Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 25


    "మీరిద్దరూ ఆనందంగా లేరని విన్నాను. ఎంతవరకూ నిజం?".
    "చాలావరకూ!" అంది ఆమె.
    "ఇద్దరిలోనూ తప్పుందా?".
    "నామటుకు నాకు నాదేమీ తప్పులేదనిపిస్తుంది. అయినా అతని గురించి నాకు నువ్వు ముందే చెప్పి ఉన్నట్లయితే పరిస్థితులిలా ఉండేవి కాదు బావా!" నిష్టూరంగా అందామె.
    ఈ మాట ఆమె అంటుందని భయపడుతూనే ఉన్నాడు సుధీర్.
    "బావుంది హేమా! అతన్ని గురించి నువ్వుగానీ, మీనాన్నగానీ అసలు నన్నడిగారా! సరే ఆ సంగతలా వదిలెయ్! ఒకవేళ మీరు అడిగినా అతని మనస్తత్వం గురించి నాకేం తెలుస్తుంది చెప్పు. అతను నా ప్రాణ స్నేహితుడేమీ కాదు. ఓ సాధారణ స్నేహితుడు! అంతే! ఇంతకూ అసలేమిటి గొడవ? మీ ఇద్దరకూ మనస్పర్ధలెందుకొచ్చాయి?"
    "ఒకటేమిటి బావా! అన్నీ పేచీలే! నేను ఏ మగాడితో మాట్లాడినా ఎవరివంకచూసినా అనుమానం ప్రాచీనకాలంనాటి స్త్రీలా అతనికి శుశ్రూషలు చేయాలి. అతనిమాట కెదురు చెప్పకూడదు. అతని ఇష్టాఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి. నా ఇష్టా ఇష్టాలంటూ ఏమీ ఉండకూడదు. తనను ఏ విషయంలోనూ ప్రశ్నించకూడదు! అతను విసుక్కుంటే సహించాలి. కొడితే పడుండాలి. తిడితే విని ఊరుకోవాలి.... ఇలా చెపుతూపోతే ఎన్నో ఉన్నాయి.
    సుధీర్ మనసంతా దిగులుతో నిండిపోయింది. ఆమె సంసారిక జీవితం అలా అవడం అతనికెంతో విచారం కలిగించింది. ఆ రోజంతా రజనీని రహస్యంగా పరిశీలిస్తూనే ఉంది హేమ. సుధీర్ ఆమెనే చేసుకోవడానికి ఎన్నో కారణాలు కనిపించాయామెకి. మొట్ట మొదటిది ఆమె కసలు స్వతంత్రంగా ఆలోచించడం తెలీదు. అన్నీ భర్త చెప్పాల్సిందే.
    "ఏ కూర వండాలి?" దగ్గర్నుంచీ" ఏ చీర కట్టుకోవాలి" వరకూ అన్నీ అతనిమీదే ఆధారం అతను ఒక్కరోజు ఆజ్ఞాపించకపోతే ఆమె గతేమవుతుందోనని చూచే వాళ్ళు భయపడిపోవాలి అంతటి అమాయకత్వం కనబడుతోంది ఆమెలో.
    ఆ సాయంత్రమే వసుంధర, చంద్రకాంత్ వచ్చారక్కడికి.
    "నా ఉత్తరం అందిందా?" ఆనందంగా అడిగింది హేమ.
    "ఓ! అందుకే అడ్రస్ పట్టుకుని వచ్చేశాను.....నువ్వు సరాసరి మా ఇంటికిరాకుండా ఇక్కడెందుకు దిగావు?" అడిగింది వసుంధర చిరుకోపంతో.
    "ఇంకేమయినా ఉందా?" మా అత్తయ్య యుద్ధం చేసెయ్యదూ?" నవ్వుతూ అంది ఆమె.
    "అలాగయితే ఇప్పుడు వెళదాం పద! త్వరగా రడీ అవ్!"
    "అప్పుడేనా? రేపు వస్తానుగా!
    "అవునండీ! ఈ ఒక్కరోజుకీ ఇక్కడే ఉండనీయండి!" సుధీర్ కల్పించుకుంటూ అన్నాడు.
