"సారీ" అంటూ చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు.
ఇద్దరూ పుస్తకాలు తీసుకుని లేచి నిలబడ్డారు.
"ఇద్దరమూ పుస్తకాలు కరక్టుగా తీసుకున్నామా? లేకపోతే తారుమారు చేసుకున్నామా?" అంది.
'అలా అయితే బావుండును' అనుకుంటూ "అలా జరిగి ఉండదులెండి" అన్నాడు.
"జరిగి ఉండదని మీకెలా తెలుసు?"
"ఊరికినే అనుకున్నాను."
సరిగ్గా ఆ సమయానికి కరెంటు వచ్చి లైట్లు వెలిగాయి.
ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు అప్రయత్నంగా చూసుకున్నారు.
ఉలికిపడ్డాడు. ఒక్కసారిగా వెలిగిన కళ్ళు మిరుమిట్లు కొలిపే కాంతిలో తెల్లగులాబీలా మెరిసిపోతుంది.
* * *
విశారద కళ్ళు విప్పింది. కడుపులో నరాలన్నీ తోడేస్తున్నట్లు విపరీతమైన బాధ.
ఏం జరిగింది?
ప్రయాస మీద గుర్తు చేసుకుంటుంది.
తనకు నొప్పిరావడం, ఆ బాధ తట్టుకోలేక పడిపోవటం, రాజాచంద్ర బైటనుంచి బజర్ నొక్కడం, తాను లేచి....
తర్వాతేదో జరిగినట్లు తెలుస్తుంది కాని, అర్ధంకావటం లేదు.
రాజాచంద్ర ఎక్కడున్నాడు? తల కొంచెం పక్కకి తిప్పి చూసింది. చాలా దగ్గర్లో కూచుని ఉన్నాడు. ఆమె కదలడం చూసి ఆమెవైపు చూశాడు.
"ఏం జరిగింది?"
"యూఆర్ ఆల్ రైట్ ఎపెండిసైటిస్ కు ఆపరేషన్ జరిగింది."
"పిల్లలు?"
"ఇక్కడే ఉన్నారు" అని రాజాచంద్ర "రాఖేష్" అంటూ పిలిచాడు. గది బయట వరండాలో కూచున్న ముగ్గురూ లోపలికొచ్చారు.
"మమ్మీ ఎలా ఉంది? ఆర్ యూ ఆల్ రైట్?" అని అడుగుతున్నారు ఆదుర్దాగా.
విశారద చిరునవ్వు నవ్వింది చిన్న చిన్న లోపాలుంటే ఉండవచ్చుగాక...తానంటే ఎంత ఆపేక్ష వాళ్ళకి?
సిస్టర్ వచ్చి "ప్లీజ్! ఆవిడనెక్కువగా మాట్లాడించకండి" అంది.
కాసేపక్కద నిలబడి పిల్లలు ముగ్గురూ బైటకి వెళ్ళిపోయారు.
గదిలో రాజాచంద్ర ఒక్కడే కూర్చుని ఉన్నాడు.
ఎంత అమాయకంగా, నిర్మలంగా, పసిపిల్లవాడిలా ఉన్నాడు! తన పిల్లలు చక్కని వాళ్ళే కావచ్చుగాని ఈయన అందం రాలేదు.
అబ్బో! ఆ ఆకర్షణ ఎంత ఎక్కువ?
ఆ ఆకర్షణకు గురయ్యే తాను...
కళ్ళు మూతలు పడుతున్నాయి.
* * *
లైబ్రరీలో మొదటిసారి అతన్ని కలుసుకుంది. అతనితో మాట్లాడటం జరిగింది.
తాను యూనివర్సిటీలో ఎం.ఎ హిస్టరీ చదువుతుంది.
క్లాసులకి వెళుతున్నప్పుడూ వస్తున్నప్పుడూ, లైబ్రరీలో ఉన్నప్పుడూ గమనిస్తూనే ఉండేది. తానసలు ఆడపిల్లలతోగాని, మొగపిల్లలతోగాని ఎక్కువగా మాట్లాడదు. ఎవరి స్వభావమూ ఎక్కువ నచ్చదు. కాని అతన్ని చూసినప్పుడల్లా మనసులో ఏదో స్పందన కలిగేది. అతన్ని పలకరించాలనీ, కవ్వించాలనీ, పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగేవి.
లైబ్రరీలో చీకట్లో తటస్థపడిన వ్యక్తి అతనేనని తెలుసు. కావాలనే కొంచెంసేపు ఉడికించింది.
మరునాడు సాయంత్రం ఆమె క్లాసులన్నీ అయిపోయాక, ఒక్కతే నడిచి వస్తుంటే అతను తారసపడ్డాడు. తనని చూడగానే అతనికి కలిగిన ఉలికిపాటు గుర్తించి నవ్వుకుంది.
10
డాక్టరు లోపలకు వచ్చి "ఎలా ఉంది?" అని సిస్టర్నో, ఎవర్నో అడుగుతుంటే విశారద ఆలోచనలలోంచి తేరుకుని కళ్ళు విప్పింది.
డాక్టర్ పల్స్ చూసి సంతృప్తి వెలిబుచ్చాడు. "షి ఈజ్ ఆల్ రైట్" అని సెలైన్ కంటిన్యూ చెయ్యమని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు.
విశారద రాజాచంద్ర మొహంలోకి చూసింది.
అతనితో ఏమేమో మాట్లడాలనుకుంది. ఎన్నో మాట్లాడాలనుకుంది.
ఆలోచనలు ప్రవహిస్తున్నాయి గాని మాట్లాడాలంటే కష్టంగా ఉంది.
"ఏమీ మాట్లాడకండి" అని చెప్పి సిస్టర్ బయటకు వెళ్ళిపోయింది.
విశారద అతన్నే చూస్తూ మెల్లిగా కళ్ళు మూసుకుంది.
రాజాచంద్రకు అప్పటి విశారదే, ఆనాడు తన గుండెల్లోకి దూసుకు వెళ్ళిన విశారదే గుర్తు వస్తోంది.
* * *
రూమ్ లో ఒక్కడే పడుకున్న రాజాచంద్రకు నిద్రపట్టడం లేదు.
జీవితంలో తల్లీ, తండ్రీ అందరూ ఉన్నా- ఒక విధంగా తాను ఒంటరి. చిన్నప్పటినుంచి ఎవరితో కలిసేవాడు కాదు. అతని మనసుని ఏ స్నేహితుడు గానీ, ఏ అమ్మాయిగానీ ఆకర్షించలేదు. ఆడవాళ్ళంటే భయం కూడా అతని బంధువులలోనే వయసులో ఉన్న అమ్మాయిలు అతనితో చనువ్వు ప్రదర్శించినా, కొంతమంది ఆశలు వెలిబుచ్చినా అతను తప్పించుకుని దూరంగా తిరిగేవాడు.
అటువంటిది విశారదని చూసినప్పట్నుంచీ అతన్లో కలవరం బయల్దేరింది.
ఆమెను చూడాలనీ, మాట్లాడాలనీ మనసులో కోరిక.