అధ్యాయం - 6
ఊటీ!!!
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న స్వర్గం తన చేతికి అందబోతోందన్న ఊహే అతన్ని ఒక్కచోట నిలవనీయడంలేదు. ఆ రాత్రికల్లా తను బుక్ చేసిన హోటల్ కి ధరణి చేరుకుంటుందని అతనికి తెలుసు! ఆ అనుభూతిని వూహించుకుంటూ ఉంటేనే శరీరంగాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించింది. ధరణి నడకా, రోషంతో ఎగిసిపడే ముక్కుపుటాలూ, వంపు తిరిగిన పలుచని పెదవులూ, తరచూ గుర్తొస్తున్నాయి.
మరోసారి షవర్ క్రింద నిలబడి స్నానం చేశాడు. ఒళ్ళంతా స్ప్రే చేసుకున్నాడు. ఆ ఫెర్ ఫ్యూమ్ వాసనకి కోర్కెలు పడగవిప్పుకున్నాయి. దొరికిన పూలన్నీ కొని రూం అంతా అలంకరించాడు. వాటి మధ్యలో తననీ, ధరణినీ ఊహించుకుని ఆనందంతో మెలికలు తిరిగిపోయాడు. రాత్రవుతూ వుంటే టెన్షన్ ఎక్కువైపోయింది.
అతని సహనాన్ని పరీక్షించి పరీక్షించి ఎట్టకేలకి ఎదురు చూసిన రాత్రి రానే వచ్చింది. టై కట్టుకుంటూ మరోమారు తన రూపాన్ని తనివితీరా చూసుకున్నాడు.
డై చేసిన జుట్టు నల్లగా నిగనిగ లాడుతోంది. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ధరణిని రిసీవ్ చేసుకోవడానికి బయలుదేరాడు.
* * *
ధరణి రాలేదు!
ఆ వాస్తవాన్ని అతను తట్టుకునే స్థితిలో లేడు. మెదడంతా గజిబిజిగా తయారయింది.
కసిగా పెదవి కొరుక్కున్నాడు.
బాధకి కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి.
నిస్పృహగా హోటల్ కి చేరుకొని తాళం అడిగి తీసుకోబోతూ ఉంటే రిసెప్షనిస్ట్ "మీ కోసం ఓ లేడీ వచ్చింది. మీ రూంకీ అడిగింది. ఆవిడ అక్కడ వెయిట్ చేస్తున్నట్లుంది" అంది.
రావు మొహంలోకి ఒక్కసారిగా వెలుగొచ్చింది. "... వ్వాట్? రియల్లీ" అన్నాడు.
అతని సంతోషాన్ని వింతగా చూస్తూ "ఐయామ్ ష్యూర్ ఎబౌట్ ఇట్" అంది రిసెప్షనిస్ట్.
".... థాంక్యూ" అంటూ, మేఘాల్లో తేలుతున్నట్టు లిఫ్ట్ వైపు పరుగెత్తాడు రావు. రిసెప్షనిస్టు తేలిగ్గా గాలి పీల్చుకుంది. సాధారణంగా గెస్ట్ అనుమతి లేకుండా తాళంచెవి ఇవ్వకూడదు. అయినా, వచ్చినావిడ హుందాతనం చూసి రిసెప్షనిస్టు కాదనలేక పోయింది. దానికి రావు ఆనందించటంతో ఆ అమ్మాయి రిలాక్స్ అయింది.
పై అంతస్థులో లిఫ్ట్ ఆగగానే రావు వరండాలో దాదాపు గుర్రంలా వేగంగా పయనించి, తన గది దగ్గిర నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడు.
తీయటి స్వరం "ఎవరూ?" అని వినపడింది లోపల్నుంచి,
"నేనే"
తలుపు తెరుచుకుంది. ఓ గాజుల చెయ్యివచ్చి అతన్ని లోపలికి లాగింది. గది చీకటిగా వుంది. గదంతా పూలపరిమళం నిండివుంది.
రావు లోపలికి అడుగుపెట్టగానే, రెండు పెదవులు, అతడి పెదవుల్ని ఊపిరాడనివ్వకుండా బంధించాయి.
క్షణంపాటు అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అయితే ఆ బాధకన్నా అతడిని మరింతగా వేధిస్తున్నది మరొకటి వుంది! అది-
"అయోమయం."
ఎంతో రిజర్వ్ డ్ గా, పొంకంగా, గంభీరంగా వుండే ధరణితో - తొలిస్పర్శ గురించి అతడు ఎంతో వూహించుకున్నాడు! చాలా నాజూగ్గా ప్రారంభించి, తన రసికత్వాన్నీ, మేధస్సునీ స్లోగా ప్రదర్సిద్దామనుకున్నాడు!! అందుకే పూలూ గట్రా కొన్నాడు.
పైగా అందర్లాటిది కాదు ధరణి అనుకున్నాడు. (అది ఈ క్షణం నిరూపించాబడింది. కానీ, అతననుకున్న విదానంలో కాదు.) ఎవరిలోనూ కనపడని ఈ ఫాస్ట్ నెస్ ధరణిలో అతడు వూహించలేదు. అందుకే అతడి మెదడు మొద్దుబారినట్లు అనిపించింది.
