Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 26

    బన్సీలాల్ నిరాశగా అక్కడే నుంచుని ఆలోచన చేశాడు.
   
    "గోపన్నని కల్సుకున్న ముసుగు వ్యక్తి ఎలా మాయం అయ్యాడు? ఏ వీధిలో అతను దూరినా దూరం నుంచి తనకి కనపడేవాడు. వాడు అంతర్ ధానం అయ్యాడంటే అర్ధం? ఏదో ఒక వీధిలోకి వెళ్ళాడన్నది ఖాయం. వాడి యిల్లు వీధి మొదట్లో అన్నంత దగ్గరగా వుండి వుంటుంది...గబుక్కున యింట్లో దూరి తలుపు బిగించుకుని వుంటాడు. చేతికి చిక్కేపిట్ట చేజారిపోయింది.
   
    ఈ రోజు కాక పోతే రేపు దొరక్కపోడు వాడి పాపం పండక పోదు. ఆరోజు వాళ్ళపని తాను పట్టకపోడు. తీట వున్నవాడు గోక్కోక మానడు. అలాగే గోపన్నని కలుసుకునేవాడు మళ్ళీ కల్సుకోటానికి వస్తాడు__ఆ రోజు వాడిని పట్టాలి.
   
    ఈ మాట అక్కడే నుంచుని అనుకున్న బన్సీలాల్ రవ్వంత నిరాశతో వెనుతిరిగి యింటిదారి పట్టాడు.
   
    పది నిమిషాల తర్వాత...
   
    కాస్త దూరంలో చిన్న మొండి గోడ పక్కన దాగి వున్నా ముసుగు మనిషి నెమ్మదిగా పైకి లేచి హమ్మయ్య అనుకుని వేగంగా అక్కడినుంచి పక్క వీధి దారి పట్టటం జరిగింది.
   
    తనని ఎవరో వెన్తాదిఉ వస్తున్నారని గ్రహించిన ముసుగు మనిషి తెలివిగా అక్కడ దాక్కున్నాడు.
   
    జరిగింది అది.
   
                                                                             18
   
    వారం తర్వాత
   
    చోరీ నేరం క్రింద గోపన్నని జైలులో పెట్టటం జరిగింది.
   
    ఈ వారం రోజులలో ఆ సంఘటన జరిగిం తరువాత మళ్ళీ అనుమానించే దేదీ జరగలేదు.
   
    ఆ రాత్రి జరిగింది పొల్లు పోకుండా బన్సీలాల్ ఇన్ స్పెక్టర్ తో చెప్పాడు. ఏం చేయమంటారు? అని సలహా కూడా అడిగాడు.
   
    "తనని కొట్టిన నలుగురు నౌఖర్లలో గోపన్న ఒకడు. ఈ వంకర వాడి జుట్టు తన చేతికి అందింది. నాలుగు బాది కసి తీర్చుకోవచ్చు. ఆ రోజు బన్సీలాల్ రోగం కుదర్చటానికి మీ నౌఖర్లలో మోసగాడు ఉన్నాడని బొంకాడు. ఆ బొంకు ర్యాంకు అయింది. కనుక...
   
    లోలోపల సంతోషిస్తూ మరో సలహా ఇచ్చాడు ఇన్ స్పెక్టర్.
   
    "లాల్ జీ! పోలీసు బుర్ర అంటే సామాన్యమా? ముందేం జరుగుతుందో, ఏదీ ఎలా జరుగుతుందో చక్కగా ఆలోచించగలం. మీ మీ నౌఖర్లలో కొందరు దొంగ వెధవలున్నారని చెప్పాను. చెప్పిన రెండు వారాలకల్లా మీ కళ్ళతో మీరే చూశారు. దొ...౦...గ...వె...ధ...వ...ని...
   
    "మీరు చెప్పింది అక్షరాలా జరిగింది. ఇప్పుడు నన్నేం చేయమంటారు?" బన్సీలాల్ అడిగాడు.
   
    "రోజూ వాడిమీద నిఘా వేయండి. గోపన్న చేసే పని వాడికి చాటుగా ఎవరు కలుసుకుంటున్నారు ఆ వ్యక్తి వివరాలు సేకరించండి. సరిఅయిన సమయం చూసి నేను పట్టేస్తాను అంటూ ఇన్ స్పెక్టర్ సలహా ఇచ్చాడు.
   
    ఆ తర్వాత బన్సీలాల్ వేయి కళ్ళతో కనిపెట్టి చూసినా గోపన్నని అనుమానించే సంఘటనలు జరగలేదు. గోపన్నని కల్సుకోవటానికి ఎవరూ రాలేదు.
   
    బన్సీలాల్ ఈ విషయం ఇన్ స్పెక్టర్ కి చెప్పాడు.
   
    గోపన్న నూటికో కోటికో ఎవరినన్నా కల్సుకున్నావాళ్ళని పట్టుకున్న తర్వాత అది నేరం కానిదయితే వాడిని చీల్చి చండాడటానికి లేదు. కసి తీర్చుకోవటానికి లేదు...కనుక...
   
    ఇన్ స్పెక్టర్ అలా ఆలోచించి మరో కుళ్ళుప్లాను తయారుచేసి యిలా అన్నాడు...
   
    "మీరు నిఘా వేసిన సంగతి వాడికెవరో అందించి ఉంటారు. దాంతో వాడు తెలివిగా సర్దుకుని మెలుగుతున్నాడు."
   
    "అలా అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?"
   
    "ముల్లుని ముల్లుతోనే తీయాలి. అవునా లాల్ జీ?"
   
    "అవును."
   
    "కనుక మనమో పాడు పని చేయాలి."
   
    "పాడుపనా?"
   
    "అవును. పాడు పనే."
   
    "అదేమిటో చెప్పండి."
   
    "మీకిష్టం అయితే చేద్దాము. లేకపోతే లేదు...నా సలహా ఏమిటంటే ఆ దొంగగాడిద మీదకి నేరం తోసి ఆ వంకతో జైలులో పెట్టి వళ్ళు వాయకొడితే దెబ్బకి దెయ్యం దిగి గాడ్దెకొడుకు విషయం భళ్ళున కక్కుతాడు."
   
    "అంతే యిహ అలా చేయాలి. వాడిమీద నాకు బాగా అనుమానంగా వుంది. ఈ మధ్య నన్ను చూడంగానే కళ్ళు వాల్చుకుంటున్నాడు. ఏం చేస్తే వ్యవహారం పకడ్బందీగా వుంటుందో మీరే చూడండి."
   
    బన్సీలాల్ అలా అనంగానే ఇన్ స్పెక్టర్ కళ్ళు తళ తళ లాడాయి. ఏం జరిగినా తన చేతికి మట్టి అంటుకోకూడదు. అలాంటి ప్లాను వేశాడు అప్పటి కప్పుడే.

 Previous Page Next Page