Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 27

           
                                       14
    
    రేఖను తన గదిలోకి పిలిపించాడు సాంబశివం, సాధారణంగా తనదగ్గర పని చేసేవాళ్ళని సాంబశివం తన దగ్గిరకి పిలిపించడు. అలా పిలిపించాడంటే ఏదో ఉన్నదన్నమాటే! రేఖ భయపడుతూ వెళ్ళింది.    
    కూర్చోమనైనా అనలేదు సాంబశివం.
    "శ్యామ్ ప్రసూన జోలికి వెళ్ళాడట! నీకు తెలుసునా?"    
    సాంబశివం కంఠం ఎంత కరుగ్గా ఉందంటే ఆ కంఠం వింటుంటే తన నెవరో కత్తితో ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు అనిపించింది రేఖకి.    
    భయంతో వణికిపోతూ "నాకు తెలియదే!" అంది. సాంబశివం సూటిగా రేఖ ముఖంలోకి చూశాడు. ఆ ఒక్క చూపులో రేఖకు ఎన్నో విషయాలు తెలిశాయి. సాంబశివం తన మాటలు నమ్మలేదు- శ్యామ్ కు ప్రోత్సాహమిచ్చింది తనేనని అనుమానిస్తోన్నాడు- అలాటిది సహించనని హెచ్చరిస్తున్నాడు.    
    పొడారిపోయిన పెదవులు తడుపుకుంటూ అలాగే నిల్చుంది రేఖ.    
    "జాగ్రత్త! శ్యామ్ తో చెప్పు! మరొక్కసారి ప్రసూన జోలికి వెళితే ప్రాణాలతో బయటపడడు......."    
    కర్కశంగా అన్నాడు........    
    ఆ 'జాగ్రత్త' శ్యామ్ కంటే తనకే ఎక్కువగా అన్వయిస్తుందని అర్ధం చేసుకుంది రేఖ.

    కాల్చేస్తున్నట్టున్న ఆ వాతావరణాన్ని భరించలేక సంభాషణ మార్చటానికి ప్రయత్నించింది.    
    "సార్! మీరు ఒప్పుకుంటే మోహన్ గారితో నేను మాట్లాడి మనవైపుకు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తాను......"    
    ఆ మాటలు వింటోనే నిరసనగా నవ్వాడు సాంబశివం.......    
    "అదేం లాభంలేదు- మోహన్ క్లాస్ మనిషి......." ఇందాకటి కారుకు మాటలన్నింటికంటే వాడిగా గుచ్చుకుంది ఈ మాట రేఖను.......    
    మోహన్ 'క్లాస్' మనిషి కాబట్టి తనబోటి తేలిక మనుష్యులు వశపరచుకోలేరు. ప్రసూనలాంటి 'క్లాస్' వాళ్ళే ఉండాలి......క్లాస్.....అన్నింటిలోను క్లాస్.    
    "ప్రయత్నిస్తాను సార్! అదీగాక స్త్రీ ఒకసారి పురుషున్ని వశపరచుకోగలిగితే ఇక ఆ మొగాడు ఆ స్త్రీ 'క్లాస్' గురించి ఆలోచించడు- అలాటి పతివ్రతా శిరోమణి లేదని త్రికరణ శుద్దిగా నమ్మేస్తాడు......"    
    సాంబశివం కొంచెంసెపు ఆలోచించి "ప్రయత్నించు" అన్నాడు.    
    "థేంక్యూ సర్!" అని ఆనందంతో వెళ్ళిపోయింది రేఖ...... రేఖ మోహన్ ను వశపరచుకోగలదని సాంబశివం అనుకోలేదు- అతనికి రేఖతో ఏవిధంగాను పెద్ద విశ్వాసమూ లేదు- కానీ, జరిగిన సంగతులు అర్ధం చేసుకుంటున్న కొద్దీ అతనికి ఆందోళనగా ఉంది. ప్రసూనను మోహన్ రక్షించాడు. రక్షించడంవరకూ బాగానే ఉంది. కానీ ప్రసూణా మోహన్ ల మధ్య అనురాగం అల్లుకోలేదుకదా?! అలా జరిగితే అంతకంటే అవాంఛనీయమైనది మరొకటి ఉండదు- అందుకే రేఖను మోహన్ దగ్గరికి వెళ్ళమన్నాడు. మోహన్ ని వశపరచుకోలేకపోయినా ప్రసూన మనసు విరగొట్టగలదు.    
    సాంబశివం దగ్గిరనుండి తిన్నగా ప్రసూన దగ్గిర కొచ్చింది రేఖ.........    
    రేఖను చూడగానే తను అడగాలనుకుంటున్నది అడిగేసింది ప్రసూన.    
    "శ్యామ్ తో నా గురించి లేనిపోనివి ఎందుకు చెప్పావ్?"    
    "లేనిపోనివి చెప్పానా?" ఆశ్చర్యపోయింది రేఖ.    
    "సాంబశివంగారికి నువ్వంటే అభిమానమనీ, నువ్వేది అడిగినా కాదనరనీ అన్నాను అది అబద్దమా?" అమాయికంగా అడిగింది.    
    అవును. అధి అబద్దంకాదు. ఆ విషయం రహస్యంగా దాచుకోవలసినదని ఇంతకు ముందెప్పుడూ ప్రసూన అనుకోలేదు. ఏ విషయంలోనైనా ఉపయోగించుకునే విధానాన్ని బట్టి రకరకాల రంగులు ప్రతిఫలిస్తాయి. ఈనాడు రేఖ పనికట్టుకుని ఇలా ప్రదర్శించే వరకూ సాంబశివం అభిమానం గురించి ప్రసూన ఎన్నడూ ఆలోచించలేదు. ఇంతవరకూ అతి సామాన్యంగా తోచిన షయం ఇప్పుడు ప్రసూనకే అనేక ప్రశ్నార్దకాలతో నిండిపోయి అయోమయంగా తోచసాగింది. ఏమీ మాట్లాడలేకపోయింది.    
    నిజాన్ని నిజంగా ఒప్పుకునే ప్రసూన ప్రవృత్తి రేఖకు తెలుసు. అందుకే గౌరవం..... అందుకే అసూయ......మన బాస్ నన్ను మోహన్ తో కత్తుకలపమంటున్నాడు." నిట్టూరుస్తూ అంది రేఖ......    
    ఉలికిపడింది ప్రసూన..... పాలిపోయిన ప్రసూనను సంతృప్తితో చూసింది రేఖ.    
    "నువ్వు నా కొక సహాయం చెయ్యాలి......"    
    ప్రాధేయ పడుతున్నట్లు అడిగింది రేఖ.    
    "ఏమిటి?"    
    "మోహన్ కి ఫోన్ చేసి నన్ను కలుసుకోవటానికి అపాయింట్ మెంట్ తీసుకోవాలి......"

 Previous Page Next Page