భగవంతుడా! ఎంత పని జరిగింది?"
అతను చటుక్కున మంచం దిగాబోయాడు.
"ఊ!" అని మత్తుగా మూలుగుతూ, అతని చుట్టూ చెయ్యేసింది సుదీర నిద్రలోనే.
ఆమె చేతిని తొలగిస్తూ "సుదీరా! సుదీరా!" అని పిలిచాడు భరత్ కంగారుగా.
తన మీద తనకే కోపంగా ఉంది అతనికి! ఏం పని చేశాడు తను! ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు! ఎంత తప్పు జరిగిపోయింది.
ఏమయిపోయాయి తన నీతి నియమాలు, ఆచార వ్యవహారాలూ, సంప్రదాయాలు, కఠోరమయిన నిగ్రహం! ఎలా మంట కలిసిపోయాయి?
పక్కనే టేబుల్ మీద ఉండవలసిన అలారం టైం పీస్ కింద పడి బద్దలై ఉంది.
పశువులాగా పెనుగులాడుతూ, ఆ ఉద్రేకంలో తన్నేశాడా ఈ గడియారాన్ని తను?
జుగుప్స కలిగింది భరత్ కి. శ్వాస దుఃఖంతో కలిసిన, ములుగులా బయటికి వస్తోంది.
అతని వెన్నుని మృదువైన హస్తం తాకింది. అరచేత్తో ఆప్యాయంగా నిమిరింది సుదీర.
"భరత్!"
"........."
ఐ లవ్ యూ భరత్!"
"సుదీరా! నన్ను క్షమించండి! నేను పశువులా ప్రవర్తించాను సుదీరా! నన్ను క్షమించండి!" సమ్మోహనంగా నవ్వింది సుదీర.
"నన్ను నేను ఎప్పుడో ఒకప్పుడు మీకు అర్పణ చేసుకోక తప్పదు. అది కొంచెం ముందరే జరిగిపోయింది. దానికి క్షమార్పణ ఎందుకు?"
"నేను నీతి లేకుండా ప్రవర్తించాను.'
చిన్నగా నవ్వింది సుదీర. "మీరేమి పరదారతో సరదాను తిర్చుకోలేదే! నేను మీకు కాబోయే భార్యనే! ఎందుకంత తలకిందులైపోతారు?"
"మీరు ఏమన్నా చెప్పండి సుదీరా! నేను విషయం తప్పి........"
లాభంలేదు! ఇతనితో గట్టిగా ఉండాల్సిందే! అని నిశ్చయించుకుంది సుదీర. అందుకని పదునుగా గొంతు పెట్టి "నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను అని అంత బాధ పడిపోతారెందుకు? అంత ఘనకార్యం చేసే ధైర్యం మీకేక్కడిది? జరిగినదంతా నావల్లే! నేనే చేశాను!" అని ఆగి, ఇష్టంగా అతని వేపు చూస్తూ, "ఐ హావ్ రేప్ డ్ యూ.........ఒకే!" అంది.
నోరు తెరచి, కళ్ళు అప్పగించి, అలాగే చూస్తూ ఉండిపోయాడు భరత్.
"సారీ! అలా అన్నానని కోపం వచ్చిందా? నిజం చెప్పాలంటే , మిమ్మల్ని మించిన మగడు లేడు- ఉండడు- వుండబోడు!" అంది సుదీర. తమకంగా ఉంది ఆమె గొంతు.
తేరుకోవడానికి చాలాసేపు పట్టింది భరత్ కి.
"ఇది పాపమే అంటారా? అయితే సరే! ఆ పాపమంతా నా నెత్తినే వేసుకుంటాలెండి! మీరేం దిగులు పడిపోనక్కర్లేదు." అంది సుదీర. మళ్ళీ కోపం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ.
బలహీనంగా నవ్వాడు భరత్.
అవును! ఈ అమ్మాయి తనకి కాబోయే భార్య! తొందరపాటు వల్ల తప్పే జరిగిపోయింది. ఇది మరి అంత భయంకరమయిన అపరాధమేమి కాదు. త్వరలోనే తమ వివాహం జరగబోతోంది.
వెంటనే అతనికి తను చెయ్యవలసిన చెల్లెలి పెళ్ళి, మనసులో మెదిలింది. దానితో బాటే దయాకర్ గుర్తొచ్చాడు.
వెంటనే చెప్పాడతను. "మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను సుదీరా! మళ్ళీ మరచిపోతానెమో! నాకు చాలా కావలసిన ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతనికి బాంకులోను కావాలి. కొన్ని టెక్నికల్ అబ్జేక్షన్స్ వల్ల లోను గ్రాంటు కావడం లేదు. మీరు అతనికి సెక్యురిటి ఇవ్వగలరా?"
"ఎవరతను?" అంది సుదీర బ్లాంకెట్ ని రొమ్ముల మీదకు లాక్కుంటూ.
"దయాకర్ అని!"
-------------
"కారు ఆపండి!" అన్నాడు చింతకాయల బాబా.
"ఏమిటి స్వామి?" అంది సీత.
"ఒక విషయం మర్చేపోయాను! మీ దంపతులిద్దరూ విడాకులు తీసుకున్నారు కదూ ఇదివరకు?"
