Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 26


    తననుకున్నంతా జరిగిందిప్పుడు. ఒక విధంగా ఆలోచిస్తే ఆమె జీవితమిలా కావడానికి తనకూ కొంతబాధ్యత ఉంది. తన అంతరాత్మకు తెలుసా విషయం. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి తనది.
    "ఏమిటి బావా ఆలోచిస్తున్నావ్? దీనికి తగిన శాస్తి జరిగిందనుకుంటున్నావా?" నవ్వుతూ అందామె.
    అతను నొచ్చుకున్నాడు.
    "హేమా! కలలోనయినా అనుకోగలనా అలా, మా హేమ జీవితం కూడా ఆనందంగా గడిచిపోతే ఎంతబావుంటుందా అనేలా ఆలోచన".
    "ఊరికే అన్నాన్లే బావా! అలా కలవరపడతావెందుకూ?" అతనిని సమాధానపరుస్తూ అందామె.
    మర్నాడు సాయంత్రం అయిదు గంటలకల్లా చంద్రకాంత్ వచ్చేశాడక్కడికి.
    "హేమగారూ! రడీయేనా?" అన్నాడు లోపలకొస్తూనే.
    "ఏమిటంత హడావుడి?" నవ్వుతూ అందామె.
    "బయట ఆటో ఉంది, ఒకవేళ ఆలస్యముంటే పంపించివేద్దామని".
    "నేను రడీగానే ఉన్నాను."
    "అలాగయితేపదండి మరి" రజనితోనూ, సుధీర్ తల్లితోనూ వెళుతున్నానని చెప్పి బయల్దేరింది ఆమె. దారి పొడుగూతా ఏవేవో విషయాలు ఉత్సాహంగా మాట్లాడసాగాడతను. ఇల్లు చేరుకునేసరికి వసుంధర వారికోసమే ఎదుర్చూస్తూ కనిపించింది. ఆమె తల్లిదండ్రులుకూడా ఎంతో కాలానికి హేమనుచూసినందుకు ఆనందపడ్డారు.
    "మీవారింకా ఆఫీసునుంచి రాలేదా?" అడిగింది హేమ.
    "ఊహు! ఆయన్చేసేది చాలా అద్భుతమయిన ఉద్యోగం కదా! ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళతారో ఎవ్వరికీ తెలీదు....."
    "ఆయన పనిచేసేది రైల్వేలో కదూ?"
    "అవును" "ఏం ఉద్యోగం?"
    "అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్"
    "మంచి ఉద్యోగమేనా?"
    "అలా అనుకునే నేనూ మోసపోయాన్లే ఆ ఉద్యోగం కంటే బట్టలుతికేవాళ్ళదగ్గరుండే గాడిద ఉద్యోగం మంచిదనుకో అడ్డమయిన చాకిరీ వీళ్ళే చేయాలి. మరి జీతం చూస్తే గొర్రెకు బెత్తెడుతోక సామెతే! ఉద్యోగానికో వేళాపాళా లేదు, పగలూ రాత్రీలేదు ఇలాంటి దిక్కుమాలిన ఉద్యోగస్తుడి కిచ్చి ఎందుకు చేశారని మా అమ్మా నాన్నలతో ఎప్పుడూ పోట్లాడుతూనే వుంటాను....." నవ్వుతూ అంది వసుంధర.
    మాటల్లోనే ఆమె భర్త తెల్లకోటు భుజాన వేసుకుని ఇంట్లోకి వచ్చాడు. అతన్ని చూసి లేచి నిలబడింది హేమ.
    "ఇదిగోండి! మా హేమ వచ్చేసింది" అంది ఆమెను భర్తకు పరిచయం చేస్తూ.
    "నమస్తే!" అంది ఆమె చిరునవ్వుతో.
    "నమస్కారం! మీరు ఇవాళ రాకపోయినట్లయితే నిజంగా మా వసుంధరకి పిచ్చెక్కిపోయేదే" నవ్వుతూ అన్నాడతను.
    "ఎందుకని?" చిరునవ్వుతో అడిగింది ఆమె.
    "మీ ఉత్తరం వచ్చిందగ్గర్నుంచీ ఇవాళ ప్రొద్దున్నవరకూ అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ ఉంటుంది చూడండీ! అలా చెప్పిందే చెపుతోంది మీ గురించి".
    "అబ్బ! పాపం మీరు మీ స్నేహితులగురించి ఎప్పుడూ బోర్ కొట్టరుకాబోలు! ఏయ్ హేమా! ఈ మహానుభావులు పెద్ద ఫుట్ బాల్ ప్లేయర్ అట! వీళ్ళ టీమ్ అంటే దేశమంతా హడాలట!" నవ్వేస్తూ అంది వసుంధర.
