Previous Page Next Page 
విరిజల్లు పేజి 32


    నవ్వి ఆమెను సాగనంపుతూ "యెలాగైనా నీవు నీవే!" అన్నాడు.
    చిత్రంగా అతనివేపు చూస్తూ "అదేమిటి?" అంది.
    మళ్ళీ నవ్వి "అదంతేలే!" అన్నాడు.
    నిశ్శబ్దంగా వెళ్ళిపోయిందామె.


                                                                 23


    నేను గుడ్డివాడినయ్యానని అంత చులకనగా చూడకు అక్కా! దైవం చిన్నచూపు చూస్తే సహించలేను. కదలటానికి కాళ్ళున్నా కళ్ళు లేవని బాధపడుతున్న నీ మాటలతో యింకా ఖూనీ చేయవద్దు. అవిటివారి మీద సానుభూతి చూపటం నేర్చుకో అక్కా!"
    కన్నీరు తుడుచుకోటానికైనా యత్నించకుండా తర్జని ఆమె వేపు చూపుతూ అన్నాడు.
    "ఒకరికి లేనిది మనకుంది అని గర్వించేవారి వద్దనుంచి ఆ గర్వాన్ని భగవానుడు ఎప్పుడయినా తీసికెడతాడు. క్రికెట్ ఆటలో నా అంతవాడు ఊరిలోనే లేడని గర్వించే నాకేమైంది! చూడు గుడ్డివాడినై మారిపోయి చివరికి ఆటను చూసే యోగ్యతను కూడా పోగొట్టుకున్నాను. యెప్పటికయినా ఈ ప్రపంచంలో గర్వానికీ అహంకారానికి శిక్ష తప్పదక్కా!"
    ఒక్క క్షణం ఆగి అన్నాడు. "తప్పుచేస్తే నరకానికి పోతారని నాయనమ్మ బెదిరించేది జ్ఞాపకముందా? నిజంగా నరకం అనే లోకం వుందని భ్రమపడుతున్నావా? నరకమనేది లేనే లేదక్కా! నరకమంటే మనచుట్టూ అల్లుకునే విషవలయాలే! యీనాడు యీ చేతితో చేసిన దానికి మరో చేతితో మరునాడే అనుభవించాలి చూడు. నాకింతకంటే నరకం ఏముంది? అసలు నరకంలో అన్నీ బాధలేననుకుంటూ. అవన్నీ శారీరకంగా బాధిస్తాయేమోకానీ, యీ నరకంలో మాత్రం నాకు మానసికంగా శిక్ష యెక్కువగా వుంది. భరించుకోలేక సదా దుఃఖిస్తున్న నన్ను ఇంకా యెందుకు వేదనపాలు చేస్తావ్!"
    కఠినంగా చూసింది. కానీ భగవంతుడు అతనివేపు చల్లని చూపు చూడటం వలన ఆ చూపుని చూడలేకపోయాడు.
    "అయిందా నీ ఉపన్యాసం? కనిపించినవాడివి కనిపించినట్లుండక ఎందుకీ షికార్లు అంటే యెంత చదివావ్? తోటలోకి వెడుతూ దారిలో ఎక్కడయినా పడితే అది ఇంకొంచెం నరకం కాదా అన్నదానికి యెంత వ్యాఖ్యానం చేశావ్? అంతగా రోజూ నీ మల్లెచెట్టు నీడని కూర్చోలేంది నిలువలేని వాడివి మీ విరజని ప్రతిరోజూ రమ్మని వేడుకోరాదా! అయినా నీకూ అర్ధంకాక అడుగుతాననుకో_ఆ విరజలో ఏముందని మీ బావమరుదులు యిద్దరూ అలా పట్టుకుని వ్రేలాడుతున్నారు? కొంచెం చెప్పరాదూ ఆమె గొప్పేమిటో తెలుసుకుంటాను."
    "ఛీ.... ఛీ....యెంత మాటంటే అంతమాట అనేస్తున్నావు. ఆలోచించి మాట్లాడక్కా. బావ వింటే యెంత బాధపడతాడు.... నేనంటే సరే! అన్నిటా వంచితుడనయ్యానా__ఇప్పుడు కష్టమయినా, దుఃఖమయినా, సంతోషమయినా ఒకటే. కానీ బావలాంటి అమృత హృదయుడిని విరజ లాంటి దేవతను అలా అనొద్దు. విరజలో వున్న గొప్పదనం తెలుసుకోవాలంటే నీలాంటి వాళ్ళకి మరో నూరు జన్మలు కావాలి, ఛీ.... ఛీ.... ఏం మాట అన్నావక్కా...."
    గట్టిగా అరిచింది ఆవేశాన్ని అణచుకోలేక "నన్ను చీవాట్లు పెడుతున్నావేం! ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అయ్యాయని వూరికే అన్నారా. చిన్నప్పటినుంచి నిన్ను సాకి సంతరించి దగ్గర తీసుకుని చదువు చెప్పిస్తూ అవివేకంగా నీవీ దురవస్థ తెప్పించుకుంటే చాకిరీ చేస్తున్న నన్ను కాదని నిన్న కాక మొన్నవచ్చిన ఈమెను పట్టుకొని దేవతని పొగుడుతూ నన్ను నిందిస్తావా కృతఘ్నుడా?"
