కుమార్ ఆస్పత్రి పుణ్యమా అని రోగులెవరూ లేరు. చుట్టు పక్కల గ్రామాలలోని రోగులందరూ కుమార్ ఆస్పత్రికి వెళ్తున్నారు. నిరుపేదలు కూడా అతడి ఆస్పత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకొని కేవలం మందులకోసమే గవర్నమెంట్ ఆస్పత్రికి వస్తున్నారు. ఝాన్సీకి అసలు పని ఉండటం లేదు. డ్యూటీ ప్రకారం ఒంటిగంటవరకూ ఉండి ఇంటికి బయలుదేరింది. దూరం నుంచి మేరీ, కుమార్ లు సైకిళ్ళ మీద వస్తూ కనిపించారు. మేరీ ఇంటికి కూడా దారి అదే! ఝాన్సీ నడక ఆగిపోయింది. ముందుకు కదలలేదు. వెనక్కు పారిపోలేదు. అక్కడే ఆగిపోయింది. తలలో ఏదో హొరు! గుండెల్లో బరువు, కళ్ళముందు చీకటి! వాళ్ళు దగ్గరకి రాగానే, మేరీ పక్కన ఉన్న వ్యక్తి కుమార్ కాదనీ, బాలయ్య అనీ గుర్తించింది. దూరంనుంచి అన్నదమ్ములు కొంచెం ఒకలాగేఉన్నారు అప్పుడు కలిగిన రిలీఫ్ తో చిరునవ్వు నవ్వింది. మేరీ తనను చూసి నవ్విందనుకొని, ఆగిసైకిల్ దిగి "బాగున్నారా?" అని పలకరించింది.
"ఆ! బాగున్నాను. మీ ఆస్పత్రి బాగుందా?"
"ఆహా! కొన్నాళ్ళలో సుందరమ్మగారు ఆస్పత్రికోసం కొత్త బిల్డింగ్ కట్టిస్తానంటున్నారు. ఈ ఇల్లుసరిపోవటం లేదు."
"సుందరమ్మగారా?......"
"అవును! ఆవిడ ఎంత మంచి మనిషో అర్ధంచేసుకున్న కొద్దీ ఆశ్చర్యం కలుగుతుంది పాపం!"
"ఆశ్చర్యం కలుగుతుంది" "పాపం"- ఈ రెండు మాటలనూ ఎవరూ వ్యాఖ్యానించలేరు.
"వెళ్తానండీ! మళ్ళీ మూడుగంటలకి నేనూ డాక్టర్ గారు విజిట్స్ కి వెళ్ళాలి."
సైకిలెక్కి తనకోసం నిరీక్షిస్తున్న బాలయ్యతో కలిసి వెళ్ళిపోయింది.
ఎంత అందమైన జీవితం! మేరీ పక్కన ఉన్నది కుమార్ అనుకోగానే తనేకెందుకింత క్షోభ! కాదనుకోగానే ఎందుకంత రిలీఫ్! మేరీ కుమార్ ళ వివాహాన్ని తను ఆపగలదా? తనూ కుమార్ ఒకటి కావటం ఏనాటికైనా సంభవమా?
ఇంటికి వచ్చేసరికి ఎదురుగా కనిపించిన దృశ్యం ఝాన్సీని పిచ్చిదాన్ని చేసింది. సుబ్రహ్మణ్యశాస్త్రి తన పక్క మీద అడ్డదిడ్డంగా పడుకొని తాంబూలం సెవిస్తున్నాడు. అక్క అతడి కాళ్ళు వత్తుతూ ఏవో ముచ్చట్లు చెపుతోంది. సాధారణంగా తన గదిలోకిరాని అక్క కొడుకు అయిదేళ్ళ వాడు, తల్లీ తండ్రీ ఆ గదిలో ఉండటంవల్ల నిర్భయంగా ఆ గదిలోకి రావటమేకాక, యధేచ్చగా అన్నీ సర్దేస్తున్నాడు. టేబుల్ మీద ఉన్న కాగితాలమీద పెన్ స్టాండ్ లోంచి పెన్ తీసుకుని బర బర గీకేస్తున్నాడు. కొడుకుని ఏ మాత్రం పట్టించుకోకుండా అతడి ముందే సరస ప్రసంగాలలో మునిగి తెలుస్తున్నారా ఆలుమగలు! అల్లుడుగారికి మధ్యాహ్నం ఫలహారానికి కాబోలు దొడ్లో పప్పురుబ్బుతోంది అనారోగ్యపు తల్లి. అలాంటి బరువు పనులు చెయ్యొద్దని తాను ఎన్నిసార్లు చెప్పినా....
ఝాన్సీ భరించలేకపోయింది.