    "అది సరేగాని నీకు నవలలపోటీలో బహుమతి వచ్చినట్లు నాకు రాయనేలేదేం? ఇవాళ ఉదయం పత్రికలో నీ ఫోటో చూచి ఎంత ఆశ్చర్యపోయానో! మా ఇంటి చుట్టుప్రక్కలవారందరికీ నీ గురించి చెప్పేశాను. అంతా నిన్ను చూడాలని ఒకటే తహతహలాడుతున్నారు...." అంది వసుంధర గడగడామాట్లాడేస్తూ.
    "ఏమిటి? నీకు నవలలపోటీలో బహుమతి వచ్చిందా? నువ్వు రచయిత్రివి ఎప్పుడయ్యావ్?" ఆశ్చర్యంగా అన్నాడు సుధీర్.
    "భలేవారే! ఇప్పుడేమిటి? ఆమె కాలేజ్ డేస్ నుంచే ఆర్టికల్స్ రాస్తూండేవారు!
    మా సావనీర్ కి కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు! ఆ ఆర్టికల్ ని కంఠతాబట్టి అ తరువాత నేనో బహుమతి కూడా గెల్చుకున్నాను....." గర్వంగా అన్నాడు చంద్రకాంత్.
    సుధీర్ కి అది నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది.
    "ఆ పత్రిక నీ దగ్గర ఉందా?" అడిగాడతను.
    "ఇదిగో! నా దగ్గర కాపీ ఉంది!" అంటూ తన చేతిలోని పత్రికను సుధీర్ కి అందించాడు చంద్రకాంత్. పుస్తకం అందుకుని అందులోని ఆమె ఫోటోనూ, ఆమె గురించి రాసిన వివరాలనూ చూడసాగాడతను.
    "హేమగారూ! మీ నవల ప్రారంభంలోనే ఎంత చక్కగా ఉందో తెలుసా? తలెత్తకుండా చదివేశాను ఆ పదిపేజీలూ!" అభినందిస్తూ అన్నాడు చంద్రకాంత్.
    ఆమెకు ఆనందం పొంగిపొరలింది. ఆ పత్రిక మార్కెట్ లోకి వచ్చినట్లే తనకు తెలీదు.
    "ఇది నా కిచ్చేసి నువ్వు మరో పుస్తకం కొనుక్కో!" అందామె."
    "అసలు ఆ అనుమానంతోనే ఇక్కడికి తెచ్చానాపుస్తకం! ఇవాళ ఉదయమే వచ్చిందది- మీరు చూసి ఉండకపోవచ్చని అనుకున్నాను.....".
    "థాంక్యూ...." "థాంక్యూ అని సరిపుచ్చేద్దామనుకుంటున్నారేమో! అదేం కుదరదు. నాకు 'టీ' పార్టీ ఇవ్వాలి" నవ్వుతూ అన్నాడతను.
    "ఓ! తప్పక ఇస్తాను! నీ ఎంకరేజ్ మెంట్ వల్లనేగా నా మనసు మళ్ళీ ఇటువేపు మళ్ళింది?" కొద్దిసేపు ఏవేవో విషయాలు మాట్లాడుకొంటూ గడిపేశారు హేమా వసుంధరా! "ఇంక నేనువెళతాను! మరి మా యింటికి రేపు ఎప్పుడొస్తావో చెప్పు!" అడిగింది వసుంధర. "సాయంత్రం...." "ఎన్ని గంటలకు నన్ను రమ్మంటారు?" అడిగాడు చంద్రకాంత్.
    "నువ్వెందుకురావడం?"
    "మిమ్మల్నెవరు తీసుకొస్తారు మరి?"
    "మాబావా!" అందామె సుధీర్ వంక చూస్తూ.
    "ఓ! గుర్తులు చెప్తే నేను తీసుకొచ్చి డ్రాప్ చేయగలను" అన్నాడు సుధీర్.
    "గుర్తులు చెప్పినా మా యింటినంబరు కనుక్కోవడం కొంచెం కష్టమేలెండి! అసలు ఈ నగరంలో ఇళ్ళనంబర్లే అంత! ఏ ఇళ్ళయినాసరే నంబరుని బట్టి కనుక్కోడానికి వీల్లేకుండా ఏర్పాటు చేశారు కార్పొరేషన్ వాళ్ళు. మీకు ఆ ఇబ్బందంతా ఎందుకు? నేనే వచ్చి తీసుకెళ్తాను.
