నాగరాజు ముఖం కళావిహీనమై పోయింది. "నువ్వు చెయ్యనితప్పుకు నీకు నువ్వు ఇంత శిక్ష విధించుకుంటావా, భారతీ!" అన్నాడు పొడిగా.
"నేను తప్పు చెయ్యలేదని ఎవరన్నారయ్యా! నేను వంచకురాలిగా పరిగణించబడ్డాను....వంచించాను కాబట్టి."
"భారతీ! నువ్వు మనిషివనుకున్నాను. దేవతగా మారిపోయావు."
ఆమె మాట్లాడకుండా అతనివంక చూస్తూంది.
"కష్టాలు కొందర్ని మురికి కూపంలోకి ఈడిస్తే, కొందర్ని హిమాలయంగా మారుస్తాయి కాబోలు. భారతీ! బహుశా నేను దుర్మార్గుడినని అప్పుడప్పుడూ నువ్వు ఝుడుసుకుంటూ వుండవచ్చు. నేను త్రాగి వచ్చాను. అయినా నీ నిర్మలమైన మాటలు నాలో ధ్వనించగానే నా మత్తు విడిపోయింది. నన్ను నమ్ము భారతీ. నేను తెలివిగా ఉండే ఈ మాటలు చెబుతున్నాను. ఈ క్షణంనుంచీ నువ్వు నా సోదరివి. ప్రపంచంలో అందరికంటే ఆప్తురాలివి. నీకేం సహాయం కావలసినా నన్నడగటానికి సంకోచించకు, భారతీ!"
ఆమె మేను గగుర్పొడిచింది. నేత్రాంచలాలలో నీళ్ళు నిలిచాయి. రుద్ద కంఠంతో అంది: "నీ అభిమానం వుంటే నా కంతేచాలు: నాగరాజూ! ఒకప్పుడు దురహంకారంతో నిన్ను అపార్ధం చేసుకున్నాను. అందుకిప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుపడి చచ్చిపోతున్నాను. నాకు మితిమీరిన కష్టం వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను నాగరాజూ!"
రెండు నిమిషాలు ఆర్ద్రనయనాలతో ఆమెవంక మౌనంగా చూస్తూ నిలబడి, "వస్తానుం భారతీ! దేవుడు నీకు మేలు చేస్తాడు" అంటూ అతను కదిలాడు.
ఆమె చేతులు జోడించి నమస్కరించి, నాగరాజు కుంటినడకతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, చూస్తూ అలాగే చాలాసేపు నిలబడిపోయింది.
* * *
భారతి పదిహేను రోజులకోసారి బెజవాడ వెళ్ళి డాక్టర్ సాగర్ని కలుసుకు వస్తూంది. అవసరమైనప్పుడల్లా నూజివీడుకు కోర్టుకు వెడుతూంది. ఆమె చివరికి వేటినిగురించీ ఆలోచించని దానిలా దేన్ని గురించీ లెక్కచేయనిదానిలా ప్రవర్తిస్తూంది. వూళ్లోని అమ్మలక్కలు తన గురించి ఎన్ని గుసగుసలాడుకున్నా, ఎంత విడ్డూరంగా చెప్పుకున్నా పట్టించుకోదు. నాటి స్పర్శ తన దరిదాపులకు రానీయదు .మునసబుగారు మాత్రం తరచు వచ్చి యోగక్షేమాలు విచారించి, తన వల్ల అయ్యే పనేమైనా వుంటే చేసిపెట్టిపోతూ వుంటాడు.
మందులు ఎంత శ్రద్దగా తీసుకుంటుందో చెప్పటానికి వీల్లేదు. ఒక తపస్సు చేసినట్లు చేస్తూంది ఆరోగ్యసాధన గురించి. హాయిగా రెండు వేళలా స్నానం చేస్తుంది. తను పెరట్లోనే నీరెండలో చిత్తం వచ్చినంతసేపు విహరిస్తుంది. డాక్టరుగారు చెప్పిన మందులు తు.చ. తప్పకుండా ఆయా పద్ధతుల్లో సేవిస్తుంది.