    ఈ ప్రపంచంలో రెండురకాలయిన మనుషులున్నారు. వారు అందరికి విభిన్నులు.... ఆవేశం అధికంగా, ఆలోచన తక్కువగా వుంటుంది. ఒకరకంవారికి తమకు దక్కలేదే అనేదానికన్నా తమకు దక్కకపోవటంతో ఏదో తమలో లోపం వుందని గోరంతని కొండంతలుగా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్సు చేత బాధపడే వాళ్ళు ఆ రకం....
    తమకీ ఆలోచనా శక్తి అధికంగా వుందనుకుని, అన్నిటా గొప్పగా ఆలోచించి మాటాడుతామని ఏ విషయాన్నయినా సూక్ష్మంగా అర్ధంచేసుకోగలుగుతామని ఓ విధమయిన సుపీరియారిటీ ఫీలింగ్ చేత గర్వపడేవాళ్ళు రెండోరకం....
    "కృతజ్ఞతకు అర్ధం తెలుసాక్కా నీకు? నీవుచేసే తప్పులను నీకు చూపకుండా మౌనంగా భరించుకుని చివరికి పరాయివాళ్ళచేత నీకు అవమానం కలుగుతూ వుంటే అప్పుడు విని మౌనంగా వుండటమే కృతజ్ఞత అనిపించుకుంటుందా అక్కా? నీవు యిప్పుడన్న మాటలు వింటే ఎవరయినా ఏమనుకుంటారు? నిన్ను, బావని విరజని బజారుకెక్కిస్తారు. ఒకరు మంచిగా ఎక్కితే మరొకరు మంచితనాన్ని బయటికి తెచ్చినవారుగా బజారుకెక్కుతారు. అంతా ఒక్కటే అక్కా! నిప్పుని నీవు ముట్టుకున్నా, నిన్ను నిప్పు ముట్టుకున్నా ఫలితం ఒకటే! నామాట వినక్కా. మనసులో లేనిపోనిదేదో ఊహించుకుని కలతలని సృష్టించవద్దు. ఎందుకో బావ ఈమధ్య సరిగా వుండడంలేదు. నీవేమైనా అన్నావేమిటి!"
    మండేకట్టెపై నెయ్యివేసినట్టుగా అయింది. "చాలా ముదిరిపోయిందే వివేకం! నన్ను దండించడం, నా యింటి విషయాలలో జోక్యం కలిగించుకోవటం. ఎబ్బే! ఎంతమాట ఎంత గొప్పవాడివయ్యా....నా సంసారాన్ని దిద్ది నన్నుద్దరించాలనుకునే వాడివి బాబూ? నీతో చెప్పనా! మీ బావకి నాకు ఈమధ్య పడటం లేదు. సంధిచేస్తావేమిటి? హుఁ.... ఎంతగా మారిపోయావ్ రా? ఆడదానికి పెళ్ళయితే పెద్దరికం వచ్చిందనుకుంటుంది. అలాగే నీకూ చూపు పోయి మంచంలో కూర్చుంటూనే పెద్దరికం వచ్చిందని భ్రమిస్తున్నావేమిటి?"
    మరీ హేళనగా మాట్లాడుతున్న ఆమె మాటలు వింటూంటే ఆమెను విరజతో పోల్చుకుని స్వర్గానికీ, నరకానికి తేడా ఒక్క గీత మాత్రమే ననుకున్నాడు.
    "నీకు తెలియదేమో! ముసలాళ్ళకు అరవయ్యేళ్ళు దాటాక చూపు మందగించి శరీరం మెత్తబడి కదలలేక మెదలలేక మంచంలో కూర్చుని అనుభవం అనే పేరిట యువతుల్ని, యువకుల్ని పిలిచి నీతిబోధచేస్తూ అన్నిటా అడ్డుపడుతూ వుంటారు. అందునా ఆడవారైతే మరీ ఎక్కువ. ఆడదానికంటే అన్యాయంగా ముసలమ్మ కబుర్లు చెప్పటం నేర్చుకున్నావా? ఇంకేం బాగుపడతావులే? బాగానే__ నోరు మూసుకుని కూర్చో. నోరు మెదిపావంటే ఇక్కడుండే యోగ్యతనికూడా పోగొట్టుకుంటావు__"
    విసురుగా వెళ్ళిపోయింది. ఇంకేమీ అనకుండా, కన్నీరు తుడుచుకుంటూ అనుకున్నాడు. "భగవాన్ కళ్ళు తీసేసుకున్నా బాధపడలేదు. అది నిన్ను త్వరగా కలుసుకునేమార్గం అనుకున్నాను. కానీ కళ్ళు పోయాయని ప్రతి నిమిషం నన్ను ములుకుల్లా గుచ్చుకునే మాటలంటూంటే అలా బాధపెట్టేవారిని మాత్రం నాదరికి రానివ్వకు అని ప్రార్ధిస్తున్నాను. నాలో ఇంకా అహంకారం ఆత్మాభిమానం చావలేదు. ఏదైనా జరిగితే దుఃఖించకుండే మనస్సుని, చలించకుండే ధైర్యాన్ని ప్రసాదించు భగవాన్?"
    ఎన్నయినా ఏమైనా నా బావ సంసారం విచ్చిన్నం కాకుండా చూడు. బంగారంలాంటి బావ మనసుని పాడు చెయ్యొద్దు. శాంతిగా ఉండేట్టు చూడు. ఆయనకు శాంతి లేకపోతే ఈ శాంతి వనానికి శాంతిలేదు.
    వి__ర__జ అక్కకంటే మిన్నగా చూసే ఆమెకిబాధ కలుగనివ్వవద్దు భగవాన్! నా కళ్ళు తీసుకున్నావ్ బాధలేదు, నా ప్రాణమైనా తీసుకో అడ్డుపెట్టను. కానీ కానీ నా విరజక్కయ్యను నానుంచి మాత్రం తీసుకోకు. మమ్మల్ని వేరు చేయకు. అలా అయితే ఆత్మహత్య చేసుకుని నీ సృష్టి నీ చర్యను హేళనచేసే అయోగ్యమైన పని చేయించకు__"


