Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 30


    "వ్వాట్! ఇది మెయిన్ రోడ్డా?"
    "అవునండీ!"
    "మరి వెహికల్స్ ఇలా ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారేమిటి?"
    "ఇక్కడింతేనండీ! ఇలాగే మా కలవాటు!" అన్నాడు శాయీరామ్.
    ఆమె వెంటనే తన పుస్తకం తీసి "తెలుగు ప్రజలు రోడ్ల మీదనడపడం నడపటం చేతకానివాళ్ళు" అని రాసుకుంది.
    మేమావాక్యం చదవనట్టునటించాం. టాక్సీ కొంతదూరం వెళ్ళి ఠక్కున ఆగిపోయింది. రోడ్డుకడ్డంగా కట్టిన షామియానాలొ వివాహం జరుగుతోంది.
    "ఏమి జరిగింది?" అడిగింది ఎల్వీరా.
    "రోడ్డు బ్లాక్ చేసి పెళ్ళి జరిపిస్తున్నారెవరో..."
    "పబ్లిక్ రోడ్ బ్లాక్ చేసి మారేజ్ చేస్తూంటే ట్రాఫిక్కంతా ఏమవుతుంది?" ఆశ్చర్యంగా అందామె.
    "మా తెలుగు రాష్ట్రంలో ఇలాంటివెవరూ పట్టించుకోరు! ఎవరు ఏ రోడ్ కావాలంటే ఆ రోడ్ ని మూసేసి వాడుకోవచ్చు."
    "మరి మీ మునిసిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది?"
    శాయీరామ్ పకపకానవ్వాడు.
    "భలేవారే మీరు! అసలు కార్పొరేషన్ వాళ్ళే రోడ్లు తవ్వేసి మధ్యలో పెద్ద ఆర్చీలు కట్టి ఫలానా ఎంకిగాడికి స్వాగతం నాయి రాస్తుంటారు- అన్ని రోడ్లమీదా! అలా రోడ్లు అన్నీ సగం బ్లాక్ అయ్యే వుంటాయ్ ఎప్పుడూను!"
    ఎల్వీరా ఠక్కున తన పుస్తకం తీసి "తెలుగు ప్రజలు మెయిన్ రోడ్లు బ్లాక్ చేసి పెళ్ళిళ్ళు జరుపుట, "ఎంకిగాడికి స్వాగతం" బోర్డులు కట్టుట చేయుదురు."
    అని రాసుకుంది. అంత చిన్న విషయం కూడా ఎందుకు రాసుకుంటోందా అని మేము సైగలు చేసుకుని ఆమె తెలివితక్కువతనానికి నవ్వుకున్నాము.
    టాక్సీ వెనక్కు నడిచి అయిదు కిలోమీటర్లు ఎక్కువదూరం తిరిగి మా కాలనీకి చేరుకుంది.
    కాలనీ చివరి ఇంటిదగ్గర బోలెడుమంది గుమికూడి ఉండటం చూచింది ఎల్వీరా.
    "అక్కడెందుకు అంతమంది గుమిగూడారు?" అడిగిందామె.
    "న్యూస్ పేపరు కోసం! మా కాలనీలో ఆ చివరింటాయన ఒక్కడే న్యూస్ పేపర్ తెప్పిస్తాడు. మిగతా అందరూ ఆయన దగ్గర తీసుకుని చదువుతారు" చెప్పాడు జనార్ధన్.
    "అదేమిటి? ఎవరి పేపర్ వాళ్ళు కొనుక్కోవచ్చు గదా!"
    "కొనుక్కోవచ్చనుకోండి! కానీ అలవాటు లేదు."
    ఆమె వెంటనే తన పుస్తకం తీసి- తెలుగువాళ్ళు అందరూ పక్కింటి వాళ్ళపేపర్లూ మాగజైన్లు చదువుతారు. అని రాసుకుంది.
    "భలేగుందే! ఇంత మై స్యూట్ డిటైల్స్ కూడా రాసుకుంటున్నారు" అన్నాడు గోపాల్రావ్ ఆశ్చర్యంగా.
    ఆమె చిరాగ్గా చూపింది.
    అందరం జనార్ధన్ ఇంటికి చేరుకున్నాం.
    "ముందు నేను స్నానం చేయాలి! బాత్ రూమ్ ఎక్కడ?" అడిగిందామె.
    అందరం ఘొల్లుననవ్వాము.
    ఎల్వీరా మమ్మల్ని పిచ్చివాళ్ళను చూసినట్లు చూసింది.
    "ఏమిటలా నవ్వుతున్నారు?" అంది టవల్ భుజాన వేసుకుంటూ.
    "ఇవాళ ఆదివారం కదా! మరి స్నానం చేస్తానంటారేమిటి? ఇక్కడ వారానికి నాలుగు రోజులే నీళ్ళువస్తాయి. అంచేత నాలుగురోజులే స్నానం చేయాలి."
    "వాట్? వారానికి నాలుగురోజులేనా?"
    "ఒక్కోసారి రెండ్రోజులే వస్తాయ్!"
    "వాటే హోప్ లెస్ పీపుల్ యూ ఆర్!" అందామె చిరాకుగా అని పుస్తకం తీసి తెలుగు ప్రజలు వారానికి నాలుగు రోజులే స్నానం చేయుదురు అని రాయబోయింది గాని శాయీరామ్ అడ్డుపడ్డాడు.
