Previous Page Next Page 
హృదయాంజలి పేజి 27

        "మీరు రచయిత్రులా?"
 
    అపురూప సంభ్రమంతో అడుగుతూంటే ఆవిడ ముఖం ఒక వెలుగు వెలిగింది.

    "అప్పుడప్పుడు పత్రికలకి చిన్న చిన్న కథలు వ్రాస్తుంటాను."
 
    "ఇక మీకు నేను చెప్పేది ఏముంది మేడమ్? మా శ్రమ మీబోటి వారే గుర్తించకపోతే......"
 
    "చెప్పాను కదమ్మా! వాళ్ళ చేత మీ పేపరు కొనిపించమని!" అప్పటికే విసిగిపోయినట్టు ఇక లేస్తావా అన్నట్టు చూసిందావిడ.
 
    ఇంకొక్క క్షణం ఉన్నా సిగ్గులేని తనమనిపించుకొంటుందని ఆ ఇంట్లోంచి బయటపడింది అపురూప.
    మరో ఇంటి గుమ్మంలో మరో అనుభవం! వాళ్ళింటికి మరో పత్రిక వస్తుందట కాని, పత్రి చదివే తీరికే ఉండదట ఆ ఇల్లాలికి. పిల్లల్ని తయారు చేసి కాన్వెంటుకి పంపడం, భర్తకు భోజనం పెట్టి ఆఫీసుకి పంపడం, తరువాత సింక్ నిండా పడిన అంట్లన్నీ తోముకోవడం, మోపెడు బట్టలుతుక్కోవడం, అలసిసొలసి అలా నడుం వాల్చగానే మళ్ళీ కాన్వెంటు నుండి పిల్లలు, ఆఫీసు నుండి భర్తా....పాపం........ఆవిడకి పేపరు చూసే తీరికే ఉండదట! "మా ఇంటికి ఈనాడొచ్చినా ఒక్కటే! ఉషోదయం వచ్చినా ఒక్కటే! చదివే తీరికే లేనప్పుడు ఏ పత్రికైతేనేం" అందామె ఇంకో మాట మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా    ఇంకో ఉద్యోగస్తురాలు తమ ఇంటికివచ్చే పత్రిక హెడ్ లైన్స్ చూసి వదిలేస్తుందట!

    "పత్రికంతా చదవడానికి ఏముంటుంది? పేపరు తెరిస్తే చావులూ . హత్యలేకదా? ఇక్కడింత మంది చచ్చారు, అక్కడింతమంది చచ్చారు అనేకదా?"

    "అలా చదివి బరులెక్కిన మనసును తేలిక చేసుకోవడానికి మా ఉషోదయం మంచుజల్లులాంటి ఓ నవలా సీరియల్ నూ, ఓ మంచి కథనూ కమ్మని కవితనూ ఓ గ్రంధ విమర్శనూ ఇస్తుంది ఒక పేజినిండా . ఉషోదయం చదివి చూడండి మేడమ్! మీకే తెలుస్తుంది"
 
    "ఆఁ అవన్నీ చదివే తీరికెక్కడిదమ్మా? ఇంట్లో చేసుకొని ఆఫీసుకు వెళ్ళేదాన్ని. తిరిగొచ్చే సరికి చీకటి పడుతుంది. ఆ కాస్త టైంలో టీవి ప్రోగ్రాములు చూడ్డంతో సరిపోతుంది. మళ్ళీ రాత్రి వంటా వార్పూ ఉండనే ఉంటాయి!"

    న్యూస్ పేపరు చదివే అభిరుచి మగవాళ్ళలో పెరిగినంతగా ఆడవాళళలో పెరగలేదు. చాలా మంది విద్యావంతులు, ఉద్యోగస్తురాండ్రే పేపరు ముఖం చూడరు. చూసినా హెడ్ లైన్స్ చూసి వదిలేస్తారు. ముఖ్యంగా తీరికలేని కారణం ఒకటి, అభిరుచి లేకపోవడం రెండవది.  "వంట చేస్తూ ఓ చెవి అటుపారేస్తే టి.విలో రేడియోలో వచ్చే వార్తల వల్ల దేశవిదేశాల్లో ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంటుంది కదా?" అన్నారు కొందరు.

