పార్టీ ముగిసి రాత్రి పదిగంటలకి యింటికి వెళ్ళేసరికి-గుమ్మంలో సునీత ఎదురొచ్చి కొత్త పెళ్ళి కూతురికి, పెళ్ళి కొడుక్కి హారతి యిచ్చి లోపలికి తీసికెళ్ళింది. ముసిముసి నవ్వులు నవ్వుతూ బెడ్ రూమ్ తాళం రాజేష్ చేతికి యిచ్చి 'హావె నైస్ టైమ్-గుడ్ నైట్' అని గబగబ వెళ్ళిపోయింది-రాజేష్ ఆమె నవ్వులు అర్ధం కాక అర్చన వైపు ఏమిటన్నట్టు చూసాడు-అర్చన నవ్వి తెలియదన్నట్టు తల ఆడించింది-రాజేష్ బెడ్ రూమ్ తాళం తీసాడు. సునీత తాళం అడిగింది ఎందుకో అర్ధం అయింది. సునీత గది స్వరూపం పూర్తిగా మార్చేసింది. డబల్ కాట్ మీద తెల్లటి పాల నురుగులాంటి కొత్త దుప్పటి పరిచింది-ఎప్పుడు ఆర్డరిచ్చి తెప్పించిందో మంచానికంతా నార్త్ యిండియన్ స్టెయిల్లో, సినిమాల్లో మాదిరి మల్లెలు దండలు వేలాడుతున్నాయి. అగరవత్తులు వెలుగుతున్నాయి. డ్రస్సింగ్ టేబిల్ మీద-టేబిల్ మీద నీళ్ళ జగ్, రెండు పాల గ్లాసులు, పళ్ళు, మిఠాయిలు...గది అంతా సెంట్ స్ప్రేచేసింది గాబోలు-కమ్మటి వాసన...ఆ గది అలంకారం చూసి రాజేష్ మొహం సిగ్గుతో ఎర్రబడింది. అర్చన గుమ్మం దగ్గిరే బిడియంగా ఆగిపోయింది. ఈ అనుభవం తనకు రెండోసారే అయినా, మొదటిసారి కలగని ఏదో పులకింత, ఆమెని కుదిపింది. మూడేళ్ళు కాపురం చేసినా ఎన్నడూ కలగని ఏదో అనుభూతితో ఆమె శరీరం చిన్నగా కంపించింది-లజ్జితురాలైన అర్చనని చూసి రాజేష్... 'సారీ అర్చనా....ఇదంతా నాకిష్టంలేదు. పెళ్ళిలాగే యిదీ సింపుల్ గా, మామూలుగా అతిసహజ వాతావరణంలో జరగాలని... నీకు ఏదీ గుర్తు రానంత మామూలుగా, నేను నీకు కొత్త వాడిని కాను అనిపించేలా వుండాలనుకునే హనీమూన్ వగైరాలు కూడా వద్దనుకొన్నాను....ఈ సునీత యిలా చేస్తుందనుకోలేదు. సారీ..." అన్నాడు.
"ఇందులో సారీ చెప్పడానికి ఏముంది రాజేష్.....నా కంటే ఈ అనుభవాలు పాతపని, నీ వెందుకు అన్నింటికీ దూరం అవాలి. నా మూలంగా పెళ్లి వేడుకలు కూడా జరగలేదు. ఇదే ఇంకోరిని చేసుకుని వుంటే ఎంత ధూమ్ ధామ్ గా జరిగేది. మీ వాళ్ళు ఎంత ఆర్భాటంగా చేసే వారు పెళ్ళి. కనీసం సునీత వుండబట్టి, ఈ మాత్రం చేసింది. సంతోషించాల్సిన విషయం గాని విచారించడానికి, క్షమాపణలు చెప్పడానికి ఏముంది...' అర్చన తేలిగ్గా అంది.
రాజేష్ నెమ్మదిగా ఆమె దగ్గిరికి వచ్చి ఆమె భుజాల మీద చేతులు వేశాడు-ఆమె కళ్ళలోకి చూస్తూ. "అర్చనా రెండేళ్ళ తపస్సు ఈనాటికి ఫలించింది. దేవిగారు ఎం వరాలు యిచ్చి ఈ భక్తుడిని అలరిస్తారో చూడాలి మరి..." చిలిపిగా అన్నాడు-అర్చన కళ్ళు చెమర్చాయి. చటుక్కున అతని గుండెల మీద వాలిపోయింది" రాజేష్..అలా మాట్లాడి నన్ను సిగ్గు పరచకు. వరాలు యిచ్చింది నీవు. ఏనాడు ఏ పూజ చేసుకున్నానో, ఏ చిన్న పుణ్యం చేశానో...అన్నీ పోగొట్టుకున్నాను యింకేం లేదు అని దుఃఖపడే వేళ...నేనున్నాను అంటూ వచ్చి నా చేయి అందుకుని వరాలు యిచ్చిన దేవుడిని....నీకు నేనేం యివ్వగలను రాజేష్-నా దగ్గిర పవిత్రంగా మిగిలింది నా హృదయం మాత్రం. అది నీకే అంకితం అయిపోయింది....ఈ దేహాన్ని నీ మంచి తనంతో ప్రక్షాళన చేశావు.....నీ ఉదారతతో ఈ శరీరాన్ని పునీతం చేశావు. నీ సంస్కారంతో నా హృదయాన్ని గెల్చుకున్నావు.....ఈ మనసు, ఈ శరీరం....నా సర్వస్వం నీకే అంకితం......రాజేష్ ఈ రోజు ఈ ప్రపంచంలో నాకంటే ఎవరూ అదృష్టవంతులు లేరనిపిస్తుంది....' ఆమె గొంతు రుద్దమయింది....అతని గుండెల్లో మొహం దాచుకుని గత స్మృతులని కడిగేసుకున్నట్టు జలజల కన్నీరు కార్చింది. రాజేష్ ఆమెని మనసారా గుండెలకి హత్తుకున్నాడు.
