Previous Page Next Page 
మమత పేజి 24

                                 

 

    ఆ మంచం మీద కూర్చునే -- ఆరు రూపాయల అద్దె గుంజుతున్నా - యిల్లు కప్పించని కామందును గురించి రహస్యంగా తిట్టుకోవాలి. పాతికేళ్ళ సర్వీసయ్యాక -- రిటైరయ్యాక - సర్కారు వారిచ్చే -- పదిహేను వందల ప్రవిడెంటు ఫండును గురించి  తమలో తాము పోట్లాడుకోవాలి. చంటి గాణ్ణి - వెంటిగాణ్ణి , తలోకళ్ళూ ఎత్తుకుంటూ జిల్లా బోర్డు ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణం చేసొచ్చి- డాక్టరు గారి సహాయాన్ని తలుచుకుంటూ - ఆ నులక మంచం మీద కూలబడే -- తాము నడుం వాల్చుకోవాలి.
    తనకు ఏదో అన్యాయం జరుగుతున్నట్లు బాధపడింది . ఎవరితో చెప్పుకోవాలి తన మనస్సుని? తల్లితో చెప్పాలనిలేదు. తండ్రికి చెప్పి ప్రయోజనం లేదని అర్ధమయింది. తెల్లవారగానే భారతి దగ్గరకు వెళ్ళింది చివరకు.

 

