ప్రమీలాదేవి మోములో చిన్నగా దరహాసరేఖ ఆమెని దిగులు దిగంతాల నుంచి ఈవలికి లాగగలిగానన్న సంతృప్తి.
ఇంతలో మనస్విని దొండపళ్ళ వంటి పెదాలు విచ్చుకున్నాయి. వరుసగా చెప్పసాగింది.
"అంగన, అతివ, ఆడది, ఇంతి, ఉవిద, కలికి, కళ్యాణి, కాంత, కొమ్మ, కోమలి, గాల, చాన, చెలువ, చేటి, చేడియ, చిగురుబోడి, జవ్వని, తన్వి, తరుణి, తెలువ, నాతి, నారి, నవల, నెలత, పడతి, ప్రమద, పెంటి, పైదలి, భామ, భామిని, మహిళ, మగువ, మానిని, ముదిత, ముగుద, మెలత, యువతి, యుగ్మలి, యోష, రత్న, రమణి, లలన, లలామ, లేమ, వనిత, వధూటి, వేలాది, సుదతి, ఇండియానా."
"వెరీగుడ్" ఫస్టు మార్కులు తెచ్చుకున్న విద్యార్ధిని మెచ్చుకునే టీచర్ లా ప్రోత్సహించింది ప్రమీలాదేవి మనస్వినిని మనస్సు తేలికైన భావన.
"మరొక చిన్న ప్రశ్న" అంది మేడమ్ ప్రమీలాదేవి.
'సిద్దమే' అన్నట్లు తలూపింది మనస్విని.
"హిందీలో మొదటి మహిళా పత్రిక ఏది?"
మనస్విని మళ్ళీ మెదడు అరల్లో దాగిన ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాటానికి ప్రయత్నించసాగింది. క్షణాలు చకచకా దొర్లిపోతున్నాయి.
కొంత సమయం గడిచిన తర్వాత- "గుర్తొచ్చింది మేడమ్....."సుగృహిణి'. 1888లో ప్రారంభించబడిన ఈ పత్రికకు హేమంత్ కుమారీ చౌదరీ అనే బెంగాలీ వనిత సంపాదకురాలు, నిర్వాహకురాలూను అప్పటికామే వయస్సు కేవలం ఇరవై ఏళ్ళే."
ఆమెలో పూర్తిగా ఉత్సాహం ప్రవేశించిందనటానికి తేటపడిన ఆమె మోమే చెబుతుంది. మేడమ్ ప్రమీలాదేవి మనస్వినితో మాట్లాడుతూనే వుంది.
* * * * *
సమయం రాత్రి ఎనిమిదిన్నర!
అపోలో హాస్పిటల్ విద్యుద్దీపాల కాంతిలో మెరిసిపోతోంది. పీక్కుపోయిన మొహంతో అభిరాం, అలసటగా వరప్రసాదం మహదేవ్ ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ గదిలో కూర్చున్నారు.
అతని పరిస్థితిని చెక్ చేయడానికి పదినిమిషాల ముందే ఇంటెన్సివ్ కేర్ వైపు నడిచాడు డాక్టర్.
అతను మహాదేవ్ దగ్గరకు వెళుతుండగా అభిరాంలో కనిపించిన టెన్షన్ వరప్రసాధాన్ని కదిలించింది. అతని చేతిని మృదువుగా స్పృశించి ధైర్యం చెప్పాడు. మహదేవ్ హెల్త్ కండిషన్ మరికొన్ని క్షణాల్లో తెలుస్తుంది.
ఇంతలో నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ డాక్టర్ తిరిగివస్తున్నట్లు బూట్ల చప్పుడు. అవి తన గుండెలమీద పడుతున్నట్లు ఉక్కిరిబిక్కిరయ్యాడు అభిరాం. 'ఏమైంది? మహదేవ్ పరిస్థితి మెరుగైందా లేదా?' నరాలు తెగిపోయే టెన్షన్.
* * * * *
వెలుగు ఓడిపోయి చీకటి రక్కసి కోరల్లో ఇరుక్కుపోతున్న వేళ- సైనిక్ పురి కాలనీవైపు సాగిపోతోందో ఆరడుగుల పైనున్న ఆకారం.
