Previous Page Next Page 
శతఘ్ని పేజి 30

 

    అక్కని చూస్తుంటే ఎంతజాలిగా వుందని......జవాబు చెప్పలేదు.....తమ్ముడిలాకాదు అన్నంత ప్రేమగా ఆమెను మంచం పైపడుకోబెట్టాడు. అన్నలాగే తలనిమురుతూప్రక్కన కూర్చున్నాడు. పార్వతి నిద్ర పోయిందోనిద్రలో కుమిలిపోతుందో తెలీదు. చాలాసేపటి తర్వాత తొలిమరణ వాంగ్మూలంలాంటి ఓ ఉత్తరంరాసేడు.....
    
    "అక్కా.....ఈ ఉత్తరంతో బాటు అయిదు వేలు డబ్బుని యిక్కడ ఉంచుతున్నాను. ఎక్కడిదంతా అని ఆశ్చర్యపోకు.....ఆశ్చర్యపోయినా అమ్మకితెలియనివ్వకు.....మనలాంటివాళ్ళ బ్రతుకులతో బలంగా ఆదుకునేది డబ్బేఅని తెలిసిన నేను ఆలస్యంగా అయినా ఓ నిర్ణయంతీసుకున్నాను. అది డబ్బు సంపాదించాలని. నెల నెలా నీకు అయిదువేలు అందుతుంది. ఆ ఏర్పాట్లు చేస్తున్నాను. అవునక్కా, నిన్ను నువ్వుకోల్పోటానికి సిద్దపడుతూ సంపాదిస్తున్న డబ్బు ఇది. పిచ్చి అక్కా! నువ్వేదో కంగారుపడుతున్నావుగాని మీకు దూరంగా వెళ్ళినా ఎలా దూరంగా వెళ్ళినా ఎలా దూరం కాగలనే.... మీతోనే వుంటాను మీతో వున్నంత సంతృప్తి బ్రతికిపోతాను. నేను ఎక్కడికి వెళుతున్నది, వెళ్ళిందీ నీకు బహుశా మరో రెండు రోజుల్లో తెలియొచ్చు తెలిసినా అది అమ్మకు తెలియనివ్వకుపిచ్చిది.....తట్టుకోలేదుగా....అందుకే అన్నీ నువ్వే కావాలి. నేను మీతోనే వున్నంత ధైర్యాన్ని అందించాలి తప్పదు....అమ్మ బ్రతకాలిగా..అక్కా....ఇలా రాస్తుంటే నా కళ్ళనుంచి నీళ్ళురాలుతున్న చాలాప్రశాంతంగా వుందిప్పుడు. నా కోరిక మన్నిస్తావుకదూ......"
    
    తెలతెలవారుతుండగా పైకి లేచాడు. తను ఆడుకున్న పరిసరాల్ని, నిద్రపోతున్న అమ్మనీ, అక్కనీ మరీ మరీ చూస్తూ బయటికి నడిచాడు. పది నిముషాల్లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ ని చేరుకున్నాడు. ఫోన్ చేశాడెవరికో.....అర నిముషంలో వినిపించింది ఆవలి వేపు నుంచి.
    
    "ఎవరూ?"
    
    "నేను విల్సన్.....కృష్ణని"
    
    "నువ్వా....ఇంత తెల్లవారుజామునే ఫోన్ చేశావేమిటి....ఒరేయ్-ఏం చెయ్యాలో చెప్పకుండా యింత డబ్బు నా దగ్గరవుంచావేమిటి.....? ఏమిట్రా యిది?" "ఒరేయ్...నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదూ" కృష్ణ గొంతు వణుకుతూంది. "ఆడబ్బు నీ దగ్గరే వుంచాలి. నెలనెలా అక్కకు అయిదు వేలుచొప్పున అందిస్తుండాలి."
    
    "ఇదంతా ఏమిట్రా" డబ్బు తెచ్చి ఇచ్చాడే తప్ప ఎంతడిగినా కృష్ణ ఆ వివరాలు చెప్పకుండా దాటేసి వెళ్ళిపోయాడు.
    
    "అసలు నీకింత డబ్బెలావచ్చింది?"
    
    "దొంగతనం చేయలేదురా.....కష్టార్జితమే...ఇదే కాదు.....నీకు త్వరలో మరో యాభైవేలు అందుతుంది. ఆ డబ్బు నీ దగ్గరే ఉంచి నేను చెప్పినట్టు నెలనెలా అక్కకి యిస్తుండాలి."    

 

    "నువ్వెక్కడికి వెళతావు?"
    
    "అది రహస్యం విల్సన్...."
    
    "అలా అయితే నేను ఈ డబ్బుని నా దగ్గర వుంచుకోను."
    
