"మనం ఒక నమ్మకంతో వాళ్ళని ఆ హాస్టల్లో వుంచాం. ఆ నమ్మకాన్ని ఆ స్కూల్ వాళ్ళు నిలపగలిగితే పిల్లలు అలా అనుకునే ఛాన్స్ తక్కువ! లేకపోతే మాత్రం మనం చినుకుకి భయపడి పిడుగు కింద తల పెట్టినట్లవుతుంది!" అంది ధరణి.
ధరణీ, శ్రీధర్ ఇంటికి వచ్చేసరికి అభీ నిద్రపోయాడు. ప్రియా, పూజా బెడ్ రూమ్ లో ఆడుకుంటున్నారు. చందూ ఇంట్లో లేడు.
"ప్రియని వాళ్ళ ఇంటికి పంపించు. వాళ్ళమ్మతో ఉండేది ఈ ఒక్కరోకే కదా!" అన్నాడు శ్రీధర్.
"అలాగేనండీ!" అంటూ ధరణి గదిలోకి వెళ్ళింది.
శ్రీధర్ ముఖం కడుక్కోవడానికి బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. అతను ముఖం మీద నీళ్ళు చల్లుకుంటూ ఉండగా ధరణి బాత్ రూం తలుపుకొడుతూ "ఏవండీ, ఏవండీ" అని కంగారుగా పిలిచింది.
శ్రీధర్ తలుపు తీసి "ఏవైందీ?" అన్నాడు.
ఆమె ముఖం పాలిపోయి వుంది. ఏమీ చెప్పలేనట్లుగా బ్లాంక్ గా చూస్తోంది.
"ఏమైందీ ధరణీ? ఏం జరిగింది?" శ్రీధర్ ఆమె భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు.
ధరణి పూజ ఉన్న బెడ్ రూంవైపు వేలితో చూపిస్తూ "పూజా....పూజా...." అంది.
"ఏమైంది పూజకు?" శ్రీధర్ ధరణిని వదిలి పూజ వున్న గదివైపు ఒక్కగెంతులో నడవబోయాడు.
ధరణి అతని చెయ్యిపట్టి ఆపుతూ "పూజకేం కాలేదు. కానీ అది...." అని కొంగుతో ముఖం తుడుచుకుంటూ "ఓ మైగాడ్! మీకెలా చెప్పాలీ?" అంది.
'ఏం జరిగిందో నువ్వు చెప్తావా? నేను వెళ్ళి చూడనా?" కోపంగా అడిగాడు శ్రీధర్.
ధరణి అతని చేతిని ఆసరాగా తీసుకుంది. ఆమె నుదురంతా స్వేదం అలుముకుంది. ఆమె ఏదో పెద్ద షాక్ కి గురైనట్లు ఉంది ఆమె ముఖం.
"ధరణీ!" మృదువుగా పిలిచాడు శ్రీధర్.
ధరణి నిస్సత్తువగా సోఫాలో కూర్చుంది.
శ్రీధర్ ఆమెని వదిలి పూజ ఉన్న బెడ్ రూంలోకి నడిచాడు.
3
లక్కపిడతలతో బొమ్మలాట లాడుకోవాల్సిన చిన్నారులు ఆడకూడని ఆటలు ఆడుతూ ఆ తల్లిదండ్రుల కంట పడ్డారు.
ధరణి తలపట్టుకు కూర్చుంది.
పిల్లలు ముందు తనూ, శ్రీధర్ పొరపాటున కూడా అటువంటి చేష్టలు చెయ్యలేదు. అటువంటిది, ఊహరాని పసిమొగ్గల్లాంటి తన కూతురు, రెండు బొమ్మలు చేతిలో పట్టుకొని వుంది. ఆ బొమ్మలకి బట్టలు విప్పి రతి భంగిమలో వుంచి కిలకిలలాడ్డం ఆమెకు విస్మయం కలిగించింది.
"పూజా!" పిలిచాడు శ్రీధర్ కూతుర్ని.
పూజ బొమ్మల్ని వదిలేసి "ఏంటి డాడీ?" అంది.
తండ్రిని చూసి భయపడడం కానీ, ఉలిక్కిపడడం కాని చెయ్యలేదు!
"ఏం ఆటలమ్మా అవీ! తప్పుకదూ! ఎక్కడ చూశావూ!" కోప్పడ్డాడు శ్రీధర్.
పూజ తడబడలేదు. "సినిమాలో చూశాగా!" అంది.
పూజ వెనకాల నక్కి బితుకు బితుకు మంటూ చూస్తున్న ప్రియకేసి చూశాడు.
"చాలా లేట్ అయింది. మీ ఇంటికెళ్ళమ్మా" అన్నాడు.
అన్నదే చాలని తుర్రున పారిపోయింది ప్రియ.
శ్రీధర్ పూజ దగ్గరికి వెళ్ళి "అలాంటి సినిమాలు చూడకూడదు. కళ్ళు పోతాయి" అన్నాడు.
"నిజంగా కళ్ళు పోతాయా?" అడిగింది పూజ.
"ఔను!"
"మరి అలా చేసేవాళ్ళకో!" కుతూహలంగా అడిగింది పూజ.
"ఔను!"
"మరి అలా చేసేవాళ్ళకో!" కుతూహలంగా అడిగింది పూజ.
