Previous Page Next Page 
ఎండమావులు పేజి 28


    ఉద్వేగంగా అన్నది నగేంద్రబాల. గుడ్ల నీళ్ళు గుడ్ల గుక్కుకుంది గౌతమి.
    "నీమీద ద్వేషంచేతా, కోపంచేతా నే నిట్లా అనటంలేదు. అదే నిజమైతే నీకు ఉద్యోగం రావటానికి నేనెందుకు సాయపడతాను. కొంతమంది వ్యక్తులకి అనుభవాలే వయస్సుకి మించిన తాప త్రయాన్నీ, ఆలోచనలనీ కలుగజేస్తయ్యి. పర్యవసానం తెలీని పన్లు చేసి, తరువాత మోసపోయామనుకుంటే అందుకు ఎవరికీ వారే బాధ్యులవుతారు." అన్నది మళ్ళీ నగేంద్రబాల.
    పొంగి పొర్లుకొచ్చే ఉద్వేగాన్ని ఆపుకోలేక పోయింది గౌతమి. తనను ఈవిధంగా ఎందుకు దుయ్యబడుతున్నదో ఆమెకు అర్ధంకాలేదు.
    "వార్ని దూరం చేసుకోవాలనీ, వారితో కాపురం చెయ్యకూడదనీ నా ఉద్దేశం కాదే నాగూ. ఉద్యోగం విషయంలో వారికున్న నిర్ణయాలూ, అభిప్రాయాలూ ఇప్పట్లో వారు మార్చుకునేటట్లు లేరు. కన్న తల్లిదండ్రులమీద ఆపేక్ష, అభిమానమూ చంపుకోమనీ నే నెప్పుడూ చెప్పను. వారికి సేవ చెయ్యాలంటే అదొక్కటే మార్గమా? ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల్ని కనిపెట్టుకుని ఉండేవారు ఎంతమంది లేరు. ఎమ్మే పాసయి గుళ్ళో పురాణం శాస్త్రులుగారి మాదిరి భారత భాగవతాలూ, పురాణ గ్రంధాలూ చదువుతూ కార్తీక స్నానాలు చేస్తుంటే అంతా హర్షిస్తారంటావా. ఉద్యోగం చెయ్యలేని అసమర్ధులంటారు. భగవంతుడు కల్పించిన అసమర్ధతను సానుభూతి తో అంతా హర్షిస్తారు. మనం తెచ్చి పెట్టుకున్న అసమర్ధతను ఎవ్వరూ హర్షించక పోగా హేళన చేస్తారు. మా బావగారి సంగతి నీకు చెప్పాను కదూ ఆ కొడుకుతో సంబంధ బాంధవ్యాలు తెంచుకుని పదేళ్ళు దాటింది. అన్న గారు అట్లా అయినందుకు, తానైనా తల్లి దండ్రుల ఋణం తీర్చుకోవాలని వారి అభిలాష. ఇలాంటి వాతావరణంలో అయిదారేళ్ళు గడిపిం తరువాతనే ఇట్లా నేను ఉంటేనైనా వారి మనస్సు మారుతుందేమోనన్న నా ఆశ." అన్నది గౌతమి.
    నాగేంద్రబాల పేలవంగా నవ్వింది. విభిన్న దృక్పధాల్లో విడిగా ఉన్న ఆ దంపతుల జీవితాలు ఎట్లా ఉంటయ్యో నని ఆమె మనస్సులోని బాధ.
