Previous Page Next Page 
మమత పేజి 23

 

    రఘుపతి గారు తొలిసారిగా భార్య పై చేయి చేసుకుంటానికి కారణం - ఆమె పై ప్రకోపించిన ఆగ్రహావేశం మాత్రం కాదు. ఆనాడు శారదమ్మ గారు గుప్పించిన ప్రశ్నల వర్షం తో అయన చిరకాలంగా కప్పుకుంటున్న, ఆత్మవంచనకు సుఖంగా సహాయం చేసిన పొగ చూరిన గాజు తేరకరిగిపోయింది. అయన జీవితం నుండి విడివడిన గతం -- నిజరూపంలో బయటకు వచ్చి - ఎదుట నిలిచింది. గెలిచేస్తున్నట్లు నవ్వింది. 'రఘుపతీ ! నీ బ్రతుకు వ్యర్ధం. ఓడిపోయావు  నువ్వు. ఊరిని పరిపాలించాలని కలలు కంటున్న నువ్వు - నీయింటిని పరిపాలించుకోక లేకపోయావు- కన్నబిడ్డకు, కన్నె చెర విడిపించి ఘనంగా అత్తవారింటికి సాగనంపి- ఋణం తీర్చుకోలేని అసమర్ధుడివై పోయావు. పరివేలు కట్నమివ్వగలిగితే నీ బిడ్డకు స్వర్గాన్ని అందించగలవు. పది రాగి పైసలు - అప్పు కూడా - పుట్టించగల శక్తి లేకపోయింది నీకు. ఆస్తి తగలబెట్టావు. కోర్టుల నూ ప్లీడర్లనూ బ్రతికించావు గాని- నీ కూతురుకు తగిన జీవితమిచ్చి బ్రతికించలేక పోతున్నావు. ఓడిపోయావు రఘుపతీ . భగవంతుడి కోర్టులో - బ్రతుకనే దావాలో నీ కూతురి జీవితం దానికి నష్టపరిహారం కాదంటావా?' అంటూ ముద్దాయినీ కోర్టులో నిలబెట్టి నిగ్గదీసినట్లు అడిగింది ఆ రూపం.
    ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక నిస్సహాయత- పరాజితున్నయ్యా నన్న కడుపు మంటకు రగిలి పెట్రోలై మండింది. భార్యను హింసించినా సెగల పోగలకు ఊపిరాడని రఘుపతి గారు - అందుకనే- ఎన్నడూ లేనిది - కుమార్తె ముందు - కళ్ళు - తుడుచుకోవడం జరిగింది.
    ఏమైనా సరే! నీకు - అన్యాయం చేయనమ్మా. ఎలాగైనా పుట్టిస్తా తల్లీ డబ్బు - విజయనగరం సంబంధం జరిగి తీరుతుంది. ముమ్మాటికి - కాకపోతే -- నే బ్రతకను- అది నిజం - పాపాత్ముడ్ని నీ విషయం గట్టిగా ఆలోచించలేక పోయాను. ఈ దిక్కుమాలిన రాజకీయాల్లో పడి, గడ్డిపోచలా కొట్టుకు పోయాను తల్లీ. కార్లలోనూ, విమానాల్లోనూ తిరగవలసిన కన్నతల్లివి నువ్వు.'
    అయన లేచి - అలాగే మతి చలించినట్లు వెలవరిస్తూ - ఆవేశంలో తూగిపోతూ -- వెళ్తున్నారు.
    'ఎక్కడికి నాన్నా?'
    'పుట్టిస్తానమ్మా డబ్బు . నీకోసం చివరకు కోనేటిరావు కాళ్ళ మీదన్నా పడి అని నీ జీవితం కంటే -- నాకు ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు సుమా--
    ఆరోజు శారదమ్మ గారు తుడుచుకుంటున్న కళ్ళు చూసింది పావని. రఘుపతి గారు తుడుచుకుంటున్న కళ్ళు చూసింది . వెర్రి ఆవేశంతో గొడ్డును బాదినట్లు తల్లిని హింసిస్తున్న తండ్రిని చూసింది. అసహయురాలై విరిగిపోయినట్లయిన శరీరాన్ని నిలుపుకోలేక వంటింటి గడపలో తూలీ పడిన తల్లిని చూసింది.
    చిన్ననాటి నుంచీ తండ్రి పట్ల తన కున్న చనువూ -- ఆపేక్షా-- తల్లి దగ్గర లేకపోయాయి. తాను చేసిన ప్రతిపనీ తండ్రిని మెప్పించేది. తల్లిని విసిగింప జేసేది.
    'తండ్రీ కూతుళ్ళు ఒకళ్ళ కొకళ్ళు సరిపోయారు. నెత్తి నేక్కించుకొండి.' అనక కొరకలచై నిప్పెడుతుంది అంటూ సాధించేది తల్లి.
    'చూద్దుగానిలే - ఇదుగో అమ్మీ - కొరకంచై నిప్పు పెడుతుందో - మణిహరంలా వేలుగుతుందో అంటూ తాంబూలపు పచ్చ కర్పూరపు పరిమళం తో సుభాళిస్తూ ముద్దు పెట్టుకునేవాడు తండ్రి.
