Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 28

    "ఏం లేదన్నయ్యా. మిమ్మల్నందరినీ ఓసారి చూడాలనిపించింది. వచ్చాను. ఓ రెండురోజులుంటాను. డ్రైవరుని కారు తీసికెళ్ళి ఓ నాలుగు రోజుల తరువాత రమ్మంటాను." అన్నట్టే డ్రైవరుకి భోజనం పెట్టించి, నాలుగు రోజుల తరువాత రమ్మని చెప్పి పంపింది.

    ఆ రోజంతా అన్యమనస్కంగానే గడిపింది గీతాభవాని.

    మరునాడు ఉదయానికల్లా స్నానంచేసి తయారై తల్లితో, వదినతో చెప్పింది. "నేను హైదరాబాద్ వెడుతున్నాను! అక్కడో స్నేహితురాలిని కలుసుకొని రేపటివరకు తిరిగి వస్తాను. అన్నయ్యతో చెబుదామంటే నిద్రపోతున్నాడు. లేచాక చెప్పు, వదినా."

    "నీ దంతా చోద్యమే అయిపోయిందే, తల్లీ! ఇలా వెళ్ళదలుచుకొన్నదానివి కారు ఎందుకు పంపేశావు?" అంది తల్లి. "ఒక్కదానివీ ఈ వెళ్ళడమేమిటి? అల్లుడికి చెప్పావా?"

    "చెప్పలేదు. ఇక్కడికి వచ్చేదాకా వెళ్ళాలనుకోలేదు కాబట్టి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపడ్డానంటే బయటపడడం మామూలు కాదు. ఇప్పుడే వెళ్ళి వద్దామనుకొంటున్నాను."

    గీతాభవాని ఇలా హఠాత్తుగా ప్రయాణం కావడం ఆమె వదినకు కూడా అసందర్భంగా కనిపించినట్టుంది. భర్తతో చెబుదామని గబగబా గదిలోకి వెళ్ళిందిగాని, అతడు నిజంగా మంచి నిద్రలో ఉన్నాడు.

   
                                *    *    *

    ట్రెయిన్ ఆగడంతో గతంలోంచి బయట పడింది గీతాభవాని.

    ఏదైనా స్టేషన్ ఉందేమోనని గీతాభవాని తలబయటికి పెట్టిచూసింది అంతా అడవి. ట్రెయిన్ లోంచి ప్రయాణీకులు దిగి గోలగా అరుస్తున్నారు. కంపార్టుమెంటులోని జనమంతా లేచి ఏమిటేమిటని ప్రశ్నించుకోసాగారు.

    ఒకాయన దిగి వెళ్ళి తెలుసుకువచ్చాడు. ఎవరో ట్రెయిన్ క్రిందపడి చచ్చారట. మనుషులెందుకిలా బలవంతంగా చచ్చిపోతారు? భరించలేని అవమానం కలిగినప్పుడో, భరించలేని దుఃఖం కలిగినప్పుడో.

    తనెందుకు ఆపని చేయలేకపోయింది? తను పొందిన దుఃఖం, ఎదుర్కొన్న అవమానం మామూలుది కాదు. అంత దుఃఖంలోనూ, అంత అవమానంలోనూ, చావాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. వచ్చి వుంటే మరో ఇద్దరు బిడ్డలకు తల్లి అయేందుకు గీతాభవాని బ్రతికిఉండేది కాదు.

    గంట తరువాత ట్రెయిన్ కదిలింది.

    గీతాభవాని ఒక నిట్టూర్పు విడిచి ట్రెయిన్ లోంచి బయటికి చూడసాగింది నిర్లిప్తంగా.

   
                                           9

    జీవితంలో వేయిపడగాడ్పులు తిన్న మనిషిలా వాడిన ముఖంతో ఇంటికి చేరుకొంది గీతాభవాని. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి నీరసంగా పడుకొంది, ఎవరు ఏం ప్రశ్నిస్తున్నా జవాబు చెప్పకుండా.