    "ఓ రెండు రోజులాగరా....."
    
    "ఎందుకు?"
    
    "నాబాద్యత నువ్వుతీసుకోడానికి."
    
    అర్ధంకాలేదు విల్సన్ కి "బాద్యతేమిటీ?"
    
    "అమ్మన్నా, అక్కన్నా నీకూ ప్రేమే కదరా.....మరి నేను దూరంగా వెళితే నా బాధ్యతను నువ్వు తీసుకోవూ"ఫోన్ క్రెడిల్ చేశాడు కృష్ణ.
    
    చాలాఅడగాలనుకున్న ఓ మిత్రుడికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకున్నాడు. అప్పుడు ఉదయం అయిదున్నరకావస్తూంది మరో పదినిముషాలలో అన్నమాట ప్రకారం పరమహంస వుంటున్న గెస్ట్ హవుస్ లో అడుగుపెట్టాడు కృష్ణ.    

                                                                   * * * *
    
    అభాగ్యుల అస్థిపంజరాలను భూమినుంచి తవ్వే గునపాల్లా సూర్యకిరణాలు సూటిగా నేలను తాకుతున్నాయి. కీచకుల చేతిలో నలిగినా స్వర్ణ యుగపు చివరి అంకంలో నగరంచేవ చచ్చిన సంరంభాన్ని నింపుకుంటున్న ఉదయం తొమ్మిది గంటలమున్నీ దూకుడుగా త్యాగిగదిలోకి వచ్చింది.
    
    "అంకుల్"

    ఎప్పటిలా ఉల్లాసాన్ని ప్రదర్శించలేకపోయాడు. నిన్న సాయంకాలం ఈవెనింగ్ ఎడిషన్ లో ప్రచురించబడిన వార్తలోని వాస్తవాణ్ణి తవ్వి తెలుసుకోవాలని రాత్రంతా జాగరణచేశాడు. చాలామంది స్టూడెంట్స్ ని కలుసుకున్నాడు. హాస్టల్స్ లోని విద్యార్ధుల్ని యింటర్వ్యూ చేశాడు. కాని ఆత్మాహుతికి సిద్దపడే ఆ విధ్యార్దెవరో గుర్తించే అణువంత 'క్లూ'ని సంపాదించలేకపోయాడు.
    
    బడలికగా వుంది... "ఏంటి మున్నీనువ్వు స్కూలుకెళ్ళలేదూ?"
    
    ఒడిలో చేరిపోయింది "లేదంకుల్.....పెద్దగొడవలుగా....." ఆరిందాలా మాట్లాడుతున్న మున్ని చాలా రిలీఫ్ నిచ్చింది.
    
    "ఏం గొడవలబ్బా...."
    
    "రేపు చదువుకునే పిల్లాడు చచ్చిపోతాడట"
    
    చురుక్కుమందేమో విభ్రమంగా చూశాడు త్యాగి. "నిజం అంకుల్! లల్లూ చెప్పింది."
    
    "లల్లూఎవరూ?"
    
    "పక్కింటి రెండోక్లాసు పాపన్నమాట"
    
    "అయితే మాత్రం నువ్వు స్కూలెందుకు మానేశావు?"
    
    "అమ్మకి భయమట"
    
    "నీకు భయంగా లేదూ"
    
    "కొంచెం కొంచెం వుంది"
    
    'వెళ్ళి ఆడుకో...." అన్నాడు అంతకన్నా ఏం చెప్పాలో తెలీక....
    
    దిగింది ఒడిలో నుంచి "నిజంగా పిల్లాడు చచ్చిపోతాడా అంకుల్?"
    
    "అహ...." అసంకల్పితంగా అన్నాడు "చావకూడదు మున్నీ.....నూరేళ్ళ జీవితంలో యింకా తొలిపుటగానే మిగలాల్సిన ఏ విధ్యార్దీ అలా కడతేరిపోకూడదు."
    
    పాపకి అర్ధం కాలేదు త్యాగిచెబుతున్నదేమిటో కాని అంకుల్ కి అలా చచ్చిపోవటంనచ్చలేదని బోధపడింది.
    
    మరణమనే ఆలోచనలకి అతీతంగా బ్రతికే వయసువేరే బాల్యం అనలేదు. ఆ వయసు పసికందు దాకాచేరిన ఆ వార్తగురించి ఆలోచిస్తూఅన్నాడు....
    
    "నిజంగా చచ్చిపోతాడా" రెట్టించింది.
    
    "లేదుమున్నీ! నేనున్నాగా" ఈ హామీ ఎంత ఆనందాన్ని అందించిందని.

 Previous Page Next Page