గ్రామోఫోనులోంచి పాట వినిపిస్తే ఎక్కడినుంచి వస్తున్నదా అని ఆశ్చర్యం! అందులో మనిషి ఉండి పాడుతున్నాడేమో అనుకునేవాణ్ణి! అన్నం నీళ్లు లేకుండా మనిషి ఎట్లా ఉంటాడు అని అనుమానం! ఎవరిని అడిగినా చెప్పరు. వారికే తెలియదేమో! గ్రామోఫోను పెడ్తే అక్కడే ఉండాలనిపించేది. ఎంతసేపు ఉంటాం? మా నాయనవెంట పోవడం - రావడం
వాళ్ళ ఇంట్లో ద్రాక్షచెట్టు ఉండేది. విశాలం అయిన వంటిల్లు, వంట మనుషులు ఉండేవారు. భోజనం వేళకు ఎంత మంది ఉన్నా వారి పంక్తికి కూర్చునేవారు. అందరికీ వెండి పూలున్న పీటలు - వెండి విస్తళ్లు! తిరువారాధన - చందనగోష్ఠి వైభవంగా ఉండేది. వారు ఎంతో ఉదారులు. దానశీలురు.
రైలుకట్ట ప్రక్కన - ప్రహరీకి ఇవతల చింతచెట్టుకు ఊయల మంచం ఉండేది. విశ్రాంతిగా ఉన్నపుడు నరసింహాచార్యులవారు - ధొరవారు - తెల్లని పరుపుమీద - తెల్లని దిండ్లు వేసుకొని ఊగుతుండేవారు. వారు లేనపుడు మాకు అభ్యంతరం లేదు. నేనూ మా అన్నయ్యా ఊగేవాళ్ళం.
ధొరవారు - వారి ఇద్దరు కొడుకులు రామానుజాచార్యులవారు, శ్రీనివాసాచార్యులవారు మా నాయనకు పరమ శిష్యులు. వారిని మేము మామలు అనే వాళ్లం - మా నాయన పాదములు పట్టి దిగిన ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది.
ధొరవారు తమ ప్రజల విషయంలో దుర్జనులు - దౌర్జన్యపరులు. ప్రజలు వీరి బాధలు పడలేక తరిమి కోట్టారట! రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకున్నారు. ప్రజలు ఖమ్మం వచ్చి ధొరవారికి శిస్తు కట్టేటట్లు - ధొరవారు ఆ ఊళ్లో అడుగు పెట్టక ఉండేటట్లు ఏర్పాటు చేశారు. అదే ఏర్పాటు కొనసాగుతున్నది.
దొరలు బయటి వారికి అత్యంత ఉదారంగా కనిపిస్తారు. భారతదేశంలో కళలన్నీ తామే పోషిస్తున్నట్లు వ్యవహరిస్తారు. తమ ఊళ్లలో మాత్రం గర్భనిర్భేద్యంగా వ్యవహరిస్తారు.
ఒక ఊరి దొర ఇంటిపేరు - ఆ ఊరిలోని మంగలి ఇంటిపేరు ఒకటే. మంగలితో ఇంటిపేరు మార్చుకొమ్మని ఆదేశించారు. "తాతల తండ్రుల కాడినుంచి వస్తాండె, బాంచెను. ఇంటి పేరెట్లు మార్తది దొర" అన్నాడు వాడు. ఎదురు చెప్పినందుకు తుపాకితో కాల్చి పూడ్చిపెట్టించాడు, మంగలి కుటుంబం మొత్తాన్ని దరిదాపుల్లో లేకుండా వెళ్లగొట్టించాడు దొర.
ఒక దొర చావిట్లో కూర్చున్నాడు. అతని ముందునుంచి చొక్కా తొడుగుకున్నవాడు పోతున్నాడు. చొక్కా వంటిమీదనే చిరిగేదాక కొట్టి పంపించాడు.
ఒక దొరముందునుంచి పోవాలంటే తలగుడ్డా, చెప్పులూ - సాధారణంగా ఉండవు. ఒకవేళ ఉంటే - చొక్కా సహితంగా దూరంగానే అన్నీ విప్పి చేతుల్లో పట్టుకొని - వంగి దండం పెడ్తూ సాగిపోవాలి.
