రాజాచంద్ర అదిరిపడ్డాడు. క్షణంలో ఆమె మీద పెంచుకున్న కోపమంతా ఎగిరిపోయింది. ఒంగి ఆమె భుజంమీదా చెయ్యి వేసి తడుతూ "విశారదా! విశారదా!" అని పిలిచాడు.
ఆమె పలకలేదు.
చెయ్యి పట్టుకుని చూశాడు. ఒళ్ళంతా చల్లగా మంచుముద్దలా ఉంది. అతనికి భయం వేసింది. ఒణికిపోయాడు. ఏడుపొచ్చింది. అటూ ఇటూ చూశాడు. ఇంట్లో ఎవరూ లేరని అర్ధమయింది. ఒక్కక్షణం ఆలోచిస్తూ నిలబడి, ఓ నిర్ణయానికి వచ్చి రెండు చేతులతో ఆమెను పైకి లేవదీశాడు. అలాగే బయటకు నడిచి కారు దగ్గరకు దారి తీశాడు.
* * *
నర్సింగ్ హోంలో డాక్టరు ఆమెను త్వరత్వరగా ఎగ్జామిన్ చేశాడు. అది చాలా పెద్ద నర్సింగ్ హోం. రాత్రివేళయినా సరే, ఏ ఇన్వెస్టిగేషనయినా చెయ్యడానికి అన్ని సౌకర్యాలూ ఉన్నాయి.
డాక్టరు ఎక్స్ రే మొదలైన ఇన్వెస్టిగేషన్స్ కూడా పూర్తి చేశాడు.
"ఎపెండి సైటిస్ పెర్ ఫరేట్ కూడా అయి పెరిటోనైటిస్ కూడా డెవలప్ అయింది. షి ఈజ్ ఇన్ షాక్. ఫ్లూయిడ్స్ ఆల్ రెడీ స్టార్ట్ చేశాను. బ్లడ్ కూడా ఎక్కించాలి. సాధ్యమైనంత తొందరగా ఆపరేషన్ చెయ్యాలి. వీలైతె ఈ రాత్రికే.
* * *
విశారదకు ఆపరేషన్ జరిగింది. పిల్లలు ముగ్గురూ బిక్క మొహాలేసుకుని దిగులుగా కూర్చున్నారు. తల్లికి అంత సీరియస్ అయితే తమలో ఒక్కరు కూడా ఇంట్లో లేరు. ముగ్గురూ నేరం చేసినట్లు చాలా గిల్టీగా ఫీలవుతున్నారు.
విశారదను స్ట్రెచర్ మీద రూమ్ లోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఇంకా పూర్తిగా తెలివిరాలేదు. సెలైన్ ఫ్లో అవుతోంది.
డాక్టరు వచ్చి ఆమె కండిషన్ బాగానే ఉన్నదనీ, ఆందోళన పడవలసిన అవసరం లేదనీ చెప్పి వెళ్ళాడు.
రాజాచంద్ర మనసు కొంత వరకూ కుదుటపడింది. బెడ్ కు సాధ్యమైనంత దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
ఆ స్థితిలో ఆమెను చూస్తుంటే చాలా జాలేస్తుంది. అనురాగం పొంగు కొస్తుంది.
విశారద! ఎప్పటి అనుబంధం తమది! ఆమె తన.... ఆమె తన...
మనసెక్కడికో పరుగిడుతోంది.
* * *
ఆంధ్రా యూనివర్శిటీలో ఎం.ఏ. స్టాటిస్టిక్స్ చదివే రోజులవి.
రాజాచంద్ర ఇతర స్టూడెంట్స్ తో ఎక్కువ కలిసేవాడు కాదు. క్లాసులకి అటెండవటం, ఖాళీ సమయాల్లో లైబ్రరీ కెళ్ళి పుస్తకాల్ని మథిస్తూ ఉండటం.
