Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 25

   

     "సినిమాకా? నేను సినిమాలు చూడడం మానేసి చాలాకాలం అయింది" అన్నాడు విశ్వనాథం.
   
    కమల ఆసక్తిగా "తెలుగేనా?" అడిగింది.
   
    "ఆ! మలయాళం కాదులే!" నవ్వింది ధరణి.
   
    "కమల ఇంకెవరితోనైనా వెళ్తుందేమో కనుక్కోండి" అన్నాడు విశ్వనాథం.
   
    "సినిమా వదిలేటప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. అసలే రోజులు బాగాలేవు. వద్దులెండి" అంది కమల.
   
    "పాపం కమలకి చూడాలనే ఉంది. ఈ ఒక్కసారికి మా కోసం కాస్త త్యాగం చేసి వెళ్ళిరండీ" అంది ధరణి.
   
    "ఇందులో త్యాగం ఏవుందీ?" మెత్తబడ్డాడు విశ్వనాథం.
   
    "అయితే అన్నయ్యగారు ఒప్పుకున్నట్లే. కమలా! త్వరగా చీర మార్చుకో" అని తొందర పెట్టింది ధరణి.
   
    విశ్వనాథం కూడా లేస్తూ "సరే తప్పేటట్లు లేదు" అన్నాడు.
   
    ధరణి టికెట్స్ అందించి, "అప్పుడప్పుడూ ఇలా బైటికివెళ్తూ ఉండకపోతే రొటీన్ తో పిచ్చెక్కిపోతుంది!" అంది.
   
    "కానీ.. రాత్రికి నా పూజ సంగతి!" నసిగాడు విశ్వనాథం.
   
    "వచ్చాక చేసుకోవచ్చులెండి. ఒక్కరోజుకి దేవుడేం అనుకోడు. ఎడ్జస్ట్ అయిపోతాడు!" అంది ధరణి.
   
    విశ్వనాథం అయిష్టంగానే అంగీకరించాడు.
   
    "మరి నే వస్తా! శ్రీధర్ వెయిట్ చేస్తున్నాడు" అంటూ ధరణి సెలవు తీసుకుంది.
   
    ఆ విధంగా చాలాకాలం తర్వాత విశ్వనాథం, కమలా కలిసి సినిమాకి వెళ్ళారు.
   
    తెలుగు సినిమా టీవీలో కూడా చూడడం మానేసిన విశ్వనాథానికి ఆ దృశ్యాలు, సంభాషణలూ పరమ ఆశ్చర్యాన్ని కలిగించాయి. హీరో హీరోయిన్ల వానపాటా, బెడ్ రూం సన్నివేశాలూ చూస్తుంటే మతిపోయినంత పనైంది. పెద్ద పెద్ద పిల్లలున్న హీరో, భార్య పోయాక ఉదాసీనంగా మారితే, అతన్ని ప్రేమించి అతనిచే ప్రేమించబడీ అతన్ని పెళ్ళి చేసుకుని తన దార్లోకి తెచ్చుకున్న కుర్ర హీరోయిన్ ప్రణయగాధ అది. వయసు మళ్ళిన ఆ హీరో కుర్రపిల్లతో వేస్తున్న ఆ స్టెప్స్ కీ పాటలోని బీట్స్ కి జనం హుషారెక్కిపోయి క్లాప్స్ కొడ్తున్నారు. ఇంకా కమెడియన్ల ద్వందార్ధ సంభాషణలు సరేసరి!
   
    కమల భయంగా చూసింది. ఏ నిమిషానికైనా విశ్వనాథం అలాంటి ప్రయత్నాలేం చెయ్యకుండా ప్రపంచంలో ఇంతకుముందు ఎక్కడా కననీ, విననీ వింతల్ని చూస్తున్నట్లుగా సినిమా చూడసాగాడు.
   
    ఇంటర్వెల్ లో పక్కన కూర్చున్న జంట కూల్ డ్రింక్స్ తాగుతుంటే చూసి తనూ వెళ్ళి ఇద్దరికీ కూల్ డ్రింక్స్ తెచ్చాడు. సినిమా పూర్తయ్యేటప్పటికి విశ్వనాథం రిలాక్సయ్యాడు.
   
    ఆ మరుసటిరోజు ప్రొద్దున్నే - "సినిమా ఎలా ఉంది?" ఫోన్లో అడిగింది ధరణి.
   
