ఎస్.ఐ. చేతిలోని వైర్ లెస్ సెట్ ని అందుకొని-
పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసాడు.
"డి.సి.పి. శతృఘ్న స్పీకింగ్....ప్లీజ్ సెండ్ క్రేన్ ఇమ్మీడియట్లీ..." అన్నాడు శతృఘ్న ఆవేశంగా.
మరో పావుగంటకు ట్రాఫిక్ క్లియరింగ్ క్రేన్ ఆ ప్రాంతానికి రానే వచ్చింది. చూస్తుండగానే క్రేన్ తన ఇనపపళ్ళతో మారుతీ జీప్ ని టాయ్ లా పట్టుకుని ముందుకు తీసికెళ్తోంది.
జనం ఆ దృశ్యాన్ని చోద్యంగా చూస్తుంటే, పోలీసులు అయోమయంగా చూస్తున్నారు.
ఆ జీప్ ని ఎక్కడకు తీసికెళ్ళాలో, క్రేన్ ఆపరేటర్ కి ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు డి.సి.పి. శతృఘ్న.
హోటల్లోంచి రోడ్ మీదకొచ్చిన సుహాస్ పరుగు పరుగున ట్రాఫిక్ ఐలెండ్ దగ్గరకొచ్చి-
అక్కడున్న ఎస్.ఐ. వేపు చురచుర చూస్తూ-
"మిస్టర్ ఎస్.ఐ. నేనెవర్నో...ఆ జీపెవరిదో నీకు తెలుసా? మర్యాదగా న అజీపుని నేనెక్కడ పార్క్ చేసానో అక్కడ పెట్టించండి. లేదా....నిన్నెక్కడకు పంపించాలో అక్కడకు పంపించాలో అక్కడకు పంపిస్తాను."
"ట్రాఫిక్ కి అడ్డుగా వుంది.... నీకు తెలీదా..." ఎస్.ఐ. జవాబిచ్చాడు.
"ఏరా... నన్ను నువ్వంటావా?" సుహాస్ విసురుగా చెయ్యెత్తాడు.
ఆ చేతిని అడ్డుకున్నాడు ఎస్.ఐ.
రోషంతో ముందుకు కదులుతూ వెంటనే ఎస్.ఐ. షర్ట్ ని పట్టుకొని ముందుకు లాగబోయిన సుహాస్ భుజమ్మీద బలిష్టమైన ఓ చెయ్యి పడింది.
తలతిప్పి చూసాడు సుహాస్.
పులిలా డి.సి.పి. శతృఘ్న!
శతృఘ్నను చూడగానే వారం రోజుల క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది సుహాస్ కి.
"అయామ్ సెర్చింగ్ ఫర్ యూ మిస్టర్ శతృఘ్నా...నిన్ను" ఉద్రేకంగా అరుస్తూ జేబులోంచి పిస్టల్ తీయబోయాడు సుహాస్.
ఏమాత్రం ఉపేక్షించలేదు శతృఘ్న. పిడికిలి మడిచి, ముఖమ్మీద ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకు సుహాస్ చేతిలోని పిస్టల్ ఎగిరి పక్కన పడిపోయింది. సుహాస్ నేలమీద పడిపోయాడు.
ఎక్కడి ట్రాఫిక్ అక్కడ స్తంభించిపోయింది.
కింద పడిపోయిన సుహాస్ బాగీషర్ట్ ని పట్టుకొని బరబరా లాక్కుంటూ ముందుకొచ్చి-
ట్రాఫిక్ ఐలెండ్ మధ్యకు తీసుకొచ్చి నిలబెట్టి-
"ఏరా.... ఈ రోడ్డు నీ ప్రైవేట్ పార్కింగ్ అనుకున్నావురా....ఇడియట్...." పోలీసులు వెర్రివెధవలనుకున్నావా....ఇన్ స్పెక్టర్ మీద చెయ్యెత్తినందుకు...ఆ ఇన్ స్పెక్టర్ కి సారీ చెప్పు!"
శతృఘ్న చేతిలో గింజుకుంటున్నాడు సుహాస్.
"సారీ..... నేను చెప్పాలా డి.సి.పి... జోరు తగ్గించు... నువ్వు కూడా ఆఫ్ట్రాల్ ఓ పోలీసువనే విషయం గుర్తుంచుకో" పొగరు పొగరుగా అన్నాడు సుహాస్.
ఆ మాటకు శతృఘ్న ముక్కుపుటాల నరాలు కంపించాయి. అతని దవడల్లోకి రక్తం సర్రున ప్రాకి వచ్చింది.
"నువ్వేం చేస్తావ్ రా.... ఇడియట్" బలంగా రెండు చేతుల్తో సుహాస్ ని ఎత్తి పట్టుకుని, ఐలేండ్ ఐరెన్ గ్రిల్స్ కేసి విసిరి కొట్టాడు.
దబ్ మని పడిపోయాడు సుహాస్ అరుస్తూ.
"ఇడియట్... ఈ పొలిటీషియన్లకు- ఈ గూండాగాళ్ళకు....పోలీసుల్ని ఇన్ సల్ట్ చెయ్యడం ఫాషనై పోయిందిరా- మిమ్మల్ని వదలకూడదు" కోపం తగ్గేవరకూ కొట్టాడు సుహాస్ ని శతృఘ్న.
శతృఘ్న ఉద్రేకం, ఉద్వేగం తెల్సిన ట్రాఫిక్ ఎస్.ఐ. మధ్యలోకి అడ్డంగా రాబోయాడు. కానీ అతన్నేమాత్రం పట్టించుకోలేదు శతృఘ్న.
