ఆంధ్ర జన సంఘం తెలంగాణ ప్రజలలో ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది.
ఉద్యమము మొదలయిన తొమ్మిది నెలల్లో సబ్నవీసు వేంకట రామనరసింహారావుగారి సంపాదకత్వాన నల్లగొండనుంచి తొలి తెలుగు పత్రిక "నీలగిరి" వెలువడింది. తొలి సంచిక 24-8-1922ణ వెలువడింది.
ఆ తరువాత మూడు రోజులకు వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి "తెలుగు పత్రిక" వెలువడింది. దీనికి బహుభాషా వేత్తలు, పండితులు, సహృదయులు ఒద్దిరాజు సీతారామచంద్రరావుగారు సంపాదకులు కాగా, వారి సోదరులు రాఘవరావుగారు ఉప సంపాదకత్వం వహించారు. దీని తొలి సంచిక 27-8-1922న వెలువడింది. ఒద్దిరాజు సోదరులు తమ గ్రామంలో అచ్చుశాల ఏర్పరచి, మత గ్రంథాల నుండి సైన్సు గ్రంథాల వరకు రచించి, అచ్చువేసిన మహనీయులు. ఈ సంవత్సరం (1994) ఒద్దిరాజు సోదరుల శతజయంతి ఉత్సవాలు జరిగాయి.
ఉద్యమ ప్రారంభం తరువాత నాలుగున్నర సంవత్సరాలకు హైదరాబాదునుండి - సురవరం ప్రతాపరెడ్డిగారి సంపాదకత్వాన గోలకొండ పత్రిక వెలువడింది. దీని తొలి సంచిక 10-5-1926న వెలువడింది. "గోలకొండ" పత్రిక మాత్రమే కాదు - సురవరం వారు సంపాదకులు మాత్రమే కాదు. వారు వెలుగుకు నిలయాలు. ఒక సంస్థగా - ఒక శక్తిగా గోలకొండ పత్రిక తెలంగాణకు చేసిన సేవ అపారం.
కొంతకాలానికి "తెలుగు పత్రిక", "నీలగిరి పత్రిక" నిలిచిపోయాయి. కాని గోలకొండ పత్రిక ద్వైవార పత్రికగా మొదలయి, దిన పత్రికగా విశాలాంధ్రం ఏర్పడిన తరువాత కూడా నడిచింది. ఆధునిక వ్యాపార వత్తిడులకు తట్టుకోలేక - ఆంధ్రపత్రిక వలెనే - మూతపడింది.
"ఆంధ్ర" పదం నిజాముకు బెదురు. ఆ పేరుతో ఒక పత్రికకు అనుమతి ఇవ్వలేదు. అందువలన పత్రికకు "గోలకొండ" అని పేరు పెట్టారు.
ఆంధ్ర జన సంఘపు తొలి సమావేశం హైదరాబాదులో మాడపాటి హనుమంత రావుగారి ఇంట్లో జరిగింది. రావుబహదూర్ వెంకట రెడ్డిగారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వెంకటరామ రెడ్డిగారిని అధ్యక్షులుగాను, మాడపాటి హనుమంతరావుగారిని కార్యదర్శిగను ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో 1. గ్రంథాలయాలు, పాఠశాలలు స్థాపించడం, 2. విద్యార్థులను ప్రోత్సహించడం, 3. విద్వాంసులను గౌరవించడం, 4. తాళపత్ర గ్రంథాలను, శాసనాలను సేకరించడం, పరిశోధించడం, 5. విజ్ఞాన ప్రచారం, 6. ఆంధ్రభాషాప్రచారం, 7. వ్యాయామము,కళలను ప్రోత్సహించడం 8. అనాధలకు సహాయం అందించడం కార్యక్రమాలుగా నిర్ణయించడం జరిగింది. ఇది 26-7-1923న జరిగింది.
రెండవ సమావేశం నీలగిరి పత్రిక సంపాదకులు సబ్నవీసు వేంకటరామనరసింహారావుగారి కార్యాలయ ఆవరణ - నల్లగొండలో జరిగింది. దీనికి వేంకట రెడ్డిగారే అధ్యక్షత వహించారు. ఈ సభ 21-3-1924న జరిగింది. ఈసభలో నిర్ణయించిన కార్యక్రమాలు -
1. నిజాం రాష్ట్రాంధ్ర నిధి ఏర్పాటు చేయబడింది. దీనికి కొండా వెంకటరంగారెడ్డి గారిని వ్యవహర్తగా నియమించారు.
