Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 31


    ఆమెను పుట్టింటి నుంచి ఏవేవో ఖరీదయిన వస్తువులు తెమ్మని అతనూ, వాళ్ళమ్మా నానాహింసలు పెడుతుంటారు.
    మేము వెళ్ళేసరికి పూర్తిగా కాలిపోయిన కిరాతకరావు భార్య శరీరాన్ని గది తలుపులు పగులగొట్టి బయటకు తీసుకొచ్చారు కొంతమంది.
    మరికాసేపట్లో టాక్సీమీద చావుబ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.
    "వాట్ హాపెన్డ్?" ఆందోళనపడుతూ అడిగింది ఎల్వీరా.
    "ఆ! మామూలే! కొత్తగా పెళ్ళయింది. భార్యను చంపేస్తే, మళ్ళీ బోలెడు కట్నం తీసుకుని పెళ్ళి చేసుకోవాలని అలా చేస్తున్నాడు" చెప్పాడు జనార్ధన్.
    "మైగాడ్! మీ వాళ్ళు మనుషులా? జంతువులా?" ఆవేశంగా అడిగింది. మేము మాట్లాడలేదు.
    ఇంటికి చేరుకాగానే పుస్తకంతీసి "తెలుగు ప్రజలలో చాలామందికి భార్యలను కిరసనాయిలు పోసి తగలబెట్టుట ఆచారము." అని రాసుకుంది. మరి కాసేపు మిగతా ఆచారాల గురించి తనకు తెలియని విషయాలు వివరంగా చెప్పాడు శాయీరామ్.
    "మీ తెలుగు సినిమా ఒకటి చూడాలి ఇవాళ!" అందామెకాసేపాగి.
    "ఓ యస్! మేమూ సినిమా చూడాలి ఇవాళ!" అందామెకాసేపాగి.
    "ఓ యస్! మేమూ సినిమా చూసి చాలా రోజులయింది పదండి!" అన్నాడు గోపాల్రావ్. అందరం రోడ్డుమీదికొచ్చాం. టాక్సీఖాళీగా కనిపించింది. శాయీరాం డ్రైవరుతో మాట్లాడాడు.
    "చాలిస్ రూపయాదేదో!" అన్నాడు టాక్సీవాడు.
    "నలభైఎందుకు? పదిహేనిస్తా!"
    "పంద్రా? పంద్రా రూపయా? హమ్ భీక్ మాంగ్ సేవాలోంకో దేతే-"    
    "అతను మాట్లాడేది ఏ భాష?" అనడిగింది ఎల్వీరా.
    "ఉర్దూ!"
    "ఓ! ఐసీ!"
    అందరం బస్ స్టాపులో నిలబడ్డాం.
    బస్సువచ్చి ఆగింది.
    ఫుట్ బోర్డు మీద యాభయ్ మంది వేలాడుతున్నారు.
    బస్సు లోపల మాత్రం అన్ని సీట్లూ ఖాళీగా ఉన్నాయి.
    మేము ఆ ఫుట్ బోర్డుమీద జనాన్ని తోసుకుంటూ లోపలికెక్కడానికి ప్రయత్నించాంగానీ మా వల్లకాలేదు. బస్సువెళ్ళిపోయింది.
    "వాటీజ్ దిస్? లోపలఖాళీ ఉండగా వీళ్ళంతా ఫుట్ బోర్డు మీదే ఎందుకు నిలబడ్డారు?" ఆశ్చర్యంగా అడిగిందామె.
    "ఫుట్ బోర్డు ట్రావెలింగ్ మా కాపిటల్ ప్రజలహాబీ! అందుకే త్వరలో కేవలం ఫుట్ బోర్డులతోనే కొత్తరకం బస్సు తయారు చేస్తున్నారు" చెప్పాడు రెడ్డి.
    ఆమె వెంటనే తన పుస్తకం తీసి "ఫుట్ బోర్డు మీద ప్రయాణించుట తెలుగు ప్రజల హాబీలలో ఒకటి" అని రాసుకుంది.
    మరో రెండు బస్ లు ఆగకుండా పోతూనే ఉన్నాయ్. చివరకు ఓ బస్ ఆపాడు.
    "కిదర్ జానా?" అడిగాడు కండక్టరు.
    "నారాయణ్ గూడా."
    "కిత్నేటికెట్?"
    "ఛే టికెట్-" అంటూ పది రూపాయల నోటు ఇచ్చాను. కండక్టర్ నోటువంక చూసి చిరునవ్వు నవ్వి నాచేతికి నాలుగు రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు.
    "వాటెబౌట్ టికెట్స్?" అంది ఎల్వీరా ఆశ్చర్యంగా.
    "సాధారణంగా ఇక్కడ టికెట్లివ్వరులెండి! దిసీజ్ నార్మల్" ఫ్రాంక్ గా చెప్పేశాను.
