Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 31


    శకుంతల అతణ్ణిచూసి నవ్వుతో-"నాతో పని పడిందా?" అని-"అరే-హెల్మెట్ తీయకుండానే లోపలకు వచ్చావే?" అన్నది.
    గోపి తనూ నవ్వుతూ-"నీ యింట్లోకి హెల్మెట్ లేకుండా రావడం ప్రమాదమని నిన్నటి నా అనుభవం చెప్పింది-" అన్నాడు ఆమె ఏదో అనబోగా-"ఈ గదిలో ఈ హడావుడంతా ఏమిటి? ఒలింపిక్స్ కుఇ గానీ ప్రిపేరవుతున్నావా?" అన్నాడు.
    "ఇది నా ప్రాక్టీస్ రూం-" అన్నది శకుంతల.
    "అతడెవరు?" అన్నాడు గోపి- బంతులమధ్య నిలబడి అటు వైపు తిరిగివున్న వ్యక్తిని చిఇపిస్తూ.
    "అతడా-?" అని ఉలిక్కిపడి అటు చూసి- "ఓహ్-వాడా-వాణ్ణి నేను నా ప్రాక్టీసు కుపయోగించుకుంటున్నాను. రా-వాణ్ణి నీకూ పరిచయం చేస్తాను. అయితే వాడికి షేక్ హ్యాండివ్వడానికి ప్రయత్నించకు. మేనర్ లెస్ ఫెలో-" అంది శకుంతల.
    గోపి అతణ్ణి ముందునుంచి చూసి-"అరే-ఇది బొమ్మ-" అన్నాడు.
    "అవును-నా ప్రాక్టీస్ చూస్తావా?" అనడిగింది శకుంతల. గోపి తల ఊపాడు- "అయితే కాస్త దూరంగా నిలబడు-" అన్నదామె. గోపి దూరంగా వెళ్ళి నిలబడి ఆమెను గమనించసాగాడు.
    శకుంతల ఆ బొమ్మ కుడి భుజంపై చేతులాన్చి-నేలమీంచి ఆరడుగుల ఎత్తున వ్రేలాడుతున్న బంతుల్ని ఎడమ మడమతో తన్నింది. తర్వాత భుజంమార్చి కుడి మడమతో కొన్ని బంతుల్ని తన్నింది. అలా కాసేపయ్యాక ఆమె బొమ్మ రెండు భుజాలమీదా చేతులాన్చి శరీరాన్ని శరవేగంతో కదుపుతూ అతి తక్కువ వ్యవధిలో బొమ్మ చుట్టూ తిరిగి మొత్తం వ్రేలాడుతున్న బంతులన్నింటినీ తన్నింది.
    ఆమె విద్యనుచూసి గోపి దిగ్భ్రాంతుడయ్యాడు.
    అప్పుడు శకుంతల నవ్వుతూ అతడిని సమీపించింది.
    గోపి అప్పుడే హెల్మెట్ తీసి చేత్తో పట్టుకున్న వాడల్లా వెంటనే మళ్ళీ హెల్మెట్ పెట్టుకున్నాడు. శకుంతల-"హెల్మెట్ తీసేయ్-" అన్నది.
    గోపి తల అడ్డంగా ఊపాడు.
    "తీసేయ్ అన్నాను-" అన్నది శకుంతల. గోపి బదులు చెప్పేలోగా ఆమె అతడినుంచి బలవంతంగా హెల్మెట్ లాక్కుంది. గోపి ఆమె ఏంచేసేది చూస్తున్నాడు. శకుంతల అతడిని చేయి పట్టుకుని కొంత దూరం లాక్కుని వెళ్ళింది. తన చేతిలోని హెల్మెట్ ను బొమ్మకు పెట్టింది. అప్పుడు గోపిని ఊతగా పట్టుకుని బొమ్మను తన్నింది.
    గోపి ఆశ్చర్యపడి చూస్తూండగా బొమ్మతలకున్న హెల్మెట్ ముక్కలైపోయింది.
    "నా హెల్మెట్!" అన్నాడు గోపి దిగులుగా.
    "అది నీ తలను యాక్సిడెంట్ బారినుంచి రక్షించగలదేమో కానీ నా కాలి మడమబారినుంచి రక్షించలేదు-"అన్నది శకుంతల.
    