    "నీ ఉద్దేశ్యమూ, అభిప్రాయమూ వినటానికి బాగానే ఉందే గౌతమీ. కాని, జీవితంలో అది ఎంత వరకూ ఆచరణయోగ్యమైనదో నాకు అర్ధం కాలేదు. నా భార్య ఉద్యోగం చెయ్యంరా లేంది, నే నెందుకు ఉద్యోగం చెయ్యకూడదని, వారు మనస్సు మార్చుకుంటారేమోననేగానీ అభిప్రాయం. ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకో. భర్త అభిప్రాయాలకు అనుగుణంగా భార్య ప్రవర్తిస్తూ, తన అభిప్రాయాలూ, అభిరుచులూ జోడించి సంసార జీవితాన్ని తీర్చిదిద్దుకోటం లోనే భార్య తన ప్రతిభ చూపించాలి. అప్పుడే తన అభిప్రాయాల్ని భర్త ఆదరించటం, ఆచరణలో ఉంచటం సాధ్యపడుతుంది. ఇది నా స్వానుభవంమీద చెప్పాను. తరువాత నీ యిష్టం. ఒక్క మాట. అనునయ వాక్యాలతో వారికి ఒక్క ఉత్తరం ఇవ్వాళనే రాసి పోస్టుచెయ్యి. స్త్రీకి పెన్నిధిలాంటి భర్తను దూరం చేసుకుని ఏకాకిగా ఉంటానికి ప్రయత్నం చెయ్యకు." అన్నది నగేంద్రబాల.
    ఆమె మనస్సు తన అనుభవాలతో నిండి పోయింది. ఆ అనుభవాలను పురస్కరించుకొని అదే విధంగా ఆచరించమని చెప్పటానికి ఆమె ఎంత  మాత్రం ఉద్దేశ్యపట్టంలేదు.
    "నాగూ!"    
    తలెత్తి చూసింది.
    "నీ మనస్సు అర్ధం చేసుకున్నాను. ఇట్లా మాట్లాడేదానివి నీ జీవిత భాగస్వామికి విడాకు లెందుకిచ్చావే. అప్పుడీ అభిప్రాయాలు లేవా. ఉన్నా తెల్సిరాలేదా."
    సూటిగా అడిగిన ప్రశ్న సూలంలా తగిలింది నగేంద్రబాలకు.
    "పరిస్థితుల ప్రాబల్యానికి అంతా తట్టుకోలేరు. కొన్ని బాధలు అనుభవించాక, కొంత పరిస్థితి ఏర్పడ్డాక మనస్సుకు విరక్తి ఏర్పడి గుండె కరుడుగట్టిపోతుంది. ఆ కరుడుగట్టిన హృదయం మీద ఏ అభిప్రాయాలూ పనిచెయ్యలేవు. ఏదో విధంగా ఈ అవాంతర పరిస్థితి నుంచి దాటి పోతే మంచిదనిపిస్తుంది. విపరీతమైన శరీర బాధల్ని, జీవిత సమరంలో ఎదుర్కొన్న ప్రతి పోరాటాన్నీ మర్చిపోవటానికి కొంతమంది మద్యం సేవిస్తారు. కాని, ఆ సమస్యలూ, కష్టాలూ, బాధలూ వదిలిపోయినా, ఈ తాగుడు అలవాటు నుంచి మాత్రం తప్పించుకోలేరు. చివరికి అసలు సమస్యలకన్న ఈ తాగుడు సమస్యే వారికి తీరని మనోవ్యధ కలిగించి జీవితాన్ని నాశనం చేస్తుంది" అన్నది నగేంద్రబాల.
    గౌతమి ఇంకేమీ మాట్లాడలేకపోయింది.

                                                      *    *    *

                                      21

    "అన్నయ్యా వదిన ఉత్తరం రాసింది" అన్నది శ్రీ లక్ష్మి.
    "గౌతమి వదినె కులాసాగా ఉన్నదా, ఉద్యోగంలో చేరిందిట" అన్నది జయలక్ష్మి.
    శలవులకు జయలక్ష్మి ఇక్కడికి క్రితం రోజునే వచ్చింది.
    "ఏం రాసిందో నువ్వే చదువు" అన్నాడు జానకిరాం.
    "మీ భార్య భర్తల ఉత్తరాలు నేను చదవటం ఏమిటి. నువ్వే చదువుకో" అంటూ ఉత్తరం ఇచ్చి వెళ్ళింది శ్రీలక్ష్మి.
    "ఉత్తరం చదువుకుని చెప్పతగిన విశేషాలుంటే మా చెవినా వెయ్యి" అన్నది జయలక్ష్మి.
    ముభావకంగానే ఉత్తరం చదువుకున్నాడు జానకిరాం.
