Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 35


    "మన ప్రవర్తన మన రూపం మీద ప్రభావం చూపిస్తూ వుంటే ఎలా వుంటుంది? బజార్లో మనం ఒకర్ని మోసం చేశామనుకోండి. ఇంటికొచ్చి అద్దంలో చూసుకుంటే మన ముఖంమీద అసహ్యంగా ఓ పుండు కనిపించి, మన మోసం అలా ప్రతిఫలిస్తే ఎంత భయంకరంగా వుంటుంది. దీనిమీద ఆస్కార్ వైల్డ్ ఓ నవల రాశాడు. దాని పేరు ది పిక్చర్ ఆప్ డొరియన్ గ్రే" వినయ్ ఏదో సందర్భంలో అన్నది గుర్తు చేసుకుని తను కూడా అలా వూహించుకున్నట్టు అనిపించింది ఆంజనేయులుకు.
    విస్కీ తన పని ప్రారంభించింది. ఏదో మత్తు శరీరాన్ని తేలిక పరుస్తోంది. మెదడులోని కణాలు యాక్టివేట్ కావడంవల్ల ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
    ఇంతవరకు అనుభవంలోకి రాని అనుభవం.
    జీవితంలో మొదటిసరిగా అతను తాగుతున్నాడు.
    తనను పీల్చి పిప్పిచేస్తున్న సంఘం మీద కోపం, తనను ఓ మనిషిగా గుర్తించలేని మనుషుల మీద అసహ్యం. ఏ అనుభవంలేని తన శరీరం మీద కసి.
    అంత మైకంలోనూ అతనికి అమ్మ గుర్తొచ్చింది. తనను కంటూనే అమ్మ చనిపోవాలా? ఎవరు పెంచుతారనుకుంది కన్న కొడుకుని? చందమామను చూపిస్తూ ఎవరు తినిపిస్తారనుకుంది? ఏడిస్తే అనునయంగా ఎవరు బుజ్జగిస్తారు? స్నానం చేయించి చివరగా దిష్టి తీసి నీళ్ళెవరు పోస్తారు? ఇవన్నీ ఆలోచించి వుంటే అమ్మ చనిపోయేదా?
    అతని కళ్ళనుంచి నీళ్ళు.
    మహాలింగం ఇది గమనించలేదు. అతని బాధల్లో అతనున్నాడు.
    బాటిల్ మొత్తం ఖాళీ చేశాక ఇద్దరూ మహాలింగం ఇంటికొచ్చారు. మహాలింగం ముసలి తల్లి లోపలి గదిలో పడుకుని వుంది. ఆంజనేయులుకు బయట వరండాలో మంచంవేశాడు మహాలింగం.
    "సారీ మిత్రమా. మరో లుంగీ లేదు ఇవ్వడానికి" అన్నాడు నొచ్చుకుంటూ మహాలింగం.
    "మనలాంటి ఇళ్ళల్లో మరో లుంగీ వుంటే ఆశ్చర్యపోవాలిగానీ," ఆంజనేయులు మాటను పూర్తిగాక ముందే మహాలింగం నవ్వేశాడు.
    బయట పడుకుంటే తనకు ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి లోపల పడుకున్నాడు మహాలింగం ఆంజనేయులు అలానే వరండాలోని మంచం మీద వాలిపోయాడు.
    పడుకున్నాగానీ కళ్ళు తిరుగుతున్నాయి. కొత్త అనుభవం నిద్రను దూరంగా తరుముతోంది.
    వళ్ళంతా మత్తుగా వుంది. నరాలు దేనికోసమో పిచ్చిగా అరుస్తున్నాయి. స్త్రీ లాలన, బుజ్జగింపుకోసం మనసు తపిస్తోంది.
    తనింతవరకు ఏ ఆడపిల్లనైనా దగ్గరకు తీసుకోగలిగాడా? ఆ కళ్ళ నీలిమలో కలిసిపోగలిగాడా? అనురాగపు వెచ్చటి ఊపిరిలో కరిగి పోయాడా? ఆ వయ్యారపు వంపుల్లో తన అస్తిత్వం చిక్కుకు పోయిందా?
    నో.... లేదు.... తనకు మూడు అడుగుల దూరంలో నిలబడ్డ అమ్మాయేలేదు. హలో అంటూ అభిమానంగా పలకరించిన అమ్మాయి అసలులేదు.
    ఎందుకు బతకడం?
    "సెక్స్ ఈ దేశంలో బూతు అయిపోయింది గానీ అంతకుమించిన అద్భుతమైన అనుభవం మరొకటిలేదు. స్త్రీ, పురుషులు కలిసి పంచుకునేది అదొక్కటే నిశ్శబ్ధాన్ని సైతం షేర్ చేసుకునే ఆ లక్షణాలు అపురూపం"
    వినయ్ ఈ మాటలు అంటున్నప్పుడు అద్వితీయమైన, అనిర్వచనీయమైన అనుభూతికి లోనుకావడం ఇంకా గుర్తుంది.
    ఒకే ఒక్కసారి ఆ అనుభవాన్ని రుచి చూడాలి ఎలా? తనలాంటి బీదవాడికి సెక్స్ కూడా లగ్జరీ అయిన విషయం, మీరెలా దాన్ని పొందడం?
    విస్కీని పీల్చుకున్న తల కొత్తపుంతలు తొక్కుతూ ఆలోచిస్తోంది.
