Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 3

    "సారి బాస్....మరి మీరిప్పుడు చంపుతానని శపధం చేసిన దీప  ఎవరు?" అడిగాడు వీరూ.

    "మా అన్న గంగుల్ని దారుణంగా కాల్చి చంపిన పోలీసు కమీషనర్ లింగారావ్ ముద్దుల కూతురు....దీప!!" ఆవేశంగా అంటూ పళ్ళు కొరికాడు గజదొంగ మంగులు.

   
                                      *    *    *    *


    అర్ధరాత్రి పన్నెండు గంటలైంది. నిర్మానుష్యమైన ఆ వీధిలో రెండు ఆకారాలు నడుస్తున్నాయ్.

    "నాకేంటో భయంగా వుంది" అంది మొదటి ఆకారం.

    "నా క్కూడా...." అంది రెండో ఆకారం.

    "గుండెల్లో వణుకు పుడ్తుంది" అంది మొదటి ఆకారం.

    "నాకూ అంతే"అంది రెండో ఆకారం .

    "అసలు ఈ రాత్రి   అనేది దేవుడెందుకు కనిపెట్టాడో....మొత్తం పగలే వుంటే బాగుణ్ణు...." ఒక నిమిషం   మౌనం తర్వాత అంది మొదటి ఆకారం.

    "అసలు మన వృత్తికి రాత్రంటే భయపడితే కుదర్దు"అంది రెండో ఆకారం.

      రెండో ఆకారం ఈ డైలాగ్ కొట్టిందంటే ఆ రెండు ఆకారాలూ దొంగలు అని మీరనుకుంటే మీరు ఉప్పులేని పప్పులో కాలేసినట్టే!

    మరి ఎవరు వాళ్ళు?

    మొదటి ఆకారం హెడ్ కానిస్టేబుల్ రాంబాబుదైతే,రెండో ఆకారం హెడ్ కానిస్టేబుల్ చిన్నారావ్ ది.ప్రస్తుతం వాళ్ళిద్దరూ నైట్ డ్యూటిలో,బీట్ లో వున్నారన్నమాట!

    "ఏంట్రా బాబు! అసలు మనం ఇన్ని సంవత్సరాలుగా రాత్రిపూట తిరుగుతున్నాం కదా....అసలు ఒక్క దొంగైనా మన కంటపడ్డాడా ఎప్పుడైనా?" అన్నాడు హెడ్ కానిస్టేబుల్ రాంబాబు.

    "కనబడకపోతే మంచిదేకదా. ఎవడైనా దొంగ కనబడ్డం ఎందుకూ? మనం కాళ్ళు పడిపోయేలా వాడిని వెంబడించడం ఎందుకూ....వాడు మనకి మస్కా కొట్టి తప్పించుకుపోవడం ఎందుకూ?" మనపై అధికారులు మన మొహాలు వాచిపోయేలా తిట్టడం ఎందుకూ...." అన్నాడు చిన్నారావ్.

    "అదీ నిజమేగానీ....ఏ దొంగా కనబడనప్పుడు మనకీ నైట్ డ్యూటి ఎందుకూ?"రాంబాబు వాక్యం పూర్తికాక మునుపే చిన్నారావ్ చెంగున దూకి రాంబాబుని వాటేస్కున్నాడు.

    "నువ్వంత ఆనందంగా వాటేస్కోడానికి నేనేమంత అద్బుతమైన డైలాగ్ ని చెప్పలేదే....ఛ! వదులు. చెమట కంపుతో చస్తున్నాను!" విసుక్కుంటూ అన్నాడు రాంబాబు.

    చిన్నారావ్ రాంబాబుని వదలకుండానే కుడిచేత్తో రాంబాబుని పట్టుకుని ఎడమచేయి చూపుడువేలుతో ఓ దిక్కుకి భయం భయంగా చూపించాడు. 
    
