"కానీ నాకు ఒకటే తృప్తి- మా నాన్నగారి హయంలో ఉన్నదంతా ఉడ్చుకు పోయినా, ఇదో , నా ఈ చేతుల్తో ఈ మాత్రం సంపాదించాను. ఇంకా సంపాదించాలి. ఇంకా సంపాదించాలి. మళ్ళీ ఇది వరకటి అంతస్థు చేరుకోవాలి."
లావణ్య దెబ్బతిన్నట్లు చూసింది.
"అంటే నా డబ్బు మీదే నని ఎప్పటికి అనుకోరా?"
"లావణ్యా! అలా తీసుకున్న రోజు జనమంతా ఏమనుకుంటారో తెలుసా? మామగారి డబ్బుతో కులుకుతున్నాడను కుంటారు. మంచి సూటు కుట్టించుకుంటే మామగారు పెట్టాడంటారు. చివరికి కొత్త చెప్పులు కొనుక్కున్నా మామగారి చలవే అనుకుంటారేమో! నేనది భరించలేను. పౌరుషం లేని మొగుడు రావడం నీ కిష్టమేనా?"
"ఇది పౌరుషం కాదు, మూర్ఖత్వం" అంది లావణ్య విసురుగా. "మీరు ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అంటున్నారు. మీరు కోరుకుంటున్న అంతస్థు చేరుకునే సరికి మనకి వయసు దాటిపోతుంది. ఇంక ఎప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేసేది" అంది.
శ్రీహర్ష నవ్వి ఊరుకున్నాడు.
అతను మాట్లాడతాడేమోనని కాసేపు ఎదురు చూసి, తర్వాత తనే మొదలెట్టింది లావణ్య.
"కనీసం ఆ డొక్కు జీపు వదిలేసి కొత్త కారు కొనుక్కుందురూ? పోనీ నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకోండి. అందరూ మీ జీపుని వింత పశువుని చూసినట్లు చూస్తుంటే నాకు చిన్నతనంగా ఉంటుంది."
"ఆ జీపు వచ్చిన రోజు నుంచి నా జీవితం మారిపోయింది. దానితోనే నా చిన్న బిజినెస్ పుంజుకుంది. దాన్లో తిరిగి ఎన్నో కాంట్రాక్టులు సంపాదించాను. అందుకే డొక్కయిపోయినా, దానిమీద అభిమానం నాకు. అంతేకాదు అపురూపమైన నీ పరిచయం కలిగించింది కూడా ఆ జీపే. దాన్ని వదిలెయ్యమంటే ఎలా?"
లైమ్ జ్యూస్ తాగడం ఆపి, పెదాల మీద చిర్నవ్వు లాస్యం చేస్తుండగా, అరమోడ్పు కళ్ళతో ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంది లావణ్య.
* * *
ఆ రోజు...........
నాన్నగారు కలప కొనడానికి అదేదో అడవికి వెళుతుంటే తనూ వస్తానంది.
"నువ్వోద్దమ్మా!ఇబ్బంది!" అన్నారు కుటుంబరావు గారు.
"ఎవరికి! మీకా?" అంది లావణ్య.
నవ్వారాయన.
"కాదు, నీకే"
"నాకేం ఫరవాలేదు"
లావణ్య ఏమన్నా అడగడం, అది జరక్కపోవడం ఆ ఇంట్లో అలవాటు లేదు.
బయటనుంచి హారన్ మోగిస్తున్నారు కుటుంబరావు గారు. ఆయన జీపులో కూర్చుని ఇరవై నిమిషాలు దాటింది.
లావణ్య గోళ్ళకు రంగేసుకుంటోంది తీరిగ్గా.
కుటుంబరావుగారు లోపలికొచ్చి చూశారు.
"ఏం చేస్తున్నావమ్మా?"
"నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను నాన్నగారు!"
"ఆయనకు, నవ్వు, కోపము రెండు కలిసి వచ్చాయి.
"అడవిలోకి వెళ్ళిన తర్వాత గోళ్ళు ఎంత నీటుగా , ఏ రంగులో ఉన్నాయన్న ప్రశ్న ఉండదమ్మ! ఎంత వాడిగా ఉన్నాయన్నదే ముఖ్యం. నీ గోళ్ళు చూడడానికి చిరతలు, ఎలుగుబంట్లు తప్ప ఇంకెవరూ ఉండరక్కడ."
"ఏమో! ఎవరికి తెలుసు?" అంది లావణ్య తలెక్కకుండా బ్రష్ తో సుతారంగా గోళ్ళని మెరుగు పెడుతూ.
తర్వాత అరగంట పట్టింది తను తయారవడానికి.
అమెరికా వెళ్ళినా సరే, అడవులకి వెళ్ళినా సరే, తన పద్దతి ప్రకారం జాగ్రత్తగా ముస్తాబయి వెళ్ళాల్సిందే. చీర నలక్కుడదు. జడలోని ఒక్క వెంట్రుక పక్కకి కదలకూడదు. శుభ్రత!
అమ్మ నేర్పించింది.
అడవి చేరేసరికి పన్నెండయింది.
అక్కడ కంట్రాక్టర్ తో కలప విషయం మాట్లాడి సెటిల్ చేసుకుని అక్కడే భోజనం చేశారు.
చిన్న గెస్ట్ హౌస్ ఉందక్కడ. చుట్టూ దట్టంగా అడవి. పిల్లత కూతలు, కీచురాళ్ళు ఇంకేవో పరుగుల రోద, ఆకుల పచ్చి వాసనా- విచిత్రంగా ఉన్నాయి పరిసరాలు.
భోజనం తర్వాత ఇచ్చిన టిఫిను కల్తి లేకుండా అర్గ్యంగా తయారుచేశారు. గానీ రుచిగా మాత్రం లేదు.
ఒక గంట విశ్రాంతి తీసుకున్న తర్వాత బయలుదేరారు.
జీపు స్తార్టవలేదు.
కాసేపు ప్రయత్నించి స్కార్క్ ప్లగ్ చెడిపోయిందని తేల్చాడు డ్రైవర్.
'ఈ అడవిలో చుట్టుపక్కల ఎక్కడన్నా స్టార్ట్ ప్లగ్గులు దొరుకుతాయా?" అని జోకేయ్యబోయి, కుటుంబరావు గారి ముఖం చూసి చటుక్కున నోరు ముసేసుకుంది లావణ్య.