మాఫియా వర్గాలన్నీ ఇప్పటికే శతృఘ్న మీద దాడి చెయ్యడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ సమయంలో మళ్ళీ ఇది!
రేపేం జరుగుతుందో ఊహించడానికే భయంగా ఉంది ట్రాఫిక్ ఎస్.ఐ.కి.
బుల్లెట్ వర్షానికి నేలకూలిన చిరుతపులిలా-
నేలమీద పచ్చికలో, నెత్తుటి గాయాలతో పడిపోయాడు సుహాస్-
మాఫియా సామ్రాజ్యానికి రేపటి నాయకుడు!
శతృఘ్న ఒళ్ళంతా తడిసిపోయింది చెమటతో.
ఠీవిగా నడుచుకుంటూ ఎస్.ఐ. దగ్గరకొచ్చి-
"డోంట్ లీవ్ హిమ్! ఫైల్ ఏ కేస్... ఎగనెస్ట్ హిమ్....ఒకే" గుమిగూడిన ప్రజల మధ్యలోంచి తన జీప్ వేపు నడుస్తున్న శతృఘ్న వేపు అంతులేని పగతో చూస్తున్నాడు కింద పడిపోయిన సుహాస్.
* * * * *
జీపు స్టార్ట్ చేస్తున్న శతృఘ్న-
"గురూ! గురూ! అంటూ పరిగెత్తుకొస్తున్న ఆ ఆకారాన్ని చూసి నవ్వాడు.
ఆ వచ్చిన వ్యక్తి కానిస్టేబుల్ కూర్మారావు.
"సిన్మా హాల్లోంచి బయటికి రాగానే స్టోరీ అంతా విన్నాను....చితగ్గొట్టేసావన్న మాట- వాడు బతికాడా- పోయాడా గురూ- నీకు చిన్నప్పుడు ఉగ్గుకు బదులు.... మిరపకాయల రసం.... తాగించారా ఏంటి గురూ చెప్పు" శతృఘన ప్రక్కనే కూలబడుతూ కంగారు కంగారుగా అన్నాడు కూర్మారావు.
"సినిమా కెళ్ళొస్తున్నావా?
జవాబు చెప్పలేదు. శతృఘ్న జీపు ముందుకు దూసుకెళ్ళి పోతోంది.
"పదిరోజుల క్రితం రోడ్డుమీద నడిపించావు కదూ! ఆడు....ఈడికి...బాబవుతాడా.... మావవుతాడా....ఇప్పటికే నీమీద మాఫియా గేంగులకే కాదు....హోంమినిస్టర్ కి, సి.ఎం.కి కూడా పీకలదాకా ఉంది. ఈ టైమ్ లో నువ్వు..."
"అయితే ఏం చేస్తారు....డిపార్ట్ మెంట్ మారుస్తారు....లేదా....ట్రాన్స్ ఫర్ చేస్తారు అంతేకదా.
"నీ మొండి ధైర్యం.... కుక్కలు, నక్కలూ, పిల్లులు తోలా.... నువ్వు....యూనిఫార్మ్ వేసినప్పుడే కాదు.... మఫ్టీలో ఉన్నప్పుడు కూడా పోలీస్ వేనని...అన్యాయాన్నీ, దుర్మార్గాన్నీ సహించవని కోపమొస్తే ఆరో రుద్రుడిలా శత్రువుల్ని చీల్చి చెండాడుతావని అందరూ నిన్ను పొగుడుతారు. నువ్వంటే భయపడతారు... కానీ బాసూ-
స్టేట్ గాని స్టేట్ లో ఊరు కాని ఊళ్ళో ఉంటున్నాం....ఏదో చిన్నప్పుడు....స్కూలు బళ్ళో స్నేహం కొద్ది నన్ను తీసుకొచ్చి....కానిస్టేబుల్ని చేసావ్.... నిజం చెపుతున్నాను గురూ.... అన్ని రోజులూ మనవి కావు" కూర్మారావు గొంతులో ఏదో తెలీని భయం ధ్వనించింది.
కూర్మారావు మొహంలోకి ఒకసారి చూసి-
"ఒరే కూర్మం.... అన్ని రోజులూ మనవి కావు.... కానీ కొన్ని రోజులయినా మనవేగహ్డా....కాకులు కలకాలం బతుకుతాయిరా....ఇడియట్" నవ్వేసాడు శతృఘ్న.
అంతలో ఓ పోష్ కాలనీలోకి జీపు ప్రవేశించింది. మరికొద్ది సేపటికి ఓ గ్రేకలర్ బిల్డింగ్ లోకి జీపు ప్రవేశించింది. పోర్టికోలో జీపునుఆపి లోనికి ప్రవేశించాడు శతృఘ్న.
"ఈ ప్యాకెట్ ను....బామ్మకిచ్చెయ్" చెప్పి పిల్లిలా నడుచుకుంటూ అటూ ఇటూ చూస్తూ హాల్లోకొచ్చాడు శతృఘ్న.
"ఒరేయ్! బామ్మ హాల్లో లేదురోయ్-" హుషారుగా అనుకుంటూ, మెట్లెక్కబోతూ మెట్ల పక్కన స్టోర్ రూమ్ లోంచి బయటకొస్తున్న బామ్మను చూసీ, చూడనట్లు శతృఘ్న మెట్లెక్కసాగాడు.
"ఒరేయ్ బుచ్చీ!" బామ్మ అనసూయమ్మ కేకేసినట్లుగా పిల్చింది.
నన్నేనా...అన్నట్లుగా తల పక్కకు తిప్పి చూసాడు డి.సి.పి. శతృఘ్న.