Previous Page Next Page 
వెలుగుబాట పేజి 31


    
    "అయ్యయ్యో! వట్టి కింద పడుకున్నావా? ఇదిగో దుప్పటి, దిండు ఉతికి తెచ్చాను! నీ మంచంమీద వేస్తానుండు....."
    తల్లి వంగుని మంచంమీద దుప్పటి తీస్తుంటే అప్పుడు జరిగినది గుర్తుకొచ్చింది. చాలా బాధపడింది. గభాలున తల్లి చేతిలోపని అందుకుని "ఉండమ్మా! నేను తీసుకుంటాలే! అయినా ఇదేం పని? ఇప్పుడు నువ్వు ఉతకాలా?" అంది.
    "ఏం చెయ్యమంటావే! మనింట్లో కాస్త శుభ్రంగా ఉండేది నీ పడక ఒక్కటే! ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాద చెయ్యొద్దుటే! అయినా నేను పడుకోమనలేదు. అతగాడే పోయి పడుకున్నాడు. లేవమని ఎట్లా అననే! అసలే  తుమ్మితే ఊడే ముక్కులా ఉంది వ్యవహారం. ఎలాగో పెద్దదాని కాపురం కాస్త కుదుటపడితే నా గుండెల మీద కుంపటి దింపినట్లవుతుంది. ఈ సారయినా దాన్ని కాపురానికి తీసుకుపోతాడని ఆశగా వుంది."
    'ఆశగా వుంది' అంటే, ఇంకా అసలు విషయం చర్చలలోకి రాలేదన్నమాట! ఎందుకిలా నానుస్తున్నారు?
    అచ్చమాంబ భయం భయంగా ఝాన్సీని చూస్తూ "మధ్యాహ్నం కూడా అన్నంతినలేదు. అన్నానికి వస్తావుటే!" అంది.
    "నువ్వు తిన్నావా?"
    "నువ్వు ఎంగిలి పడకుండా అలా పడుకుంటే, నేను తినగలనుటే?"
    "పద!"
    అచ్చమాంబ ఇద్దరికీ వడ్డించింది. అల్లుడు వచ్చాడని కాబోలు, ఎప్పటికంటే ఎక్కువ పదార్ధాలు చేసింది. తీరా తినబోయేసరికి, పొద్దుటినుంచీ ఆకలితో ఉండటం వల్ల కాబోలు, తిన్నది ఇమడక దొడ్లోకి పరుగెట్టి వాంతిచేసుకుంది. ఝాన్సీ కూడా తల పట్టుకొంది. వాంతిచేసుకుని ఆయాసపడుతూ కూచుంది అచ్చమాంబ. ఝాన్సీ నడిపించుకొని వస్తే లేచివచ్చి, ఏం తినలేక అతి కష్టంమీద కాస్త మజ్జిగ తాగింది. ఆ తరువాత ఝాన్సీకి కూడా అన్నం సహించలేదు కంచంనిండా పదార్ధాలున్నా ఏదో పేరుకి తినిలేచింది. తల్లికి స్థిమిత పడటానికి మందిచ్చి తన గదిలోకి వచ్చింది. తల్లి అతి తెల్లగా ఉతికిన దుప్పటి- తన మనసులోని మాలిన్యాన్ని చూపుతున్నట్లుగా, తనను అపహాస్యం చేస్తున్నట్లుగా ఉంది.
    "పెద్దవాళ్ళతో పోట్లాడలేని పరికిపందవు" అన్నట్లుగా ఉంటాయి మేరీ చూపులు! తను ఎవరితో పోట్లాడాలి? ఎలాపోట్లాడాలి? ఆ మూర్ఖత్వాలను పెనవేసుకుని, అమాయకత్వమూ, ఆత్మీయతా, మంచితనమూ ఉన్నాయి ఈ రెంటినీ విడదీయటం ఎట్లా?"
    

                                                          *    *    *


    పదిహేను రోజులు గడిచాయి.
    సుబ్రహ్మణ్యశాస్త్రి వీధరుగుమీద కూచుని పందుం పుల్లతో ముఖం కడుక్కుంటున్నాడు, కుటిలమైన చూపులతో చుట్టుపక్కల ఇళ్ళలోకి పరిశీలగా చూస్తూ-
    "ఓరి దొంగ సచ్చినోడా! ఇక్కడున్నావా?" అనేఫిరంగి మోతలాంటి అరుపుకి అదిరిపడి ముఖం కడుక్కోకుండానే ఇంట్లోకి పరుగెట్టాడు! ఆ అరుపుకి ఇంటిల్లిపాదీ బయటకు వచ్చారు. ఆ ఫీరంగిమోత సృష్టికర్త ఒక నడి వయసు స్త్రీ చిరిగిపోయి కుట్లున్న పాత నైలాన్ చీర, మాసికలున్న జాకెట్టూ, నల్లగా మొద్దు బారిపోయి ఉన్న చేతులకి మట్టిగాజులూ, ముడతలు పడ్డ ముఖంమీద కుంకం బొట్టు. ఆ స్త్రీని అందరూ నివ్వెరపోయి చూడసాగారు. ఉత్తమ ఇల్లాలు నాగమాంబ కల్పించుకుని "ఏయ్! ఆయన్నెందుకు తిడతావ్?" అంది.
    "తిట్టాలా? సంపాలా? ఏదీ ఇట్టా బయటికి రమ్మను. నూకాలమ్మంటే ఏంటనుకున్నాడో! నా కూతురి బతుకుబుగ్గిసేసి ఈడ దాక్కొంటే వదుల్తాననుకున్నాడేమో? ఏదో మర్యాదగా పోదారని చూస్తున్నా! మాయూనియాస్ ఉంది, ముప్పతిప్ప....పేట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తా....." రొప్పుతోంది ఆ స్త్రీ. అప్పుడు చూశారు, ఆ స్త్రీ వెనుక  ఒదిగి ఒదిగి నిలబడ్డ పదిహేనేళ్ళ వచ్చీ రాని యౌవనంలో ఉన్న పసిపిల్లని. ఆ పిల్ల పచ్చగా అందంగా కళకళ లాడుతుంది.తల్లి కాక ముందు ఒదిగి ఒదిగినిలబడింది. ఆ పిల్ల అణువణువునా భయం తొంగిచూస్తుంది, అందరికీ విషయం లీలగా స్ఫురించసాగింది. శరీరమంతా చెమటలు పట్టసాగాయి. నాగమాంబ కళ్ళలో నీళ్ళు తిరిగి పోతున్నాయి. ఝాన్సీ ముందుకొచ్చి "ఎవరమ్మ నువ్వు?" అని అడిగింది.   

 Previous Page Next Page