"అలాగే, మమ్మీ! నీ సంతోషం కోసం మేం త్యాగం చేసేస్తున్నాం! ఇక్కడే ఉండిపోతున్నాం!" స్వాతి త్యాగమయి ఫోజు పెట్టి గంభీరంగా అంది.
గీతాభవాని ఫక్కున నవ్వింది. స్వాతిని మరో చేత దగ్గరికి తీసుకొని ఆ పిల్ల బుగ్గమీద ముద్దు పెట్టుకొంది! ఇద్దరి బిడ్డల మధ్య నిండుగా, మాతృమూర్తిగా కనిపిస్తున్న గీతాభవాని అంతరంగంలో మరో బిడ్డ కోసం ఆవేదన చెందుతూందని, తీరని అసంతృప్తితో కుములుతూందని ఎవరికి తెలుసు?
జ్యోతి సూట్ కేస్ తీసికెళ్ళి కారులో పెట్టింది! స్వాతి శాలువా తెచ్చి తల్లి భుజాల చుట్టూ కప్పింది.
భర్తకు కళ్ళతోనే వీడ్కోలు చెప్పి కారులో ఎక్కి కూర్చుంది గీతాభవాని.
గిరిధరం ఏదో మరిచిపోయిన వాడిలా గబగబా కారు దగ్గరికి వచ్చి మెల్లని స్వరంతో అన్నారు: "రెండురోజుల్లో వచ్చేస్తావు కదూ?"
"రెండు రోజులేనా?" కొంచెం సిగ్గుపడుతూ చూసింది.
"ఆఁ. అంతే. నువ్వు ఇంట్లో లేకపోతే నాకు ఎలాగో ఉంటుంది!"
అరవయ్యేళ్ళ గిరిధరంగారిలో పాతికేళ్ళ పడుచువాడు తొంగి చూస్తూ ప్రేయసి కోసం విరహతాపం పడుతున్నవాడిలా కనిపించారు.
ఆయనకు సరిజోడులా గీతాభవాని ముఖం అరుణరాగ రంజితమైంది. కళ్ళు వాల్చుకుని ముగ్ధలా తలాడిస్తూ, "అలాగే వస్తాను." అంది.
డ్రైవరుతో, "కారు పోనీయ్" అన్నారు గిరిధరంగారు.
కారు కదిలిపోతుంటే భర్త, ఇద్దరు పిల్లలు, వెనుక వంటమనిషి నౌకర్లు చెయ్యూపుతూ కనిపించారు! వాళ్ళు కనుమరుగు అయ్యేంతవరకు చేయ్యూపుతూనే ఉంది గీతాభవాని.
వీడ్కోలిచ్చే వాళ్ళలో ఇంకా ఇద్దరు తక్కువున్నారు! వాళ్ళు తన మనుమడూ, మనుమరాలూ! వాళ్ళు మొన్నే మేనత్త ఊరికి వెళ్ళారు బడికి సెలవులున్నాయని!
తన వైవాహిక జీవితం యాంత్రికంగా గడిచిపోతుందనుకునేది! తన మనసు ఈ బంధాలన్నిటికీ అతీతంగా సంచరించే దనుకొంది. కాని, తనకు తెలియకుండానే ఈ ఇరవై ఏళ్ళలో ఏవో బంధాలల్లుకుపోయాయి. తన పిల్లల్ని చూచుకొంటే ఏదో ముచ్చట. ఆయన అనురాగంలో తన మనసు పొందే స్పందన మిధ్య కాదు! తనకు తెలీకుండానే తను మారిపోయిందా! వాళ్ళందరినీ వదిలి ఇలా ఒక్కతే బయల్దేరడం ఎలాగో ఉన్నా తనకి తప్పని పరిస్థితి!
* * *
"పిల్లల్ని తీసుకురాకుండా ఒక్కదానివే వచ్చావేమే?" ఒక్కతే వచ్చిన కూతుర్ని చూసి విడ్డూరంగా అడిగింది గీతాభవాని తల్లి.
"వాళ్ళూ వస్తామన్నారు! అందరం వచ్చేస్తే ఎలా అని వాళ్ళను అక్కడే ఉంచేసి వచ్చాను!"