    కొంచెంసేపటి తరువాత వామనరావు వచ్చాడు. "ముందు నువ్వు స్నానంచేసి భోజనం చెయ్యి....నువ్వు హైదరాబాద్ ఎందుకు వెళ్ళావో నేను ఊహించగలిగాను. నువ్వు పొరపాటుపని చేస్తే అప్పటిలా తట్టుకొనే శక్తి ఈ గుండెకి లేదమ్మా. వెళ్ళు. భోజనం చేశాక నాగదిలోకి రా! నీతో మాట్లాడాలి." మెల్లిగా చెప్పి తనగదిలోకి వెళ్ళాడు.

    గంట తరువాత గీతాభవాని అన్నగారి గదిలోకి అడుగుపెట్టింది.

    "తలుపు గడియవేయి, గీతా!"

    గడియవేసి వచ్చి వామనరావు మంచానికి దగ్గరగా కుర్చీలో కూర్చొంది.

    "ఇక చెప్పు. నీ కూతురు బాగుందా?"

    అన్నగారి గొంతులో వినిపించిన కాఠిన్యానికి గీతాభవాని కళ్ళలో కన్నీరు తిరిగింది. గాద్గదికంగా అంది, "అన్నయ్యా! అమ్మ నన్ను తొమ్మిది నెలలు కడుపులో మోస్తే, నువ్వు నేను చేసిన తప్పును ఇరవైసంవత్సరాలుగా కడుపులో పెట్టుకు మోస్తున్నావు. నువ్వు నాకు తల్లికంటే, తండ్రికంటే ఎక్కువ, అన్నయ్యా!"

    చెల్లెలి పరిస్థితి దయనీయంగా ఉన్నా అతడికోపం తగ్గలేదు!

    "ఆ పిల్లను పెంచడానికి తీసుకొన్నతడిభార్య చనిపోయింది! అతడు పోవడానికి సిద్దంగా ఉన్నాడు. ఆ సంగతి పేపరులోప్రకటించి ఆ పాప తాలూకు వాళ్ళెవరైనా వచ్చి ఆమె బాధ్యత స్వీకరించమని కోరాడు. బిడ్డ అనాధ అవుతూంటే ఏ తల్లిగుండె ఊరుకోగలదన్నయ్యా?"

    "తల్లిగుండె సంగతి బిడ్డ పుడుతూనే ముళ్ళకంపలోకి విసిరేసిన తల్లిదగ్గరే తెలుసుకోవాలి." ఈసడింపుగా అన్నాడు. "పేపరులో ప్రకటన నేనూ చూశాను! అది నాకు జ్యోతి, స్వాతిలాంటిదే! కాని 'నా మేనకోడలు' అని ఎవరికైనా చెప్పుకోగలవా? ఈ సమాజ మర్యాదకోసం రక్తపాశాన్ని కూడా మట్టిలో కలపాల్సిందే...ఆ పిల్లను తీసుకురావడానికి వెళ్ళావా?"

    ఔనన్నట్టుగా తలూపింది.

    "తీసుకువచ్చి ఆ పిల్ల నీకేమవుతుందో అందరితో చెప్పాలను కొన్నావా?"

    "ఉహుఁ."

    "మరి?"

    ఏమనుకొని వెళ్ళిందో చెప్పింది. అక్కడ ఆ పిల్ల చిరుతపులిలా తన పైకి లేవడం, తనని గాయపరచడం అంతా చెప్పింది.

    "నా బిడ్డ అన్న మమకారం నీలో కొట్టుకుపోతూంది! కాని, ఆ పిల్లకు? నువ్వు తనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటూంది కదూ?"

    "అవును."

    "ఇంకా ఆ పిల్లమీద ఈ మమకార మేమిటి? నీ మమకారం గుమ్మరించడానికి నీకు ఇంకా ఇద్దరు బిడ్డలున్నారు. ఈ బిడ్డల భవిష్యత్తు కోసమైనా ఆ బిడ్డను మరిచిపో!"
   

 Previous Page Next Page