ఎప్పుడూ ఒంటరిగా తిరుగుతూండే వాడు. ఎవరైనా పలకరిస్తే సభ్యతగా, మర్యాదగా జవాబిచ్చేవాడు. తాను మాత్రం ఎవరి తోనూ చనువుగా ఉండేవాడు కాదు. సాయంత్రాలు ఎప్పుడయినా బుద్దిపుడితే సముద్రతీరానికి వెళ్ళి కూర్చునేవాడు.
ఒకరోజు సాయంత్రం చీకటిపడేవేళ లైబ్రరీలో కూర్చుని చదువుకుంటుంటే కరెంట్ పోయింది. కరెంట్ వస్తుందేమో, చాప్టర్ పూర్తి చేద్దామని అలాగే కదలకుండా కూర్చున్నాడు. ఎంతకూ రాలేదు.
ఈలోగా చీకటి పడిపోయింది.
ఫ్యాన్లు ఆగిపోయినందు వల్ల ఉక్క పోస్తుంది. ఇహ బైటకి వచ్చేద్దామని లేచి ఇవతలకు వస్తున్నాడు. బాగా చీకటిగా ఉంది. చేతిలో పుస్తకం పట్టుకుని నడుస్తున్నాడు.
చీకట్లో ఎవరో అతన్ని ఢీ కొన్నారు.
"అయ్యో" అంది ఓ స్త్రీ కంఠం.
అతని చేతిలోంచి పుస్తకం జారి క్రిందపడిపోయింది. అతను పుస్తకం జారిపోయినందుకు బాధపడలేదు. తాను ఢీ కొన్నది ఓ స్త్రీ అయినందుకు కంగారుపడిపోయాడు.
అసలే అతనికి ఆడవాళ్ళంటే చచ్చేంత భయం. మాట్లాడాలంటేనే చేతులూ, కాళ్ళూ ఒణుకుతాయి. అలాంటిది అమాంతం ఢీ కొంటే! "సారీ" అన్నాడు భయపడిపోతూ.
"సారీ ఏమిటండీ? ఆడపిల్ల ఒంటరిగా కనపడితే కావాలని కోతిపన్లు చేసే ఇలాంటి జులాయి మనుషుల్ని చాలా మందిని చూశాను.
"నిజమండీ! నేను జులాయి వేషాలేసే మనిషిని కాదు" అంటూ పక్కకితప్పుకుందామని తడుముకోవటంతో అతని చెయ్యి ఆమె భుజం మీద పడింది.
"అదిగో భుజం మీద చెయ్యి వేశారు."
"అయ్యో! ఇది భుజమా? ఇంకేమిటో అనుకున్నాను."
"ఇంకేమిటో అనుకున్నారా కావాలని వేసి? - ఇప్పటికన్నా తియ్యండి."
"సారీ మరిచిపోయాను" అంటూ చెయ్యి తీసేశాడు.
ఒక్కక్షణం చీకట్లో అలా నిశ్శబ్దంగా నిలబడిపోయారు పక్కకి తప్పుకోకుండా.
"దారి కనపడటం లేదు. మళ్ళీ తగిలితే మీకు కోపమొస్తుంది."
"నా పుస్తకం కింద పడిపోయింది" అన్నదా అమ్మాయి.
"నా పుస్తకం కూడా పడిపోయింది."
"నేనడిగింది మీ పుస్తకం గురించి కాదు. నా పుస్తకం గురించి."
"ఉండండి తీసిస్తాను" అంటూ అతను కిందకు వంగబోయాడు. అదే సమయానికి ఆ అమ్మాయి కూడా వంగింది.
"అదిగో మళ్ళీ ఢీ కొన్నారు."
"నేను కావాలని చెయ్యలేదు."
"పాపం! మీరు కావాలని చెయ్యరు. కాని అన్నీ చేస్తూ ఉంటారు.
చీకట్లో ఇద్దరూ పుస్తకాల కోసం తడుముకుంటున్నారు. చేతికి చెయ్యి తగిలింది.
"తిడితే తిట్టింది గాని- ఈస్పర్స హాయిగా ఉంది" అనుకున్నాడు.
"చేతిమీద చెయ్యివేసి అలా ఉంచేస్తారేమిటి? ఎంతకూ తియ్యరేమిటి?"