్స్ అక్కర్లేదని నాకు తెలుసు. మీ దంత పటిమా తెలిసిపోతోంది. చమత్కారానికి కోపగిస్తే ఎలా? మత్కృతి చమత్కృతి మతులైన మీ మతిని సమ్మతితో రసింపజేయాలి? నిరసింపజేస్తే ఎలా?" సన్నని నవు. ఎండిపోయిన ఏటి పాయపై గొలకరిలో కురిసిన ప్రవాహం నెమ్మది నెమ్మదిగా వస్తోన్న ద్వనిలాంటి నవు.

ఆచార్య గుండె గొంతులోకి వచ్చింది.

"అన్నట్లు మీరు సైకాలజీ చెబుతారా?"

"వూ"

"నాకు కొన్ని శబ్దాల ఉత్పత్తి తెలియటం లేదు."

"ఉదాహరణకి ప్రేమ"

"ఏమండీ?"

"నా పేరు కావాలా?"

"వూ"

"అమ్మో! ఆశ! అంత సులువుగా చెబుతానా. అయినా పరాయి అమ్మాయి పేరు కనుక్కోవాలని ఎందుకండి మీకు అంత కుతూహలం!"

అతనికి గుండెలో కితకితలు పెట్టినట్టయింది. పూలతో కొడుతున్నట్టుగా ఉన్న సంభాషణని ఇంకాస్త పొడిగించాలనిపించింది.

"ఏమిటి నాగ్భంధమై పోయింది? 'మేడమ్' గుర్తుకోస్తున్నారా?"

"ఆ,ఆ" తడబడ్డాడి అర్ధాంగి ప్రసక్తి రాగానే.

"క్లాసులో పాఠం చెబుతుంటే మీకు భార్య గుర్తుకి వస్తుంది. లైబ్రరీలో తారాశశాంకమో, బిల్హణి యమో అహలా సంక్రందనమో చదువుతుంటే మీకు మదిలో మెదిలేది మీ అర్ధాంగి, మీరు ఉత్తమ భర్తలు, ఏమండీ అలా అనొచ్చా! నేను తెలుగు చదువుకోలేదు."

"మీరేం చదివారు?"

"ఏరోవాటిక్స్ పిహెచ్.డి. చేశాను."

ఫారిన్ రిటర్న్."

"అవునండి! ప్రతి స్త్రీకి అత్తారిల్లు ఫారినే కదా!" ఆ మాటల వెనుక మేఘం చాటున మెరుపులా కన్పించి కన్పించని నవు- తెరలు తెరలుగా వస్తోంది.

ఆమెను తను మాటలతో జయించలేననుకున్నాడు.

"ఇంక మీ పేరు చెప్పారు కాదు."

"మాష్టారు! మీకు ఆరుద్ర గళ్ళ నుడికట్టు శ్రీ శ్రీ పదబంధ ప్రహేళక పూర్తి చెయ్యటం వచ్చు కదా! నా పేరు కనుక్కుందుకి క్లూస్ చెబుతాను . కనుక్కోండి"

"చెప్పండి"

"అబ్బ! ఆశ- తెలుగెమ్మె శాంస్క్రీట్ డిప్లమో విశ్వనాధ పై రిసెర్చి- క్లూ ఇస్తే అట్టే పట్టేయరూ . అయినా మీ అబిమాన కవి పేరులో తొలి అక్షరం నాపెరులో ఉంది సంఖ్య మళ్ళీ చెబుతాను. ఇదో క్లూ గుర్తుంచుకొండి."

"ఇంతకీ మీకు నాతో పనేమిటి?"

"చందమామతో మనకి చుట్టరికమా? చల్లగాలిలో బంధవ్యమా? పరిమళాలతో పరిచయమా! అవంటే ఎందుకిష్టం? మీకు ఆవకాయలో పచ్చిమిర్చి నంజుకోవటం ఇష్టం- వో హౌ! కిన్నెరా సానీ అంటూ మీ ఆవిడ చుట్టూ మీరు సూర్యుడి చుట్టూ తిరిగే భూగోళంలా....."

"ఏమండీ ఇవన్నీ మీకు ఎలా తెలుసు?"

"మీకు విశ్వనాధ 'వేయి పడగలు' ఎన్ని రోజుల్లో రాసింది ఎలా తెలుసు? నాయని సౌభద్రుని ప్రణయ యాత్ర ఎలా రాసింది ఎలా తెలుసు? ప్రభాకర శాస్త్రి మాస్టర్ యోగ గురించి ఎలా తెలుసు? ఇది అంతే! మనసుంటే మార్గం ఉండదా!"

జలతరంగిణి శబ్దాల్లాగా మోగుతున్నాయి పదాలు. ఆ కంఠంలో ఎంత మాధుర్యం! పూలు జలజల రాలినట్టు , మంచు చలచల్లగా సోనలై వర్షించినట్టు , గంధం చిలకరించినట్టు.......

"సరే, ఎవరయినా కాలేజికి రింగ్ చేస్తోంటే మన ఎంగేజ్ సౌండ్స్ విని తిట్టుకుంటారు. ఫోన్ పెట్టేస్తున్నాను. మళ్ళీ వీలయినప్పుడు ఫోన్ చేస్తాను."

"ఎప్పుడు"

"ఎందుకండి కంఠంలో ఆ ఉద్విగ్నత- అన్నట్టిది తద్దిత రూపమేనా? ఏమో బాబు! నేను తద్దిత మూడురాలీని. నన్ను తద్దిత మూడురాలిని చెయ్యండి- ఇంటికి వెళ్ళి నా గురించి కలలు కనకుండా కుల పాలికా ప్రణయంలో మునిగిపొండి."

పోన్ కట్టయిన శబ్దం. ఉస్సురుమన్నాడు ఆచార్య.

ఆ పూటంతా అదోలా గడిచిపోయింది. ఒక వినుత్నానుభవం- పొందిన మనస్సా భావపరిమళాన్ని దాచుకోలేకపోతోంది. కానీ ఈ అనుభవం ఇతర్లతో చెప్పుకునేదా? ఉహూ మంత్రం కంటే రహస్యం- మధువు కంటే మధురం - మగువ కంటే తీయన-

ఇంటికి వచ్చేసరికి అర్ధాంగి లక్ష్మి ముభావంగా ఉంది.

ఆచార్య కూడా అదోలా ఉండిపోయాడు. కాఫీ ఇస్తే తాగేడు. టిఫిన్ వద్దన్నాడు. బయటికి వెళ్ళలేడు. ఇంట్లో ఉండలేడు. కూర్చోలేడు. నుంచోలేడు. ఏదయినా చదువుదామనుకున్నాడు. తీస్తే చేతికి క్రీడాభిరామం వచ్చింది. నిట్టూర్పూ గుండెలోంచి తన్నుకొచ్చింది.

ఆ 'వయారి' ని అయన చూసి ఉంటె - అమ్మాయ్ బ్రతికి పోయావు నువు- లేకపోతే నీ పై నునాస్త్ర ప్రమాదా అంటూ పద్యం చెప్పి 'ణిసి' ధాతువు అర్దాన్ని అడిగేవాడు కంసారభౌముడు" అనుకున్నాడు.

చప్పున లైటు వెలిగింది.

"ఏమిటలా ఉన్నారు? చీకటిపడింది కూడా గమనించలేదు."

"ఆ ఆ"

"అనుష్టానం చేసుకుంటారా?"

 Previous Page Next Page