    ఆరాత్రి యింట్లో ఎవరికీ అన్నాలు లేవు. స్వామి శిష్యరికం వల్ల నేర్చుకున్న వంట వండి తల్లిని పిలిచింది పావని. ఆమె మరి నాలుగు తిట్టి - మూలగా చాప పరచుకుని పడుకుంది తల్లి. తండ్రి రాక కోసం ఎదురు చూసింది పావని.
    రఘుపతి గారు యింటికి వచ్చేసరికి రాత్రి పదకొండు గంటలు దాటింది. అడగవలసిన వాళ్ళందరిని అడిగాడు అప్పు.
    ఒక్కొక్కళ్ళు ఒక రకంగా సమాధానం చెప్పారు.
    'ఈమధ్య పెద్దాటలాడి - మనలో మన మాట - మరెవరితో అనకండి -- మొన్న నెలరోజులు జింఖానా దెబ్బతో పాతికవేలు పోయింది. సర్కారు సొమ్ము పదివేలుందందులో . తల్లి తోడు రఘుపతి గారూ' ఈసారి గుర్రపు పందెం కొడితే గాని ఈ అప్పులు తీరవండి. ఎవరన్నా -- తాకట్టేడతా ఆ నల్లచెరువు కండం- పదివేలిస్తారేమో చూడండి. మాతోడల్లుడు సన్నాసి అయిదు రూపాయి కట్టి- డెబ్బై  వేలు- అది జాకుపాటు కోట్టాడండీ- పుగాకు ముక్క ;లడుక్కునే సన్నాసి- కారుకొని - బెంగుళూరు రేసుల కెళ్లాట్ట ఆ పంతులమ్మ పీనుగుని ఎంటేసుకొని- అది సరే గాని రఘుపతిగారూ -- పుగాకు కాడలుంటే నాలుగు పంపండని నారి గాన్నంపా సందేళ- తమ దగ్గరకు రాలా?' అంటూ అవలించాడు మున్సుబు. ఆరిపోయినచుట్టాను అపేక్ష తీరక చప్పరిస్తూ .
    'కోనేటి రావు బాంకు సొమ్ము తిన్నానని మీరు ప్రపంచ మంతా అల్లరి చేశారు గానీండి -- ఆ మున్సుబు మాట విని - నెత్తి మీదా వెంట్రుకలు లేని ప్రతి ఎదవకూ అప్పులిచ్చి- ముణిగి పోయానండి - ఆళ్ళ పేరు  ఈళ్ల పేరూ పెట్టి తీసుకుని అంతా ముస్సబే తగలేశాడు చిట్లాట లో ' అంటూ తనభాధలు చెప్పుకున్నాడు కోనేటిరావు. అన్ని మరిచిపోయి అంతటి మనిషి వచ్చి సహాయం అర్ధించినా.
    'మున్నెగదుటయ్యా అమ్మయి పెళ్ళి చేస్తా కన్నబిడ్డ సుఖం కంటే ఈదిక్కు మాలిన జీవితాని కింకేం కావాలని- ఎత్త లేకపోయినా తెగించి - నిక్షేపం లాంటి సంబంధం చేశా. పట్టుబట్టలేక్ అయిందనుకో పదిహేను వందలు పై చిలుకు. ఇదిగాక మోటారు సైకిలు లాంచనం ఒప్పుకుని- పెళ్ళి కొడుక్కి ప్రత్యేకంగా మూడు వేల ఏడువందల అప్పజెప్ప. ఏది? ఆరుగురు ఆడబడుచులకూ అర్ధ నూట పదహార్లు లంచానాలూ - ఏంది వేల కట్నం కాకనుకో. మొత్తం ఇరవై దాకా దేకిందయ్యా. అయితే ఒకటి . అల్లుడు బంగారమానుకో. అమెరికా ఎగిరి ఎంచక్కా పోతున్నారు అల్లుడు అమ్మాయీ- కాని- యింకా బయట పడలేదయ్యా నేను గూడా - చివరకు అల్లుడ్నే అప్పడిగి తీసుకోవలసి వచ్చింది. మనలో మాట అమ్మాయన్నా -- మేమన్నా ప్రాణం లే . అందాకా ఎందుకూ? మా వియ్యంకురాలు- కావేరమ్మంటే మాటలా . వీళ్ళ కాపురం వీళ్ళను చేసుకోనివ్వచ్చా? ఊహు! పానకంలో పుడకలా తయారై-- దీన్ని నానా తిప్పలు పెట్టాలని ప్రయత్నంట. అల్లుడి దగ్గర ఈ ఆటలు సాగాలేదనుకో. తన్ని తరిమేశాట్ట. ఎంత తల్లయితే మాత్రం? అదేమరి- అంత చదువుకున్న వాడు గనకనే ఎప్ఫర్సీ యస్సంటే మాటలా ఏమిటి? ' అంటూ తన కూతురు సంసార బ=వైభోవాన్ని గురించి ఏకరువు పెట్టాడు కరణం గారు.
    తిరిగి తిరిగి యింటికి చేరిన తండ్రిని భోజానానికి లేవండి నాన్నారు' అంటూ పిలిచింది పావని.
    'లేదమ్మా! కడుపు నిండిపోయింది . నా ప్రయోజకత్వానికి చెరువై నిండి పోతున్నదన్నదమ్మా కడుపు- ఓడిపోయాను తల్లీ - పాడుచేస్తున్నా నీ జీవితాన్ని -- బావురుమన్నాడు రఘుపతి గారు.  