రెండు నిముషాల తరువాత కానీ అతడి జ్ఞానేంద్రియాలు స్పృహలోకి రాలేదు. అలా వచ్చాక తెలిసిన మొదటి విషయం- తన చేతులు దూరంగా వున్నాయని! చేతులు దూరంగా వుండటంలో ఆశ్చర్యం లేదుగానీ, అవి ఒక అమ్మాయిని చుట్టుముట్టినప్పుడు- దగ్గిరగా బిగుసుకోవాలి కదా!
ప్రయత్నించి చూశాడు. వేళ్ళు దగ్గరికి రాలేదు. అప్పుడు వచ్చింది అనుమానం- తన చేతుల మధ్యవున్న కాయపు పరిమాణం గురించి!
ఆమెనించి విడివడి, లైటు వేసాడు.
ఎదురుగా సుకుమారి వుంది.
* * *
అతడా షాక్ నుంచి తేరుకునేసరికే, ఆమె అతడికి మరొకసారి చేరువైంది.
అతడు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసాడు.
"పిలిచి మరీ బెట్టు చేస్తున్నావేం? మిస్టర్ రావ్.. యూ ఆర్ టూ నాటీ!" అంటూ అతన్ని గట్టిగా వాటేసుకుంది.
రావుకి ఫెళఫెళమన్న చప్పుడు వినిపించింది. అది తన పక్క టెముకల మూలుగని తర్వాత తెలిసింది.
"ఫోన్లో ఊటీ రమ్మని పిలిచి..... ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేసీ....ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఈ వేషాలేంటీ!" అతని చెవి కొరుకుతూ అడిగింది.
"ఫోన్లోనా? మిమ్మల్నా?" రావు నిర్ఘాంతపోయాడు.
"నాతో స్వయంగా చెప్పావు. నేను వెంటనే 'ఐయామ్ వెరీ వెరీ హేపీ!' అనలేదూ..." గుర్తు చేసింది సుకుమారి.
రావుకి జరిగిన సంగతి అర్ధమైంది. ధరణి బదులు ఈవిడ తీసిందన్నమాట ఆ ఫోన్. సమయానికి ఆ వెధవలు ఆ డ్రాయింగ్ షీట్ పట్టుకుని అడ్డు రావడంవల్ల తనతో మాట్లాడింది ధరణే అనుకుని మురిసిపోయాడు. అతడు ఆ విధంగా ఆలోచిస్తూ వుండగా-
"కమాన్. డార్లింగ్ నీకింత మంచి టేస్ట్ ఉందని నకు తెలియనే తెలియదు" అంటూ సుకుమారి అతన్ని ఊరిపి ఆడకుండా నలిపెయ్యసాగింది.
కౌరవసభలో ద్రౌపదిలా తనను రక్షించే దిక్కు ఎవరా అని నలుదెసలా చూశాడు. లాభం కనిపించలేదు.
"వన్ మినిట్... ఇప్పుడే వస్తా..." అని వెనుదిరిగాడు.
"ఊహూ! నేను వదలను..." అని నవ్వింది.
"అర్జెంట్!" వేలు చూపించాడు.
"అయితే సరే. త్వరగా వచ్చెయ్యాలి సుమా!" అని గట్టిగా చెంప కొరికి అతన్ని వదిలిపెట్టింది.
రావు బాత్ రూమ్ దగ్గిర ఒక్కక్షణం ఆగి, గుండెల్నిండా గాలి పీల్చుకున్నాడు.
ఆమె తనని గమనించటం లేదని నిశ్చయించుకున్నాక, శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకుని చటుక్కున తలుపు తెరిచి బయటకు దూకాడు.
ఆమె అది గుర్తించి వెంతబడే లోపులో క్రింద సెల్లార్ లోకి వెళ్ళి, కారు స్టార్ట్ చేసి ఒక్క ఉదుటున ముందుకు దూకించాడు.
ధరణితో కలిసి ఊటీలో తిరుగుదామని తెచ్చుకున్న కారు ఆ విధంగా ఉపయోగపడింది. అలా చాలాదూరం వచ్చేసేక, తను వున్నది తమిళనాడులోనో కర్ణాటకలోనో అర్ధంకాక కారు ఆపి క్రిందికి దిగాడు.
ఒక్కసారిగా చల్లటిగాలి వంటిని చుట్టుముట్టి వణికించింది.
ఊటీ చలి అది!
తను ఎక్కడికి వచ్చాడో అతనికి అర్ధంకాలేదు. చుట్టూ అంధకారం మనుష్య సంచారం లేదు! అంతా అడవి.
వెనుకనుండి ఓ కారు వస్తూ కనిపించింది.
"హెల్ప్... హెల్ప్!" రావు చేతులు ఊపుతూ కారుకి ఎదురెళ్ళాడు.
కారు ఆగడం, తలుపు తీసుకుని ఆ శాల్తీ బయటికి వచ్చి రావుని చుట్టేయడం తృటిలో జరిగిపోయింది.