నందిగామ పొలిమేరల్లో లారీ ఆపాడు డ్రైవరు వెనకాల లోడ్ చేసిన గొనె సంచుల మీద పడుకున్న జాన్ గోవింద్ దిగ్గున లేచి కూర్చున్నాడు అతనికి గాడనిద్ర ఎప్పుడూ పట్టదు. ఆ ప్రమాదం పసిగట్టే లక్షణం అతని శరీరంలో ప్రతినరానికి వుంది. ముందుకు వొంగి "యేంధన్నా!" అన్నాడు. అతడికి ఆంధ్రరాష్ట్రంలో చలామణిలో వున్న ఐదారు భాషలు వచ్చు బట్లరి యింగ్లిషు సరేసరి. ఈ భాషలన్నీ సమయానుకూలంగా వాడుకునే చాకచక్యం కూడా వుంది.
"దాహం!" అన్నాడు డ్రైవరు. తల బయట పెట్టి చూసాడు జాన్ గోవింద్. ఆంధ్రదేశపు "పెద్దమ్మ" కల్లుపాక కనిపించింది. మనసులో డ్రైవర్ ని తిట్టుకుంటూ కిందకి దూకాడు. లారీలో మరొక వైపున పడుకున్న క్లినరు గుర్రు పెడుతున్నాడు. ఆతని సుఖ నిద్ర చూసి యిర్ష్య కలిగింది. ఈ జన్మలో అలా నిద్ర పోలేడు అతను.
డ్రైవర్ తో పాటు మరో వ్యక్తీ కూడా కిందకి దిగడం చూసి కళ్ళు చికిలించాడు అనుమానంగా.
"నీలాగె మరో పాసింజరు. విశాఖపట్టణంలో పనికోసం ఎల్తాన్నాడట. విజయవాడ నుంచి మరో లారీ పట్టుకుంటాడంట." వివరించాడు డ్రైవర్ ఆరాటంగా కల్లుపాకలోకి నడుస్తూ. ప్రతికొత్త మనిషిని అనుమానించడంతో మొదలౌతుంది జాన్ గోవింద్ పరిచయం.
"నీపేరేంటి?" అడిగాడు కొత్తమనిషిని.
"గోవింద్ సింగ్ సుబ్బయ్య"
తెల్లబోయాడు జాన్ గోవింద్ విడేవడోతనకి అన్నలాగున్నాడు. మాసి చిరిగిపోయిన కాకి లాగు కాకీ చొక్కా మట్టికొట్టుకుపోయిన ముఖం నిద్రలేని ఎఱ్ఱని కళ్ళు, అమాయకంగా బిత్తర పోతున్నట్లున్న చూపులు. అయితే చూపులను బట్టి బుట్టలో పడడు జాన్ గోవింద్ కావాలనుకుంటే అంతకంటే అమాయకంగా చూడగలడు తను.
"ఏం పని కావాలి నీకు?"
"ఏదో ఒకటి. విశాక రేవులో ఎన్నెన్నో పనులు దొరుకుతాయన్నారు. ఏదో ఒకటి చూసుకుందామని డబ్బులు రావాలి ఏ పనైనా చేస్తాను."
"నీ మాటల్లో సరైన యాస లేదు. ఏం చదివావు?"
"చదవలేదు. పద్నాలుగేళ్ళ వయస్సు దాకా ఓ పెద్దింటిలో పని చేశాను. అళ్ళ మాటలు పట్టుపడ్డాయి.
"అక్కడెందుకు మానేశావు?"
గోవింద్ సింగ్ సుబ్బయ్య సమాధానం చెప్పకుండా ముఖం తిప్పేసుకున్నాడు. జాన్ గోవింద్ ఈల వేశాడు అర్ధమైనట్లు.
"ఎంత?" అడిగాడు.
"ఏమిటి?"
"చోరి- చోరియేనా రేప్ కూడానా?"
గోవింద్ సింగ్ సుబ్బయ్య జాన్ వేపు రెండు నిమిషాలు చూసి భుజాలేగరేసి అన్నాడు. "యాభైవేలు క్యాష్ కాదు బంగారం షాహుకారు బాగానే సొమ్ము చేసుకున్నాడేమో నాకు ముట్టింది యాబై వేలు.
"రేప్ చేసినావిడకి ఎన్నేళ్ళు?"
"అప్పటికి యాభై, ఇప్పటికేన్నో తెలియదు."
పక్కున నవ్వాడు జాన్.
