Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 3


    "నాథా ఎట్టి ధైన్యపు వాక్యములివి! మీరు దరిద్రులా! ఎవ్వరందురు? పూనా నగరమున మనకంటే ధనవంతులేరి? మీకు ధనమునకై మనయిల్లే కావలయునా? మనముచ్చస్థితిలోనే యున్నామే? ఉన్నతస్థితిలో నున్నప్పుడు వేయి రూపాయలొసగుటకు గదా మీరు నిశ్చయించుకొనిరి! అట్లయిన నదిగో ధన పేటిక! అంది క్షణమున నైదువేల రూపాయలు కలవు! మన మింకను భాగ్యవంతులమనియే విశ్వసింతురా? అదిగో! అట్టాశ్చర్యమొందనేల? మీరు ద్రవ్యార్ధ మెచ్చటకును పోనవసరము లేదు! మన భాగ్యము తిరుగు మొగము పెట్టుచున్నవని నేనొక యుపాయము చేత సముద్ర గర్భమున బడి నశింపనున్న నావ నుద్దరించితి"నని పల్కుచు మన్మథుని గూర్చుండ జేసెను.
    ఇక మన్మథుని యాశ్చర్యమునకు బారమేమున్నది? తన భార్యకాదన మెక్కడిదనియే యతడచ్చెరువొందసాగెను. దరిద్రులగు తాము ధనవంతులమని చెప్పుచుండుట చేత మన్మథుడామెకు పిచ్చిపట్టినదేమోయని యనుకొనెను. అంతలో మాలతి "నాథా! మీరిట్లాశ్చర్య మొందుదురని నాకు తెలియును. ఆశ్చర్యమేల! మనము ధనవంతులమే! ఇట్టి వేయి రూపాయలు మనకింకను గలవు. అమ్మబడినవని నేను పల్కిన మన భూములు కూడ నిజముగా నమ్ముదుకాలేదు.  అవియును మన స్వాధీనములోనే యున్నవి! ఇదంతయు నేను పన్నిన తంత్రము! మిమ్ము మద్యపాన విముఖుల నొనర్చుటకే నేనే నాటకమాడితిని! ఎట్టి చిత్రచర్య నడిపించితినో మీకు తెలియదుకాన వినుడు. అలనాడు మిమ్ములను రోజునకు గొంత పానీయమును ప్రసాదింపుడని ప్రార్దించుట జ్ఞాపకమున్నదా? అప్పుడు మీరు నాకు ధనాగారమును వశ్యమొనర్చిరి. నాటినుండియు నేను మీ కంటే నెక్కుడుగ ద్రాగినట్లు చూపట్టు చుంటిని! ధనమంతయు వేర్వేరు పేటికలలో దాచి మీకు కనబడకుండ జేయుచు నంతయు తరగిపోవుచున్నట్లు చూపట్ట జేసితిని. మీరట్లే తలచి యుండిరి. మన దాసీజనమును కూడా నేనే తొలగించి మనదారిద్ర్యావస్త యెల్లరకును తెలియునట్లో నర్చితిని. ఇన్ని విధముల జేసి పైకినిర్ధనులుగా జూపట్టజేసినను, మనమింకను మహాదైశ్వర్యవంతులమే! మీరీ మధ్యకాలమున వినియోగించిన ధనము పోయినను నదియొక నష్టము కాదు. ఇప్పటికిని మన మాగర్భశ్రీమంతులమే! పోయిన మీ యుద్యోగమునకు గూడ జింతింప నవసరము లేదు. లేఖామూలమున మీసగంతిని మా తండ్రిగారి కెరుంగజేయగా నాయన తన యావచ్చక్తులను వినియోగించి ప్రయాసమొందుచున్నారు. ఇప్పటికి తత్ప్రయత్నములు కొనసాగుచున్నట్లున్నవి మీరుద్యోగమునకు బాట్లుపడకున్న నేనూర కుందునా? కొలది రోజులకే మీరు మరల నుద్యోగము చేయుచుందురు. మన పూర్వపు దినములు మరల లభించును. ఇకనీ మధ్య కాలములో జరిగినదానిని స్వప్నగత వృత్తాంతముగ దలచి మరచిపొండు జస్వంతరాయని కొరకిక మనము చేయగల్గిన దేమి? ఈ రూపాయల గొనిపోయి యాయవశిష్టమును దీర్చుకొనుడు. ఇక మీకు కావలసిన దింతకంటే నేమి కలదు?" అని పల్కుచు ధనమొసంగెను.
    ఆ వాక్యముల నాకర్ణింపగనే మన్మథుని హృదయము ద్రవీభూతమయ్యెను. సుగుణ రత్నాకరమగు తన భార్యను మనస్సులోనే పరిపరి విధముల బొగడుచు మాటాడనేరక బొటనవ్రేలితో నేలను రాయుచుండెను అంతలో తంతివార్తాహరుండొక తంతి గొనివచ్చి మన్మథుని కొసంగిపోయెను. అందాతని యుద్యోగము తిరిగి యెసంగ బడినదనియు నవి సెలవుదినములు కావున సెలవులు ముగియగానే వచ్చిపనిలో ప్రవేశింపవచ్చుననియు నుండెను. ఇక మన్మథుని హృదయస్థితి నేమని వర్ణింపవచ్చును. అతని యంతరంగమునందలి వివిధ భావ పరంపరలు స్తోత్రరూపమున నీదలకు బ్రవహించి మాలతిని ముంచి వైచెను. కొంతవరకు పొగడుట సాగిన పిమ్మట మన్మథరావు భార్య నభినందించుచు ధనము జేకొని వెడలిపోయెను.
    క్షణకాలములో మన్మథుని శుభవార్త నగరమెల్ల వ్యాపించెను. అతడు మద్యపానమును మానివేసెదనని ఘోరమగు శపథమొనర్చెనని యూరెల్ల ననుకొనసాగిరి. పూర్వము వలెనే మన్మథుడు గౌరవపరస్పరముగా నెల్లరిచేత నభినందితుడయ్యెను. ఆనందమందిరము నందలి యతని మిత్రులు మన్మథుని హృదయ పరివర్తనమును మాలతియొక్క యనన్య సామాన్య ప్రవర్తనను నెరింగి తాముకూడ మద్యపాన విముఖులైరి పూర్వమెచ్చట మధురసము విశేషముగ బ్రవహించెనో అట్టి యానంద మందిరమునందే మద్యపాన నిషేధసభ యనెడు సంఘ మప్పుడప్పుడు సమావేశ మగుచుండెను. దానికి మన్మథరావే యధ్యక్షుడయ్యెను. పూనానగరమున నెక్కడ పలుకుబడిగల మన్మథుని వాక్యముల చేత పురమందెవ్వరును. ఎన్నడును. ఎచ్చటను మద్యమును ముట్టుకొనరైరి. సముచిత కాలములో జస్వంతరాయ జ్ఞాపకార్ధమగు వైద్యశాలకూడా నిర్మితమయ్యెను. అందాతని శిలావిగ్రహము ప్రతిష్టింప బడియెను. ఆ వైద్యశాలకు మన్మథరావే శంకుస్థాపన మొనర్చెను.
    భార్యాపుత్రుల తోడ మన్మథరావు మహాద్వైశ్వర్య శోభితుడై సుముఖముగా గాలము గడపెను.
    
                                      --౦౦౦౦--

 Previous Page Next Page