"సారీ సుశీ! అవినీతిలో కూడా కొంత నీతి ఉంటుంది. దీనికి సంబంధించిన రహస్యాలేవీ ఎలాంటి పరిస్థితుల్లోను నేను బయట పెట్టలేను-"
"కానీ పాపం ప్రసూనకు నేను మాట ఇచ్చాను-"
"ప్రసూనమీధ నీకు నిజంగా అభిమానం ఉంటే ఆవిడను ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండమని చెప్పు-ఏమీ లాభంలేదు- పైగా ప్రమాదం......." సుశీల హడలిపోయింది___
"తప్పకుండా చెప్తాను......." అంది.....
ఆ మరునాడే ప్రసూనతో శేఖర్ చెప్పిన విషయాలు చెప్పింది.
"ప్రసూనా! నీకు పుణ్యముంటుంది- లేనిపోని చిక్కులలో ఇరుక్కోకే తల్లీ! నీ కేమైనా అయితే నేను భరించలేను?"
సుశీలకు తనమీద ఎంత అభిమానమో ప్రసూనకు తెలుసు-
ఆప్యాయంగా నవ్వి "చిక్కులకు భయపడి నువ్వు శేఖర్ కి దూరంగా ఉండగలవా?" అంది.
"సుశీల తెల్లబోయి దానికీ దీనికీ ఏమిటి సంబంధం?" అంది.
ప్రసూన మాట్లాడలేదు- సుశీల కొంచెంసెపు ఆగి సంకోచిస్తూ "చిక్కులకు భయపడి నేను శేఖర్ కి దూరంగా ఎలా ఉండగలను? శేఖర్ నాకోసం ఏమైనా చేస్తాడు-" అంది.........
ఆ దెబ్బ ప్రసూన మనసుకు గట్టిగా తగిలింది-
"మోహన్ నాకోసం ఏమీ చెయ్యడు- నామీద ఏ అభిమానమూ లేదు- అయినా అతనికోసం ఏం చెయ్యడానికైనా నేను సిద్దంగా ఉన్నాను. ఎలాంటి ప్రమాదాల కైనా భయపడను-"
"సారీ ప్రసూనా! ఏమీ అనుకోకు! నీ కోసమే!"
"నాకు తెలుసు-"
సుశీల చెయ్యి ఆప్యాయంగా స్నేహపూర్వకంగా నొక్కింది. శేఖర్ తో తనే మాట్లాడాలని నిర్ణయించుకుంది ప్రసూన-
సాంబశివం మధ్యాహ్నంవేళ నిద్రపోతాడు- ఆ సమయంలో శేఖర్ దగ్గరకొచ్చింది- ప్రసూన పని కట్టుకుని తన దగ్గిర కెందుకొచ్చిందో ఊహించుకోగలిగిన శేఖర్ మర్యాదగా "కూచోండి!" అన్నాడు............
రూపము, చదువు, సంస్కారము అన్నీ ఉన్న శేఖర్ కూడా ఇందులో ఒకడయి పోయాడు- బాధగా మూలిగింది ప్రసూన మనసు-
"ఒకసారి ఏదైనా తప్పటడుగు వేశామే అనుకోండి! అధి వెనక్కి తీసుకోవచ్చుగా! అందుకు మారుగా తప్పులే పెంచుకోవటం మానవ లక్షణమేనా?"
"ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగవచ్చుగా!"
"అంటే?"
"ఒకేచోట పని చేస్తున్నాం! ఒకరి కొకరం ఏం చెప్పుకోగలం?"
"ఇలాంటి చోట కెందు కొచ్చారు?"
"నిరుద్యోగాన్ని భరించలేక........"
"మీ ఒక్కరికి ఉద్యోగం సంపాదించుకోవటం వల్ల......ఇలాంటి ఉద్యోగం సంపాదించుకోవటం వల్ల ......మీలాంటి ఎంతమందిని నిరుద్యోగులుగా నించోబెడుతున్నారో ఆలోచించారా?"
"ఆలోచించను! ఇలాంటివన్నీ ఆలోచించే అవస్థ దాటి పోయింది- కానీ, ఇంకా ఆలోచిస్తున్నారుగదా! మీరు మాత్రం ఏం చెయ్యగలుగుతున్నారు? ఈ ఉద్యోగం మానేసి వెళ్ళిపోరాదా?"
"నేను........."
ఆగిపోయింది ప్రసూన_
"వెళ్ళలేరు- నాకు తెలుసు- ధర్మం కావాలి-న్యాయం కావాలి- అంతేకాదు-డబ్బు కావాలి-అందరమూ అంతే!"
"డబ్బుకోసం కాదు!"
"కాదు? మీరు కట్టుకున్న చీర, పెట్టుకున్న నగలు ఎక్కడివి? అసలు మీకా డిగ్రీ మాత్రం ఎలా వచ్చింది? అంతవరకు దేనికి? మీరింతవారు ఏ డబ్బుతో అయ్యారు? ఈనాడు పరమేశ్వరిగారికి కాస్త సాయం చెయ్యగానే సంఘసేవకులయిపోరు - మనకన్నీ సవ్యంగా సాగుతోంటే సరదాగా సంఘ సేవ చెయ్యటం గొప్ప విషయంకాదు-"
ప్రసూన తెల్లబోతూ "నేను పరమేశ్వరిగారి దగ్గరకు వెళ్తున్న విషయం మీకెవరు చెప్పారు?" అంది.
"మీరు ఎక్కడెక్కడ ఏంచేస్తున్నారో అంతా సాంబశివంగారికి తెలుస్తుంది- తర్వాత నాకు తెలుస్తుంది. సాంబశివంగారిని మూర్ఖుడిగా అంచనా వెయ్యకండి" నిర్ఘాంత పోయింది ప్రసూన.......
"అయితే ఆయన నన్ను మందలించవచ్చుగా!"
"మందలించటం అనవసరం అనుకుని ఉండవచ్చు- లేదా, మందలించలేని అశక్తత కావచ్చు!"
"మందలించలేని అశక్తత!.....అంటే?"
"నేనేం చెప్పగలను? మీరే అర్ధం చేసుకోవాలి!"
ప్రసూన సూటిగా శేఖర్ ముఖంలోకి చూసింది.
శేఖర్ ముఖం తిప్పుకున్నాడు-
ప్రసూన గుండె ఝల్లుమంది.