Previous Page Next Page 
యుగాంతం పేజి 26

   

      రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ - స్టాక్ హూం, స్వీడన్ హాలు ఆహుతుల్తో కిక్కిరిసి వుంది. ఒక్కో రంగంలో ఒక్కో విషయంలో పరిపూర్ణత సాధించిన మేధావులు కూర్చుని వున్నారు. రాయల్ డిగ్నిటీ జ్యూరి ఆఫ్ హోలెండ్ - ది కింగ్ ఎత్తయిన వేదిక మీద కూర్చొని వున్నాడు.
   
    ఇన్ వెస్టిట్యూర్ సెర్ మనీ మొదలైంది.
   
    ప్రపంచాన్ని రక్షించినందుకు ఆ సంవత్సరపు అత్యున్నతమైన బహుమతి......"ప్రొఫెసర్ ఆనందమార్గం."
   
    ట్రంపెట్స్ మోగుతున్నాయి. అతని బయోడేటా - అతడు సాధించిన విజయాలూ సంక్షిప్తంగా చదవబడుతున్నాయి. గ్రే కలర్ సూట్ లో అతడు మెట్లెక్కు తున్నాడు.
   
    ది స్క్రాల్! అతడి విజయం విషయం వ్రాయబడిన స్వర్ణపత్రం బహూకరింపబడినది.
   
    ది మెడల్!!..... తళతళా మెరుస్తూన్న పతకాన్ని అతడి కోటు జేబుకి హాలెండ్ రాజు అలంకరించాడు.
   
    చివరగా -
   
    ది నోబుల్ ప్రైజ్!!..... ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే చెక్కు కళ్ళముందు దృశ్యం కరిగిపోతోంది..... అయిపోతోంది..... అంతా అయిపోతోంది..... అంతా.... అయి.... పోతోంది.... అయి....పో....యింది.
   
    అతడి ప్రాణం విశ్వంలో కలిసిపోయింది.
   
    టు.వొ.త్రీ.ని విడగొడ్తే అయిస్కాంతం సృష్టించదనీ, కేవలం త్రీ. వొ.టు.గా మారుతుందని అలవాటుగా మర్చిపోయిన ఆ ప్రొఫెసర్ తన అవాస్తవపు కలల ప్రాంగణంలోనే సమాధి అయిపోయాడు.
   
                                                *    *    *
   
    ఆ చీకట్లో ఆమె హరికేన్ లాంతరు పట్టుకొని నడుస్తోంది. ఆమె మొహంలో ఆందోళన కదలాడ్తూంది. నాలుగువైపులా చూస్తూ ముందు కదుల్తోంది. "ఏమండీ" అని పిలుస్తూంది.
   
    బీటలు వారిన భూమిలోంచి పడుతూ లేస్తూ ఆమె గమ్యం లేకుండా సాగిపోతోంది. రాళ్ళు, గుట్టలు దాటుకొంటూ వెళుతోంది. కంగారుని అదిమిపెట్టి, భర్తకేమైందోనన్న ఆందోళనని నొక్కిపట్టి ఆమె వెదుకుతోంది. రాళ్ళూ గుట్టలూ దాటుకుంటూ వెళ్తూంది. ఆమె కాలికేదో తగిలింది. వంగి చూస్తే బోర్లాపడి వున్న శరీరం. ఎనిమిదేళ్ళ సాహచర్యం ఆమెలో అనుమానాన్ని రేపింది. తిప్పి చూసింది.
   
    ప్రకాశరావు.....భయంనుంచి దూరంగా..... దూరలోకాల్లో.
   
    ఆమె కెవ్వున అరచింది. లాంతరు చేతిలోంచి జారిపోయింది. అతని మృతకళేబరం మీదపడి గోడుగోడున ఏడుస్తూంది. ఆ నిర్మానుష్యమైన స్మశానంలో ఒంటరిగా ఆమె విలపిస్తూంటే సానుభూతి చూపిస్తున్నట్టు భూమి, ఆకాశం నిస్తేజంగా అయ్యాయి. అప్దిపోయిన హరికేన్ లాంతరు మినుకు మినుకుమని వెలుగుతూ ఆరిపోవటానికి సిద్దంగా వుంది.
   
