Previous Page Next Page 
భారతి పేజి 30

    ఎన్ని అభూతకల్పనలవి! ఆమె చుట్టూ ఎన్ని సుడిగుండాలు గిరగిర తిరుగుతూ మతిభ్రమించేలా  చేశాయవి! "నీ కసలు  ఈ పెళ్ళి ఇష్టంలేదు. నీ తండ్రి బలవంతంమీద  చేసుకున్నావు ఎవరెన్ని విధాల ప్రయత్నించినా పెడచెవిని  పెట్టి  కాపరానికి నీళ్ళు  వదులుకుని వచ్చేశావు. నీవు ఇంకెవర్నో  ప్రేమించావు. నీ భర్తని చాలా  అవమానం  చేశావు. అతని జీవితానికి సుఖం  లేకుండా  చేశావు. అతని జీవితాన్ని నాశనం చేశావు."

    ఆమె ఏ వాదననూ  వ్యతిరేకించలేదు. అన్నిటికీ  ఊఁ కొట్టింది.

    కోర్టులో ఆమె భర్తను చూసింది. అదే సుకుమారమైన రూపం. ముఖంలో  అవే అమాయకమైన భావాలు. రంగాజమ్మగారిని  చూసింది. అందరూ  ఆమెకు  వ్యతిరేకంగా  మాట్లాడుతున్నారు. ఆమె ఆశ్చర్యపోలేదు. వాళ్ళందర్నీ  కీలుబొమ్మల్ని చేస్తూ మాట్లాడిస్తూన్న శక్తి  ఏదో ఆమెకు తెలుసు. ఆమెకు వాళ్ళమీద  కోపం రాలేదు. అసహ్యం కలగలేదు. వాళ్ళ అంతర్యాలను  గుర్తించింది. వాళ్ళంటే జాలిపడింది.

    రెస్టిట్యూషన్  ఆఫ్  కాంజ్ గల్ రైట్స్, సరాసరి విడాకులు కావాలని అతను అర్జీ పెట్టుకోవటానికి వీల్లేదు. తన భార్య తనతో సంసారం చేయ నిరాకరిస్తూందనీ, అలా చేసే ఏర్పాటు చేయించమనీ పెట్టుకోవాలి. అలాగే చేశాడు.

    భారతి ఒక్కమాట  అంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ  బూడిదలో పోసిన పన్నీరయిపోను. 'నేను ఇష్టపడుతున్నాను. అతనితో  కాపరం చేస్తాను' అని ఆమె అన్నట్లయితే  వాళ్ళు వేరుమాట  మాట్లాడటానికి వీలులేదు.

    కాని ఆమె అలా అనలేదు. మామగారి అభ్యర్ధనను  మన్నించింది.

    ఆమె అలాంటి  ప్రకటన చేసినప్పుడు  మల్లిక తల బాదుకుంది. "అంత త్యాగమెందుకు చేశావు? తెలివితక్కువతనంగా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని  చేజేతులా  పాడుచేసుకున్నావు. ఒక్కమాట అని వుంటే వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల  నీళ్ళు  త్రాగించేదానిని" అంది ఆవేశంగా.

    భారతి శుష్కమందహాసం చేసింది. "అలా నేను వాళ్ళ కోరికకు  ఎదురీత ఈది, ఆ దాంపత్యాన్ని  సాధిస్తే  అది అనవసరపు  దాంపత్యమవుతుంది.ఏ శుభం కోరి నన్ని యిరుకున పడమంటావు?" అన్నది.

    "అయితే వాళ్ళు ఆడమన్నట్టల్లా  ఆడతావా?"

    భారతి మళ్ళీ నవ్వింది__జవాబు ఊహించమన్నట్లు.

    "నీకు వాళ్ళమీద  కసి తీర్చుకోవాలని లేదా?"