2. వేతనమిచ్చి ఒక ప్రచారకుని నియమించడం.
3. పరిశోధన విభాగాన్ని కేంద్ర జన సంఘానికి మార్చడం.
4. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి ఆంధ్రభాషలో ప్రథమముగా ఉత్తీర్ణులయిన వారికి వెండి, బంగారు పతకాలు బహూకరించడం.
5. తెలుగుభాష వ్యాప్తికి పరీక్షలు నిర్వహించడం.
6. నిజాంరాజ్యమండలి ఆంధ్రుల స్థితిగతులను తెలియపరచే చిన్నపుస్తకం ప్రచురించడం.
మూడవ సభ మధిరలో జరిగింది. మాడపాటి తిరుమలరావుగారి అధ్యక్షతన ఆహ్వాన సంఘము ఏర్పాట్లు చేసింది. వెంకటరామ రెడ్డిగారే అధ్యక్షత వహించారు. సభలో చేసిన ప్రధాని నిర్ణయాలు:
1. ఆంధ్రపరిశోధక మండలికి కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది.
2. ఇంజనీరింగ్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయిన ఆంధ్రునికి సువర్ణపతకంతో గౌరవించడం.
3. ఆంద్ర భారతీ తీర్థ (విజయనగరం) పరీక్ష ఇవ్వడాన్ని ప్రోత్సహించడం.
4. బొంబాయి ఆంధ్రులు చూపిన సానుభూతికి కృతజ్ఞతలు తెలియపర్చడం.
ఇంతవరకు ప్రభుత్వం అంతగా ఆటంకం కలిగించలేదు. కాని, దినదినాభి చెందుతున్న ఆంధ్ర జన సంఘం విషయంలో అప్రమత్తంగా ఉంది.
ఇంతవరకు జరిగిన సభలకు వంద - రెండు వందలకు మించి ప్రజలు రాలేదు. తీర్మానాల్లో రాజకీయ జాడ గాలించినా కనిపించలేదు.
కాని, 21-2-1925న మధిరలో జరిగిన సభకు ఒక విశిష్టత ఉన్నది.
1. ఆంధ్ర జన సంఘ సభతోపాటు గ్రంథాలయ మహాసభ కూడా 22-2-1925న జరిగింది.
2. బొంబాయి ఆంధ్రులు సానుభూతి తెలిపారు. నిజాం గ్రంథాలయాలను సహించలేడు. రాజ్యపు అవలివారి సంబంధాలను అసలు ఓర్చలేడు.
సూర్యాపేటలో జరుప తలపెట్టిన 4వ సభలకు అంతరాయం కలిగించాడు.
నాలుగవ మహాసభలు సూర్యాపేటలో జరపడానికి కోదాటి రామకృష్ణారావు గారి అధ్యక్షతన ఆహ్వాన సంఘం ఏర్పడింది. ఆంధ్ర జన సంఘ సభలతోపాటు గ్రంథాలయ మహాసభ, విద్యావిషయక, సామాజిక సభలు కూడా జరపడానికి నిశ్చయించారు. వెంటనే "ప్రభుత్వము వారి అనుమతి లేక సభలు జరుపరాదు" అని ఆదేశించారు. అంతేకాదు, "ప్రభుత్వము అనుమతి లేకుండా సభలు జరుపడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి." అనే సుగ్రీవాజ్ఞను సూర్యాపేట పురప్రముఖులకు చాలామందికి పంపారు.
దీనితో ఉత్సాహవంతులయిన పురజనుల్లో నిరుత్సాహం వ్యాపించింది. అంతేగాని, పట్టుదల సన్నగిలలేదు. మాడపాటివారు పోలీసు అధికారిని కలిశారు. ఇవి రాజకీయ సభలు కావని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అతడు ససేమిరా వినలేదు.
అది ప్రభుత్వ ఆదేశం! అధికారి ఏం చేయగలడు?
అమరవాది వేంకట నర్సయ్యగారు నల్లగొండ జిల్లా న్యాయస్థానంలో మనవి పత్రం సమర్పించి సూర్యాపేట సభలకు అనుమతి కోరారు. జిల్లా న్యాయాధికారి "ప్రభువువారి ఫర్మానాను అనుసరించి బాబెహుకూమత్ అనుమతి పొందుట తప్పనిసరి" అని తీర్పు ఇచ్చాడు.