    ఆమె ఎంతసేపు అలా ఏడుస్తూ వుందో తెలీదు. చాలాసేపటికి తేరుకొంది. మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ఆ ఎండిన చెట్టు క్రింద అలానే కూర్చుండి పోయింది.
   
    ఆమె తలెత్తి చుట్టూ చూసింది. పిచ్చిమొక్కలు, ఎండుకొమ్మలు, రాళ్ళగుట్టలు అన్నిటినీ దాచుకొన్నచీకటి. ఆ చీకట్లో పొదచాటునుంచి మెరుస్తున్న రెండు కళ్ళు పిల్లివా? నాక్కవా? తోడేలువా?
   
    ఆమె వణికిపోయింది. భయంతో కాదు - భర్త శరీరానికి పట్టబోతున్న గతి తల్చుకొని-
   
    మరిది ఎక్కడున్నాడో తెలియదు. ఆమె లేచింది.
   
    ఆగష్టు పదహారు-లండన్   
   
    చీకట్లో ధేమ్స్ నది జుట్టు విరబోసుకున్న స్త్రీలా వుంది. ఎప్పుడూ కళకళలాడుతూ వుండే గ్రాస్వెనార్ రోడ్ నిర్మానుష్యంగా వుంది.
   
    అది పగలో రాత్రో తెలియటం లేదు. రెండ్రోజుల్నుంచీ అంతా చీకటే. చీకట్లో లండన్ నగరం నిద్రపోతోంది. దూరంగా చర్చిలో గంటలు అవిరామంగా వినపడుతున్నాయి. కింగ్స్ రోడ్ మీదనుంచి హైడ్ పార్కు చుట్టూ తిరిగి హౌస్ ఆఫ్ పార్లమెంట్ చేరుకున్నాడు మెక్. కారు పార్కుచేసి లోపలి ప్రవేశించాడు.
   
    "గుడ్ ఈవెనింగ్ రాబర్ట్ ఫిన్చ్."
   
    "ఇది సాయంత్రమా?"
   
    "సారీ.....గుడ్ మార్నింగ్."
   
    మెక్ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
   
    రోగర్స్ ముందు మాప్ వుంది. కరోలిన్ ఐలెండ్స్.
   
    చుట్టూ ఎర్ర పెన్సిల్ తో మార్కు చెయ్యబడి వున్నాయి.
   
    కరోలిన్ ద్వీపాల్లోకన్నా చిన్న ద్వీపం, "లాండ్ ఆఫ్ యుటోపియా."
   
    ""లాండ్ ఆఫ్ యుటోపియా?" అడిగేడు మెక్.
   
    "అవును" అన్నాడు వెనక్కి వాలుతూ రోగర్స్.
   
    "ఏ లోహాలూ, ఏ మిశ్రమాలు లేని ప్రదేశం. రెండు చదరపు మైళ్ళ విస్తీర్ణమున్న ద్వీపం మనుష్యజాతిని రక్షించడం కోసం మనం చేసే ప్రయత్నం సఫలమయ్యేది ఆ ఒక్క ద్వీపం ద్వారానే. ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా ఆ మాత్రం ఛాన్సెస్ కూడా ఈ పరిస్థితుల్లో దొరకటం కష్టం."
   
    "ఈ ద్వీపంలో ఏ పదార్ధమూ లేదని కనుక్కొన్నది ఎవరు?"
   
    "క్రెడిట్ గోస్ టు ఎ బ్రిటిష్ జియాలజిస్ట్" అన్నాడు రోగర్స్. "మిండనోవా డీప్ లో విస్ఫోటనం జరిగి పసిఫిక్ పొంగినప్పుడు దగ్గరే వున్న ఈ ద్వీపం చెక్కు చెదర్లేదు. దాంతో అతడికి అనుమానం వచ్చి పరిశోధన సాగించేడు. ఫలితంగా ఈ విషయం బయటపడింది."
   