                                       
    స్నేహాలు రకరకాలు.
    చిన్ననాటి స్నేహం పావనిదీ భారతిది.
    జరిగిన కధంతా చెప్పింది పావని. తండ్రి పడుతున్న బాధనూ- తన మనస్సులో మెదులుతున్న ఆలోచనలనూ చెప్పింది. ఆత్మీయుల - అపేక్ష వున్న మనిషి గనుక - పావనిని అక్కున చేర్చుకుని వోదార్చింది. పెళ్ళి అవగానే ఆడపిల్లలకు సహజంగా వచ్చే పెద్దరికంతో 'ఏం చేయనే' అని పావని అడిగినప్పుడు తనకు న్యాయమనిపించిన సలహా చెప్పింది భారతి ఆప్యాయంగా అరమరికలు లేకుండా. ఇంతవరకూ పిచ్చా పాటీ మాట్లాడుకునే వరకేవాళ్ళ స్నేహం పరిమితమై ఉండేది. నిజానికి కవల పిల్లాల్లా అతుక్కుపోయి తిరిగేవాళ్ళు యిన్నాళ్ళూ. ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకునేవారు. క్రమ క్రమంగా పావని ఒత్తిరి మనిషి కావడంతో భారతి జాకెట్లు తొడుక్కోగానే పిట పిటలాడి చిట్లి పోయేది పక్కున నవ్వేది భారతి. జరగబోతున్న భారతి పెళ్ళిని గురించి -- ఇద్దరూ గంటల తరబడి ఒకరు చెవులోకరు కొరుక్కుంటూ చర్చించుకునే వాళ్ళు, అతుక్కుపోయినట్లు కూర్చుని. ఆ సంరంభం లో శారదమ్మ గారి కేకలు పావని చెవుల్లో పడేవి కావు . వీళ్ళ గుసగుసలు చూసి - 'ఛీ పాడు కబుర్లు - ఏముంటాయే , బాబూ అంతగా గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటానికి- ఎక్కడ నుంచి ఊరుకోస్తాయో అన్ని రహస్యాలు వాళ్లకి!' అని తక్కిన ఆడపిల్లు అసూయపడటం కూడా హాయి అనిపించేది వాళ్ళిద్దరికి.
    భారతి అత్తవారింటికి మొదటిసారి వెళ్తున్న రోజు ఇద్దరూ తనివి తీరా కావలించుకుని ఏడ్చారు.
    'ఈ శుభసమయంలో ఈ శోకాలేమిటమ్మా విడ్డూరం మరీను-' అంది కరణం గారి అమ్మాయి.
    'ఎందుకీ ఏడుపు' అంది కళ్ళు తుడుచుకుంటూ పావని.
    'నిన్ను వదిలి పోవాలంటే బాధగా వుందే' అంది భారతి. మరొకసారి పావనిని గుండెలకు హత్తుకుంటూ.
    'ఇద్దరిలో ఏ ఒకళ్ళు మగ జన్మేత్తి న సరిపోయేది'
    ఏడుస్తూ నవ్వింది భారతి.
    నవ్వుతూ ఏడ్చింది పావని.
    అటువంటి గాడ స్నేహం పెనవేసుకున్నది గనుకనే - ఆ సమయంలో అదృష్టవశాన పుట్టింటికి వచ్చిన భారతి దగ్గరకు వెళ్ళగలిగింది పావని.
    భారతి మాటలన్నీ విన్న తర్వాత, తన ఆలోచనలన్నీ చెప్పుకున్నాక, పావని మనస్సు కొంత తేలిక పడింది. అలాగే మాట్లాడి మాట్లాడి మౌనంగా కూర్చుండి పోయారిద్దరూ. స్వామి రూపం కళ్ళ ముందు మెదిలింది . మరొక సారి పావనికి. లేత తమలపాకు లాంటి శరీరం స్వామిది. అందులో అంతో రవ్వంతో స్త్రీత్వం తాలూకు నాజూకు తనముంది. అప్పుడే తెలుపు విరిగి నీలిమకు విరుగుతున్న గడ్డం - పత్రికామ్ల జన్మ రహస్యాన్ని గురించో, నజభబల్ బరేభలతో విడదీసిన - పద్య రహస్యం గురించో పాఠం చెబుతున్నప్పుడు గీరతో మ్రోగే అతని కంఠంలోని ఆర్ద్రత,వంట చేస్తూ తిరగమోతల గుభాళింపు కిటుకుల్ని వర్ణిస్తున్నప్పుడు అమాయకంగా  అతని కళ్ళల్లో తొంగి చూసే గర్వం - మనస్సు తో మెదిలి , ' మంచివాడేనే పాపం-' అంది పావని.
    'ఎవరే?' అంది భారతి చిరునవ్వుతో పెదిమలు విప్పుకుంటూ.
    'తనే'
    'తనంటే'
    'పోవే! నీకు తెలీదు ! నా నోటితో చెప్పించాలని.'
    'నువ్వు ఎన్నిసార్లు చెప్పించలా నా నోటితో  ? చెప్పుదూ ఎవరే - అతను'
    'మాష్టారే'
    ఎర్రబడింది పావని నవ్వు.
    నేస్తం బుగ్గ గిల్లి 'ఊహూ' కూత పట్టిందే పిట్ట.' అంటూ విరగబడి నవ్వింది భారతి.
    'విజయనగరం సంబంధం చేయలేకపోతే బండరాయి కొట్టుకుని బావిలో పడతాను' అని ప్రతిజ్ఞ చేసిన రఘుపతి గారు అటువంటి అఘాయిత్యం చేయకపోగా, సలక్షణంగా భార్యా సమేతంగా ఘనంగా పీటల మీద కూర్చున్నారు. స్వామి కాళ్ళు కడగి కన్యాదార పోశారు.
    పెళ్ళికి రారనుకున్న ,మేనమామ మంగపతి గారు సకుటుంబంగా తరలి వచ్చారు.
    ఆ తర్వాత పెళ్లి నాటి ముచ్చట్లు ఎప్పుడు తలచుకున్నా త్రుళ్ళి పడేవాడు స్వామి.
    'దమ్మిడి కట్నం యివ్వకుండా స్వామిని బుట్టలో వేసుకున్నాడు రఘుపతి ; అంటూ వ్యాఖ్యానించాడు పరాంకుశం.
    'మా అక్కయ్యను చేసుకుంటా వనుకున్నాం బావా' అన్నాడు అమాయకంగా 'మంగపతి మావయ్య' కొడుకు వెర్రి శంకరం.
    'మీ ఆయనకు క్రాపు పెట్టించే భారం నీది తల్లీ యింక' అంది భారతి మధుపర్కం సవరిస్తూ.
    'అంతా చల్లగా చూశాడు భగవంతుడు. అదే పదివేలు' అనుకుంది సీతమ్మగారు.
    'వెర్రికుట్టి వదినగారూ మా పావనమ్మ. మీ చేతుల్లో పెడుతున్నా, ఎలా కడుపులో పెట్టుకుంటారో' అంటూ సీతమ్మ గారి రెండు చేతులూ పట్టుకుని ఆ చేతులతో తన ముఖం కప్పుకుని బావురుమంది శారదమ్మ గారు.
    'నాకు కొడుకు- కోడలూ - ఆ ఇద్దరూ రెండు కళ్ళు వదినా. నీకు అటువంటి భయం అవసరం లేదు.' అందిసీతమ్మ గారు.
    స్కూల్లో టీచర్ల అందరూ కలిసి తలకు రెండు రూపాయలు చందా వేసుకుని ఒక పింగాణి టీ సెట్టు కొని ప్రజేంటిచ్చారు దంపతులకు 'సంతోష భాష్పాలు' అంటూ పంచరత్నాలు స్వయంగా వ్రాసి , గంభీరంగా చదివారు పెళ్ళి పందిట్లో పరాంకుశం. కోనేటిరావు కక్షలు మరిచి పెళ్ళి కొచ్చి స్వయంగా పెళ్ళికూతురుకు నూట పదహార్లు చదివించారు. వెంకన్న ఒంటెద్దు బండెక్కి నూతన దంపతులిద్దరూ అంజనేయుల వారి గుడికి వెళ్తూ - కన్నెపిల్ల తొలి వలపుల విరుపుల్లా కొంచెం కొంచెం విచ్చుకుంటూ , ఎదుట పడుతున్న తాటి వనాల డొంకదారి వంకరలు దాటి ఎగిరిపడిన బండితో పాటు జారిపోతున్న పెళ్ళి కుమార్తెను చూసి 'పైకి జరగండి కొంచెం - పడతారు జారీ ' అన్నాడు స్వామి.
    'మీరిలా గట్టిగా పట్టుకుంటే నేనెక్కడ పడతాను లెండి అంది నవ్వుకుంటూ పైకి జరుగుతున్నా పావని.
    'మీరు కొట్టండి ముందు కొబ్బరి కాయ ' అన్నాడు స్వామి నవ్వి.
    'ఆ అండీ - యింక కట్టి బెట్టాలండి మీరు'
    'సరేనండి.'
    ఇద్దరూ నవ్వుకున్నారు. గుడి మంటపం లో చతికిలబడి  కూర్చుని -- అల్లంత దూరంలో రావిచెట్టు క్రిందనున్న పాముల పుట్టాను చూస్తూ -- కొబ్బరి ముక్కలు తిన్నారిద్దరూ మౌనంగా మాట్లాడుకుంటూ.
    