                                      10

    ఒకే రాత్రి -
    ఒకే యిల్లు -
    కమ్మని కలలు కంటూ నిద్రపోతున్నాడు స్వామి.
    తన ఇంటిని గురించి- తనకు భార్యయై జీవితాన్ని సుఖశాంతులనూ కన్నీటిని భవిష్యత్తునూ పంచుకోబోతున్న పావనిని గురించి - తనకు మాతృమూర్తి యై , జీవితాన్ని తీర్చిదిద్ది , తన కోసం కష్టాలనూ కన్నిటీని తృప్తిగా భరించి- తన నీడలో - తమ దంపతుల సేవలో - సుఖ శాంతులతో శేష జీవితాన్ని గడపబోతున్న తల్లి సీతమ్మ గారిని గురించి రకరకాల కలలు, రంగు రంగుల అలలై - నింగి కెత్తి మనస్సును - నిలుపుతున్నాయి మరొక లోకంలో.
    అదే రాత్రి -
    అదే యిల్లు-
    అవలి గదిలో అస్పష్టమైన భయాల బరువును నిద్రలేమి తోడూ రాగా - నలిగి పోతున్న పావని మనస్సు -- పెళ్ళి మలుపు కావల దాగి - కంటికి కనిపించని భవిష్యత్తును - పోల్చుకుంటానికి ప్రయత్నిస్తున్నది.
    స్వామి పట్ల తనకు ద్వేషం లడు. అపేక్ష లేదు. అసలు నిశ్చింతగా ఒక అభిప్రాయమూ లేదు.
    సగం సగం మగత లో స్వామిని భర్తగా ఊహించుకుని -- తన జీవితం ఎలా వుంటుందో చిత్రించుకుంది పావని మనస్సు.
    తండ్రి పడుతున్న బాధలో న్యాయముందనిపించింది. పెళ్లి చేసుకుని - పిల్లలను కని - చాలీ చాలని జీతంతో సంసార రధాన్ని గానుగెద్దు లాగా లాగుతూ - గమ్యంతో సంబంధం లేకునా తిరిగే గానుగెద్దు లాంటి జీవితం ! బడినుంచి ఉస్సురుమంటూ భర్త యింటికి వస్తాడు. సైను లాల్చీ విప్పి దండెం మీద గిరవాటు పెడ్తాడు. చిటికెడు ఉప్పు వేసి తానందించిన గ్లాసెడు మజ్జిగనూ అమృతం లా త్రాగి - అరుగుల మీద సర్కస్ చేస్తున్న ట్యూషన్ కుర్రాళ్ళ తో యుద్దానికి బయలుదేరి - చేసినంత సేపు సాము చేసి - గబులుమళ్ళి - తటాలున లేచి వంటగదిలో తిరగమోత పెడుతున్న తన ప్రక్కన పీట వేసుకు కూర్చుని లాలనగా వీపు నిమురుతాడు. ఏ మున్సుబు గారో పంపిన ములక్కాయ ముక్కలతో తానూ కాచిన కందికట్టు గరిటలో పోసుకు త్రాగి రుచి చూసి 'బ్రహ్మాండం' అంటూ చెంప మీద చిటికే వేస్తాడు. లొట్టలు వేస్తూ జుర్రుకు తింటాడు. రైలు పొగలా దుమ్ము రేపుతున్న దుప్పటిని దులిపి , పక్క వేసిన నులక కుక్కి మీద -- పవ్వళిస్తాడు, సరసన నవ్వుకుంటూ బళ్ళో కుర్ర కుంకలతో తాను ఆడిన చమత్కారపు మాట ఏదో గుర్తుకు వచ్చి -
    ఆ నులక మంచం -
    దానిమీదనే తామిద్దరూ ముచ్చట్లు చెప్పుకోవాలి.
    కోపాలూ తాపాలూ తీర్చుకోవాలి.
    తన సౌందర్యానికీ, యౌవన సౌభాగ్యానికీ - కాంక్షల వెల్లువకూ కన్నీటి వరదలకూ -- అదే హంస తూలిక తల్పం -- అదే సాక్షి. అదే తోడు. భారీ వర్షాలతో ఆ మూలనుంచి ఈ మూలకు -- వీలును బట్టి రంగులు మార్చే రాజకీయ నాయకుని మాదిరి - అది మారుతున్నా -- తన బాధ్యతను విస్మరించదు.

 Previous Page Next Page