పాపకి మంచినీళ్ళు పట్టించి తన పక్కన పడుకోబెట్టుకుంది. జాన్ సుబ్బయ్యలు ఒకరినొకరు క్రూరంగా చూసుకుంటూ చెరో గోడకి అనుకుని పడుకున్నారు.
ఆరోజు తెల్లగాతెల్లారక లేచింది యమ్మాయమ్మ. జాన్ సుబ్బయ్య లిద్దరూ ఎప్పుడూ త్వరగా లెవరు. ఆరోజు లేవలేదు.
"ఏయ్ సుబ్బయ్య, ఒరేయ్ జాన్!" ఖంగారుగా గట్టిగా అరిచింది. ఇద్దరు బద్దకంగా లేచి విసుక్కుంటూ, ఏంటి?" అన్నారు విసుగ్గా.
"రాగని యిదరిలో ఎవరేత్తుకెళ్ళారు? ఎక్కడ దాచారు? నిజం చెప్పండి."
ఏడుస్తూ వాళ్ళిద్దరి చొక్కాలు గుంజుతూ అడిగింది.
"రాగ లేదా!" నిర్ఘాంతపోతూ అడిగాడు సుబ్బయ్య. సుబ్బయ్యని కోపంగా, కసిగా చూశాడు జాన్.
"మీరైనా నన్ను క్షమించాలి. నిజంగా నా మనసులో ఏ దురుద్దేశము లేదు ఎంత చెడ్డవాడైతే మాత్రమూ పసిపిల్లల్ని బలాత్కారం చేసే దుర్మార్గున్ని కావాలని మీ అమ్మాయి దగ్గిరికి పంపుతానా? జీవన్ నిష్కారణంగా నా మీద కోపం తెచ్చుకుని నాతో మాటలు మానేసాడు. అతడు మాటలు మానేసినందుకు నాకు బాధగా లేదు కాని నా కారణంగా ఒక చిన్న పిల్ల ఇన్ని యిబ్బందుల పాలైనందుకు , మీ కందరికీ దుఖం కలుగుతున్నందుకు బాధగా వుంది. అవసరమైతే ఎంత డబ్బయినా ఖర్చు పెడతాను. ఏ సహాయమైన చేస్తాను. నన్ను నమ్మండి." ప్రాధేయపడుతూ అన్నాడు గిరీశం.
అతడి మాటలు, ఇప్పటికి కనీసం నూటేనిమిది సార్లయినా అని ఉంటాడు. జీవం లేనట్లుగా వున్న అణువేదని అతడు చూడలేకపోతున్నాడు. ఒకప్పుడు జీవన్, అణువేదలు ఎంత అన్యోన్యంగా ఉండేవారో, గిరిశానికి తెలుసు. అనుకోకుండా ఒక దారుణం జరగడానికి తను కారకుడయ్యాడు అది సరిదిద్దుకొనే అవకాశమొస్తే అదృష్టమే. ఆ ఉద్దేశ్యంతోనే అతడు ఇంచుమించుగా ప్రతి రోజు అణువేద దగ్గిరకి వస్తున్నాడు. కనీసం అణువేదనే ఆశ్రయించాడు గిరీశం. జలజ కూడా ఆ సమయంలో అక్కడే వుంది. గిరీశం మాటలు విన్నప్పుడల్లా పట్టరాని నవు వస్తుంది జలజకి. ఒక్కోసారి నిస్సంకోచంగా పైకే నవేస్తుంది. ఆ నవు చూసి అతడు తబ్బిబ్బు పడుతుంటే మరింత నవేది.
"గిరీశంగారూ! మీరు మా అణుకి చెయ్యగలిగిన సాయం ఒకటుంది చెప్పనా!"
"సెలవియ్యండి"
"నన్ను లవర్స్ పారడైజ్ బీచ్ కి తీసుకెళ్ళండి" ఆ మాటలు వింటూనే ఖంగారు పడిపోయాడు గిరీశం.
"నేను బాలికా స్నేహితులతో తిరిగేవాణ్ణి కాను"అన్నాడు. పడిపడి నవింది జలజ,
"బాలికస్నేహితులా? వాళ్ళేవరయ్యా? ఓహో గాళ్ ఫ్రెండ్ కి తెలుగా ఏమిటి? గాళ్ కి తెలుగు బాలిక కదయ్యా మహానుభావా! కన్నె పిల్ల. కన్నెపిల్లలతో తిరగడంలో దోషం లేదయ్యా! ఎందుకంటె కన్నె భర్త ఎవరో తెలియదు కదా!" మరింత ఖంగారు పడిపోయాడు గిరీశం.