ఆమె అదృష్టాన్ని ఆమె కన్న కూతురే పరిహసిస్తుందని, ఆమెకు దక్కిన అదృష్టాన్ని అనుభవించనీయకుండా ఆమె కన్న బిడ్డే అడ్డుగోడయి ఆమె మనశ్శాంతిని హరిస్తుందని ఆనాడు అర్చనకి తెలియదు కనక....తను అదృష్టవంతురాలినని....కష్టాలు కడతేరి కథ సుఖాంత మయిందనే అనుకుంది కాని.....కథంతా ముందే వుందని ఆమెకు ఆనాడు తెలియలేదు.
* * *
"అర్చనా....ఇంక ఆలస్యం చెయ్యకుండా పూజని తీసుకురా. యింక వదిలేస్తే బాగుండదు. అందరూ ఏమన్నా అనుకోగలరు...."పెళ్ళయిన నెల రోజుల తరువాత బ్రేక్ ఫాస్ట్ టేబిల్ దగ్గర అన్నాడు రాజేష్ ఆ నెలరోజులూ ఎంత తొందరగా గడిచిపోయాయో కూడా యిద్దరికి తెలియనంత త్వరగా గడిచిపోయాయి. ఒక్క నెలలోనే మనసులు కలిస్తే వివాహబంధం, ఎంత మురిపించి మరిపింప చేస్తుందో తెల్సింది అర్చనకి. భర్త ప్రేమ, ఆదరణ, అనురాగం అంటే ఏమిటో అర్ధంఅయింది. సున్నితం, లాలిత్వం, సెన్సాఫ్ హ్యూమర్ వున్నమనిషి తోడు నీడ లభిస్తే ఆ ఆడది ఎంత అదృష్టవంతురాలు అవగలదో తెలుసుకుంది. ప్రతి రోజూ ప్రతిక్షణం మనం కావాలనుకున్న మనిషి పొందు మనిషి మనసుకి ఎంత శాంతి, పరిపూర్ణత యివ్వగలదో తెలుసుకుంది. ప్రతి రోజూ ప్రతిసంఘటన అర్చన మనసుని రాజేష్ పట్ల ప్రేమ, అభిమానం, కృతజ్ఞత, గౌరవంతోముంచెత్తాయి. తనకింత అదృష్టాన్నిచ్చిన రాజేష్ ని కన్న తల్లిలా లాలించి, ప్రేయసిలా అనురాగంతో ముంచెత్తి నెచ్చెలిలా అతని భావాలు పాలుపంచుకొని, కార్యేషుదాసి..... సామెతని నిజం చేసింది. అర్చన.......ఉప్పెనలా అతన్ని ప్రేమాభిమానాలతో ముంచెత్తించింది. ఆనంద డోలికల్లో ఓలలాడించింది. అతని సర్వస్వం తనే అని నమ్మకం యిచ్చింది. తనకు అతనేసర్వస్వం అన్న భావన అతనికి కల్గించింది. లాలించి, పాలించి అతని మనసు గెల్చుకుంది ఏ క్షణంలోనూ యీ అనుభవాలు తనకి రెండో సారి అని కూడా గుర్తు రానంతగా అర్చన పాత జీవితాన్ని మరిచి పోయింది.....మనసులు కలిస్తే హానిమూన్ లు - ప్రేమ యాత్రలు పనిలేకుండానే కళ్ళముందే బృందావనాలు, కాశ్మీరులు సృష్టించుకోవచ్చని అర్చనకి అర్ధం అయింది. ఈ నెలరోజులలో తనకో కూతురున్నదన్న విషయం కూడా మర్చిపోగలిగింది అర్చన - రాజేష్ మాటతో ఆమె కాస్త గిల్టీగా ఫీలయింది. ఈ నెలరోజులలో పూజకి ఒక్క ఉత్తరం రాయలేదు. ఫోను చెయ్యలేదు. అనుకోగానే ఆమె హృదయం ఒక్కసారి మూలిగింది. పూజ గుర్తురాగానే ఆమె మనసు ఒక్కసారి మమతతో నిండిపోయింది. గత రెండు మూడు ఏళ్ళుగా పూజని వదిలివేరే వుండడం అలవాటయినా, ఏ శలవులు కలిసి వచ్చినా, వెళ్ళి కూతురిని చూసి వచ్చేది. పూజ చిన్నారి చిట్టి చేతులతో వచ్చీరాని ఇంగ్లీషులో ఉత్తరాలురాస్తే దాచుకుని పదే పదే చదువుకునేది వారానికి ఓసారి ఫోనులో మాట్లాడేది. స్కూలుకి శలవు యివ్వగానే పూజని తీసుకుని యింటికి వెళ్ళేది అలాంటిది ఈ నెల రోజులూ కనీసం ఫోనన్నా చెయ్యలేదు తను అనుకోగానే ఆమె గిల్టీగా ఫీలయింది- అత్తగారూ వాళ్ళు ఏమనుకున్నారో పెళ్ళి చేసుకుని మొగుడితో కులుకుతూ పిల్లని మరిచిపోయిందనుకున్నారేమో -" అర్చన మొహంలో భావాలు గుర్తించినట్లే రాజేష్.