Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 32

  

     ఈ లోపులో A.D.U. సెక్రటరీ లేచి, "తరువాత ఏం చేస్తారో అనవసరం గానీ, ఇప్పుడు మాత్రం సమాధానం కావాలి...." అని అరిచాడు. మిగతా అందరూ అతనికి వత్తాసిచ్చారు. ఆడిటోరియం గోలగోలగ మారింది.
   
    కార్యక్రమ నిర్వాహకుడు గడావుడిగా "క్షమించాలి ఈవిడెవరో అనవసర అభియోగాలు చేస్తూ పెద్దమనిషిమీద బురద జల్లుతున్నారు. అసలు అటువంటిదేమీ జరగలేదని ఏడుకొండలు గారు చెబుతున్నారు" అన్నాడు.
   
    "ఎందుకు జరగలేదూ?" ధరణి అరిచింది. "చందూ!" అని ఆమె కేక వేసింది. చందూ వళ్ళంతా బ్యాండేజ్ కట్లతో జనంలోంచి ముందుకు వచ్చాడు.
   
    ధరణి ఆవేశంగా మైక లాక్కుని "ఈ చందూ ఓ గ్రాడ్యుయేటు. ఆటో అద్దెకి తీసుకుని నడుపుకుంటూ ఈ పెద్దమిషి తీసిన చిత్రాన్ని చూసి మిక్కిలి ప్రభావితుడయ్యాడు. ఎంతగా అంటే....తరతమ భేదాలు విస్మరించి ఓ శ్రీమంతుల పిల్లని ప్రేమించేసేటంతగా అన్నమాట! ఒక ఆడపిల్ల వెనకాలపడి పాటలు పాడితే ఓసారి కాదన్నా రెండోసారో, మూడోసారో తప్పక తమప్రేమని అంగీకరిస్తుందనే అభిప్రాయాన్ని యువతలో ప్రవేశపెట్టిన ఘనత ఈ చిత్రాలు నిర్మించే మహానుబావులదే! అలా ప్రేమలో పడిన తరువాత ఈ ఆటోడ్రైవర్ కి పెళ్ళాడాలన్న కోరిక కలిగి వేరోచితంగా ఆ పిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఈ యువకుడు! ఆ తండ్రి ఎవరో కాదు.... ఈ వేదిక నలంకరించిన మానవతావాదీ, సంఘసంస్కరతా, కోటీశ్వరుడూ అయిన శ్రీ శ్రీ శ్రీ ఏడుకొండలుగారు! ఆ ఏడుకొండలుగారు సినిమాలోలాగే ప్రవర్తించాడు. అంటే విలన్లా అన్నమాట!! ఆ యువకుణ్ణి కిరాయి గూండాలచేత మెత్తగా తన్నించారు. అతని అదృష్టం బాగుండి ప్రాణంపోకుండా బయటపడ్డాడు. ఆయన కూతురు ఈ ఆటోడ్రైవర్ని మనసారా ప్రేమించి, పెళ్ళి చేసుకోవడానికి సిద్దంగా ఉంది. ఈ తండ్రి విలన్లా అడ్డుపడుతున్నాడు. తన చిత్రంలో ఇటువంటివి సమర్ధించి, నిజ జీవితంలో ఇలా కిరాతకంగా ప్రవర్తించే హక్కు ఈయనకు ఉందంటారా?"
   
    "లేదు.... లేదు....!" జనం అరిచారు.
   
    "అసలు అటువంటి ఆలోచనలూ, కోరికలూ అమాయకులలో కలుగజేస్తున్నది ఈ దర్శక నిర్మాతలు కారా?"
   
    "ఔను.... ఔను!" కేకలు.
   
    "ఇటువంటి వాళ్ళా సంఘసంస్కర్తలు? పెద్దమనుషులు? యువతకు స్ఫూర్తినిచ్చె చిత్రాలు నిర్మించేవాళ్ళు ఎవరికోసం తీస్తున్నారు? మనకోసం..... మన వాళ్ళకోసం కాదా? మనం వాళ్ళు చెప్పిన నీతులన్నీ విని నమ్మాలి. మరి వాళ్ళదాకా వస్తే వాళ్ళెలా ప్రవర్తిస్తారూ? ఇదిగో ప్రత్యక్షంగా ఉన్న సాక్ష్యం... కళ్ళారా చూసి నిజం తెలుసుకోండి! 'డబ్బుపోసి టిక్కెట్టుకొనే మీకేకానీ నీతులు మాకు కాదు.....మేము చెప్పేదొకటి...చేసేదొకటి!' అని బహిరంగంగా ఒప్పుకోమనండి! తమ అసలు రంగులు బయట పెట్ట మనండి!" ఆమె అరిచింది.
   
    "ఏడుకొండలూ డౌన్ .... డౌన్" ఎవరో చెప్పు విసిరారు.
   