    "అప్పటి సంగతి వేరు. అప్పుడు ఆ నక్షత్రం దూరం నుంచి చంద్రుడ్ని ఆకర్షించింది. కానీ ఎల్లుండి అది దగ్గరగా వస్తోంది. అప్పుడు చుట్టూ వున్న సముద్రం పొంగవచ్చు. అది పొంగితే రెండు చదరపు మైళ్ళ విస్తీర్ణం ఏ పాటిది?"
   
    "పొంగవచ్చు. అయినా అంతవరకూ ఎందుకు? భూమి అంతర్భాగంలో వుండే ఏ లోహపు మిశ్రపు చర్యవల్ల నయినా, మిగతా ప్రపంచంతో పాటు ఆ ద్వీపమూ పేలిపోవచ్చు. కానీ మిగతా ప్రపంచంతో పోల్చుకుంటే ఆ ద్వీపం మీద ఆడం ఈవ్ లని వదిలి పెడ్దామా?" అంటూ పిన్చ్ నవ్వేడు. ఎవరూ నవ్వకపోవటం చూసి ఆపుచేసేడు.
   
    "లాండ్ ఆఫ్ యుటోపియా ఎవరి అధీనంలో వుంది?"
   
    "చైనా"
   
    చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు.
   
    ఆస్ట్రేలియాకి ఉత్తరంగా, అమెరికాకి పశ్చిమంగా, జపాన్ క్రిందుగా వుండే ఒక అనామకమైన దీవి. ఆ క్షణం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే స్థానాన్ని పొందింది.
   
    "నిజానికి చైనా కూడా దానిమీద ఆసక్తి చూపించడంలేదు. రాళ్ళూ రప్పలూ తప్ప ఏమీలేని ద్వీపం అది. మిండానియో నుండి సాధారణంగా బెస్తగాళ్ళు ఆ ద్వీపం వరకూ వెళుతూ వుంటారు.
   
    మళ్ళీ కొంచెంసేపు నిశ్శబ్దం.
   
    "రెండు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఎంతమందికి రక్షణ కల్పించగలం?"
   
    "రెండు వందల మందికి".
   
    "ఒక రక్షణేకాదు....." రోగర్స్ అన్నాడు. "ప్రళయం తర్వాత మిగతా ప్రపంచం ఎలా వుంటుందో తెలియదు. వాళ్ళ జీవితాంతం సరిపోయే ఆహారపదార్ధాలుంచాలి. ఒక షిప్, ఒక హెలికాప్టర్. ఇంకా....."
   
    "మన ప్రపంచం గురించిన విశేషాలూ, ఫోటోలూ, పుస్తకాలూ-"
   
    "అవి అప్పుడే భూమిలో పాతిపెట్టడం జరుగుతూందిగా."
   
    "లావాలో అవీ పాడవకుండా, ఆ ద్వీపంలో కూడా కొన్ని వుంచాలి."
   
    బాణంలా సూటిగా మనసులో వచ్చింది మరో ప్రశ్న. 'హు యీజ్ మోస్టు ప్రిఫర్డ్?' వరుసగా పేర్లు వ్రాసుకొంటూ పోతే మొదటి రెండు వందలమంది ఎవరు? ఆ తర్వాత మిగతా ప్రపంచం నివాసయోగ్యం కాకపోతే.....ఆహారపదార్ధాలు సరిపోకపోతే.... మొదట ఎవర్ని సముద్రంలోకి తోసెయ్యాలి?
   
    గుండెల్ని లోతుగా తొలిచే సమస్యలు.
   
    సమాధానం మౌనం.
   
    నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ మెసెంజర్ చిన్న కాగితం అందించేడు. అది చదివిన రోగర్స్ మొహం ఎర్రబడింది.

 Previous Page Next Page