Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 28

 

     శ్రీధర్ పెదవి విరిచి 'ఏమో!' అన్నట్లు చూశాడు.
   
    ధరణికి ఆ భావం అర్ధం కాలేదు.
   
    సమాధానం, అయిదు గంటల తరువాత దొరికింది.
   
    తెల్లవారుఝామున అయిదింటికి నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. చందూ అప్పటివరకూ అక్కడే వున్నట్టున్నాడు. ఒకే ఒక వాక్యం చెప్పి ఫోన్ పెట్టేశాడు.
   
    "ప్రియ ఇక లేదు."
   
                                           4
   
    బూరెల్లాంటి పెద్ద పెద్ద బుగ్గలేసుకుని అందంగా బొద్దుగా ఉండే ప్రియని నిర్జీవంగా చూడడానికి ధరణికి ధైర్యం చాలలేదు. నీలూ దుఃఖం వర్ణించనలవికాదు. ఒక్కపాప అయితే కంఫర్టబుల్ గా పెంచచ్చు అని తల్లి ఫ్యామిలీ ఫ్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించేసుకుంది. ఆ ఒక్క పాప వాళ్ళ ముద్దు ముచ్చటలన్నీ మూన్నాళ్ళల్లో పూర్తిచేసుకుని వెళ్ళిపోయింది.
   
    ప్రియ హఠాత్ మరణం వెనుకవున్న కారణం ధరణికి అర్ధం కాలేదు.
   
    పిల్లలు చాలాసార్లు స్కూల్ కి వెళ్ళమని మారం చేస్తారు. మంకుపట్టు పడతారు. కారణం, చెప్పమంటే చెప్పరు. తల్లిదండ్రులు తిట్టీ బెదిరించీ బలవంతంగా స్కూల్ కి పంపేస్తారు. అరిచే తల్లితండ్రులూ, ఇసకలో నీల్ డౌన్ చేయించి, బెత్తాలతో కొట్టే టీచర్లూ, వాళ్ళ కళ్ళకి రాక్షసుల్లా కనిపిస్తారు. ఆ రాక్షసుల మధ్య బ్రతకలేమోననే భయంతో బెంగపడి జ్వరం తెచ్చేసుకుంటారు. తిట్టీ, కొట్టీ బెదిరించీ కాకుండా కాస్తంత ఓర్పుతో, మరింత సహనంతో మెలిగితే వారి మనోభావాలు, శంకలు తెలుసుకోవచ్చు!
   
    ఓ చిన్న పాపని, దార్లో ఉన్న శ్మశానం స్కూల్ కి వెళ్ళనీయకుండా భయపెడుతుండవచ్చు. ఆమె ఆ విషయం పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు అర్ధం చేసుకోకుండా బలవంతంగా ఆ దారినే పంపడం వలన పాప భయంతో, హెలూసినేషన్స్ కి లోనయి ప్రాణాలే కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఇంకొక పిల్లవాడికి ఫలానా టీచర్ అంటే భయం, అయిష్టం ఏర్పడి ఈ పరిస్థితి రావచ్చు. 'పిల్లలు ఏడిస్తే, భయపడినట్లు కనిపిస్తే తల్లిదండ్రులు వాళ్ళ ఫీలింగ్స్ ని కొట్టి పారెయ్యకుండా అర్ధం చేసుకుని ఆ సమస్యల్ని పరిష్కరించాలి' అనుకుంది ధరణి. నీలూతోటే ఆ రోజంతా వుండిపోయింది.

    శ్రీధర్ లీవ్ పెట్టి పూజని చూసుకున్నాడు. పూజకి మర్నాటికి జ్వరం బాగా తగ్గిపోయింది. ప్రియ మరణం సంగతి పూజకి తెలియనీయలేదు. ఆ రోజు అన్నం కలిపి తినిపిస్తూ ఉండగా "మమ్మీ...ప్రియ హాస్టల్ లో ఉందా, ఇంట్లో ఉందా?" అని అడిగింది పూజ.

    ధరణికి గుండె ఆగి కొట్టుకున్నట్లయింది. "ఎందుకమ్మా?" అంది.
   
    "ప్రియని చూడాలి."
   
    "ఎందుకూ?" సందేహంగా అడిగింది. పూజ మాట్లాడలేదు. అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ వారంరోజులూ పూజ పరిస్థితి అలాగే వుంది. ఎవరితో మాట్లాడదు. తను అడగదలుచుకున్నవి అడుగుతోంది కానీ ఎదుటివాళ్ళు అడుగుతున్న వాటికి జవాబులు చెప్పడంలేదు!
   
    "ప్రియ గురించి దీనికి అనుమానం వచ్చినట్లుంది" అంది ధరణి.
   
    "దానిముందు ఏమైనా మాట్లాడావా?" అడిగాడు శ్రీధర్.
   
    "లేదే?"
   
    "ఏమో! జాగ్రత్తగా ఉండు, అసలే వీక్ గా వుంది" అని ఆఫీసుకి వెళ్ళి పోయాడు శ్రీధర్.
   
   
   
                                                            -- * * * --

 Previous Page Next Page