    "ఓ.... బావుంది" హుషారుగా జవాబిచ్చింది కమల.
   
    "నేను అడిగేది థియేటర్లో చూసిన సినిమా గురించి కాదు. ఆ తర్వాత.....?" కవ్వించింది.
   
    కమల బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి.
   
    "నీకెలా తెలుసు?"
   
    "తెలుసు కాబట్టే అలా ప్లాన్ చేశాను. తెలుగు సినిమానా? తడాఖానా?"
   
    "అంటే మీ పిన్నత్తగారికి హార్ట్ ఎటాకూ....?"
   
    "అసలు నాకు పిన్నత్తగారే లేరు! మీ విప్రనారాయణుడికోసం అల్లబడిన కథ అది. బోధపడిందా దేవదేవీ?"
   
    "రాకాసీ!"
   
    "థాంక్యూ ఎండ్ విష్ యూ హేపీ నైట్స్!" ఫోన్ పెట్టేసింది ధరణి.
   
    ఆ సాయంత్రం మామూలుగా పూల దుకాణానికి వెళ్ళి తను వాడుకగా కొనే కదంబంతోపాటు సన్నజాజుల మాల కూడా కొని హుషారుగా ఇంటికెళ్ళాడు విశ్వనాథం.
   
    అన్ని ఛానెల్స్  వాళ్ళూ పొద్దుటే భక్తి ప్రోగ్రామ్స్ ప్రసారం చెయ్యడం విధిగా పెట్టుకున్నారు. ఆరింటికల్లా ఓ ఛానెల్ వాళ్ళు ప్రసారం చేసే ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ మాత్రం చూసి ఆ తరువాత టీవీవైపు కన్నెత్తి కూడా చూడని విశ్వనాథం, ఇప్పుడు అదే ఛానెల్ వాళ్ళు ప్రసారం చేసే అర్ధరాత్రి మసాలా పాటలు వదలకుండా చూస్తున్నాడు.
   
                                        5
   
    "వారం రోజులు గడువు పెట్టాను. అయిపోయింది! పోనీలే పదిరోజుల తర్వాత ఏ సంగతీ చెబుతావు అని ఎదురుచూశాను.... అధీ అయిపోయింది. ఇంకా ఎంతకాలం ఎదురు చూడమంటావు? ప్రమోషన్స్ లిస్ట్ ఫైనలైజ్ చెయ్యవలసి వుంది!" ఫైలులోంచి తల ఎత్తకుండానే అన్నాడు కామ్ గా.
   
    ధరణి పెదవి మునిపంట నొక్కిపట్టి బలవంతాన కోపాన్ని నిగ్రహించుకుంది.
   
    పక్కింటావిడ వస్తువు బదులు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే 'ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడమంటారూ? ఇచ్చెయ్యండి' అని నిష్టూరంగా అన్నట్లుంది ఆయన ధోరణి. అతని వాయిస్ లోని సహజత్వాన్ని బట్టి ఇలా ఆడపిల్లల్ని బెదిరించి తన అవసరాలు తీర్చుకోవడంలో అతనికున్న సర్వీసు చెప్పొచ్చు.
   
    "వెళ్ళు.... రేపు ఏ సంగతీ చెప్పు! లేదా ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ కోసం ఎదురుచూడు!" అనేసి ఫోన్ తీసుకుని ఎవరికో డయల్ చెయ్యసాగాడు.
   
    ధరణి అవమానభారంతో ఆ గదిలోంచి బైటికి వచ్చింది. ఆమె మనసు కుతకుతలాడిపోతోంది! ఇంత పబ్లిక్ గా, 'నాతో గడపకపోతే నీ ఉద్యోగానికే ముప్పు' అంటున్నా తనేం చెయ్యలేకపోవడం ఆమెకు చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలో తోచటంలేదు.
   
    బాధపడుతూ కూర్చుంటే వచ్చేలాభం ఏమీ లేదు. బాధ వివేకాన్ని, ఆలోచనల్నీ కూడా మింగేస్తుంది. తాడిని తన్నే వాడుంటే దాని తలదన్నేవాదు కూడా ఉంటాడట. వాడెవడా? అని ఆలోచించడమే తక్షణ కర్తవ్యం అనుకుంది.

 

 

                                 -- * * * --

 Previous Page Next Page