                                         17
    

    ముందు ట్రక్ నడుస్తోంది. ట్రక్ లో డ్రయివర్ కాక నలుగురు మనుషులున్నారు.
    ట్రక్ వెనుకనే అంబాసిడర్ కారు. డ్రయివింగ్ సీట్లో సోము వున్నాడు. అతడి పక్కన ఇద్దరు వెనకసీట్లో నలుగురూ.
    "ఏ ఇబ్బందులూ లేకుండా బాగానే వచ్చేశాం-" అన్నాడు కార్లోని ఒకడు.
    "సరుకు నాయుడిది. తెస్తున్నది సోము ఇబ్బందులకే ఇబ్బంది-రావాలంటే-" అన్నాడు సోము.
    సరిగ్గా అప్పుడే ట్రక్ వున్నట్లుండి ఆగిపోయింది. వెంటనే సోము కారుకు బ్రేక్ వేశాడు. అందరూ కార్లోంచి దిగారు. అప్పుడే ట్రక్ లోంచి డ్రయివరూ, మనుషులూ దిగారు.
    "ఏం జరిగింది?" అన్నాడు సోము.
    "దారికి అడ్డంగా పెద్ద చెట్టు పడివుంది-" అన్నాడు ట్రక్ డ్రైవర్.
    "ఎక్కడా గాలీ వానా లేదు-చెట్టెలా పడింది" అన్నాడు సోము.
    "నాకెలా తెలుస్తుంది?" అన్నాడు ట్రక్ డ్రైవర్.
    సోము అనుమానంగా మళ్ళీ రోడ్డువైపు చూసాడు.
    అది రెండు రోడ్ల కూడలి. ఒకటి ఫిరంగి పురంవైపు వెడుతుంది. రెండోదారి పొరుగూరికి దారితీస్తుంది. ఆ రెండు రోడ్లకూ అడ్డంగాఎత్తయిన పెద్ద చెట్టు పడివుంది. చాలా పెద్దచెట్టు. దాన్ని కడపలంతే తమవల్ల అవుతుందా? తాము మొత్తం పన్నెండుగురున్నారు. ప్రయత్నిస్తే పని జరుగవచ్చు.
    "చెట్టును పక్కకు తప్పిద్దామా?" అన్నాడు ట్రక్ డ్రైవర్.
    "ఇంత పెద్ద చెట్టు ఉన్నపళంగా ఎలాపడిందా-అని ఆలోచిస్తున్నాను. ఇందులో ఏమీ మోసం లేదుకదా-" అన్నాడు సోము.
    "ఎవరైనా దారికి అడ్డంగా పడేయాలన్నా - ఇంత పెద్ద చెట్టును లేవాలంటే కనీసం పాతికమంది కావాలి. ఈ చెట్టు దానంతటదే పడి ఉండాలి-"అన్నాడు ట్రక్ డ్రైవర్.
    "ఏ తుఫానో లేనిదే ఇంతపెద్ద చెట్టు పడిపోదు. ఎక్కడా తుఫాన్ జాడలైనా నాకు కనిపించలేదు-" అన్నాడు సోము.
    అప్పుడు చెట్టు వెనుకనుంచి చటుక్కున గోపి లేచి- "ఇడీగో తుఫాన్-" అన్నాడు. సోము తెల్లబోయి జేబులో చేయిపెట్టబోయాడు.
    గోపి తనచేతిలోని పిస్టల్ ని ఝుళిపిస్తూ- "అతితెలివికిపోకండి. మిస్టర్ సోమూ! నాపైన తుపాకిగుళ్ళు పనిచేయవని స్వానుభవంనీకు చెప్పలేదా?" అన్నాడు.
    "అప్పుడేదో ట్రిక్ చేశావు-" అన్నాడు సోము.
    "ట్రిక్.... ట్రిక్..... ట్రిక్ ..... ...... అదే నా హాబిట్. అయితే హోటల్లో పన్నెండు సీసాలు పగులగొట్టానే - అదిమాత్రం ట్రిక్ అనుకోకు. నీ ప్రాణాలకు ప్రమాదం-"
    "నువ్వొక్కడివేనా?" ఆనందు సోము సాలోచనగా.
    "మేము ఇద్దరం-" అన్నాడు గోపీ.
    "రెండోమనిషి ఎక్కడ?"
    "చూడాలనుకున్నవాళ్ళు నా దగ్గరగా రావచ్చు-" అన్నాడు గోపి.
    సోము తన అనుచరులిద్దరికీ సైగ చేశాడు. అతడి సైగను వారు అర్ధం చేసుకున్నారు. గోపీని సమీపిస్తూనే వారు అతడిమీదపడి లొంగదీసుకోవాలి.

 Previous Page Next Page