                                                          24


    అప్పుడే విరిసి మంచులా తడిసిన గులాబీలా వుంది తోట. తనకిష్టమైన మల్లెచెట్టు నీడని కూర్చుని సావిత్రికీ, విరజకీ అంతస్థులో, అంతఃకరణలో బేధాన్ని చూస్తున్నాడు రంగ. అప్రయత్నంగా కన్నీరు కారిపోయింది. నిండుకుండలో నీరు ఒలిపితే వెలితి అయి లోటుగా కనిపిస్తుంది కానీ మానవుడిలో నీరు తొలిగితే బాధలు వెలితి అయి నిండుగా కనిపిస్తాడు.
    వచ్చి అతని ప్రక్కనే కూర్చుని కన్నీరు తుడుస్తూ అంది విరజ. "ఏమైంది రంగా! ఒంటరిగా కూర్చొని ఆలోచనల్ని పెంచుకుని ఏడ్వటం అలవాటు చేసుకోకు. చిన్నవయసులో ఇలా అలవాటు పడితే పెద్దయ్యాక ఆ అలవాటు మారక యెంతో బాధపడాలి యింతకీ ఏమైంది చెప్పవూ?"
    ఆమె తొడపై తలను ఆన్చుకుని ఏడుస్తూ అన్నాడు. "ఏడ్వడం తప్ప నాకింకేముందక్కా! అశక్తుడిని. అసహాయుడిని. ఉన్న లోపాన్ని గోరంతని కొండంతలుచేసి అయినవాళ్ళే అవమాన పరుస్తూంటే పగిలి ముక్కలైన హృదయాన్ని జతపరచాలని మరొకరు చేసే ప్రయత్నం వ్యర్ధం అవుతుందే అని బాధపడే నాకు దుఃఖంకాక మరేముంది?"

 Previous Page Next Page