Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 30

    "నాకు ఆయనతో పెళ్ళవుతుందా?" చింకి చాటంత ముఖం వేసుకొని ఆనందంతో అడిగింది చామంతి.
   
    "ఆ...తప్పకుండా అవుతుంది."
   
    "మరి జైలులో వున్నాడు కదా?"
   
    "త్వరలోనే వచ్చేస్తాడు. మీ ఆయన దొంగకాదు కదా! అందువలన క్షేమంగా వస్తాడు."
   
    "కాని లాల్ జీ గారు మీ ఆయన దొంగతనం చేశాడని చెప్పి జైలులో పెట్టించాడు కదా?"
   
    "నిజంగా దొంగతనం చేయలేదు కదా!"
   
    "చెయ్యలేదు. దొంగతనం చెయ్యడు కూడా."
   
    "కాని ఒకటి దొంగిలించాడు."
   
    సోదెమ్మ సాంతం మాట పూర్తిచేయకముందే కోపంగా అరిచింది చామంతి. "అబద్దం...ఆయన దొంగ కాదు. ఏదీ దొంగిలించలేదు."
   
    "కాదు దొంగిలించాడు"
   
    "కాదు...కాదు....కాదు...."
   
    "కాదు అంటే సరిపోయిందా?" సోదెమ్మ నవ్వుతూ అడిగింది.
   
    "ఆ__లేకపోతే చెప్పు మా ఆయన ఏం దొంగిలించాడో?" రోషంతో ముక్కుతమ్మెలు అదురుతుండగా అడిగింది చామంతి.
   
    "చెప్పనా?"
   
    "చెప్పమనే అడిగేది."
   
    "మీ ఆయన నీ మనసు దొంగిలించాడు. ఇది నిజం కాదా? ఏది ఇలా నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు."
   
    సోదెమ్మ చిలిపిగా చూసి తమాషాగా కళ్ళెగరేసి అడుగుతుంటే సిగ్గుతో చామంతి కనురెప్పలు బరువుగా వాలిపొయ్యాయి.
   
    "మీ ఆయన పేరేంటి?"
   
    "గోపన్న"
   
    "మంచిపేరు" అంది సోదెమ్మ.
   
    ఆ తర్వాత...
   
    సోదెమ్మ మాటలలో పెట్టి చామంతి విషయమంతా తెలుసుకుంది.
   
    విషయం మరీ చిన్నదేమీ కాదు.
   
    గోపన్న బన్సీలాల్ ఇంట్లో నౌఖరు. చామంతి తండ్రి సూరప్పఠాకూర్ ఇంటి నౌఖరు. బన్సీలాల్ కి ఠాకూర్ కి పడదు. ఆ భయంతో గోపన్న, చామంతి చాటుగా ప్రేమించుకున్నారు. చాటుగ కల్సుకుంటున్నారు. వాళ్ళ పెళ్ళి కావాలంటే గోపన్న అన్నా నౌఖరీ వదులుకోవాలి లేక చామంతి తండ్రి సూరప్పన్నా నౌఖరీ వదులుకోవాలి. కొన్ని కారణాల వలన ఆ రెండూ అయ్యేలా కనిపించలేదు.
   
    ఇదిలా వుండగా నగలు పోయాయి అని దొంగతనం గోపన్న మీదకి నెట్టి బన్సీలాల్ గోపన్నని జైలులో పెట్టించాడు. చామంతి తండ్రి సూరప్పకి ఇదేమి పట్టలేదు. పెద్ద వాళ్ళు జైలులో పెట్టించారు కాబట్టి ఇహ వాడి గతి జైలు గోడలే అన్న గాడాభిప్రాయంలో ఉన్నాడు.
   
    ఈ కథ ఇలా వుంటే ఓ రోజు అర్దరాత్రి చాటుగా గోపన్న ఉండే ఇంటికి వచ్చింది చామంతి, గోపన్న దగ్గర నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు నల్లదుప్పటి నిలువునా ముసుగు వేసుకొని బయలుదేరింది. కొంతదూరం వెళ్ళి చూసేసరికి మరో దుప్పటి ముసుగుమనిషి తన వెనుకనే వస్తున్నట్లు పరుగెత్తుకెళ్ళి మొండిగోడ పక్కదాక్కుంది. తర్వాత క్షేమంగా ఇంటికెళ్ళగలిగింది. మర్నాడే ఈ విషయం గోపన్నకి చెప్పింది. ఇరువురూ జాగ్రత్తపడ్డారు.
   
    గోపన్నకి తెలిసిన చుట్టాలు పెద్దగ ఎవరూలేరు. ముసలి తాత తల్లి వున్నారుగాని వాళ్ళు దూరంగా వేరే ఊళ్ళో ఉన్నారు. వాళ్ళకీ విషయం తెలుసో తెలియదో ఎవరికి తెలియదు. ఏం చేయాలో తెలియని చామంతికి ఎవరో ఆప్తులు మంచి సలహా యిచ్చారు. దాంతో దిక్కు తోచకుండా కొట్టుమిట్టాడుతున్న చామంతి అడవికి బయలుదేరివచ్చింది.
   
    అదీ విషయం....
   
    అటు తిప్పి ఇటు తిప్పి తన కథ, తనకొచ్చిన కష్టం మొత్తం అంతా పూసగుచ్చినట్లు చెప్పింది చామంతి.
   
    మాటల్లో పెట్టి చాకచక్యంగా గుట్టు బయటికి లాగింది సోదెమ్మ.
   
    "అమ్మకి చెప్పుకుంటే కష్టంతీరుతుందని అమ్మ సాయం చేస్తుందని ఎవరు చెప్పారు?"
   
    మా ఇంటిపక్కనే నాకు బాగా తెలిసినవాళ్ళున్నారు. వాళ్ళు చెప్పారు.
   
    "వాళ్ళ పేరు?"
   
    పేరు చెప్పింది చామంతి.
   
    "మరి నీకు ఈ అడవిలో అమ్మ కనిపించిందా?"
   
    "ఉహూ...వెతికి చూశాను. పిలిచి చూశాను. కనిపించలేదు. నేను వెళ్ళి రేపు నా స్నేహితురాలిని వెంట పెట్టుకువస్తాను నా స్నేహితురాలు మావ ఆనందయ్య ఓసారి...."
   
    "ఇప్పుడు ఆ విషయాలేమీ వద్దులే త్వరలో గోపన్న జైలునుంచి వస్తాడు. నీవు నమ్మిన గోపన్న నీ మెడలో తాళికడతాడు వెళ్ళు" అంది సోదెమ్మ.

 Previous Page Next Page