"తప్పు చెయ్యలేదని తెలిసీ దండించడం!" అన్నాడు శ్రీధర్.
"తేలికైనది ఏమిటో తెలుసా శ్రీవారూ?" అడిగింది ధరణి.
"ఏమిటీ?"
"చిరునవ్వు నవ్వి అవతలివారి మూడ్ బాగుపరచడం!" అంది.
శ్రీధర్ వెంటనే నవ్వేశాడు. విక్రం కూడా నవ్వుతూ "ఇంక నేను ఎక్కువసేపు వుంటే బాగోదు. వెళ్ళొస్తాను" అని లేచాడు.
"థాంక్యూ ఇన్ స్పెక్టర్!" మనస్ఫూర్తిగా అన్నాడు శ్రీధర్.
"మళ్ళీ కలుద్దాం" అంది ధరణి.
"ఫర్ ఏ చేంజ్-ఈసారి టెన్షన్ లేకుండా కలుద్దాం" చెప్పాడు విక్రం.
"ష్యూర్" నవ్వింది ధరణి. విక్రం సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
* * *
మళ్ళీ శనివారం వచ్చింది. న్యూస్ పేపర్లో జాన్ అబ్రహం నోట్ పెట్టి పంపించాడు.
"స్వాతంత్ర్యదినోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే పిల్లల పేర్లు పంపవలిసింది" అని.
"పూజ లక్ష్మీదేవి వేషంలో బావుంటుంది కదూ!" అన్నాడు శ్రీధర్.
"కిరణ్ బేడీగా బావుంటుంది" అంది ధరణి. శ్రీధర్ నవ్వాడు. ఆమె మాటల్లో వున్న అర్ధం అతడు పట్టించుకోలేదు. "నీలూని కలిసి చాలా రోజులయింది. త్వరగా బయల్దేరి వాళ్ళింటికి వెళ్ళి ఆఫీసుకి వెళ్తాను" అంది ధరణి.
శ్రీధర్ ముఖంలో బాధ అలుముకుంది. "ఏమని పలకరిస్తావు ధరణీ?" అన్నాడు.
"కష్టమే! కానీ తప్పదు. అందరూ వదిలిపెట్టేశారు అనుకుంటుంది లేకపోతే" అంది. శ్రీధర్ కి రబ్బరు బొమ్మలాంటి చిన్నారి ప్రియ రూపం గుర్తొచ్చి మనసు భారమైంది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ధరణి నీలూ ఇంటికి బయల్దేరింది. చాలా రోజులుగా ఇంటిని శుభ్రపరచనట్లుగా ఎక్కడి చెత్త అక్కడే కనిపించింది. ధరణి వెళ్ళేసరికి స్కూటర్ మీద గ్యారేజ్ కి బయల్దేరబోతున్నాడు ఆమె భర్త.
"రండి.... నీలూ లోపల ఉంది" అన్నాడు.
ధరణి తల ఊపి ఒక్కక్షణం లోపలికి వెళ్ళడానికి తటపటాయింపుగా చూసింది.
"మీరు వచ్చి మంచిపని చేశారు. నీలూని పలకరించే సాహసం ఎవరూ చెయ్యలేకపోతున్నారు!" బాధగా అన్నాడు. ధరణి తల వంచుకొని అంది. "ఈ ధరణికి కూడా గుండె ధైర్యం చాలని పరిస్థితి ఇది!"
అతడు తన కళ్ళల్లో నీళ్ళు ధరణి చూడకూడదన్నట్లుగా తల తిప్పుకుని "వెళ్ళొస్తాను!" అని వెళ్ళిపోయాడు.
ధరణి తలుపు తీసుకుని లోపలి నడిచింది. నీలూ హాల్లో నేలమీదే పడుకుని వుంది. ఆమె చుట్టూ ప్రియ ఆటబొమ్మలు చిందరవందరగా పడివున్నాయి. ధరణి నెమ్మదిగా వెళ్ళి "నీలూ" అంటూ మీద చెయ్యి వేసింది.
నీలూ కళ్ళు తెరిచింది. ధరణిని చూడగానే ఒక్క పెట్టున బిగ్గరగా ఏడుస్తూ ధరణిని కౌగిలించుకుంది.
"ఊర్కోనీలూ!" ధరణి ఆమె వీపు మీద నిమిరింది. నీలూ వెక్కిళ్ళు పెడుతూ "నేనేం తల్లిని ధరణీ! నా బంగారు తల్లి, నా ప్రాణం నాకు దూరమయ్యాక కూడా ఇంకా బ్రతికున్నాను! ఛీ.....నన్ను చూసుకుంటూ ఉంటే నాకే అసహ్యం వేస్తోంది!" అంది.