సాధారణంగా మనుషులు రెండడుగులు వేసి చేరుకునే దూరాన్ని ఒకే అడుగులో అధిగమించి సునాయాసంగా ముందుకు సాగిపోతోందా ఆకారం.... సాధ్యమైనంతవరకూ వీధిదీపాలు వెలుగు తనమీద పడకుండా జాగ్రత్తపడుతూ...
అప్పటికీ రోడ్డుమీద పోతున్న ఒకరిద్దరు అతన్నీ, అతని ఆకారాన్నీ వీక్షిస్తూ విస్తుపోతున్నారు.
అతని కనులు అర్ధనిమీలిత నేత్రాల్లా సగం మూసుకుని సగం తెరుచుకుని వున్నాయి. పెదాలు ఆగకుండా మంత్రపఠనం గావిస్తున్నాయి. అతని చెవిలో విన్పిస్తున్న సన్నని హోరు దిక్సూచిలా మార్గదర్శకమై ముందుకు గొనిపోతోంది అతన్ని.
అతని వెనుక ఆకారంలేని ఏవో నీడలు గాలిలో నాట్యం చేస్తున్నట్లు ఝంకారం విన్పిస్తోంది.
అతని గమ్యం దగ్గరయింది. రెండు మూడు వీధులు తిరిగి ఓ ప్లాట్ ముందుకు నడిచి ఆగాడు. చీకటిగా మనుష్యులు లేరన్న సంగతిని తెలియబరుస్తోందా ప్లాట్. అతని చెవిలోని హోరు చిత్రమైన రీతిలో రొద పెట్టింది.
అర్ధమైనట్టు తల పంకించాడతను. తీక్షణంగా చూశాడా ఫ్లాట్ వైపు కొద్దిసేపు తరువాత సన్నగా మంత్రాలు పఠించాడు.
అతన్ని వెన్నంటి వచ్చిన నీడలు ఒక్కొక్కటిగా ఆ ఫ్లాట్ వైపు దూసుకు పోయినట్లు గాలిని సర్రు సర్రుమని చీల్చుతున్న ధ్వనులు... చేయవలసిన పనిని విజయవంతంగా ముగించినట్లు చిన్నగా విచ్చుకున్నాయి అతని పెదవులు వచ్చిన వాడు వచ్చినట్లే వెనుదిరిగాడు వీధి మలుపు తిరుగుతుండగా విన్పించాయి. అతనికి.... కుక్కలు మొరుగుతున్న అరుపులు అయినా ఆగలేదతను.
* * * * *
"భౌ... భౌ! భౌ.... భౌ.... భౌ...." ఆగకుండా అరుస్తోంది సైనిక్ పురీ కాలనీలో ఫ్లాట్ నెంబర్ నలభై ఒకటిలోని ఆల్సేషియన్! "ఛుప్! డాలీ నో నాయిస్" గదమాయించాడా ఇంటి యజమాని దానిని అయినా ఆగలేదది. గొంతు పగిలిపోతుందేమో అన్నట్టు అరుస్తోంది పక్క ఫ్లాట్ లోకి చూస్తూ.
అప్పుడు చూశాడతను కూడా అటువైపు దీపాలు లేక చీకటిగా వుందది. అతనికెందుకో అనుమానం వచ్చింది.
గబగబా ఇంట్లోకి నడిచి టార్చ్ తెచ్చి అటువైపు ఫోకస్ చేశాడు. దొంగెవారయినా దూరాడా? డాలీ యిలా మొరుగుతుంది- అనుకున్నాడతను.
చాలాసేపు గమనించినా అటువంటి ఛాయలేమీ కానరాలేదు. డాలీ మాత్రం ఎగిరెగిరి పడుతూ అరుస్తోంది.
"ఏమిటివాలిది ఇలా సతాయిస్తోంది? తీసుకెళ్ళి స్టోర్ రూంలో కట్టేయండి" అతని భార్య అంది.
అతను దాన్ని లోపలకు తీసుకెళ్ళబోయాడు. అది గింజుకుంది.