    "మల్లికా! ఆవేశం  మాని నిదానంగా  ఆలోచించు. అసలీ విపరీత పరిణామాలన్నీ కలగటానికి కారణం నా అపరాధం. అపరాధం నా తలమీద  వుంచుకుని కసి ఊపెత్తటానికి  నాకు హక్కేది?"

    "పోనీ, ఇంకో విషయం  చెప్పు నీ అత్తగారు, ఆ రాక్షసుడి లాంటి మామ, ఆఖరికి నీ పెనిమిటి.... కోర్టులో  అందరిముందు అంత పచ్చి అబద్దాలాడారు కదా! వాళ్ళందరి విషయం  అలా విడిచిపెట్టు. అంత దారుణంగా ప్రవర్తించినందుకు  మీ ఆయనంటే  నీకు అసహ్యం వేయటంలేదూ?"

    "ఉహుఁ, లేదు"

    "ఎందుకని? అతన్ని క్షమించడం ఓ ఘనకార్యం అనుకుంటున్నావా?"

    "అదేమీకాదు  మనస్పూర్తిగా ఆయనంటే  నాకింకా  తరగని ప్రేమాభిమానాలు ఉన్నాయి. కారణమేమిటని  నువ్వడుగుతావు. అది నాలోని బలహీనత అంటాను నేను అంతకంటే  చెప్పలేను.

    మల్లిక  ఆమెవంక  నిస్సహాయంగా చూస్తూ  నిట్టూర్పు విడిచి ఊరుకుంది. ఒక నిమిషమాగి  "అన్నిటికన్నా పెద్ద కారణం, వాళ్ళు నిన్ను దూరం చేసుకున్న అసలు కారణం వేరే వుండగా యిన్ని అబద్ధాలు కల్పించవలసిన  అవసరం ఏమొచ్చిందంటావు! ఒక్కసారిగా నువ్వు ఆరోగ్యవంతంగా  తయారై వాళ్ళ కెదురుగా  నిలుస్తే ఇంకా అభ్యంతరం చెబుతారా?" అని అడిగింది.  

    ఆ సందేహమే  భారతికి వచ్చింది. తన శరీరంలోని  మాలిన్యాన్ని రచ్చ కీడ్వటం  యిష్టంలేదని  ఆనాడు మామగారు  చెప్పారనుకో. అయితే ఆయన చెప్పిన మాటల్లో సత్యముందా? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవటానికి భారతి లాయర్నెవర్నీ పెట్టుకోలేదు. ఏం జరిగినా తల వంచుకుని స్వీకరించటానికి సర్వసన్నద్ధురాలై  నిలబడిన వ్యక్తికి లాయరెందుకు? కాని ఆలోచించి, ఆలోచించి, తరుచు కోర్టుకు వెళ్ళటం వల్ల కలిగిన అనుభవాన్ని పురస్కరించుకుని  ఆమెనిజం కొంతవరకు  గ్రహించింది. 'నా భార్యకు కుష్ఠురోగం. అందుకని ఆమెను వదిలేస్తాను' అంటే కోర్టు ఒప్పుకోదు. లెప్రసీ చికిత్సకు  అతీతమైన వ్యాధి కాదు. అందుకనే  తన మామగారు  ఈ పన్నాగం  పన్నాడని  అనుకుంది.

    'సారధి! వాళ్ళ తండ్రి చెబుతున్నట్లల్లా ఆడుతున్నాడు. కోర్టులో నిలబడ్డప్పుడు  ఎన్నోసార్లు నావంక చూశాడు. ఆ చూపులో కరుణ వుందో, కార్పణ్యముందో, ప్రేమేవుందో, చంచలత్వమే వుందో నాకర్ధం కావటంలేదు. ఏమయినా ఒక్కటి మాత్రం నిజం  అతను నన్ను నిర్దాక్షిణ్యంగా  వదిలివేస్తున్నాడు. అలాంటి వ్యక్తిమీద నాకు భ్రమ ఎందుకు చావలేదు? అతన్ని ఇంకా ఎందుకభిమానిస్తున్నాను? ఎందుకు మరిచిపోలేకుండా  వున్నాను?'