గడీలు కోటల్లా ఉంటాయి. అందులోకి వెళ్లిన మనిషి తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు. ఒక ఊరుగడీ - పేరు తెలుసుకాని, చెప్పను - ఆ గడీలోకి ముత్యాల వర్తకులు వచ్చారు. దొరలు, దొరసానులు ఖరీదు చేశారు. మరొకసారి మరీ విలువయినవి తెమ్మన్నారు. రత్నాల వర్తకులు తెచ్చారు. దొరలు, దొరసానులు కొన్నారు. దొరల చుట్టాలు - దొరసాన్ల బంధువులు కొన్నారు. మరిన్ని వజ్ర, వైఢూర్యాలు తెమ్మన్నారు. వర్తకులు లాభానికి ఆశపడ్డారు. తెచ్చారు. వారిని చంపించి, పాతిపెట్టించారు. వజ్ర వైఢూర్యాలు కాజేశారు. వర్తకుల కోసం వెదుకుతూ వచ్చినవాళ్లను, ప్రాణాలు దక్కవని బెదిరించారు. బయటినుంచే సాగనంపారు.
నా "చిల్లర దేవుళ్లు" నవలలో చింతకాయలు తెంపినందుకు చావకొట్టిన దొర కథ ఉన్నది.
ఇలాంటివి కోకొల్లలు. అయితే ప్రజలు సహించినన్నాళ్ళు సహించేవారు, తిరగబడ్తే దొరల ప్రాణాలు తీసేవారు. అప్పుడప్పుడూ ఆ వార్తలూ వచ్చేవి.
దొరను - నట్టనడి ఊళ్లో - పట్టపగలు - గునపం గుచ్చి చంపారు.
ప్రజలు బండరాతితో దొర మెదడు చితక్కొట్టారు.
ఒక ఊళ్లో దొరను గొడ్డళ్లతో నరికారు.
ఒక ఊరి దొరను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు, గద్దలకు వేశారు.
ఇలాంటి వార్తలు తరచుగా కాకున్నా అప్పుడప్పుడూ వినిపిస్తుండేవి.
అదిగో, ఆ భయంతోనే దొరవారు పోలేపల్లిలో అడుగు పెట్టేవారుకారు.
ఇది తెలంగాణా ప్రజల సహజ స్వభావంగా ఉంది. పడి ఉన్నవాళ్లు పడి ఉంటారు. విజృంభించారంటే గిరిగుహలోకి సింహాలే! ఇహ వదలడం లేదు. నిజాం సహితంగా అంతు చూడాల్సిందే. అందుకే ఈ గడ్డన - ఎక్కడా రాని విప్లవాలు వచ్చాయి.
పోలేపల్లి అగ్రహారీకులు మా నాయనకు గృహదానం చేస్తామన్నారు. ఇల్లు పెద్దది. చాల పెద్దది. ఇటునుంచి మల్లన్న బజారు నుంచి వెనుక వీధిదాకా వ్యాపించి ఉంది. ఎందుకో ఆ ఇల్లు తాతయ్యకు నచ్చలేదు. ఆ ఇల్లు మంచిది కాదు, అరిష్టదాయకం వద్దంటారు.
తాతయ్య అన్న దాంట్లో కొంత అర్థం ఉంది. అంత ఇల్లు చాలాకాలంగా పాడుబడి వుంది. మంచి రోడ్డుకు ఉంది కదా ఎవరూ అద్దెకు ఉండడం లేదు. అంతేకాదు, ఆ యింటి యజమానికి ఎన్నో బాధలు కలిగాయట. అమ్ముకున్నాడు.
"పుచ్చిన సొమ్ము బాపన్ల పాలు" అని ఒక సామెత. పోలేపల్లిగారు అది వదిలించుకోడానికి దానం చేస్తున్నారని మా తాతయ్య వాదన. పిల్లలు గలవాడవు, ఆ ఇంట్లోకి పోవడం మంచిది కాదు అనేది పెద్ద మనిషి సలహా.
మా నాయనకు అంత ఇల్లు వదులుకోవడం ఇష్టం లేదు. భగవారాధన - తడియారాధన అన్ని అరిష్టాలను దూరం చేయగలదని మా నాయన వాదన. అయితే, నిర్ణయించాల్సింది మా నాయన. గృహదానం తీసుకోవడానికే నిర్ణయించారు.
కాని, అనంతర పరిణామాలు మా తాతయ్య వాదననే నిజం చేశాయి.