    "దయచేసి అదంతా రాయకండి! ఎందుకంటే నేను చెప్పేది వేసవిలో సంగతి. అదీగాక తెలుగు ప్రజలు ఇంకా నయమండి! తమిళ ప్రజలు వారానికి మూడుసార్లే చేస్తారు" అన్నాడు రెడ్డి.
    అందరం తలోకొంచెం నీళ్ళుదానం చేశాము- ఆమె స్నానానికి.
    మా అందరికీ గోపాల్రావ్ వాళ్ళింట్లోనే భోజనం ఏర్పాటు చేశాడు.
    "కేవలం తెలుగుభోజనమే తింటాను" అని ముందే ఎల్వీరా చెప్పటం చేత తెలుగు వంటకాలే చేయించారు.
    ఎల్వీరా అన్నం మొదటి ముద్దనోట్లో పెట్టుకోగానే పటపటమన్న శబ్దాలు వినిపించాయ్.
    "స్టోన్స్" అంటూ అరచి బయటకు పరుగెత్తి అన్నం ఊసివేసిందామె.
    "ఈవిడ వ్యవహారం మరీ విడ్డూరంగా ఉందే! బియ్యంలో రాళ్ళు ఉండకుండా ఎలా ఉంటాయ్?" అన్నాడు గోపాల్రావ్ రాళ్ళుమింగేస్తూ.
    "అన్నంలో రాళ్ళు మామూలు విషయమేనండీ! ఖంగారుపడవద్దు!" చెప్పాడు రెడ్డి.
    "నో నో! నావల్లకాదు. నాకు బ్రెడ్ తెప్పించండి!" అందామె.
    "బ్రెడ్ లో కూడా రాళ్ళుంటాయ్!" అన్నాడు జనార్ధన్.
    "ఇలా అన్నిట్లో రాళ్ళు కలుపుతుంటే మీ గవర్నమెంట్ ఏం చేస్తోంది?"
    "గవర్నమెంట్ ఏమిటి?" మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాడు రెడ్డి.
    ఆమె రెండు చేతులతో తల పట్టుకూర్చుంది.
    "రుక్మిణీ" అంటూ భార్యను పిలిచాడు గోపాల్రావ్.
    "ఏమిటండీ!" చేతులు తుడుచుకుంటూ వంటింట్లో నుంచి వచ్చిందామె. "నువ్వు నిన్న పక్కింట్లోనుంచి పేపర్ తెచ్చి చదివినట్లున్నావ్ కదా! గవర్నమెంట్ ఉందీలేందీ ఏమయినారాశారా అందులో?"
    "భలేవారే! గవర్నమెంట్ లేకపోవటం ఏమిటి? ఉందని జనార్ధన్ అన్నయ్యగారి భార్యకూడా అంది నిన్న."
    "ఏది- ఆవిడనోసారి పిల్చుకురండి! సరిగ్గా కనుక్కుందాం!" అన్నాడు జనార్ధన్.
    జనార్ధన్ భార్య రెండు నిమిషాల్లో వచ్చింది.
    "ఏమే? రుక్మిణమ్మగారితో నువ్వు గవర్నమెంట్ ఉందన్నావా?" అడిగాడు జనార్ధన్.
    "అవునూ! ఏం?"
    "నీకెలా తెలుసు ఆ విషయం?"
    "బాగుందండీ! రోజు రోజుకీ ధరలు పెరిగిపోతూంటే తెలియటం లేదూ? గవర్నమెంట్ లేకపోతే ధరలెలా పెరుగుతాయ్?"
    "నిజమే!" ఒప్పుకున్నాడు శాయీరామ్.
    "ఓ! అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా ఉందన్నమాట!" అంది ఎల్వీరా ఆమె రెండు అరటి పళ్ళుతిని చేయి కడుక్కుంది. మధ్యాహ్నం వరకూ తెలుగు ప్రజల గురించి ఎన్నో ప్రశ్నలు వేసి వివరాలు సేకరించిందామె.
    (1) భర్తలను పశువులసంతలోవలే కొనుక్కొనుట వీరి ఆచారము.
    (2) మతాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో పిల్లలను కనుట వీరి ఆచారము.
    (3) ....
    ఇలా చాలా విషయాలు ఆమెరాసుకుంటూంటే నేను దొంగతనంగా చదివాను. (అవన్నీ మరోసారి మనవి చేసుకుంటాను. ఆ మధ్యాహ్నం మా ఇంట్లో టీ పార్టీ.
    టీ తాగుతుండగా కాలనీ మధ్యవరుసలోని ఇంట్లో పెద్ద కేకలు వినిపించినయ్. మరుక్షణం కాలనీలో చాలామంది అక్కడకు పరుగెత్తారు.
    మేమూ, ఎల్వీరాకూడా అక్కడకు చేరుకున్నాం. సంగతేమిటో మాకు ముందుగానే తెలిసిపోయింది.
    కిరాతకరావు తన భార్యను రోజూ చావగొట్టడం కాలనీలో అందరికీ తెలిసిన విషయమే!

 Previous Page Next Page