    "ఓకే! అలాగయితే నాకు చాలా పెద్ద శ్రమ తప్పిపోతుంది...." నవ్వుతూ అన్నాడు సుధీర్. వసుంధరా, చంద్రకాంత్ వెళ్ళిపోయారు. రాత్రి భోజనాలయాక హేమ దగ్గరకొచ్చి కూర్చున్నాడు సుధీర్.
    "నీ సీరియల్ చదివానోయ్" అన్నాడు చిరునవ్వుతో.
    "ఎలా వుంది?" "ఇది ప్రారంభమేగా, అప్పుడే ఏం తెలుస్తుంది? అయితే నాకో చిన్న అనుమానం వచ్చింది....."
    "ఏమిటది?" "అందులో ఈశ్వర్రావ్ పాత్ర ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశావ్?" 'ఎందుకు?"
    "తెలుసుకోవాలని వుంది".
    "నీకెవరయినా కనబడుతున్నారా ఆ పాత్రలో?"
    "అవును"
    "ఎవరు?"
    "ఒకతను శ్రీనివాసరావ్! రెండోది నేనేమో అని....." ఇద్దరూ గట్టిగా నవ్వేశారు.
    "నువ్వు మాత్రం కాదులే!"
    "రక్షించావ్!"
    "అన్నట్లు అమ్మనాకో విషయం చెప్పిందిందాక! నువ్వు తల్లివి కాబోతున్నావటగా? కంగ్రాచ్యులేషన్స్ చెప్పవచ్చా?"
    ఆమె మొఖం వాడిపోయింది.
    "అవసరంలేదులే! ఇది నాకేమీ శుభవార్త కాదు! ఆ ఆనందమే లేదు".
    కొద్దిక్షణాలు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.
    "హేమా!" నెమ్మదిగా పిలిచాడతను.
    "ఊ!"
    "విరక్తికలిగించేంత దారుణంగా ఉందా నీ జీవితం?" బాధపడుతూ అడిగాడతను. జీవంలేని నవ్వు నవ్విందామె.
    "అందరి జీవితాలూ నందనవనాలుకావు గదా!"
    "నీ అభిప్రాయాలూ, ఆదర్శాలవల్లనేనా ఈ గొడవంతా?"
    "కొంతవరకూ! కానీ నేను ఎన్నో విషయాలలో రాజీపడ్డాను బావా! పెళ్ళికి ముందున్న నా ఆలోచనా ధోరణిని చాలా వరకూ మార్చుకున్నాను ఎందుకో తెలుసా? సంసారాన్ని నాశనం చేసుకోవడం ఇష్టంలేక! కానీ మీ స్నేహితుడి మితిమీరిన మూర్ఖత్వంవల్లే ఈ సమస్యలు.
    భార్యంటే అతని ఉద్దేశ్యంలో యజమాని చెప్పినట్లు నడుచుకునే పాలేరులాంటి మనిషి! అంతటిహీన స్థితికి  దిగజారి అతనికి తల ఒగ్గటం నాకు చేతకాని పని...."
    సుధీర్ కి అర్ధంఅయింది. ఆ రోజు శ్రీనివాసరావ్ ఆమె గురించి మాట్లాడేప్పుడు "సమానహక్కులూ, వగయిరాలన్నీ ఆడపిల్లలు కాలక్షేపానికి మాట్లాడే మాటలు ఆ మాటల్ని మనం సీరియస్ గా తీసుకోకూడదు. పెళ్ళయిన తర్వాత క్రమేపీ అన్నీ మర్చిపోతారు!" అని ధీమాగా చెప్పినప్పుడే తనకు అనుమానంవచ్చింది. "ఆడది ఎప్పుడూ ఆడది లాగానే ఉండాలి" అన్న అతని తత్వానికీ, హేమ ఏర్పరచుకున్న బలమయిన అభిప్రాయాలకూ, వ్యక్తిత్వానికీ ఏ మాత్రం నావలా తయారవుతుందేమోననీ కలవరపడ్డాడు తను.

 Previous Page Next Page