"ఏం మాటలవి? పోయినవాళ్ళతో వాళ్ళ దగ్గరవాళ్ళూ పోతూ వుంటే ఇంక ఈ లోకంలో ఎవరూ మిగిలి ఉండేవారు కాదు!" అంది ధరణి.
"ఇవి చూడు ధరణీ!" నీలూ తన తలకిందనుండి ఓ ఫోల్డర్ తీస్తూ అంది. "ప్రియ పేరిట ఆయన కొన్న ఇందిరా వికాస్ పత్రాలు! ఇది ఇన్సూరెన్స్ పాలసీ.....నా చిట్టితల్లి డబ్బు.... ఏం చేసుకోను చెప్పు? అది ఉన్నన్ని రోజులూ దాన్ని ఎక్కడో అనాధలా వదిలేసి, దాని భవిష్యత్తు కోసమే అని సర్ది చెప్పుకుంటూ ఇవన్నీ కూడబెట్టాము. ఇప్పుడు అవే మిగిలాయి! నా బంగారుతల్లి లేదు!" వాటిని గుండెలకి హత్తుకుని నీలూ వెక్కివెక్కి ఏడ్చింది.
ఆమెని ఓదార్చే ప్రయత్నం ఏమీ చెయ్యకుండా, ఆమె బాధని తనూ పంచుకుంటున్నట్లుగా కళ్ళనీళ్ళతో మౌనంగా చూస్తూ కూర్చుంది.
"పిల్లల్ని వదిలిపెట్టి, వాళ్ళకోసం మనం ఇలా డబ్బు కూడబెట్టడం, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ వర్తమానాన్ని నరకం చెయ్యడం ఎంత అవివేకమో ఇప్పుడు తెలుస్తోంది! నువ్వు అలా చెయ్యకు ధరణీ!"
ధరణి ఆమెవైపు చూస్తూ కూర్చుంది.
"మనని వాళ్ళు కనమని అడగలేదు. కన్నాక ఇలా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చేర్పించమనీ, బోలెడు డబ్బులు తమకోసం కూడబెట్టి ఇమ్మనీ అడగలేదు..ఇవన్నీ మనమే మన ఆనందంకోసం, స్వార్ధంకోసం చేస్తున్నాం. మా పిల్లలు ఫలానా స్కూళ్ళలో చదువుతున్నారనీ, ఫలానా కోర్స్ చేస్తున్నారనీ నలుగురికీ చెప్పుకోవాలనే స్వార్ధంతో చేస్తున్నాం. కనీ.... ఇదంతా పిల్లలకోసం మనం చేసే త్యాగంగా అభివర్ణిస్తాం. ఏక్చువల్ గా ...వాళ్ళకి పసితనంలో కావల్సింది డబ్బూ....గొప్పలూ కాదు! గోరంత ప్రేమా....ఆదరణా! తల్లిదండ్రుల దగ్గర నిశ్చింతగా నిద్రపోవడం. అవి వాళ్ళకి ఎండమావులు చేసి మనం కూడబెడుతున్న ఈ ధనం వాళ్ళ దాహాన్ని తీర్చగలదా? వాళ్ళు పోగొట్టుకుంటున్న బాల్యాన్ని వెనక్కి తీసుకురాగలదా? చెప్పు ధరణీ! వాళ్ళ మంచికోసం అంటూ మనం వేసే స్టెప్స్ వాళ్ళకి ఇష్టమో కాదో ఎప్పుడైనా కనుక్కున్నామా?" నీలూ నిలదీసింది.
ధరణి తల అడ్డంగా ఊపింది. ఆమె ఆలోచన్లు ఎక్కడో పరిభ్రమిస్తున్నాయి. వ్యవస్థకి ప్రతీక అయిన తన కాలనీ వ్యక్తుల చుట్టూ....
రాగిణి నృత్యం నేర్చుకోవాలనుకుంది. కానీ ఆర్ధిక ఇబ్బందులవల్ల కుదరలేదు. అందుకే తన కూతురికి బలవంతంగా నేర్పిస్తోంది! ఆ పాప ప్రతిరోజూ ఏడుస్తూ డాన్స్ క్లాస్ కి వెళ్తోంది. ఆ పాపకి తోటిపిల్లలతో ఖోఖో, కబడ్డీ ఆడుకోవాలంటే సరదా! రాగిణి ఒప్పుకోదు.
ఇలా తమ తమ అభిరుచుల్నీ, కోరికల్నీ పిల్లలమీద రుద్ది ఈ తల్లిదండ్రులు ఎందుకు వారిని వేధిస్తున్నారు? ఇదంతా పిల్లల మీద ప్రేమా లేక కన్నామన్న అధికారమా?