    రాత్రి పది గంటలైనట్టు దూరంగా చర్చి గంటలు వినిపిస్తున్నాయి. ముప్పాతిక చందమామ శక్తి మేరకు వెన్నెలను కురిపిస్తోంది. లోకం తెల్లటి మేలిముసుగును కప్పుకుంది.
    "ఏమిటేమిటో కావాలనిపిస్తోంది. ఆంజనేయులకు.
    అతని బుర్రలో ఏదో ఫ్లాష్ అయింది.
    అవును అమ్మాయి ప్రేమను కొనుక్కోవడం తప్ప మరో మార్గంలేదు తనలాంటి వాళ్ళకు.
    వినయ్ లా మాటకారిని తనను, అభినయ్ లా డబ్బులేని తనను, జీవన్ లా ప్లేయర్ కాని తనను ఏ ఆడపిల్లా ప్రేమించదు. నల్లగా, పొట్టిగా, సన్నగా - ఏ ప్రత్యేకతా లేని తనను ఏ స్త్రీ కూడా దగ్గరకు తీసుకోదు.
    అందుకే తనలాంటి వాళ్ళు ప్రేమను కొనుక్కుంటారు. అనురాగాన్ని అణాపైసల్తో కొలుస్తారు. ఆత్మీయతను కాసుల త్రాసులో తూస్తారు. అభిమానానికి ధర కడతారు.
    ఆంజనేయులు లేచాడు. జేబు తడుముకున్నాడు. కరెన్సీ నోట్లు పెళపెళ లాడాయి.
    చెప్పులేసుకుని బయల్దేరాడు.
    మరి కొద్ది క్షణాల్లో తన యవ్వనానికి స్త్రీ రంగులు అద్దబోతున్నాడు బాధలతో, అసహ్యంతో వెలిసిపోయిన, పాలిపోయిన తన జీవితానికి ఆడపిల్ల నవ్వుల చమ్కీని పొదగబోతున్నాడు. ఏ అనుభవంలేని తన శరీరానికి పునర్జన్మ ప్రసాదించబోతున్నాడు. అప్పుడు కొత్త శరీరంతో తాను కొంగొత్తగా మెరిసిపోతాడు దేబ్రాసి ముఖం, దైన్యం చూపుల ఆంజనేయులు ఆ క్షణం నుంచి మాయమౌతాడు. ఆ అనుభవం ఒక్కసారి చాలదా? అమృతం ఎన్నిసార్లు తాగాలి? ఒక్కసారి తాగితే అమరత్వం సిద్దిస్తుంది.
    తను కొనుక్కోబోయే అమ్మాయి ప్రేమను భద్రంగా గుండెల్లో దాచుకుంటాడు. జీవితాంతం ఆనందంగా ఆ క్షణాలను నెమరవేసుకుంటాడు.
    ఇక నుంచి తాను ఒంటరితనంతో కుంగిపోడు. ఏకాంతం పెళ్ళి చక్రాల కింద నలిగిపోతాడు. తనకూ ఆలోచించుకోవటానికి ఓ అనుభవం వుంటుంది. పలవరింతలతో త్రుళ్ళిపోవడానికి కొని ఆ మధురమైన క్షణాలుంటాయి. అప్పుడప్పుడు స్మృతి పధంలో తిప్పుకోడానికి. అనుభూతులుంటాయి. సో.... తనిప్పుడు ఓ అమ్మాయిని కొనుక్కోబోతున్నాడు.
    అతను ఊహల మబ్బుల మీద ఊరేగుతున్నాడు.
    అడుగులు చకచకా పడుతున్నాయి. సందు మలుపు తిరిగాడు.
    అక్కడ - ఆ వీధినంతా తిరునాళ్ళలాగా జనం. దాదాపు పదిపెంకుటిల్లు పడుకున్న జింకపిల్లల్లా వున్నాయి వాటి మధ్య ప్రవహిస్తున్న కాల్వ వెన్నెల్లో పారుతున్నట్టుగాక కదులుతున్నట్టుంది. ఇళ్ళల్లోని దీపాలు నీరసంగా వెలుగుతున్నాయి. అక్కడ వీస్తున్న గాలికి జబ్బు చేసినట్టు ఆహ్లాదంగా లేదు.
    ఆంజనేయులు చివరి ఇంటిముందు కెళ్ళి నిలుచున్నాడు.
    అది పెద్ద పెంకుటిల్లు. ఓ పక్కగా వుంది దానికి తూర్పుగా ఖాళీ స్థలం వుంది అక్కడ పెద్ద సిమెంటు తొట్టివుంది. ఇంటికి ఉత్తరంగా సిమెంటు అరుగు వుంది. దానిమీద ఇద్దరమ్మాయిలు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు.
    వాళ్ళు ఓసారి ఆంజనేయుల్ని చూసి, తిరిగి మాటల్లో నిమగ్నమయ్యారు.
    వెన్నెలను చెదపురుగులు తినేసినట్టు అరవాకొరవా నీడలు పరుచుకుని వుండడంవల్ల అమ్మాయిలు సరిగ్గా కనిపించడంలేదు.
    అంతలో ఓ వ్యక్తి లోపలి నుంచి వచ్చి అమ్మాయిల పక్కగా కూర్చున్నాడు. ఆంజనేయుల్ని చూసి "ఎవరు కావాలి?" అని అడిగాడు.

 Previous Page Next Page