Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 32


    ఇద్దరు అనుచరులూ గోపీని సమీపించారు గోపీ చేతిలోని పిస్టల్ అలాగే ఉంది. అతడు చేతిని కదపడంలేదు. ఇద్దరూ చెరో పక్కనుంచీ ఇంచుమించుగా గోపీకి దగ్గరగా వచ్చారు. సోము ఆత్రుతగా చూస్తున్నాడు. గోపీ తమకుచిక్కి నట్లే అతడు భావిస్తున్నాడు. కానీ మనసులోకాస్త భయంగానే ఉంది.
    అనుచరులిద్దరూ గోపీని సమీపించినప్పటికీ అతడు నిశ్చలంగానే ఉన్నాడు. కానీ ఉన్నట్లుండి చెట్టువెనుకనుండి శకుంతల లేచింది. ఆమె గోపీని ఊతగా చేసుకుని తనప్రతాపం చూపించింది. ఇద్దరు అనుచరులూ చెరో పక్కకూ పడిపోయారు. శకుంతల మళ్ళీచెట్టు వెనక కూర్చుండి పోయింది.
    "వాళ్ళిప్పట్లో లేవరు-" అన్నాడు గోపి.
    సోము తెల్లబోయి చూస్తున్నాడు. ఈ గోపి ఎవడు? వీడు నిజంగా మనిషేనా? తన ఊహకు మించిన జిత్తులు ప్రయోగిస్తున్నాడు. ఇప్పుడేం చేస్తాడో?
    "నాకు దగ్గరగా వస్తే ఏం జరుగుతుందో చూశారు. అందుకని దూరంగానే ఉండినేను చెప్పినట్లు వినండి. వినకపోతే పిస్టల్ ఉపయోగించాలి. నాగురించి మీకేమైనా సందేహాలుంటే అటుచూడండి-" అంటూ అటు వైపుగా పిస్టల్ పేల్చాడు. దూరంగా ఉన్న చెట్టుమీంచి ఓ పండురాలింది.
    "అది నాగురి మాత్రమే కాదు-రేంజ్ కూడా-మరినేను చెప్పినట్లు వింటారుకదా?" అన్నాడు గోపి.
    అనుచరులందరూ సోమువంక భయం భయంగా చూశారు. సోము చేసేదిలేక తలవంచుకున్నాడు.
    గోపి వాళ్ళందర్నీ వరుసగా లైన్లో నిలబడమన్నాడు. పదిమందినీ అయిదుజంటలుగా విడదీశాడు. జంటలు ఒకరికొకరు వీపులానించుకునిచేతులు జంటగా కలుపుకుని - పోరుగూరికి పోయేదారిలో వేగంగా పరిగెత్తాలి.
    "ఏ మాత్రం పొరపాటు జరిగినా పిస్టల్ పేల్తుంది. మీ అయిదు జంటలకూ పరుగుపందెం- రెడీ వన్....టూ....త్రీ...." అన్నాడు గోపీ.
    వెంటనే అయిదు జంటలూ రెండోరోడ్డుమీద పరుగుప్రారంభించాయి. గోపీ ఆవినోదం చూస్తూనిలబడ్డాడు. అయిదుగురి ముఖాలు అతడికికనబడుతూనే ఉన్నాయి.
    ఒకడికి పాంటుజారిపోయింది. రెండోవాడు ఆగలేదు. ప్రాణభయం అటువంటిది. ఆజంట అలాగే పరుగుకొనసాగించింది.
    సోము చేతులు పట్టుకుని ఉన్న తన జంటమనిషిని విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాడు ముందుకు పరుగెడుతూ సోమును వదలడం లేదు. కనుచూపు మేరదాటినా వాళ్ళను ప్రాణభయం వదలడంలేదు.
    వాళ్ళు కనుచూపుమేరదాటగానే గోపీ చెట్టును సమీపించాడు - "మన పని అయిపోయింది -" అన్నాడు. శకుంతల చెట్టువెనుకనుంచి లేచి చెట్టు మధ్యలో ఓప్రాంతాన హుక్ తీసింది. కొద్దిక్షణాల్లో అంతచెట్టూ అప్పడంలాగైపోయింది. గాలిఊదితయారు చేసిన ఆబొమ్మ చెట్టునువారు మడతపెట్టి ట్రక్ లో వేశారు.
    "నువ్వు కార్లోరా- నేను ట్రక్ ను నడుపుతాను"-అన్నాడు గోపి.
    సోము అవతలిదారిలో చాలాదూరం వెళ్ళాక ఎలాగో మొత్తంమీద తన అనుచరుణ్ణి బలంలో అధిగమించి పడగొట్టి- "యూఫూల్-ఇలాఇంకా ఎంతదూరం పరుగెడదామనుకుంటున్నావు?" అన్నాడు.
    అనుకాహృడు మాట్లాడలేదు. సోము మిగతావారందరినీ కూడా హెచ్చరించి మళ్ళీ కూడలివద్దకు తీసుకునివచ్చాడు. అక్కడ ట్రక్కులేదు, తమ కారులేదు. కూడలివద్ద పడిఉన్న చెట్టుకూడాలేదు.
    శకుంతల చేతతన్నబడిన ఇద్దరు అనుచరులుమాత్రం ఇంకా అలాగే పడిఉన్నారు.
    