ఆమెను చూడగానే డాక్టర్ సాగర్ ముఖం వికసిస్తుంది. "రండి రండి" అని ఆదర పూర్వకంగా ఆహ్వానిస్తాడు. "అరె, చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతున్నారే! మొదట్లో మీ వాలకం చూసి ఇంత చక్కగా కో ఆపరేట్ చేస్తారని వూహించలేదు సుమండీ. ఎప్పుడన్నా అద్దం చూసుకుంటున్నారా? మీలో కనిపిస్తున్న తేడా మీకు తెలియటం లేదూ? ఏదీ, యిటు తిరగండి. ముఖం యిలా త్రిప్పండి. సో నైస్. అసలిది మునపటి మీ ముఖమే కాదు."
విజయోత్సాహంతో అతని కనులు మెరిసిపోయేవి. పోటీలో పాల్గొని గెలిచిన బాలుడి ముఖంలో తృప్తి, ఆనందం వెల్లివిరిసిపోయేది. భారతికి తెలుసు_ఈ ఘనత అతనిదే. ఆమె కనులు భక్తి ప్రపూర్ణాలయేవి.
మొదట్లో తనను కేవలం ధైర్యం చెప్పటానికే అలా మాట్లాడుతున్నాడనుకునేదిగాని, అద్దంలోకి చూసుకున్నప్పుడు ఆమెకు నిజం విడమరిచి బోధపడినట్లయేది. తనలో మార్పు వస్తూంది. తను వెనుకటి భారతి అయిపోతుంది. అవును, ఆమె పిన్ని కూడా తన మూగ సంజ్ఞల ద్వారా, మెరిసే కళ్ళతో యిదే విషయాన్ని వ్యక్తం చేసింది.
అలాంటప్పుడు భారతికి ఈ ప్రపంచం నందనవనంగా, వూహించలేనంత అందంగా గోచరించేది. మనసు రెక్కలు విప్పుకుని పొలాల మధ్యగా, చెరువు గట్టుమీద, వూరి బయటి తోటల్లో పిచ్చిగా పరిగెత్తాలనిపించేది.
ఇంతలో కోర్టు వాయిదా. ఆమె అందమైన కోరికలు నిర్దయగా విరిగిపోయి బాహ్య జగత్తులోకి తప్పనిసరిగా వచ్చేది.
ఆమె దుఃఖంగా వున్నట్లు పసిగడితే "అదిగో! విచార చాయల్ని మీ దగ్గరకు రానిచ్చారంటే మీరు మళ్ళీ వెనకబడిపోతారు. మీరు సంతోషానికి ప్రతిబింబం అవ్వాలి. ముందుకు....ముందుకు సాగిపోవాలి" అనేవాడు డాక్టర్ సాగర్.
అవును! ఆమెకు వల్లమాలిన పట్టుదలా, ఆవేశం వచ్చేవి. ఇదంతా ఎవరికోసం? ఆమెకు తెలియదు. తన అందాన్ని నిరూపించుకోవటంకాదు! కోర్టులో అసలు ఆ ప్రసక్తేలేదు. వాళ్ళమీద కసి తీర్చుకోవటానికి కాదు. తనలో అసలు పగేలేదు. వెర్రి పట్టుదల. మనిషిలా జీవించాలి .డాక్టరు చెప్పినట్లు ముందుకు....ముందుకు సాగిపోవాలి.
వెంటనే తనని తాను నిలద్రొక్కుకునేది.