"మనిద్దరి పేర్లలో గోవిందు కామన్ అందుచేత మనం దోస్తులం. నేను నిన్ను సుబ్బయ్య అంటాను నువు నన్ను జాన్ అని పిలు" చెయ్యి జాపాడు జాన్. ఆ చెయ్యి అందుకొని అటూ ఇటూ ఆడించాడు సుబ్బయ్య.
"మనలో మన మాట నీ మీద పోలిసుల చూపులెం లేవు కదా!"
"ప్రస్తుతానికి కేసులెం లేవు. కానీ ఈపోలిసు వాళ్ళని నమ్మడానికి లేదు. దేశం మొత్తం మీద ఎక్కడెం నేరం జరిగినా ఈ పోలీసువాళ్ళ నందరిని గాలించి లోపల పడేసి చావదన్తారు."
"మన అని నన్ను కూడా కలుపుతున్నావెంటి గురూ!"
"లారీలో పడుకుని ప్రతి చిన్న చప్పుడికి ఉలికులికి పడుతున్నప్పుడు నువు నేను ఒకటేనని కనిపెట్టేసాను."
"ఓర్నీ యమ్మ!............"
సుబ్బయ్య భుజం మీద మెచ్చుకోలుగా చేత్తో చరిచాడు. ముందుకు తూలిన సుబ్బయ్య నిలదొక్కుకుని,
"నీకు పుణ్యం వుంటుంది. ఇంత మరీ మెచ్చేసుకోకు" అన్నాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటే డ్రైవర్ తాపీగా కల్లుముంతలు ఖాళీ చేస్తున్నాడు. తాగి రోడ్డు మీద వాహనాలు నడపకూడదని రూల్ వుంది. కానీ అన్నీ వర్గాలలోను యెవరు ఆ రూలు స్ట్రిక్టుగా పాటించరు. మైళ్ళకి మైళ్ళు లారీలు నడిపే డ్రైవర్లు అసలు లెక్కచెయ్యరు.
జాన్ కల్లుపాకలోకి నడిచి డ్రైవరు భుజం మీద చెయ్యి వేసి " ఇంక చాల్లే అన్నా! చాలాదూరం పోవాలి" అన్నాడు డ్రైవరు ఆ చెయ్యి తోసి పారేసి "ఏయ్" అని గట్టిగా అరిచి "నా సత్తా నీకు తేలదు ఏటనుకుంటున్నావో ఇంకో నాలుగు బుడ్లు లాగించినా రయ్ మని నడుపుతాను లారీని" అన్నాడు ముద్ద ముద్దగా.
ఎలాగో నచ్చజెప్పి డ్రైవర్ ని సీట్లోకి చేర్చాడు జాన్. ఈసారి మిత్రులిద్దరూ వెనక్కి చేరారు. తాగుడు మైకంలో వున్న డ్రైవరు, గుర్రు పెడుతున్న క్లినరు దడదడమని సాగుతున్న లారీ చప్పుడు, మిత్రులిద్దరూ నిర్భయంగా మాట్లాడుకోసాగారు.
"నాకోపని తగిలింది. పెద్దపనే తోడుంటే బాగానే వుంటుంది. నువు కలుస్తావా!"
"ఏం పని? ప్రమాదం వుందా?"
"ఎర్రోడా! ఏ ప్రమాదం లేకపోతే మనదాకా యెందుకోస్తాయిరా పన్లు? భువనేశ్వర్ లో ఒకావిడ వుందట. పేరేదో అనువేద అట్టాంటిదేదో ఇదుగో ఫోటో"
పాంటు జేబులోంచి చిన్న అట్టపెట్టె తెరచి అందులోంచి పాస్ పోర్టు సైజు ఫోటో తీసి చూపించాడు. పాతికేళ్ళమ్మాయి , అందంగా నిశ్చితంగా నవుతోంది.
"ఏం చెయ్యాలి యీ అమ్మాయిని. "భయంగా అడిగాడు సుబ్బయ్య.
"నీ భయం దొంగలుదోలా! ఈ అమ్మాయినేం చెయ్యక్కరలేదు. ఆవిడ కూతురుందట పేరు రాగమాల ఆ పిల్ల నేత్తుకురావాలి.
"ఆ చిన్న పిల్ల ఎందుకట?"
"ఆయన్ని మనకెందుకు? మనక్కావలసింది డబ్బు. హైదరాబాదులో జీవన్ బాబు పదివేలిస్తానన్నాడు ఆ పిల్ల నప్పజెప్పితే."