                                           18
    
    జరిగింది వినగానే నాయుడికి గుండె ఆగినంత పనైంది. "చౌదరి నావ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడనుకోలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాను. అందుకే నాపని ఓవర్ అయింది-" అన్నాడతడు.
    "బాస్- ఆ గోపీగాడు చాలా ప్రమాదకరంగా ఉన్నాడు. వేసినట్రిక్ వేయడంలేదు. వాడేం చేస్తాడో ఊహించడానికి కూడా కష్టంగాఉంది-"
    నాయుడు చిరాగ్గా -"వాడని తర్వాత పొగుడుదువుగాని. ఇది రెండున్నరకోట్ల సరుకు. అంటే రెండువందల యాభైలక్షలు. ఈ నష్టం నేను భరించలేను. అదలాగుంచితే దీనిగురించి నాకు మాటవస్తుంది. ఇందులో మూడొంతులు పైగా సరుకు-మరోపార్టీకి అందజేయాల్సిన బాధ్యత నాకున్నది-"అన్నాడు.
    సరిగ్గా అప్పుడే నాయుడి బల్లమీద ఫోన్ మ్రోగింది-"డియర్ మిస్టర్ నాయుడూ! సరుకు నావద్ద భద్రంగా ఉంది. అది అందవలసినవారికి సక్రమంగా అందుతుంది. నీ బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తాను. నీకు ఎక్కడా మాటరానివ్వను. ఎటొచ్చీ సరుకు సరఫరా చేసినవారికిప్పటికే కోటిరూపాయలు అడ్వాన్సుగా ఇచ్చిఉన్నావు. మిగతా కోటిన్నరాకూడా నువ్వేఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇచ్చుకుంటావో-సరుకు నీ చేయిదాటి పోయిందని వాళ్ళకు చెప్పుకుంటావో -అంతా నీ యిష్టం-"
    నాయుడు ఆ కంఠాన్ని గుర్తుపట్టాడు. ఎన్నడూలేనిదీ అతడిచేతులు వణికాయి-"చౌదరీ-ప్లీజ్....నీకిది న్యాయంకాదు. నాసరుకు నాకిచ్చేసేయ్-" అన్నాడు.
    "అరే- నాయుడు న్యాయం గురించి మాట్లాడుతున్నాడే-ఇదెప్పట్నుంచి?" చౌదరి గొంతు వేళాకోళంగా ధ్వనించింది.
    "వేళాకోళం తర్వాత....ప్లీజ్....నాసరుకు..... "నాయుడి గొంతు దీనంగా పలికింది. తనకు సరుకు సరఫరా చేసిన వ్యక్తి సామాన్యుడుకాదు. అతడొక ఇంటర్నేషనల్ స్మగ్లర్. నాయుడు అతడికి అంతరంగికుడు. ఇంత వరకూ నాయుడు అతడికున్న ఆంతరంగికులందరిలోకి సమర్ధుడిగా ఎంచబడ్డాడు. ఈరోజులో ఇంతకాలం తను తెచ్చుకున్నపేరు-వృధా అయిపోతుంది.
    సోము బాధగా బాస్ వంక చూశాడు. ఇదంతా తన వల్లనే జరిగింది. బాస్ ఇంత దీనావస్థలో ఉండగా అతనెప్పుడూ చూడలేదు.
    చౌదరి నవ్వుతూ- "అదింక నీ సరుకుకాదు.....నా సరుకు...." అన్నాడు.
    "నీకేం కావాలో చెప్పు. ఇస్తాహను. నా సరుకు మాత్రం నాకిచ్చేయ్-"
    "అయితే నేనడిగిందిస్తావా?"
    నాయుడి ముఖంలో వెలుగు కనబడింది. అతడి మనసులో ఆశ తళుక్కుమంది- "తఃప్పకుండా?"
    "నాకు నా భార్య, కొడుకు కావాలి...."
    నాయుడు తెల్లబోయి-"అయాంసారీ చౌదరీ-" అన్నాడు. అతడి గొంతులో చేసిన తప్పుకు పశ్చాత్తాపం ధ్వనించింది.

 Previous Page Next Page