    కారణం తెలియలేదు భారతికి. కారణం తెలియనందుకు  విచారించలేదు భారతి.

    ఆమె నిర్లిప్తతను  చూసి  మల్లిక  దుఃఖాన్నాపుకోలేక  పోతూంది.

    ఒకరోజు భారతి  సాయంత్రంవేళ  తలుపులు  గడియ వేద్దామని లోపలి నుండి  హాల్లోకి వస్తూంటే గుమ్మంలో  నాగరాజు కనబడ్డాడు. నాగరాజు కళ్ళు ఎర్రగా  వున్నాయి. జుట్టు రేగి వుంది. బట్టలు  దుమ్ముకొట్టుకు వున్నాయి.

    అతని వాలకం  చూడగానే  భారతికి గుండె  దడదడమని కొట్టుకుంది. రాధమ్మ ఇంట్లో లేదు. శనివారం కావటాన దేవాలయానికి వెళ్ళింది. 

    "భారతీ....! కులాసాగా వున్నావా!" నాగరాజు తడబడుతూన్న  కంఠంతో  అని, హాల్లోకి ప్రవేశించాడు.

    ఆ చుట్టుపక్కలంతా  ఒక రకమైన  వాసన  వ్యాపించింది భారతికి. కడుపులో  త్రిప్పినట్లయింది. ఆమె కర్దమైంది.

    "నాగరాజూ! ఎందుకొచ్చావు!" అంది అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కివేసి, కంపిత స్వరంతో.

    నాగరాజు  జవాబు చెప్పకుండా ఆమె ముఖంకేసి  నిదానించి చూస్తున్నాడు. భయంతో, అనుమానంతో మునిగిపోయి భారతి ఆ చూపుల్ని తట్టుకోలేక ముఖం ప్రక్కకి, ప్రక్కకి త్రిప్పుకుని కర్తవ్యమాలోచిస్తూంది.

    "ఎంత మారిపోయావు భారతీ!" దుఃఖావేదనలతో కూడిన నాగరాజు కంఠం వినబడింది.

    మళ్ళీ రెండు మూడు క్షణాలు  నిశ్శబ్దంగా  గడిచాయి.

    "అందంగా, అపురూపంగా, దేవతలా  ఉండేదానివి. ఎలా నాశనమైపోయావు?"

    తాగే ఉన్నా, అతని మాటలు త్రాగినవాడి  మాటలుగా  లేనందున ఆమెకు విచిత్రంగా తోచి, మళ్ళీ అతని ముఖంలోకి  చూసింది. ఎందుకనో ఆమెలోని  భయం మెల్లిమెల్లిగా  తొలిగిపోసాగింది.

    "ఎందుకలా  నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావు, భారతీ!"

    ఆమెకు ఏడుపు వచ్చింది. కష్టంమీద  కన్నీరు నాపుకుని మూగగా మిగిలిపోయింది.

    "నువ్వేం అపరాధం చేశావని, ఆ దుర్మార్గుడు__గంగాధరంగాడు  నిన్నిలా కక్షగట్టి  సాధిస్తున్నాడు? భారతీ! ఇప్పుడే చెబుతున్నాను త్రాగినవాడి మాటలని కొట్టిపారెయ్యకు. కోర్టులో నీ కన్యాయమే జరగనీ__ఆ గంగాధరంగాణ్ణి తవ్వి ఉప్పు పాతరెయ్యకపోతే  నా పేరు  నాగరాజు కాదు.

    "నాగరాజూ!" ఆవేశంగా  అరిచింది భారతి. కొంచెం ఆగి మళ్ళీ  మెల్లిమెల్లిగా  అంది: "నా మీద నువ్వు సానుభూతి  చూపించే మార్గం ఇదే అనుకుంటే  ఇంతకన్నా  ఆత్మవంచన వుండబోదు!"

 Previous Page Next Page