"వివాహం చేసుకునే ఉద్దేశం లేకుండా నేను కన్నెపిల్లలతో తిరగను."
జలజ ఆశ్చర్యంగా "ఏమిటి? నీకు యింకా వివాహం కాలేదా?" అంది.
"అయింది"
"ఓయి నీ నిష్ఠ కూల ఇంకా వివాహం చేసుకునే ఉద్దేశమేమిటయ్యా ప్రవరాఖ్యా!"
"ప్రవరాఖ్యుడా! అతడెవరు?"
"నీలాంటి వాడు కాదులే. ఒక మంచివాడు."
"అలాగా! అతడి చిరునామా వుంటే యివండి. ఒకసారి వెళ్ళి కలుసుకుంటాను. "విరగబడి నవింది జలజ. జలజ నవుతున్నప్పుడల్లా తనని తను అన్నివేపులా చూసుకుంటూ తబ్బిబ్బు పడిపోతుంటాడు గిరీశం.
"ఇంతకీ మీకు అణుకి సాయం చెయ్యాలని వుందా లేదా?' సీరియస్ గా అడిగింది జలజ.
"తప్పకుండా! ఎంత క్లిష్టమైన కార్యమైనా సాధిస్తాను,."
"అహొ! అపర ఆంజనేయా! నాతో లవర్స్ పారడైజ్ బీచ్ కి రా అదే నువు మా అణుకి చేయగలిగిన సాయం." గిరీశం బిత్తరపోతూ అణు వైపు చూశాడు. అణు జలజని మందలిస్తూ "ఏమిటి పాపం! ఆయన్ని ఆటలు పట్టిస్తున్నావు!" అంది.
"ఆటలు కాదు. ఇది నిజంగా అవసరమే!"
"అవసరమా! ఎవరికి?"
"నీకు, నాకు- ముఖ్యంగా గిరీశం గారికి. "మళ్ళీ నవింది జలజ.
"అణువేద గారికి ఏ విధంగా నైనా ఉపయోగపడగలిగితే నేను తప్పకుండా ఆ ప్రేమికుల స్వర్గమైన సముద్రపు ఒడ్డుకి వస్తాను."
"మీ తెలుగు తగలెయ్యా! ఎప్పుడొస్తారు?"
"మీరు నన్ను తిట్టినా ఒప్పుకుంటాను గాని నా తెలుగుని తిట్టకండి. నేను తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి, తెలుగునే పిలుస్తూ బతుకుతున్న వాణ్ణి."
"అద్భుతం ఇంతకీ ఎప్పుడు వెళ్దాం మనం?"
"అవసరమేదో మీకు తెలియాలి మీరెప్పుడు రమ్మంటే అప్పుడోస్తాను.'
"సరే అయితే ఇవాళ జాగ్రత్తగా ప్లాన్ చేస్తాను. రేపు వెళ్దాం. సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి."
"అలాగే రేపు నాలుగున్నరకే యిక్కడికొస్తాను? "అందరికి నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు గిరీశం. అతడు వెళ్ళిపోయాక,
"పాపం ఆయన్ని ఆటలు పట్టిస్తున్నావేంటి? అతడేమైనా కాలేజి స్టూడెంట్ అనుకున్నావా! నీకు తగిన రోమియో అనుకున్నావా!" అంది అణు.
"అతనెవరో నాకు తెలియక పోవడమేమిటి? గుట్టుగా బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేసుకునే పెద్దమనిషి. అతన్ని ఆటలు పట్టించడం కోసం కాదు. నిజంగానే నాకతనితో అవసరం వుంది"
"ఏమిటా అవసరం?"
`బాగుంది నా అవసరాలన్ని నీకు చెప్పుకోవాలా? నీ అవసరలేమిటి? అని అడిగానా నిన్నేప్పుడైనా?"
ఇప్పుడు జలజ అల్లరి ధోరణి బాగా అలవాటైపోయింది అణుకి.
"నువు హైదరాబాద్ వెళ్ళవా?" అడిగింది.
"వెళ్ళను"
"మరి నీ చదువు?"
"హైదరాబాద్ లో చదివే చదువే యిక్కడా చదువుతున్నాను. "చటుక్కున నవేసింది అణు. అదే జలజలో గొప్పతనం ఏ మూడ్ తో ఉన్నవాళ్ళనైనా కులాసా మూడ్ లోకి దింపేస్తుంది.
"చదువు సంగతి సరే అటెండేన్స్ పోదా!"