    ఏడుకొండలు కంగారుగా చూస్తూ తన మనుషులతో ఏదో చెప్పాడు.
   
    హీరోయిన్ కి భాష అర్ధంగాక, ఏం జరుగుతోందో తెలియక బేజారెత్తిపోయింది. జనం ఇదే సమయమని స్టేజ్ పైకి ఎక్కేసి ఆమె చుట్టూ మూగారు. విలేఖరులు ఏడుకొండల్ని చుట్టుముట్టి, ధరణి ప్రశ్నలకి వివరణ ఇవ్వవలసిందిగా కోరారు.
   
    ఏడుకొండలు తన కూతురి యిష్టం కూడా తెలుసుకుని ఆమెకు అంగీకారమైతే చందూకు ఇచ్చి పెళ్ళి చెయ్యాల్సిందే అని ఆటోడ్రైవర్ల సంఘం డిమాండ్ చేసింది. అందుకు ఒప్పుకోకపోతే విడిచిపెట్టేది లేదని, వెంటనే ధర్నాకూడా ప్రకటించేశారు!
   
    పోలీసులు రంగప్రవేశం చేశారు. లాఠీఛార్జీ జరిగింది. ఆ గొడవలో "చందూ- చందూ-" అంటూ ముందు వరసలో కూర్చున్న మేధ లేచి వచ్చి చందూని కౌగిలించుకుంది. అలా కౌగిలించుకాగానే ఫోటోగ్రాఫర్లకి చేతినిండా పని తగిలింది.
   
    "మా నాన్న ఇంత కర్కోటకుడు అనుకోలేదు. ఆయనేకాదు. ఆ దేవుడు అడ్డుపడినా మన పెళ్ళి జరుగుతుంది!" అంది.
   
    ప్రెస్ వాళ్ళు గబగబా ఈ విషయం నోట్ చేసుకున్నారు. ధరణి ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తే, ధరణి వారించింది. సినిమాల వలన యువత ప్రభావితం అయ్యే ఆస్కారం ఎక్కువ కాబట్టి అవాస్తవిక చిత్రాల్ని, అసహజమైన దృశ్యాలనీ చిత్రాల్లో చూపకూడదన్నదే తన అభిప్రాయం అనీ, అందుకే ఇలా ఈ విషయం నలుగురి దృష్టికీ తీసుకురావడం జరిగిందని చెప్పింది.
   
    ఆటోడ్రైవర్ల సంఘం వారు హుషారుగా చందూ, మేధలకి అదే వేదికమీద దండలు మార్పించేశారు.
   
    ఏడుకొండలు విధిలేక "ఈ వివాహం నాకేమాత్రం బాధ కలిగించడంలేదు. యువత శక్తిముందు పెద్దరీకాలు తలవంచక తప్పదని మరోసారి రుజువైనందుకు ఆనందంగా వుంది" అని కన్నీటిని తుడుచుకుంటూ స్టేట్ మెంట్లు ఇచ్చాడు.
   
    విచ్చేసిన ప్రముఖులు వధూవరులని ఆశీర్వదించారు. మూవీ కెమెరాలు, ఫ్లాష్ లైట్ల వెలుగులమధ్య నిండుగా నవ్వుతూ మేధ చందూ చేతిని గట్టిగా పట్టుకుంది.
   
    "ఇది ప్రజలు చేసిన పెళ్ళి! జన చైతన్యం చేసిన పెళ్ళి" అని వ్యాఖ్యానించాడు దర్శకుడు.
   
    "ఐయామ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ మై బోయ్" అని చందూని కౌగిలించుకున్నాడు హీరో.
   
    ఈ ఫోటో ఆ వారపు సినిమా మేగ్ జైన్స్ అన్నింటికీ కవర్ పేజ్ అయింది!
   
                                         4
   
    ఆ గదిలో సూదిపడితే వినిపించేటంతగా నిశ్శబ్దం నిండి వుంది.
   
    శ్రీధర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా కనబడ్డాడు. ధరణి సోఫాలో వెనక్కివాలి కళ్ళు మూసుకుని కూర్చుని వుంది.
   
    ఇన్ స్పెక్టర్ విక్రం ఆ నిశ్శబ్దాన్ని చీల్చడానికా అన్నట్లుగా తన చేతిలోని లాఠీతో టేబుల్ మీద చిన్నగా కొట్టాడు.
   
    ధరణి కళ్ళు తెరిచింది.
   
    "తర్వాత ఏమిటి?" శ్రీధర్ ఎవర్నీ ఉద్దేశించకుండా అడిగాడు.
   
    "పెళ్ళి తర్వాత జరిగేదే- శోభనం!" అని తన జోక్ కి తనే నవ్వేశాడు ఇన్ స్పెక్టర్.
   