    'శ్రీవారి పాద పద్మములకు ప్రణామములు:
    ఉభయ కుశలోపరి. నేను ఇక్కడికి వచ్చేసిం తరువాత ఇంతకాలానికి గాను ఉత్తరం రాసినందుకు గాను కోపగించుకోరని నమ్ముతున్నాను. సంసార జీవితంలో సుదీర్ఘమైన సుషుప్తావస్థనుండి మేల్కొన్న నేను ఒక చిన్న సంఘటనను పురస్కరించుకోని ఇట్లా వచ్చివేయటం తప్పేనన్న సంగతి తెల్సుకున్నాను. మీరు ఉద్యోగం చెయ్యటం లేదనే మూర్కపు కుమిలింపే నన్నీ స్థితికి తెచ్చింది. కాని తొందర పడ్డానని ఇప్పుడు తెల్సుకున్నాను. ఏదో తెలియని ఆవేశంతో ఉన్న ఆభావం వల్లనే ఇంతకాలమూ మీకు ఉత్తరం రాయలేకపోయాను. నన్ను నేను తెల్సు కున్న తరువాత, వివాహితురాలైన గృహిణిస్థానం ఎక్కడుండాలో, ఇక్కడి పరిస్థితులనుబట్టి పూర్తిగా తెల్సుకున్నాను. ఎక్కడున్నా నేను మీదాననే! మీ చరణదాసినే, మీ భార్యనే, మీ గౌతమినే. ఉబలాటం వల్లనేమి, కోరికవల్లనేమి చూచి తెల్సుకోవలెనన్న కాంక్ష వల్లనైతేనేమి కొంతకాలం ఉద్యోగం చెయ్యవలెనన్న ఉద్దేశ్యం కలిగింది. ఇరవై రోజుల నుంచీ ఒక టెంపరరీ ఉద్యోగం చేస్తున్నాను. నా చిన్ననాటి స్నేహితురాలు నగేంద్ర బాల నాకు ఉద్యోగం వాళ్ళ ఆఫీసు లోనే ఇప్పించింది. నాన్నగార వ్రాసిన ఉత్తరం వల్ల అన్ని విషయాలూ మీకు తెల్సి ఉండవచ్చు. నా కోరికను మన్నించి ఉద్యోగం చెయ్యమన్నా ఇష్టమే, ఉద్యోగం మానుకుని తమ సన్నిధికి వచ్చెయ్యమన్నా అంతకన్నా ఇష్టమే. మీరు ఏ విధంగా ఆదేశిస్తే అట్లాగే నడుచుకుంటాను.
    అత్తగారి మామగారికి నమస్కారములు. వదినె శ్రీలక్ష్మికి ఆ మనః పూర్వక శుభాకాంక్షలు. మీ పాద పద్మములకు అనేక నమస్కారములు.
    వెంటనే జాబు రాస్తారు కదూ!
                 మీ
                గౌతమి'
    ఉత్తరం చదివి కళ్ళు మూసుకుని పడుకున్నాడు జానకిరాం.
    "ఏం అన్నయ్యా వదినె రాసిన ఉత్తరం చదివే సరికి నిద్ర వస్తున్నదా" అంటూ వచ్చింది జయలక్ష్మి. ఆ వెనుకనే శ్రీలక్ష్మి వచ్చింది. గౌతమి ఉత్తరాన్ని శ్రీలక్ష్మి కి ఇచ్చాడు జానకిరాం. ఇద్దరూ ఆ ఉత్తరాన్ని చదువుకున్నారు.
    "ఏం సమాధానం రాస్తావు అన్నయ్యా" అన్నది శ్రీలక్ష్మి నవ్వుతూ.
    "వదినె ఉద్యోగం చేస్తుందని నేను కల్లోనైనా అనుకోలేదు. మన కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న ప్రథమ మహిళ మన గౌతమివదిన, ఆమెకు నా శుభాకాంక్షలు. నీ ద్వారా అందజేస్తున్నాను అన్నయ్యా" అన్నది జయలక్ష్మి.
