"నేనూ వెళతాను" అంటూ లేచింది ప్రసూన.
అక్కడి జనంలో ఎవరికీ చదువు విలువ తెలియడం లేదు. వాళ్ళు తమ పిల్లల్ని బడికి పంపరు. ఆ పిల్లలు రారు. వచ్చినా చదువుకోరు. ఆ తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆ పిల్లల్ని బడికి తెచ్చే బాధ్యత ప్రసూనమీద పెట్టింది పరమేశ్వరి. అంతకంటే చికాకు కలిగించేది లేకపోయినా సాధ్యమయినంత సహనంతో చేయడానికి పూనుకొంది ప్రసూన.
మోహన్ తన జేబునుండి వంద రూపాయలు తీసి పరమేశ్వరి ముందు ఉంచాడు.
"ఈ డబ్బు మీ కార్యక్రమంలో ఎలాగైనా ఉపయోగించుకోండి ప్రస్తుతం నేను చెయ్యగలిగింది ఇంతే!"
అని సిగ్గుపడుతున్నట్లు అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
16
ఏ విషయమైనా తెలుస్తుందేమో అని భయపడుతున్నప్పుడు ఉన్నంత సంక్షోభం తెలిసిపోయిన తర్వాతః ఉండదు- ఆ కారణం చేతనే శేఖర్ ఇప్పుడు సుశీలతో స్వేచ్చగా మాట్లాడగల్గుతున్నాడు........ ముందు కర్తవ్యం ఏమిటనేదే ప్రస్తుతం ఇద్దరినీ ఎదుర్కొంటున్న సమస్య..... నేను ఈ రేకెట్ లో ఉండగా నిన్ను పెళ్ళి చేసుకోలేను సుశీలా! నిన్నే కాదు. ఎవరినీ పెళ్ళి చేసుకోను...." తేల్చి చెప్పేశాడు శేఖర్.
"ఇందులోంచి బయటకు వచ్చెయ్యండి."
సుశీల అమాయకత్వానికి జాలిపడుతూ నవ్వాడు శేఖర్.
"పిచ్చి పిల్లా! అదంత తేలికయితే నేను ఇన్నాళ్లు ఇక్కడ ఉండేవాడినా? బయట పడటం అంటే ప్రాణాలతో చెలగాటం!"
"బయట పడటం సాధ్యంకాదు. బయట పడకుండా పెళ్ళి చేసుకోరు. ఇంతకు మీ మాటల సారాంశం ఏమిటి?"
"అర్ధమవుతుందిగా! ఎంచక్కగా నీకు తగిన వరున్ని..... మీ నాన్నగారు ఎంచి తెచ్చినవాణ్ని ........"
కూర్చున్నది చివాలున లేచి వెళ్ళబోయింది. సుశీల చెయ్యి పట్టుకొని ఆపుచేసాడు శేఖర్.......
"ఇలా కోపంతో వెళ్తే నా గతేంకావాలి? మీ ఇంటికి వచ్చి బ్రతిమాలుకునే అర్హత కూడా లేదే?"
"మీరు చీటికీ మాటికి ఇలా మాట్లాడకండి- నాకు మీ మీధ ఉన్న ప్రేమ ఋజువు చెయ్యాలంటే ఏం చెయ్యాలో చెప్పండి! నిప్పులో దూకనా?"
"అలా ఎర్రగా చూడకుండా ఉంటే చాలు! ఇలా చల్లగా చిరునవ్వు నవ్వితే చాలు."
పకపక నవ్వేసింది సుశీల- కొంచెంసేపు ఆలోచించి అంది.
"మనం ఎక్కడికైనా పారిపోతేనో?"
"బ్రహ్మాండమైన ఆలోచన ఆ తరువాత వాళ్ళు నా కుటుంబాన్ని బ్రతకనివ్వరు - పోనీలే! వాళ్ళు ఎలా పోతేనేం? మనం సుఖంగా ఉండవచ్చు?
"పొండి! నేనలా అనగలనా?"
"ఆలోచించకుండా ఎలా అంటే అలా మాట్లాడితే ఎలాగండీ మరి?"
"ఏం చేద్దామంటారు?"
"ఎటూ పాలుపోకుండా ఉంది. ఇలాటివన్నీ స్థిమితంగా ఆలోచించుకోవలసిన విషయాలు- మరొక్కసారి హెచ్చరిస్తున్నాను నువ్వు..... ...."
సుశీల లేచి వచ్చి శేఖర్ నోరు మూసేసింది.
"ఇది చివరిసారి. ఇంకొక్కసారి మీరిలా అన్నారంటే నేను మీకింకా కనపడను- అప్పుడు తెలుసొస్తుంది బడాయి........"
శేఖర్ చిరునవ్వుతో సుశీల చేతిని తొలగించాడు.
"నిజంగానే సుశీలా! నిన్ను వదులుకోవాలంటే ఎంత బాధగా ఉందో, అంగీకరించాలంటే అంత భయంగా ఉంది. నాకోసం కాదు- అలలరు ముద్దుగా అపురూపంగా పెరుగుతున్న నిన్ను చిక్కులలోకి ఈడుస్తున్నానేమోనని ......"
"మరేం పర్వాలేదు- ఆ చిక్కులన్నీ నేను పరిష్కరిస్తానుగా! అన్నట్లు మీరు నాకొక సహాయం చెయ్యగలరా?"
"అంత అదృష్టమా? చెప్పు!"
"ఈ నోట్ల మారకానికి సంబంధించిన రికార్డు ఎక్కడ ఉంది?"
ఉలికి పడ్డాడు శేఖర్ -
"ఎందుకు నీకది?"
"నా కోసం కాదు ప్రసూనకోసం........"