ఆ సమయంలోనే జ్యోతిర్మయి పిన్ని చెల్లెలు కొడుకు సురేష్ కి పెళ్ళి కుదిరింది.
పెళ్ళి మరో పదిహేను రోజులుందనగానే హడావిడి మొదలైంది.
పెళ్ళి శ్రీకాళహస్తిలో.
ఆ పెళ్ళికి ఎలాంటి డ్రెస్ కావాలా అని నేను పెళ్ళి అని విన్నప్పట్నుంచీ ఆలోచనలో పడ్డాను!
సురేష్ పెళ్ళిలోనే నా జీవితం ఓ కొత్తమలుపు తిరిగింది" అని శతరూప ఆపింది.
డీప్ గా వింటున్న ఇందుమతి ఉలిక్కిపడి, ఆ తరువాత తేరుకుని "ఏమిటమ్మా ఆపేశావ్?"
"ఈరోజు ఇక్కడికి చాలు. మిగిలింది రేపు" అని ఆమె లేవబోతుంటే ఇందుమతి ఆపలేదు.
అమ్మ వెళ్ళిపోతే తాను అంకాళమ్మ గుడికి బయల్దేరవచ్చని ఆమె ఆశ.
"సరే-నేనలా సరస్వతి పిన్నివాళ్ళింటికి వెళ్ళొస్తా" అని ఆమె కూడా తల్లితోపాటు లేచింది.
"ఇంతరాత్రా?"
"టైమెంతయిందనుకున్నావ్? మహా అయితే పదకొండు. ఓ పది నిముషాల్లో వచ్చేస్తాలే" అని తల్లి జవాబుకోసం చూడకుండా బయల్దేరింది.
సరస్వతి పిన్ని ఇంటికి వెళ్ళకుండా అంకాళమ్మ గుడికి వెళ్ళేదారిలో నడుస్తోంది ఇందుమతి.
ఊరు దాటి ఏట్లోకి దిగుతుంటే దూరంగా ఓ నల్లటి ఆకారం కదలడం గమనించి ఠక్కున ఆగింది. భయం వెన్నుపూసను వణికిస్తుంటే అలాగే చూస్తూ నిలబడిపోయింది.
కళ్ళు చిట్లిచ్చి చూసింది ఇందుమతి. తలనుంచి పాదాలవరకు నల్లగా వున్న ఆకారం మనిషిలా లేదు.
మనిషి కాదంటే ఇక మిగిలేది దెయ్యమే, ఆ ఊహతోటే చెమటలు పట్టాయి ఇందుమతికి.
వెన్నెల ఇప్పుడు పచ్చపువ్వు విచ్చుకుంటున్నట్లు లేదు. మచ్చల పాడు ఒళ్ళు విరుచుకుంటున్నట్టుంది. గాలి సుతారంగా తగలడం లేదు. కత్తిలాగా కోసేస్తున్నట్టుంది. వెనక్కి మళ్ళితే ఇక ఆ రోజుకి భరణిని కలుసుకోవడానికి వీలుండదు. మరో అరగంట గడిస్తే మరింత నిశ్శబ్దం పేరుకుపోతుంది. రాళ్ళు సైతం ప్రాణం పోసుకుని నడుస్తున్నట్టు తోస్తుంది.
నల్లటి గీతల్లాగా నిలుచున్న చెట్లు జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా కనిపిస్తాయి. వెన్నెల తెల్లటి గంధకపు పొగలాగా చుట్టుకుంటుంది.
అలాంటి సమయంలో ఒంటరిగా వెళ్ళాలంటే కనీసం అరడజను గుండెలైనా వుండాలి.
ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్ళాలి. భరణిని కలుసుకుంటే ఇక ఆ తరువాత ఈ భయాలుండవ్. మరి నిలుచున్న ఆ ఆకారం ఏమిటి? అది ఎటూ వెళ్ళడంలేదు. కదిలితే మనిషోకాదో తెలిసిపోతుంది. కానీ అది కదలదేమిటి?
అమ్మ నిద్రపోయుంటుందా? సురేష్ పెళ్ళితో తన జీవితం ఓ మలుపు తిరిగినట్టు చెప్పింది. ఆ మలుపు ఏమిటి? వినాలన్న కుతూహలం వుందిగానీ కధ వింటూ కూర్చుంటే భరణిని మరి చేరుకోలేం.
భరణిని తన జీవితపంధాను మార్చడానికి ఆ దేవుడే స్వయంగా పంపించినట్టు తనకు తోస్తుంది. వెళ్ళాలి. భరణిని కలుసుకోవాలి.
అతనితో దూరంగా పారిపోవాలి. ఈ కుళ్ళునుంచి, ఈ దరిద్రం నుంచి కన్నీళ్ళకు దొరకని ఓ చుక్కల ప్రపంచంలోకి దూసుకెళ్ళాలి.
అమ్మ పెద్దగా చదువుకోకపోయినా తనకథ ఎంత బాగా చెబుతోంది. ఏమాత్రం అబద్ధాలు లేకుండా, మొహమాటాలు లేకుండా అంత నిజాయితీతో చెప్పాలంటే ఎంతో మంచిమనసుండాలి.
అమ్మ అలా స్కూల్ కి ఎగ్గొట్టకుండా చదువుకునుంటే తన జీవితం ఖచ్చితంగా ఇలాగ వుండేదికాదు. పాతిక్కీ పరక్కీ వెదుక్కోవాల్సిన అవసరం వుండేదికాదు. ఇలాంటి జాగ్రత్తలు తను నేర్చుకోవాలనే అమ్మ కథ చెప్పడం ప్రారంభించింది.
అవునూ ఇంతకీ సురేష్ పెళ్ళిలో ఏం జరిగింది? అది తను తెలుసుకోవాలంటే రేపు వుండకతప్పదు. ఎలాగూ ఆ నల్లటి ఆకారం ఇప్పట్లో కదిలేట్లులేదు. కాబట్టి తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం ఉత్తమం. ఈరోజు వెళ్ళకపోయినా వచ్చిన నష్టం ఏమీలేదు.
అమావాస్య వరకు భరణి తనకోసం వెయిట్ చేస్తూ వుంటాడు. చివరిసారి అన్నట్లు అటుకేసి పరికించి చూసింది. నల్లటి ఆకారం భూమిలోకి పాతుకుపోయినట్లు కదలడంలేదు.
తన ప్రయాణాన్ని రేపటికి వాయిదా వేసుకుని తిరిగి ఇంటికి బయల్దేరింది ఇందుమతి.
* * *
తెల్లవారుజామున నాలుగ్గంటలకు వచ్చి పడుకోవడంవల్ల ఆలస్యంగా లేచాడు భరణి. లేవడం వేడివేడి కాఫీ తాగాలనిపించి వంటగదిలోకి వెళ్ళాడు.