    ఈ మాటలకు ముఖం చిట్లించింది శ్రీలక్ష్మి.
    "ఆవిడ ఉద్యోగం చెయ్యకపోతే ఈ ఇల్లు గడవకపోదు. మానుకుని వచ్చెయ్యమని రాసెయ్యి" అన్నది శ్రీలక్ష్మి.
    'నీ పూర్వకాలపు పద్ధతుల్లోనే ఈనాడు కూడా ఆడవాళ్ళు ఉండాలనటం సబబుకాదు శ్రీలక్ష్మి! అన్నయ్య చెయ్యని పని వదినె చేసింది. అందుకు మనం గర్వపడాలి" అన్నది జయలక్ష్మి.
    జానకిరాం ఒక్కసారి జయలక్ష్మి వైపు చూసి చిన్న బుచ్చుకుని కళ్ళు మూసుకున్నాడు.
    "వితంతువులకు తలవంపు కలిగించేటట్లుగా నువ్వు ప్రవర్తిస్తూనే ఉన్నావుగా జయా, అంతా నీ మాదిరే ఉంటే మన స్త్రీ జాతి ఎన్నడో నాశనమై పోయేది" అంటూ అక్కడినుంచి వెళ్ళింది శ్రీలక్ష్మి.
    నిర్ఘాంతపోయి నిల్చుంది జయలక్ష్మి. మెల్లిగా కళ్ళు తుడ్చుకుంటూ వెళ్ళబోయింది.
    "జయలక్ష్మి! ఉరుము ఉరిమి మంగలంమీద పడ్డట్లు మీ రిద్దరూ మనస్సు కష్ట పెట్టుకోటం ఎందుకమ్మా. శ్రీలక్ష్మి సంగతి నీకు తేలింది కాదుగా. నువ్వేమీ అనుకోకు. గౌతమి ఇష్ట ప్రకారమే చెయ్యమని ఉత్తరం రాస్తాను. చదువుకున్న అసమర్ధుడ్ని నేను. ఆదర్శప్రాయురాలైన గృహిణి గౌతమి. లోకాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నాకనే ఆవిడ ఇక్కడికి వస్తుంది. దమ్మిడీ సంపాదనలేని ఈ భర్తని కట్టుకుని గౌతమి ఏం సుఖపడుతుంది. డబ్బు విలువ నాకన్న గౌతమికే ఎక్కువ తెలుసు. భార్య సంపాదనతోనే భర్త బ్రతకాలన్నది మా అన్న దమ్ములకు ఇక శాపమేమో" అన్నాడు జానకిరాం. ఈ ఆఖరిమాట అనలేక, అనలేక అన్నట్లుగానే ఉంది. మనస్సులోని అవ్యక్త వ్యధ జానకిరాం ముఖంలో ప్రస్ఫుటంగా చూసింది జయలక్ష్మి.
    "కృష్ణమూర్తి అన్నయ్యకు ఇంకా బాగా కులాసాలేదా అన్నయ్యా" అన్నది.
    "లేదమ్మా గుండె జబ్బు తగ్గలేదు. జీవితమంతా అట్లా విశ్రాంతిగా గడపవలసిందే" అన్నాడు జానకిరాం మెల్లిగా.
    "సాయంత్రం వాళ్ళింటికి వెళదామా" అన్నది ఆత్రంగా జయలక్ష్మి.
    "కుల తత్వాలముందు మంచి మనస్సులు ఎన్నడూ పనికి రావమ్మా జయా. అక్కడికి వెళ్ళావని తెలిస్తే ఈ ఇంట్లో గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వదు శ్రీలక్ష్మి" అన్నాడు మెల్లిగా నవ్వుతూ.
    "అక్కడికి వెళ్ళావని చెపితేకదా. కాస్తో కూస్తో చదువుకున్నదాన్ని, ఆమాత్రం తెల్సుకోలేనంటావా. స్నేహితురాలింటికి వెళ్ళానంటాను. స్వాతి వదినెను చూడాలని ఉంది అన్నది.
    "శుభం అట్లాగే" అన్నాడు జానకిరాం.

 Previous Page Next Page