    "అన్యాయం! నా ఆట చూసే కదా రైల్వేవాళ్ళు మూర్చపోయి వెంటనే నాకీ ఉద్యోగం ఇచ్చింది?" గర్వంగా అన్నాడతను.
    "ఇచ్చారులే! నా ఆట బాగున్నట్లయితే, నిజంగా వాళ్ళు మిమ్మల్ని లైక్ చేసినట్లయితే రైల్వేలో ఉద్యోగం ఇవ్వకుండా వదిలేసేవాళ్ళు మీ చెత్త ఆట చూసి ఆ కోపంతో మీకు తగిన శాస్తిచేయాలని స్టేషన్ మాస్టర్ ఉద్యోగం ఇచ్చిఉంటారు.
    "హేమగారూ! విన్నారు కదా! మీరే ఋజువు. రేపు కోర్టులో ఈ మాటలన్నీ అని పరువు నష్టం చేసినట్లు వసుంధరకి ఎగినెస్ట్ గా సాక్ష్యం ఇవ్వాలి. ఆమె నవ్వేసింది.
    "బావుంది! మా ఫ్రెండ్ కి వ్యతిరేకంగా నేనెలా సాక్ష్యం చెప్తాను?"
    "అవున్లెండి బంధుత్వానికి ఉన్న విలువ న్యాయానికెక్కడుందీ? అది సరేగానీ మీరంతా విమన్స్ లిబ్ ఆర్గనైజర్స్ అట గదా! ఆ విషయం మీద మీతో పెద్ద చర్చ జరపాలనుకుంటున్నాను."
    "ఓ రడీ" అందామె.
    "మా హేమ సంగతి మీకు తెలీదేమో! ఈ సబ్జెక్టు మీదే డిబేటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది...." భర్తను బెదిరిస్తూ అంది వసుంధర.
    "సరే! సరే! ఆ ఫస్ట్! ప్రయిజ్ సంగతేమిటో తేల్చేస్తానుగదా! మా రాంజీగాడినోసారి ఇలాగేమంచినీళ్ళు తాగించేశాను. నీకు చెప్పానా ఆ విషయం?" వసుంధరనడిగాడతను.
    "అరవైసార్లు!" ఠకీమని జవాబిచ్చింది వసుంధర.
    "అలాగా" ఆశ్చర్యంగా అన్నాడతను.
    ఆ రాత్రి భోజనాలయాక అందరూ వెన్నెల్లో కూర్చుని మాటల్లోకి దిగారు.
    "నాకు తెలీకడుగుతాను! అసలీ విమన్స్ మూమెంట్ ఎందుకంటారు? మీకేం అన్యాయం జరిగిపోతోందని?" అడిగాడు కుమార్.
    "ఆడదానికి అన్యాయం జరగనిది ఏ విషయంలోనో మీరే చెప్పండి" ఎదురు ప్రశ్న వేసింది హేమ.
    "ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదని మా తెలుగు మాస్టారుగారంటూండేవారు. అందరూ నవ్వేశారు.
    "అసలు ఆడపిల్లగా పుట్టినక్షణం నుంచే ఆమెకు అన్యాయం ప్రారంభమవుతుంది. "అయ్యో ఆడపిల్లా?" అంటూ అందరూ సానుభూతి చూపడం, దాంతో తల్లిదండ్రులకు నిరాశ, తేలిక భావం, నిర్లక్ష్యం మొదలవుతాయ్. ఆ తరువాత చదువు "ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా!" అంటూ ఏ యస్సల్సీ వరకో చదివించిమానిపించి పారేస్తారు. అదీగాక మొగాళ్ళకున్న వివిధ విషయాలకు సంబంధించైనా విద్యావకాశాలు ఆడాళ్ళకేవీ చాలా టెక్నికల్ కోర్సుల్లో ఆడపిల్లలకు ప్రవేశంలేదు. అలాగే కొన్ని ఉద్యోగాలకు స్త్రీలు అనర్హులు. కారణమేమిటో ఎవ్వరికీ తెలీదు. ఇక పెళ్ళి విషయంలో మనదేశంలో అందునా మన ఆంధ్రదేశంలో ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయం, అవమానం అంతా ఇంతాకాదు.
    వరుడిని ఎంతో ధరపెట్టి కొనుక్కుని ఆ తరువాత చచ్చేవరకూ వాడికి చాకిరీ చేస్తూవాడికిష్టం వచ్చినట్లు ఆటలాడాలి. వ్యక్తిత్వాన్నీ, ఇష్టాఇష్టాల్నీ, అన్న కోర్కెలనూ చంపేసుకోవాలి. పోనీ దుర్మార్గుడయిన భర్త బారినుంచి తప్పించుకుని ఒంటరిగా స్వతంత్రంగా జీవితంగడుపుదామన్నా వీలులేకుండా చేశారు. చట్టరీత్యా విడాకులు పొందడం ఎంతకష్టమయిన ప్రొసీజరో అందరికీ తెలుసు. ఎక్కడికక్కడ ఆడదాన్ని అణగదొక్కడానికే అన్ని నిబంధనలూనూ! ఇక ఆడదాని శీలం విషయంలో పురాణకాలంలో ఏ న్యాయాలు ఉండేవో- ఇప్పటికి అవే అలాగే నిలిచి ఉన్నయ్.