ఎంతో కళాతృష్ణతో డ్రాయింగ్ వేసే ఓ పిల్లవాడి బొమ్మల్ని చింపేసి "ఇంకోసారి బొమ్మలేస్తే చంపేస్తాను" అంటుంది ఓ తల్లి, చక్కగా పాటలు పాడే పిల్లలని కోప్పడి "చదువు మానేసి పాటలు పాడ్తే నాలుక చీరేస్తా" నంటాడు ఓ తండ్రి.
ఇలా వాళ్ళ ఆశల్ని అణిచిపెట్టి కోరికలను నేలరాచి వారి కలల పుస్తకాల్ని చింపేసే హక్కు ఎవరు యిచ్చారు ఈ తల్లిదండ్రులకి? తమ వృత్తంటే తమకే ఇష్టంలేని ఓ డాక్టరూ, ఓ ఇంజనీరూ, ఓ లాయరూ ఈ సమాజానికి ఏం చెయ్యగలరు?
ధరణి తన ఆలోచనల్లో తను మునిగిపోయింది. ఇంతలో నీలూ గొంతు బాధగా వినిపించింది. "నా చిట్టితల్లి ... చాలా వేధింపబడీ, బాధపడీ ఎవరికీ చెప్పుకోలేక అలా అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. అది తలుచుకుంటే నా గుండె చెరువౌతోంది!"
ధరణి ఉలిక్కిపడి ఆమెవైపు చూసింది.
నీలూ తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది. "బుగ్గమీద దాని ఇష్టం లేకుండా ఎవరైనా చెయ్యేస్తేనే ఒప్పుకునేది కాదు! అలాంటిది....దాన్ని...." ఆ తర్వాత మాట్లాడలేనట్టు ముఖాన్ని చేతుల్లో దాచుకుని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది.
"ఏమైంది?" ఆత్రంగా అడిగింది ధరణి.
"ఒద్దు....ఒద్దు....నన్నేమీ అడగకు. నేనేం చెప్పలేను. నాకేమీ తెలీదు. నేను అవేమీ తలుచుకోడానికి కూడా ఇష్టపడటం లేదు" కంగారుగా అంది నీలూ.
"నా దగ్గర దాచాల్సిన విషయమా?" అంది ధరణి.
"ధరణీ! నేను ఒక నర్సుని! నా పాప లేత శరీరం ఎందుకు కమిలిందో.....ఎంత బాధకు గురైందో తెలుసుకోలేక కాదు. ఆ విషయం నలుగురికీ తెలియడం ఇష్టంలేక బయట పెట్టలేదు. నా అనుమానాల వల్ల దాన్ని టెస్టులంటూ మరింత బాధపెడ్తారని భయపడ్డాను. ఆ శవాన్ని ఎక్కడ ముక్కలు ముక్కలుచేసి నా చిన్నతల్లిని చిత్రవధ చేస్తారోనని ఆ విషయం పొక్కనీయలేదు. ఇక్కడ..... ఇక్కడ దాచుకున్నాను!" నీలూ గుండెలు బాదుకుంటూ, జుట్టు పీక్కుంటూ, హిస్టీరిక్ గా అంది.
ధరణి అనూహ్యమైన విషయం విన్నట్లుగా చిత్తరువులా వుండిపోయింది. ఏడేళ్ళ పసిపాప లేత శరీరం మీద అత్యాచారం జరిగిందా? అటువంటి నీచపు పని చేసినవాడు మనిషా లేక పశువా? అసలు అలాంటివాణ్ణి నరికి కాకులకీ గద్దలకూ వెయ్యాలి గానీ నీలూ ఎందుకు ఊరుకుంది?
"నీలూ.....నిజంగా నువ్వు ఊహించినది నిజమా? ప్రియ.... ప్రియ అత్యాచారానికి గురైందా?" ధైర్యం కూడగట్టుకుంటూ అడిగింది ధరణి.
నీలూ ముఖంమీద నుండి చేతులు తియ్యలేదు. ధరణి బలవంతంగా వాటిని తొలగించింది. అప్పటికే నీలూకి స్పృహతప్పింది.
* * *
"డాక్టర్ మీరైనా నిజం చెప్పండి. అసలు ప్రియకి ఏమైంది?" ధరణి ముఖంలో ఆత్రుతా, ఆందోళనా ఒకదానితో ఒకటి పోటీ పడుతుండగా అడిగింది.
పరిమళ జవాబు చెప్పలేనట్లుగా చూసింది.
"ప్లీజ్ డాక్టర్ తెలిసిన విషయం చెప్పండి. నాకూ ప్రియ వయసు కూతురుంది" బతిమాలుతున్నట్లుగా అడిగింది ధరణి.