శ్రీధర్ వెంటనే జవాబివ్వలేకపోయాడు. పూజ ముఖం వంక చూశాడు. ముఖం అమాయకంగా, నిర్మలంగా ఉంది! "తప్పు! పద పడుకుందువుగాని" అన్నాడు.
పూజ "గుడ్ నైట్ డాడీ!" అని వెళ్ళిపోయి పడుకుంది.
శ్రీధర్ ధరణి దగ్గరికి వచ్చి ఆమెమీద చెయ్యి వేశాడు.
"ఏమిటిది శ్రీ? ఇలా జరుగుతుందేమిటి?" గాభరాగా అడిగింది.
"నువ్వు అనవసరంగా కంగారుపడుతున్నావు. స్టార్ మూవీస్ లో ఏదైనా అడల్స్ పిక్చర్ చూసిందేమో, ఇప్పటినుండీ మనం జాగ్రత్తగా చూసుకుందాం" అన్నాడు.
"మన దగ్గర ఎంతకాలం ఉంటారని మనం జాగ్రత్త పడటం?" బాధగా అంది ధరణి.
"నువ్వు అనవసరంగా అన్నింటికీ హైరానాపడి టెన్షన్ తెచ్చుకుంటావు" మందలింపుగా అన్నాడు శ్రీధర్.
"భార్యాభర్తలంటే ఏమిటో.. వారి మధ్యన ఎటువంటి శారీరక సంబంధం ఉంటుందో ఆ వయసులో మనం ఊహించనన్నా ఊహించగలిగామా?" ధరణి బాధగా అంది.
శ్రీధర్ ఆమె తలమీద రాస్తూ "జనరేషన్ చాలా ఫాస్ట్ గా మారిపోతోంది ధరణీ! నా వయసులో నేను మా నాన్నలా బొగ్గు ముక్కలతో రాసుకోలేదు. పలకా, బలపం పెట్టి రాసుకున్నాను. బల్లకట్టు మీదా, ఎడ్లబండి మీదా ప్రయాణించాలేదు. సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళాను. నాలా నా కొడుకు ఆ వయసులో చింతచెట్లు ఎక్కి కాయలు కొయ్యడం, గోటీబిళ్ళలు ఆడడం చెయ్యడం లేదు. కంప్యూటర్ గేమ్స్ ఆడుతూ, వీడియోలో పిక్చర్స్ చూస్తున్నాడు. విఠలాచార్య కత్తి ఫైటింగ్స్ సినిమాలు నోరు తెరుచుకుని చూసే వాళ్ళం మనం. ఇప్పటి పిల్లలు క్లోనింగ్ గురించి, ఏలియన్స్ గురించీ తెలుసుకోవడంలో థ్రిల్ పొందుతున్నారు. తరం తరం నిరంతరం ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఇదో అనంత ఝరి. కొట్ట ఎప్పుడూ వింతగానూ, తప్పుగానూ ఉంటుంది. ఎందుకంటే అది అప్పటివరకూ ప్రచారంలో లేదు కాబట్టి!" అన్నాడు.
శ్రీధర్ మాటలకి ధరణి కొద్దిగా ఊరడిల్లింది. "అంతేనా? ప్రమాదం ఏమీ జరగడంలేదుగా!" అంది.
"అంతా మామూలే! కనగారు పడాల్సిందేం లేదు!" అన్నాడు.
ధరణికి ఏదో అపశ్రుతి అనిపించినప్పటికీ అప్పటికి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. పడుకోబోయే ముందు శ్రీధర్ చెప్పాడు. "పూజని పొద్దుట ఏమీ అడగకు! అనవసరమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం."
"అలాగే!" అంది ధరణి.
4
"హాయ్ ధరణీ! ఏమిటిలా చెప్పాచెయ్యకుండా వచ్చావు?" ఆశ్చర్యంగా అడిగింది కమల.
ధరణి నవ్వి అక్కడే కూర్చుని కాఫీ తాగుతున్న విశ్వనాథంతో "నమస్కారం అండీ!" అంది.
"నమస్కారం... ఆఫీసునుండి ఇటే వస్తున్నారా?" పలకరించాడు.
"ఆ....చిన్న పనిమీద వచ్చాను" అంది.
"ఏమిటో అది?" కుతూహలంగా అడిగింది కమల.
"ముందు ధరణిగారికి కాఫీ పట్రా!" చెప్పాడు విశ్వనాథం.
"వద్దు! ఇప్పుడే తీసుకుని వస్తున్నాను. నేనూ శ్రీధర్ ప్రొద్దుట సినిమాకి వెళ్దాం అనుకుని టికెట్స్ ఎడ్వాన్స్ బుకింగ్ చేయించుకున్నాం. తీరా ఇప్పుడేమో మా పిన్నత్తగారికి హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు ఫోన్ వచ్చింది. మేము అర్జెంటుగా వెళ్ళాలి!" అంది.
"అయ్యయ్యో.... వెళ్ళిరండి. సినిమా ఎప్పుడైనా చూడచ్చు....!" అన్నాడు విశ్వనాథం.
"అదే మేమూ అనుకున్నాం. కానీ ఇంత డబ్బు పెట్టి కొన్న టికెట్స్ వేస్ట్ చెయ్యడం అంటేనే బాధగా ఉంది. శ్రీధర్ ఇవి మీకిచ్చి కమలనీ, మిమ్మల్ని సినిమాకి వెళ్ళిరమ్మని తన మాటగా చెప్పమన్నాడు" అంది ధరణి.