    ప్రజల్లో చదివే ఓపిక తగ్గి ప్రపంచంలో ఒకనాటికి ఈ వచ్చే పత్రికలన్నీ అంతరించిపోయి , వాటి స్థానంలో ఆడియోలు, వీడియోలు ఆక్రమిస్తాయని ఆ మధ్య ఒక పత్రికలో రాయడం గుర్తువచ్చింది. అపురూపకు.

    చాలావరకు మగవాళ్ళకు, ఆడవాళ్ళకు తీరిక ఉండడం అనేది తగ్గిపోయింది.

    చదవాలన్నా, చదివే అభిరుచిని పెంచుకోవాలన్నా తగినంత తీరుబాటు ఉండాలి.
 
    అపురూప పది రోజులు తిరిగనా పట్టుమని పది మందిని కూడా చందా దారులుగా చేర్చలేకపోయింది.

    "పది రోజులు తిరిగినా పదిమంది చందాదారుల్ని కూడా చేర్పించలేక పోయాను సార్! నేను పత్రిక్కి రిప్రెజెంటేటివ్ గా పనికిరానని పిస్తూంది!" ఒకరోజు నిస్పృహగా అంది ఎడిటరు గారితో.

    "ఏం జరిగింది? ఎందుకంత నిస్పృహ?"

    "లోక్లాస్ వాళ్ళు అసలు పేపరు కొనరు. హై క్లాసువాళ్ళు పేపరు కొంటారుగాని తెలుగు పేపరు కొనరు."

 

       "వాళ్ళకి తెలుగంటే ఎలర్జీకదా? నాకు తెలుసమ్మా! ఇండియాలో ఉంటా ఫారినర్స్ లా జీవిస్తారు వాళ్లు. ఇండియాలో ఎందుకు పుట్టామా అని ఏడుస్తారు. కాని, ఫారిస్ లో వుండే తెలుగువాళ్ళ కథ వేరేగా వుంటుంది తెలుసా? మన కల్చరు, మన పండుగలు, మన భాష, మన ఆవకాయ, వాళ్ళకెంతో అపురూపం. క్యాసెట్లు పెట్టి సత్యనారాయణ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలూ చేసుకొంటారు. మన ఉగాదికి మరువకుండా పచ్చడి తింటారు. నాకు తెలిసిన మిత్రుడొకడున్నాడక్కడ! పరమ నాస్తికుడు! పూజలు లేవు! పండుగలు లేవు! ఏం లేవు! వాడి కొడుకూ కోడలు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళమ్మాయి సమర్తాడితే అమెరికా అంతా తెలిసేలా పేరంటాళ్ళని పిలిచి, దళియం పరిచి పేరంటం చేశారు. ఆ ఫోటోలు వీడియో క్యాసెట్లు తాతగారికి, నాన్నమ్మగారికి పంపారు. ఫోటోలు ఆల్బంలో పెట్టుకోమని, వీడియో టివిలో పెట్టి చూచుకోమని! సూర్యుడు పశ్చిమాన క్రుంగినా తూర్పున ఉదయించాల్సిందేనన్న సత్యం చాలామంది మరిచిపోతారు ఏ జాతికైనా సంస్కృతీ సంప్రదాయాలు జీవధారలు. వాటిని బ్రతికించుకోలేకపోతే మనం చచ్చిపోయినట్టే లెక్క!"


    "నాకు మీ పత్రికలో ఇంకేదైనా ఉద్యోగం ఇవ్వండి, సర్!"


    "ఎలాగో ఈ నెల పూర్తిచెయ్యి! రిపోర్టరుగా తీసుకొంటాను! జర్నలిజంలో డిప్లొమా చేశావంటే సబ్ -ఎడిటర్ గా తీసుకొంటాను"


                                            *    *    *


    అందం, ఆడంబరంలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నట్టుగా ఉన్నాయి, ఆ కాలనీలో ఇళ్లు.

 Previous Page Next Page