గృహదాన కార్యక్రమం చాల అట్టహాసంగా జరిగింది. తెల్లవారు జామున - పెట్రోమాక్సులైట్ల వెలుగు - బాజా బజంత్రీలు మా నాయన కూర్చున్న మీనాను అగ్రహారీకులు సహితంగా అనేకమంది శిష్యులు మోశారు. వేదం - ద్రావిడవేదం - ఉచ్చైస్వరంతో పఠిస్తుండగా - ముందు పూర్ణకుంభంతో మా కుటుంబం ఇంట్లో ప్రవేశించింది.
తరువాత చాల కార్యక్రమాలు జరిగాయి. భగవదారాధనలు ద్రావిడ వేద అధ్యయనాలు - చేరలకొద్ది నేయితో - వేలమందికి లడ్డూల సాపాట్లు - చందన గోష్ఠులు, తిరునామాలు, మంగళ హారతులు ఒక మహాపర్వ వాతావరణాన్ని కలిగించాయి.
ఆ ఉత్సవాల వైభవానికి మా తాతయ్య సహితం పొంగి పోయారు. శాంతి జరిగింది అని తృప్తిచెందారు.
అంపశయ్య:
మా తాతయ్యకు ఆ ఇంటితోనే కాదు. అసలు ఖమ్మంతో తృప్తిలేదు. వారి అణువణువునా చిన్న గూడూరు - వారి మిత్రుడు వడ్లకుంట సాయెబు చేరారు. వారు గూడూరు వెళ్తాననడం, మా నాయన వారించడం సాధారణం అయిపోయింది. అది వారిమధ్య అభిప్రాయ భేదాలు - కలతలు - అశాంతి కలిగించాయి.
ఒక విచిత్రం ఏమంటే - మా తాతయ్య పుట్టి పెరిగింది భద్రాచలంలో. వారికి భద్రాచలం మీద లేదు. ఇల్లు, వాకిలి, పొలాలు, ఉద్యోగం వదులుకొని వచ్చారు. మళ్లీ అటుతొక్కి చూడలేదు. మద్రాసులో ఎంతో వైభవంగా వైద్యం చేశారు. అటూ తిరిగి చూడలేదు. మరి ఏముందో తెలియదు చిన్న గూడూరు వారి మనసులో గూడు కట్టుకుంది.
మనం అన్నింటికీ హేతువులు నిర్థారించలేం. ముఖ్యంగా మనసుకు సంబంధించిన విషయాల్లో హేతువు మనకు అందదు. ప్రేమాభిమానాలు - ఈర్ష్యాద్వేషాలకు సరియైన కారణాలు కనిపించవు.
లైలా మజ్నూల కథ ప్రఖ్యాత ప్రేమకథ. లైలా అంత అందమయింది కాదు. కారునలుపు. మజ్నూ ఎంతో అందగాడు. ఆమె ప్రేమలో పడ్డాడు. పిచ్చివాడు అయినాడు. రాళ్లదెబ్బలు తిన్నాడు. అయినా, లైలాను వదలడు.
రాజు మజ్నూను పిలిపించాడు. "లైలా వికారి. నీవు అందగాడవు. ఏముందని ప్రేమిస్తున్నావురా దాన్ని?" అని అడిగాడు.
మజ్నూ జవాబు విని రాజు విస్తుపోయాడు.
"జహాఁ పనా! లైలాకో మజ్నూకే నజ్రోఁసే దేశఖో" "మహాప్రభూ! లైలాను మజ్నూ దృష్టితో చూడండి." అన్నాడు మజ్నూ!
మా తాతయ్యదీ ప్రేమగాధే. వారు చినగూడూరును ప్రేమించారు. ఆ ఊళ్లో ఏదో ఆకర్షణ ఉంది. అది నన్నూ మురిపిస్తుంది!
"బ్రతికి ఉండగా నన్ను గూడూరు చూడనియ్యవు" అనేవారు మా తాతయ్య.
"నీకేం రోగమా నొప్పా! చూడవచ్చులే" అనేవారు మా నాయన.
ఈ విషయంలో రోజూ తగాదాయే. అది తెగదు.
తాతయ్య నశ్యం పీలుస్తారు. అందమైన వెండి పొన్ను నశ్యం కాయలుండేవి. వారు చొక్కా వేయలేదు. నశ్యంకాయ రొంటిన దోపుకునేవారు. మా నాయన కూడా చొక్కా తొడగలేదు. తాతయ్య స్వయంగా నశ్యం చేసుకునేవారు. ఎదురు బద్ద చీరి - అందులో పొగాకు పెట్టి, నిప్పు సెగకు కాచేవారు. కొద్దిగా సున్నం వేసి ఖల్వంలో నూరుతే మెత్తని నశ్యం తయారయ్యేది.