ఆమె వెళ్ళినప్పుడల్లా డాక్టర్ సాగర్ ఆమెతో ఎంతో ఆత్మీయతతో ,సౌహార్దంతో మాట్లాడేవాడు .అయినా, ఒక్కసారీ ఆమె స్వవిషయాన్ని గురించి ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఎప్పుడూ 'ఎవరు మీరు? మొదట మరో అమ్మాయితో కలిసి వచ్చారు తరువాత ఎవరి తోడూ లేకుండా, ఒంటరిగా వస్తున్నారు. మీకూడా ఎవరూ కనిపించరేం? మీకెవరూ లేరా? లేకుండా ఎలా సంభవం? ఏమిటి మీ కథ?"__ఇలా ఎన్నడూ ప్రశ్నించలేదు. మొదట్లో అలాంటి ప్రశ్నలు అతని నుంచి వెలువడతాయని భారతికి భయం భయంగా వుండేది. కాని రానురానూ ఆ భయం తగ్గి, తరువాత మొదట్లో తను భయపడ్డ విషయం కూడా మరిచిపోయింది.
డాక్టర్ సాగర్ కి కారులేదు. ప్రాక్టీస్ ఇప్పుడిప్పుడే పెరుగుతూంది. మనిషి నిరాడంబరంగా వుంటాడు. అతని ముఖాన ఎప్పుడూ చిరునవ్వేగాని కోపంగా వుండగా భారతి ఎప్పుడూ చూడలేదు.
ఒకరోజు ఆమె వెళ్లేసరికి బాగా పొద్దుపోయింది, క్లినిక్ కట్టివేయబోయే ప్రయత్నంలో వున్నారు డాక్టరూ, కాంపౌండరూ కలిసి. కాంపౌండరు తలుపులు మూస్తున్నాడు. డాక్టరు కిటికీలు మూస్తున్నాడు. ఆ పరిస్థితిలో వాళ్ళిద్దర్నీ చూసేసరికి నవ్వు వచ్చింది భారతికి.
అలికిడి విని తలత్రిప్పి చూసి "మీరా? యింత ఆలస్యమయిందేం?" అంటూ ఆమె దగ్గరకు వస్తూ "అరె యింత నీరసంగా వున్నారేం? నిరాహార దీక్షేమయినా మొదలుపెట్టారా?" అన్నాడు ఆశ్చర్యంగా.
ఆ మాట నిజమే. రెండు మూడు రోజుల క్రితంనుంచీ ఆమెకు ఒంట్లో అస్వస్థతగా వుండి అన్నం సహించటంలేదు. ఈవేళ ఉదయం నుంచీ వచ్చి మంచినీళ్ళు తప్ప ఇంకేమీ తీసుకోలేదు. అందులో బస్సులో చోటు దొరకటం ఈరోజు ఒక పట్టాన సాధ్యం కాలేదు....ఆమె ముఖం తెల్లగా పాలిపోయి వుంది. నుదుట స్వేద బిందువులు జారుతూ, వాటిలో ముందుకు వాలిన ఒకటి రెండు కేశాలు అంటుకుని వున్నాయి.
"లేదే" అన్నది బలవంతాన నవ్వటానికి ప్రయత్నిస్తూ. కాని విఫలురాలైపోయింది. దాచివేయాలనుకుంటూన్న సత్యం ఇతరులెవరైనా ఎత్తిచూపితే, అది పదిరెట్లు అధికమై విచలితుల్ని చేస్తుంది భారతి విషయంలో అదే జరిగింది. ఆమె అణిచిపెట్టుకుంటూన్న బలహీనత, అతడు ఆశ్చర్యం ప్రకటించేసరికి పైకి ఉబికి, ఆమెకు చప్పున కళ్ళు తిరిగాయి. కాళ్ళు గాలిలో తేలిపోయినట్లయి, తూలి క్రింద పడబోతూంది. డాక్టర్ సాగర్ చప్పున పరిస్థితి గ్రహించి గబాలున ముందుకు జరిగి, ఆమెను క్రింద పడిపోకుండా పొదివి పట్టుకున్నాడు. మూసుకుపోతూన్న కళ్ళని బలవంతాన విప్పటానికి ప్రయత్నిస్తూ ఆమె అతని ముఖంలోకి చూసింది. తరువాత కళ్ళు మూతలు పడిపోయాయి.