"అది కేవలం సీలింగు తప్పించుకోవడానికి స్వామీ!"
"అయినా సరే! ఇప్పుడు పూజలో కుర్చోవాలంటే మీరిద్దరూ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి. అది సంగతి. వంద మేకల రక్తంతో స్నానం చేయించి మంత్రాలు చదివినా నీకు మంత్రి పదవి ఎందుకు రాలేదా అని ఆలోచిస్తున్నా! ఇదన్నమాట మెలిక!"
"ఇప్పుడు మళ్ళీ పెళ్ళా?" అంది సీత.
"ఏముంది! గంటల్లో పని! గబగబ మంత్రాలు చదివేస్తాను."
ఇంటికి తిరిగి వచ్చింది కారు. మూడు గంటల తరవాత, మళ్ళీ నూతన దంపతులయిన సీతా, రత్నాకరరావు కారేక్కారు.
అప్పటికి పదకొండున్నర అయింది. సినిమా వదిలారు. బిక్కుబిక్కుమంటూ చింతలతోపు వైపు వస్తున్నాడు దయాకర్.
---------------
"దయాకరా!" అంది సుదీర ఆశ్చర్యంగా. "అతని మీద మీకేమిటి ఇంట్రెస్టు? అతను ఎలా తెలుసు మీకు?"
"దయాకర్ నా చెల్లిలికి కాబోయే భర్త సుదీరా! ముందు వాళ్ళ పెళ్ళి జరిపించి తరువాత మనం మ్యారేజ్ చేసుకుందా."
ఎక్కడో పిడుగు పడ్డ చప్పుడు!
బిగుసుకుపోయింది సుదీర. కాసేపు దుర్భరమైన నిశ్శబ్దం! చాలా సేపటి తరువాత, మాటలు కూడదిసుకుంటూ అంది సుదీర. "ఆ సంబంధం నాకు ఇష్టం లేదు.'
"అదేమిటి? - ఎందుకని?" అన్నాడు భరత్ ఆశ్చర్యంగా..
"నాకు ఇష్టం లేదు. ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు."
"సుదీరా?"
"నేనెందుకు చెబుతున్నానో అర్ధం చేసుకోండి."
"అర్ధంకాకే అడుగుతున్నాను" అన్నాడు భరత్ కొంచెం తీవ్రంగా.
"ఈ పెళ్ళి జరగనివ్వను నేను!"
భరత్ తనను తాను కష్టం మీద నిగ్రహించుకుని అన్నాడు, 'అతను ఇష్టపడ్డాడు. భారతి ఇష్టపడింది. నాకూ నాన్నగారికి కూడా ఇష్టమే!"
"అలాంటప్పుడు నీకు ఇష్టమయితే మాకేం, ఇష్టం కాకపోతే మాకేం. మధ్యలో నువ్వు ఎవర్తివి? అంటారు అవునా?"
"అలా ఎండుకంటాను సుదీరా! ఎందుకు వద్దంటున్నావో కారణం చెబితే........"
"కారణం! కారణం! షిట్. అల్ రైట్! చెబుతాను. ఆ దయాకర్ కి బతికి బయటపడే లక్షణాలు లేవు."
స్థభించిపోయాడు భరత్.
"ఎందుకని?"
"అదంతే!"
"ఎలా తెలుసునని అడుగుతున్నాను!"
"నా మాట మీద నమ్మకముంటే నేను చెప్పినట్లు చెయ్యండి. లేకపోతే లేదు......." అంది సుదీర విసురుగా లేస్తూ.
ఆమె మనసు అల్లకల్లోలంగా అయిపొయింది.
రత్నాకరరావు తగువు పెట్టుకున్న వాడెవడు ఇంతవరకూ బతికి బట్ట కట్టలేదు. ఒకవేళ దయతలచి చంపకుండా వదిలేసినా ఆజన్మాంతం క్షణక్షణం కుమిలి పోయేటట్లు అంగవైకల్యం కలిగించి గానీ ఊరుకోడు అతను.
విరోదులకి అంగ వైకల్యం కలిగించడం అతని దృష్టిలో కనిసపు శిక్ష. ఆ విషయంలో మాత్రం ఎవరు వారించినా ఊరుకోడు. పైగా తనకి అడ్డం చెప్పిన వాళ్ళమీదకి కూడా అతని ఆగ్రహం మళ్లే ప్రమాదం ఉంది. అతనితో విరోధం పెట్టుకున్న వాళ్ళు అతని చేతికి చిక్కడం కంటే, ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఉత్త్తమం అనుకుంటారు తెలిసిన వాళ్ళు. చంపడానికి అతను ఉపయోగించే పద్దతులు అతి దారుణంగా , మిగతా వాళ్ళకి హెచ్చరికలాగా, శత్రువులు కలలో కూడా తలుచుకుని జడుసుకునే లాగా ఉంటాయి.
ఈ విషయాలన్నీ ఇంత వివరంగా తెలియకపోయినా, తన తండ్రి చండశాసనుడని , శత్రువుల పాలిటి ప్రత్యక్ష యముడని తెలుసు సుదీరకి.
అలాంటి తన తండ్రితో దయాకర్ విరోధం పెట్టుకున్నాడు.