    "ఓ మైగాడ్ నెస్!"
    అందామె ఆశ్చర్యంగా ఆ తరువాత అరష్ లోనే పుస్తకం తీసి ఏదో రాసుకుంది.
    "తెలుగువాళ్ళు అవినీతిపరులు అని రాసుకుందేమో!" అన్నాడు శాయీరామ్ నా చెవిలో సినిమా హాలుకి చేరుకున్నాం.
    "ఈ హీరో పేరేమిటి?" హాల్ బయటవున్న పెద్ద కట్ అవుట్ ని చూస్తూ అడిగిందామె. "రాజేష్ కుమార్! తెలుగులో సూపర్ స్టార్! అతను నటించిన సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయ్" చెప్పాడు రెడ్డి.
    "ఓ ఐసీ! ఏం సినిమాలవి?" కుతూహలంగా అడిగిందామె.
    "అల్లుడే మేనత్తమొగుడు! సింహం రక్కింది! దగుల్భాజీ వెధవ..."
    "ఆగండాగండి!" అరిచిందామె.
    "ఏమిటి?" అడిగాడు జనార్ధన్ ఆగి.
    "అల్లుడే మేనత్త మొగుడు! అంటే ఏమిటి?"
    "అంటే... అంటే సన్ ఇన్లా ఓన్లీ ఈజ్ అంట్స్ హజ్ బెండ్."
    "అంటే?" మళ్ళీ అడిగిందామె.
    "అంటే... అంటే... అదే!"
    "కానీ అదెట్లాకుదురుతుంది? మీ తెలుగులో ఆ వరుసలు ఉండవుగా?"
    "అబ్బే - అలాంటివేమీ చూడరండీ మా వాళ్ళు! టైటిల్ కొత్తగా ఉండాలి- ప్రాస కుదరాలి! అంతే."
    "మిగతా అవార్డు ఫిలిమ్స్ ఏమిటి?"
    "సింహం రక్కింది- దగుల్భాజీ వెధవ- తీటగాడు."
    "దగుల్భాజీ! వాటీజ్ దగుల్భాజీ-"
    "అంటే వట్టిరోగ్ అన్నమాటండీ!"
    "వెధవ అంటే?"
    "అంటే వట్టివెధవ అని అర్ధం."
    గోపాల్రావ్ టికెట్లు తీసుకొచ్చాడు.
    "తీటగాడు అంటే ఏమిటి?" అడిగింది ఎల్విరా.
    "అంటే- అంటే తీటగాడేనండీ" ఆలోచించింది చెప్పాడు జనార్ధన్.
    అందరం హాల్లోకెళ్ళి కూర్చున్నాం.
    సినిమా టైటిల్స్ వస్తున్నాయి.
    వక్రవీర ప్రొడక్షన్స్ సమర్పించు- 'తెడ్డిపాలెం గిడ్డిగాడు' అన్న అక్షరాలను అతి కష్టం మీద చదివింది ఎల్వీరా.
    "తెడ్డిపాలెం గిడ్డిగాడు అంటే ఏమిటి?" అడిగిందామె రెడ్డిని.
    రెడ్డి ఓ క్షణం ఆలోచించి "ఆపేరుకి అర్ధం ఏమిట్రా?" అంటూ శాయీరామ్ ని అడిగాడు. శాయీరామ్ రహస్యంగా నన్నడిగాడు.
    నేను రెండు  నిమిషాలు ఆలోచించి "తెడ్డిపాలెం అంటే ఓ ఊరన్నమాట! అందులో గిడ్డిగాడు! అదీ సంగతి" అని చెప్పాను.
    "ఓ! కాని, గిడ్డిగాడు అంటే ఏమిటి" మళ్ళీ అడిగిందామె.
    నాకేం చెప్పాలో తెలీలేదు. "గిడ్డిగాడూ.....మీన్స్..... మీన్స్...." అని గోపాల్రావ్ వేపు చూశాను.
    "గిడ్డిగాడంటే...... ఇది" అన్నాడు గోపాల్రావ్ సరయినపదం కోసం వెతుకుతూ.
    "ఇదంటే?"
    "ఇదంటే అదే- ఇది! నిజం చెప్పాలంటే నాకూ సరిగ్గా తెలీదు" అనేశాడు చివరకు.
    "అయ్ టూ డోన్ట్ నో!" అన్నాడు జనార్ధన్.
    "వ్వాట్! గిడ్డిగాడు- తెలుగుపదమే కదా!" అడిగింది ఎల్వీరా.
    "అఫ్ కోర్స్ అఫ్ కోర్స్" అన్నాం అందరం!
    "మరి మీ మదర్ టంగ్ తెలుగయి ఉండి ఓ తెలుగు పదానికి అర్ధం తెలీదా? వెరీబాడ్!" అందామె పుస్తకం తీస్తూ.

 Previous Page Next Page