    శ్రీధర్ దిగులుగా - "ఇన్ స్పెక్టర్ జోక్ గా తీసుకోకండి. సీరియస్ గా ఆలోచించండి. ఆ ఏడుకొండలు ఈవిడగారు చేసిన గొడవకి పబ్లిక్ లో నోరు మెదపకుండా ఊరుకున్నా తర్వాత రియాక్ట్ కాకుండా ఎలా వుంటాడు?" అన్నాడు.
   
    "ఏం చెయ్యగలడు? పబ్లిక్ ఫిగర్ కదా! అల్లుణ్ణి ఏం చేసినా పత్రికలవాళ్ళు ఊరుకోరు. పైగా అతనికీ ఒక్కగానొక్క ఆడపిల్ల. వదిలేసుకుంటాడా!" ధైర్యం చెబుతున్నట్లుగా అన్నాడు విక్రం.
   
    ధరణి లేచి వంటగదిలోకి వెళ్ళింది.
   
    "ఆవేశం తప్ప తను ఆలోచన చెయ్యదు. రేపట్నుంచీ తన గురించి నేనెంత కేర్ తీసుకోవాలో అని తలుచుకుంటేనే భయం వేస్తోంది!" అన్నాడు విక్రంతో శ్రీధర్.
   
    ధరణి ప్లేట్లో స్వీట్స్ తీసుకుని వచ్చి " తీసుకోండి" అంది.
   
    "మీ తమ్ముడి పెళ్ళి జరిగినందుకా?" వస్తున్న కోపాన్ని అదిమిపెడుతూ అడిగాడు శ్రీధర్.
   
    "కాదు! నాకు ప్రమోషన్ వచ్చినందుకు. ఇప్పటినుంచీ సెక్షన్ ఇన్ చార్జిని నేనే" కాస్త గర్వంగా అంది. శ్రీధర్ ఆశ్చర్యంగా ఆమెవైపు చూశాడు. ఆమె నవ్వి "సాయంత్రం ఇది చెప్దామనే ఆఫీసు నుండి తొందరగా వచ్చాను. ఇదిగో ఈ గొడవ జరిగింది" అంది.
       
    అతడికి భార్యని చూస్తూంటే సంతోషంతో పాటూ, ఒక్కోసారి ఆశ్చర్యం కూడా వేస్తూ వుంటుంది. "నా భార్యలాంటి భార్యని పొందే అదృష్టం కొద్దిమంది మొగవారికి మాత్రమే దొరుకుతుంది" అనుకున్నాడు మనస్ఫూర్తిగా!
   
    "కంగ్రాట్స్ మేడమ్" విక్రం లేచి స్వీట్ తీసుకున్నాడు.
   
    "మీరుకూడా తీసుకోండి. రేపు చేదుగా వుంటుందేమో అని విచారిస్తూ కూర్చునేవారు, ఈ రోజులోని తీపిని అనుభవించలేరు!" శ్రీధర్ కి తనే అందిస్తూ అంది.
   
    "నేను భయపడుతున్నది నా గురించి కాదు!" బాధగా అన్నాడు శ్రీధర్.
   
    "మీవాళ్ళ గురించైతే భయం మరీ అనవసరం! ఇలాగే ప్రతివాళ్ళూ ఆలోచిస్తూ కూర్చుంటే మనరోడ్ల కూడళ్ళలో పెట్టుకోవడానికి ఒక్క నాయకుడి విగ్రహం కూడా వుండేది కాదు!" ధరణి చిరునవ్వుతో చెప్పింది.
   
    విక్రం మెచ్చుకోలుగా "మీరు మా డిపార్ట్ మెంట్ లో వుండి వుంటే బావుండేది మేడమ్" అన్నాడు.
   
    "మా ఆయన ఒక్కరాత్రి కూడా నిద్రపోయేవాడు కాదు! ఆయనకు నేనంటే విపరీతమైన ప్రేమ!" అంది ధరణి.
   
    విక్రం ఒకసారి శ్రీధర్ నీ, ధరణినీ నిశితంగా చూసి "ప్రేమకు నిదర్సనం నిలదీయడం, అవతలివారి పనిని విమర్సించడం కాదు. అర్ధం చేసుకోవడం, చాతనైతే సహకరించడం అనుకుంటున్నాను. ఎక్కువగా మాట్లాడినందుకు క్షమించాలి!" అన్నాడు.
   
    శ్రీధర్ ధరణి చేతిలోని స్వీట్ అందుకుని ఆమె నోటికి అందిస్తూ "కంగ్రాట్యులేషన్స్ ఇన్ చార్జిగారూ!" అని నవ్వాడు.
   
    "థాంక్స్" ధరణి అంది దాన్ని తోసుకోకుండా!
   
    "ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏమిటో తెలుసా ఇన్ స్పెక్టర్?" అడిగాడు శ్రీధర్. విక్రం ఏమిటన్నట్టు చూశాడు.

 Previous Page Next Page