    మొగాడు ఎన్ని వెధవ్వేషాలేసినా ఫరవాలేదు. ఎంతచెడు నడతగలవాడయినా ఫరవాలేదు. పట్టించుకునేవారులేరు. శిక్షించేవారూలేరు. అనుభవించాలి? ఆ జీవితం అంతం కావడమే ప్రాయశ్చిత్తం. ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేదు....." ఆవేశంగా అందామె.
    కుమార్ నవ్వేశాడు.
    "సరే మీరు చెప్పిన పాయింట్లనీ బాగానే ఉన్నాయ్. ఆడదానికిఎన్నో అన్యాయాలుజరుగుతున్నాయని మీరెలా అంటున్నారో, మొగాడికీ అన్యాయాలు జరుగుతున్నాయని నేనంటాను. ఉదాహరణకి మొత్తం కుటుంబ బాధ్యతంతా ఆనాటినుంచీ ఈనాటి వరకూ మగాడి నెత్తినే ఉండిపోయింది చచ్చీచెడీ, నానా తంటాలుపడి కుటుంబ సభ్యులందరినీ మొగాడు పోషించాల్సిందే!
    కొన్ని ఉద్యోగాలకు ఆడాళ్ళయెలా అనర్హులో అలాగే కొన్ని ఉద్యోగాలకు మగాళ్ళు కూడా అనర్హులు. భార్యలను హింసించేమగాళ్ళు ఉన్నట్లే, భర్తలను రాచిరంపాన పెట్టే భార్యలూ ఉన్నారు. మగాడు పగలల్లా పొలాల్లోనూ, ఆఫీసుల్లోనూ ఫ్యాక్టరీల్లోనూ గొడ్డుచాకిరీచేస్తే ఆడది హాయిగాఇల్లు కదలకుండా గంటసేపట్లో వంటచేసి సీరియల్స్ చదువుకుంటూకూర్చుంటుంది. ఆడాళ్ళకి సమానత్వం పేరుతో ఎన్నోహక్కులు, బోలెడు స్వేచ్చ లభించింది. కాని మగాడికి మాత్రం కొత్తగా ఏమీ లభించలేదు..." నవ్వుతూనే మాట్లాడాడతను.
    "ఇవన్నీ ఉపన్యాసాల్లోనూ, కాగితాలమీదా కనిపించే లాభాలు. నిజానికి స్త్రీ పరిస్థితి రోజురోజుకీ దారుణమవుతోంది తప్ప మెరుగుపడడంలేదు!" ఖండితంగా చెప్పేసిందామె.
    "సరే! మీ వాదన నిజం కాదనడానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. మగాళ్ళకంటే ఆడ రచయిత్రులురాన్రాను ఎక్కువయిపోతున్నారాలేదా?"
    "ఆ! అవును పాపం! ఎవరికి తెలీదనీ? ఆడపేర్లతో రాసే మగాళ్ళు ఎక్కువయిపోబట్టే రచయిత్రు లెక్కువయ్యారు!" హేళనగా అంది వసుంధర.
    "ఫౌల్! నేను హేమగారితోమాట్లాడుతోంటే నువ్వు కల్పించుకోకూడదు!"
    అందరూ నవ్వేశారు.
    "సరే! మన వాదన తేలేదికాదుగానీ మీకో విషయం చెప్తాను హేమగారూ! స్త్రీకి కొంత అన్యాయం జరుగుతోన్న మాట వాస్తవమే! కానీ ఇలామగాడి మీద కత్తిగట్టిరోడ్డున పడాల్సినంత అన్యాయమేమీ జరగటంలేదు. నన్నడిగితే అసలీ పరిస్థితి మగాడిదేమాత్రం బాధ్యత లేదంటాను. ఆడదాని పరిస్థితిలో మార్పు రావాలంటే స్త్రీల మనస్తత్వంలోనే మార్పు రావాలి. ఎందుకంటే వాళ్ళే ముఖ్యంగా ఆ పరిస్థితికి కారణం గనుక! స్త్రీలు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల్లో చాలావరకూ ఆమెకు ఆర్ధికం రక్షణ ఏర్పడితే తొలగిపోయేవి! మీరు వప్పుకున్నా వప్పుకోకపోయినా నిజం ఇదే!".

 Previous Page Next Page