"ఏమిటో! ఒక్కనాడూ మగడితో, పిల్లలతో ముచ్చటగా కలిసి వచ్చినదానివి కాదు!" తల్లి విచారంగా అంది. "నా వెర్రికాకపోతే మీది ముచ్చటయిన జంట అయితే కదా? రత్నంలాంటి పిల్లను రెండో పెళ్ళి వాడికి ఇచ్చాడు మీ అన్న. వాడి నెత్తిన ఏ శని కూర్చొని రాజ్యమేలిందో?"
"నా పిల్లలు పెళ్ళీడుకొచ్చారు! ఇంకా విచారమేనా మా ఈడూ జోడు గురించి?" అంది గీతాభవాని. ఆ వయసు తేడా గురించి తనకేం విచారం లేదన్నట్టుగా!
"జ్యోతిని మీ ఆడబిడ్డకొడుక్కివ్వడం ఖాయమేనా?"
"ఇంకా ఖాయం అనుకోలేదు. మీ అల్లుడు మేనల్లుడికివ్వక పైవాడికిస్తారా? పెళ్ళిమాటలు జరపడానికి ఇప్పుడేం పెళ్ళి చెయ్యడం లేదుగా? అదింకా చదువుకోవాలంటూంది?"
"నువ్వూ ఒకనాడు చదువుకొంటానని పట్టుబట్టి, ఊరువిడిచి వెళ్ళిన దానివే! చివరికి ముసలి మగడిని సంపాదించుకొన్నావు!"
"నా పెళ్ళి ఆయనతో రాసి ఉంది! అయింది! ఇప్పుడు నాకేం తక్కువైందని? నేను సంతోషంగా ఉన్నానమ్మా! చూడు, నా ముఖంలో ఏమైనా దిగులు కనిపిస్తూందా?"
లోపలినుండి వదిన వచ్చింది "బాగున్నావా, గీతా? లే, కాళ్ళుకడుక్కో. మేమే నీకు కబురు చేయాలనుకొన్నాం! నువ్వే వచ్చావు!"
"ఏమిటి, వదినా?"
"మీ అన్నయ్యకి నిన్న హార్ట్ ఎటాక్ వచ్చింది చాలా భయమేసింది. డాక్టరు వెంటవెంటనే అయిదారు ఇంజక్షన్సు చేశాడు. భగవంతుడి దయవల్ల తగ్గింది. డాక్టరు కొద్దిరోజులు సెలవు పెట్టి రెస్ట్ తీసుకోమన్నాడు. నిన్నటినుండి ఎక్కడికీ కదలకుండా పక్కమీద పడుకొన్నారు!"
ఉన్న ఒక్కసారీ మూసుకుపోయినట్టుగా హతాశురాలైపోయింది గీతాభవాని. ఈ పరిస్థితిలో అన్నయ్య సహాయం ఎలా అర్దిస్తుంది? ఆపిల్ల పుట్టడం, ఆ గతం ఓదుస్వప్నంలాగా మరిచిపోయి ఉంటాడు అన్నయ్య. మామూలుగా అయితేనే దాన్ని గుర్తుచేయడం కష్టం. గుండెమీద ఏబరువుపడినా తట్టుకోలేని ఈ స్థితిలో పేపరులో పడిన ప్రకటన గురించి, ఆపిల్లను ఆదుకోవడం గురించి ఏమని చెబుతుంది?
ఇంకెవరికి చెబుతుంది? ఆపిల్ల సంగతి, తనసంగతీ ఒక్క అన్నయ్యకే తెలుసు! చెల్లెలి పాపిష్టికథంతా అతడి హృదయంలో నిక్షిప్తం చేసుకొన్నాడు. ఆ దుఃఖభారమంతా, ఆ అవమాన గాధంతా అతడొక్కడే భరించాడు! కనీసం తల్లికిగానీ, తండ్రికిగానీ పంచలేదు!
గదిలోకి వెళ్ళి అన్నగారిని పరామర్శించి మౌనంగా కూర్చొంది గీతాభవాని.
"చెప్పకుండా హఠాత్తుగా వచ్చావు! ఎలాగో ఉన్నావు. ఏమిటమ్మా?" వామనరావు కలవరంగా అడిగాడు.