    రాంబాబు చిన్నారావ్ చూపించిన దిక్కుకి చూశాడు.అక్కడ వీళ్ళకి యాబై గజాల దూరంలో....ఓ మనిషి గోడచాటున నక్కుతూ,అటూ ఇటూ దిక్కులు చూస్తూ,మెల్లగా అడుగులు వేస్తున్నాడు.వీధి లైటు కాంతిలో అతను స్పష్టంగా కనిపించాడు.చారల బనీను,గళ్ళాలుంగీతో వున్నాడు.అటు తిరిగి వుండడంచేత అతని మొహం కనిపించడంలేదు.

    "దొంగ...."గుసగుసలాడుతూ రాంబాబు చెవిలో అన్నాడు చిన్నారావ్.

    రాంబాబు మాత్రం గట్టిగా అరిచేశాడు.

    "దొంగ....దొంగ....పట్టుకోండి....పట్టుకోండి."

    చిన్నారావ్ రాంబాబు వంక ఆశ్చర్యంగా చూశాడు."పట్టుకోండి....పట్టుకోండి అని అరవడం ఏంటి?దొంగని పట్టుకోవాల్సింది మనం కదా?"అన్నాడు.

    రాంబాబు నాలుక్కర్చుకున్నాడు.నిజమేకదా!పద పట్టుకుందాం"అని ముందుకు పరుగుతీశాడు. చిన్నారావ్ రాంబాబుని ఫాలో అయ్యాడు.

    కానీ అప్పటికే వీళ్ళిద్దరి గొడవ విన్న ఆ దొంగ పరుగుతియ్యడం మొదలుపెట్టాడు.అంతేకాదు....రాంబాబు దొంగ....దొంగ అని గట్టిగా గొంతు చించుకుని అరిచిన అరుపు గాడనిద్రలో వున్న కాలనీ వాసుల్ని నిద్రమత్తులోంఛి లేపింది.

    ఠకా ఠకా లైట్లు వెలిగాయ్.ధనా ధనా ఇళ్ళ తలుపులు తెరుచుకున్నాయ్.చరచరా ఇళ్ళలోంచి మనుషులు బయటికి పరుగున వచ్చారు.

    అర్దరాత్రి....ఆ కాలనీ వీధుల్లో -ఓ బ్రహ్మండమైన పరుగుపందెం జరిగింది.అందరూ దొంగ వెనకాల పడ్డారు.

    "వీళ్ళంతా బయటికొస్తే వచ్చారుగానీ వీళ్ళు మనకంటే స్పీడుగా పరిగెత్తడం నాకేం నచ్చలేదు!"చికాకుగా అన్నాడు రాంబాబు చిన్నారావ్ తో.

    ఓ అయిదు నిమిషాలు పాటు కాలనీలోని సందులన్నీ పరిగెత్తి జనంనుండి తప్పించుకున్నాడు ఆ దొంగ.కానీ ఓ నాలుగు రోడ్ల కూడలిలో నాలుగువైపులనుండీ చుట్టిముట్టిన జనంనుండి తప్పించుకోలేకపోయాడు.

    అందరూ అతన్ని చుట్టిముట్టి ఏక దంచుడు దంచారు.ఆడవాళ్ళు చీపుళ్ళతో అతని వీపుమీద పుల్లలు విరిగేలా విన్యాసాలు చేయించారు.రాంబాబు,చిన్నారావ్"కొట్టండి,దంచండి,విరగదియ్యండి"అని జనాల్ని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ వాళ్ళు అతని వీపుమీద గుభీ గుభీ అని గుద్దారు.

    రెండు నిమిషాలు దంచుడు కార్యక్రమం తర్వాత "ఇంకచాలు.చస్తాడేమో!" అని జనాన్ని హెడ్ కానిస్టేబుల్ రాంబాబు వారించాడు.

    "చాలు....చాలు....తప్పుకోండి"అన్నాడు కానిస్టేబుల్ చిన్నారావ్.

    జనం ప్రక్కకి తప్పుకున్నారు.

    వీధిలైటు కాంతిలో రోడ్డుమీద వెల్లకితలా చిరిగి పేలికలయిన బట్టలతో పడివున్న అతని మొహం చూసిన రాంబాబు, చిన్నారావ్ భయంతో "కెవ్...."మని కోరస్ గా అరిచాడు.

    ఇంతకీ ఎవరతను....!?

 Previous Page Next Page