దీనిమీద హైకోర్టుకు అపీలు చేయగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధానాంశాలు:
1. రాజకీయముకాని విద్యాసంబంధమైన సభలకు నిర్బంధము కలిగించుట ప్రభువువారి ఫర్మాను భావము కాకపోవచ్చును.
2. ఒక సభ రాజకీయము అగునా కాదా అన్నది సభ జరిగిన తరువాతగాని తెలియదు. ప్రభువువారి ఫర్మానుకు విరుద్ధమైతే శిక్షపడక తప్పదు. అలాంటి సందర్భంలో అది రాజకీయం అవునా కాదా అని నిర్ణయించు హక్కు కోర్టువారికి ఉంటుంది.
ఈ తీర్పువల్ల స్థూలంగా నిర్ణయమైంది ఏమంటే - ఆంద్ర సంఘానికి చెందిన ఏ సభ జరపాలన్నా బాబెహుకూమత్ - మంత్రిమండలి - నుంచి అనుమతి పొందాలి.
బాబెహుకూమత్ అనుమతి కోరితే వారు ఎంతకూ తేల్చి చెప్పలేదు.
1927లో బ్రిటిషిండియా ప్రభుత్వం రెవెన్యూశాఖ మంత్రిని - పోలీసుశాఖాధ్యక్షుని నిజాం ప్రభుత్వంలో ఇంగ్లీషువారిని నియమించింది. DG.గా లెఫ్టినెంట్ కర్నల్ ట్రెంచ్ వచ్చాడు. మాడపాటివారు ట్రెంచ్ ను కలిసి, సూర్యాపేట సభలకు అనుమతి సాధించారు.
ఆవిధంగా 1926లో జరగవలసిన సభలు ప్రభుత్వ దమననీతి కారణంగా సూర్యాపేటలో 28, 29, 30మే 1928లో అత్యంత వైభవంగా జరిగాయి. సభలు విజయవంతంగా జరగడానికి, ప్రజలలో ఉత్సాహం వెల్లివిరియడానికి రెండేళ్ళపాటు ప్రభుత్వం పెట్టిన తిప్పలు ప్రముఖ కారణం కావచ్చును. మూడు రోజుల్లో ఏ రోజునా వేయికి తక్కువ జనం రాలేదు. సుమారు 50 మంది ఉపన్యాసాలిచ్చారు. ఆంధ్ర జన సంఘ సమావేశాలకు కొండా వెంకటరంగా రెడ్డిగారు అధ్యక్షత వహించారు. దానితో పాటు మరికొన్ని ప్రధాన సభలు జరిగాయి.
1. ద్వితీయ గ్రంథాలయ మహాసభ - మహారాష్ట్రుడయిన వామన నాయక్ అధ్యక్షులు.
2. వర్తక సంఘ వార్షికోత్సవం - అధ్యక్షుడు వై. అంజయ్యగారు.
3. స్థానిక గ్రంథాలయ వార్షికోత్సవం - అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డిగారు.
4. స్థానిక భజన సమాజ వార్షికోత్సవం అధ్యక్షుడు ఆదిపూడి సోమనాథరావుగారు.
5. మహిళాసభ - అధ్యక్షుడు చట్రాతి లక్ష్మీనరసమ్మగారు.
6. ఆంధ్ర యువజన మహాసభ - అధ్యక్షులు లోకనంది శంకరనారాయణరావుగారు.
7. ఆంధ్ర సంఘ సంస్కార సభ - అధ్యక్షులు గాడేపల్లి సూర్యప్రకాశరావుగారు.
8. వైశ్యుల సభ - అధ్యక్షులు పులిగళ్ల అంజయ్యగుప్తగారు.
తరువాత నల్లగొండ - మిర్యాలగూడెం - తిప్పర్తిలలో కూడా అత్యంత ఉత్సాహంగల జనబాహుళ్యంతో జరిగాయి సభలు.
ఇక్కడ గమనించవలసినవి.
1. సాధారణ సభ జరుపుకోవడానికి మంత్రిమండలినుంచి అనుమతి కావాలనడం రాక్షసం - పాశవికం - క్రూరం.