"అక్కయ్యా! ఏమిటిది? బుద్ధుందా లేదా? నా పక్కమీద మరొకళ్ళు పడుకోవటమేమిటి? బాబు నా టేబులంతా పాడుచేస్తుంటే చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారా? ముందు మీ ఆయన్ని నా పక్కమీంచి లేవామను!" అని అరిచింది. మంచంమీద పడుకున్న సుబ్రహ్మణ్య శాస్త్రీ దిగ్గున లేచాడు. అతడి ముఖం కోపంతో జేవురించింది. తన కాళ్ళి దగ్గర ఉన్న సతీ రత్నాన్ని ముద్దుగా ఒక తన్ను తన్ని "ఏమిటే! నీ చెల్లెలు ఎవరనుకుంటోంది నన్ను? ఇంటి అల్లుణ్ణి మర్యాద చేయవలసిందిపోయి, ఇలా నోటి కొచ్చినట్టు వాగుతోందా? నే నసలు ఈ ఇంట్లో ఉండనే ఉండను. ఇప్పుడే పోతాను." అని ధాంధూంలాడుతూ లేచి, తన పాత ట్రంకుపెట్టె ధన్ మని తెరిచి, "ఒసేయ్! ఆ బట్టలన్నీ ఇందులో సర్ది తగలడు" అని ఆజ్ఞాపించాడు. ఆ ఇల్లాలు గోలు గోలున ఏడుస్తూ, మొగుడి పాదాలు పట్టుకుని వేలాడుతూ, "మా చెల్లెలు చేసిన తప్పుకు నన్ను శిక్షించకండి!" నన్ను వదిలి వెళ్ళకండీ!" అని దీర్ఘాలు తీస్తోంది. ఝాన్సీ అసహ్యం భరించలేకపోయింది. తను తప్పుచేసిందా? అందుకు వీడు తనను క్షమించాలా? మనసు రగులుకుపోతుండగా, తన మంచంమీదనుంచి దుప్పటి, తలగడదిండు తీసి అవతల పారేసి తీక్షణంగా, "మీరంతా ఈ గదిలోనుంచి అవతలికి పోండి. మీ కోపాలూ, తాపాలూ, సరసాలూ అన్నీ బయట ప్రదర్శించుకోండి!?" అని అరిచింది, తర్జనితో గుమ్మంవైపు చూపిస్తూ, ఈ హడావుడికి అచ్చమాంబ దొడ్లోనుంచి వచ్చింది. తల్లి ముఖంలోకి చూడగానే, ఝాన్సీ కోపం చప్పున జారిపోయింది. వేటగాడి బాణం తనకు తగలక తప్పదని తెలిసిన ముసలి లేడి, పరుగెత్తే ఓపిక కూడా లేక ప్రాణత్యాగానికి సిద్ధపడి దీనంగా చూస్తూ నిలబడిపోయినట్లుగా వుంది ఆ ముఖం. భయ విహ్వలాలైన ఆ చూపులు ఝాన్సీ మనసుకు తూట్ల వుతున్నాయి. తన తల్లిని ఆ దైన్యావస్థలో చూడటం చాలా కష్టంగా వుంది ఝాన్సీకి. వప్పు రుబ్బుతూన్న చేతులు అలాగే కడుక్కోకుండా వచ్చేసింది. జుట్టంతా రేగి వుంది. చీరంతా మసి మరకలు, ఒక్క మాట మాట్లాడాలేక అలాగే నిలబడి పోయింది. బయటినుండి శాస్త్రి రంకెలూ, అక్క ఏడుపూ వినిపిస్తూ వున్నాయి అక్క ఏడుపు వినిపించినప్పుడల్లా తల్లి ముఖం మరింత పాలిపోతోంది. గుండె గతి తప్పుతోంది. తల్లి ఆరోగ్యం ఏమయిపోతుందోనని కంగారు కలిగింది ఝాన్సీకి అంచేత పూర్తిగా తగ్గిపోయి "అమ్మా! ఈ దుప్పటీ గలేబూ చాకలివాడికి పంపించు" అంది నిర్లప్తంగా. అచ్చమాంబ పిండిచేతులతో అవి తీసుకుని గడప దాటగానే గది తలుపులు లోపలినుంచి అటు శాస్త్రి అరుపులూ, ఇటు అక్కా, తల్లీ దీనంగా ప్రాధేయపడుతున్న మాటలూ వినిపిస్తూనే వున్నాయి. ఈ శాస్త్రి నిజంగా కోపం తెచ్చుకుని పోతే బాగుండును అనుకుంది ఒకసారి. అంతలోనే అలా జరిగితే, అక్కగతి ఏంకావాలనే ఆలోచన కూడా వచ్చింది. సుందరమ్మగతి తన అక్కకు పట్టాలని అనుకోగలదా? ఆ ఆలోచనకే శరీరం జలధరించింది. బయట గదిలో గలాటా అణిగిపోయింది. అల్లుడుగారు శాంతించినట్లున్నారు. అతడే ఉద్దేశంతో వచ్చాడో ఒక పట్టాన కదిలా లేడు. అతడు ఇన్నాళ్ళు ఇక్కడ వుండడం తనకు విచిత్రంగానే వుంది. ఏ ఉద్దేశంతో వచ్చాడు? ఇన్ని రోజులిక్కడుంటే, ఉద్యోగం ఏమవుతుంది? అక్కను ఇప్పటికయినా తనతో తీసికెళతాడా? లేక తాను కోరిన అయిదువేలు దగ్గరుండి వసూలు చేసుకోవటానికి వచ్చాడా? ఈ ప్రశ్నలన్నీ అమ్మా అడగదేం? తను అడగబోతే, "హుష్! హుష్!" అని వారించింది. అక్క అయినా, అతనితో రోజులు గడిపిందే చాలనుకుంటుందే కాని, అసలు సమస్యను పరిష్కరించుకోవాలని చూడదు. ఆలోచనలతో, అలసటతో ఎప్పుడో నిద్రపట్టేసింది. తలుపు తట్టిన చప్పుడుకు లేచి, తలుపు తీసింది. ఎదురుగా తల్లి- వడిలిపోయిన ముఖంతో, చేతిలో ఉలికిన దుప్పటి, దిండుతో నిద్రమత్తులో కొంతసేపు ఏదీ అర్ధం కాలేదు.