                               *    *    *    *
    ఒకే యిల్లు-
    ఒకే రాత్రి -
    'ఒకసారి యిలారండి - అన్నాడు స్వామి.
    'ముందు ఆ అండి తీసెయ్యండి మరి' అంది పావని.
    'ఎలా?'
    'మీకు తెలీదూ'
    'అలావాటై పోయిందండీ.'
    'మానుకోవాలండీ'
    'ఏం చేయమంటారు.'
    'నాకూ ఒక పేరుంది-'
    'ఔను.'
    'అది మీకు తెలుసు'
    'తెలుసు'
    '.......' అంది పావని తల వంచుకుని.
    '.....' అన్నాడు స్వామి అముఖాన్నే చూస్తూ.'
    '.....' ఇది పావని ప్రశ్న.
    '......' అది స్వామి జవాబు.
    'మా అమ్మ-' అన్నాడు స్వామి అప్రయత్నంగా.
    'ఇప్పుడెందుకు గుర్తోచ్చారండి ఆవిడ.'
    'ఎప్పుడూ గుర్తొస్తుంది మరిచి పోలేను.'
    నిచ్చనలు వేసుకునీ - కిటికీ సందులను చూసుకుని నీరిక్షిస్తున్న అమ్మలక్కలు  ఆశాభంగంతో చల్లబడి పోతున్నారు.

 Previous Page Next Page