"ఆ పిక్చర్ మాటలు, పాటలు కూడా పూర్తిచేసి తెస్తానని ప్రొడ్యూసర్ తో చెప్పారుగా!".
"అడిగినదానికి సమాధానం చెప్పు సరోజా!" అని ఆయన అనగానే -
"తెచ్చేనండి" అన్నాను.
"వెరీగుడ్! అడిగిన ప్రశ్నకి ఎస్ ఆర్ నో అని ఏదో ఖచ్చితమైన సమాధానం చెప్పు. అంతేకానీ ఎదురు ప్రశ్న వేసే అలవాటు మానుకో" అని, "మొత్తం తమిళ్ వెర్షన్ తెలుగులోకి అర్ధంతో సహా వచ్చేసిందా?".
"ఆఁ" అన్నాను.
"తమిళ్ రాయడం, చదవడం బాగా వచ్చినట్టేనా?"
"ఈ పిక్చర్ తో బాగా వచ్చేస్తుందనుకుంటున్నాను"
" 'గంధర్వకన్య' పాటలెలా వచ్చాయంటావు?"
"రాసినప్పుడు లేని సందేహం ఇప్పుడెందుకొచ్చింది?"
'అబ్బా' అన్నట్టు కుడిచేత్తో నుదిటినోసారి రుద్దుకున్నారు.
అడిగినదానికి సామధానం సరిగ్గా చెప్పనందుకే ఆ రియాక్షనని - నాకు అర్ధమయ్యింది.
అదేమిటో, ఆ తెగులు నా కిప్పటికీ పోలేదు. కావాలని చేస్తున్నది కాదు. స్వభావసిద్దంగా నాలో ఊరిపోయిన జబ్బు అనుకుంటాను.
ఒక్క శ్రీశ్రీగారితోనే కాదు. ఎవరితోనైనా అడిగినదానికి రిప్లయ్ అలాగే వుంటుంది. కానీ అర్ధం కూడా అందులోనే వుంటుంది.
ఈ తెగులు పోవడానికి ఏం చెయ్యాలో అర్ధంకాక ఒక్కోసారి పిచ్చెత్తుతుంది.
"సరే - ఇక రూముకి వెళ్ళిపోదామా" అని లేచారు.
"టైమెంతయ్యిందండి" అన్నాను.
"తొమ్మిది గంటలవుతోంది".
"పదండి పోదాం. రెండు మూడు రోజుల్లో కొత్త పిక్చర్ డైలాగ్స్ కూడా పూర్తిచేస్తే బాగుంటుంది" అన్నాను.
"నీ ఓపికే" - అన్నారు.
"మీరు విసుక్కోకుండా పనికి కూర్చుంటే, నేనెంతయినా శ్రమపడతానన్నాను.
"ఆ సంగతి తెలుసుకనకే నిన్ను పెర్మినెంట్ అసిస్టెంట్ గా నియమించాలను కుంటున్నాను -" అన్నారు.
"నా జీవితంలో అది మరువలేని రోజు.
శ్రీశ్రీగారు సున్నితంగా చీవాట్లు పెట్టినా, చాలా ఆప్యాయంగా, హాయిగా మాట్లాడతారు.
నా ఆనందానికి అవధుల్లేవు.
బృందావన్ గార్డెన్స్ లోనే నాలుగు రోజులు ఉండిపోయాం.
గురువుగారి మూడ్ కూడా బాగుందేమో, కొత్త పిక్చర్ డైలాగ్స్ కూడా పూర్తి చేసేశాం.
తరువాత వరుసగా మూడురోజులు రికార్డింగ్ పెట్టారు. మాధవపెద్ది, రాణి కూడా వచ్చారు.
బైజుబావరాలో 'దూరుకోయిగామ్' అన్న వరుసలో ఒక పాట, 'బచ్ పన్ కి మొహబత్ కో' అనే వరుసలో ఒక పాట, 'ముఝె భూల్ గయే సాఁవరియా' అన్న ట్యూన్ కి దగ్గరగా వున్న ఒక ఏడుపు పాట - మొత్తం మూడు పాటలు నా చేత పాడించారు.
మిగతా పాటలు మహాత్మా పిక్చర్స్ వాళ్ళ బంధువుల పిల్లలిద్దరూ, రాణి, మాధవపెద్ది కలిసి పూర్తిచేశారు. రోజుకి నాలుగు పాటలు చొప్పున ధన్ ధన్ మని లాగేశాం.
"డబ్బింగ్ మద్రాసులోనే ఫిలిం సెంటర్లో ఏర్పాటుచేస్తా"మని చెప్పారు. భానుమతిగారి రికార్డింగ్ వుంది. వెంటనే రమ్మని మద్రాసు నుండి వైరొచ్చింది.
మేము మళ్ళీ మద్రాసు చేరుకున్నాం.
రాత్రంతా యింట్లోనూ, పగలు ఆఫీసులోనూ కూర్చొని నాలుగు రోజుల్లో మొత్తం తెలుగు పిక్చర్ మాటలు ఒక పెద్ద పుస్తకంలోనూ, ఆర్టిస్టుల పోర్షన్లు చిన్న పుస్తకాల్లోనూ ఎక్కించేశాను.
ప్రొడ్యూసర్లు మా పనికి చాలా సంతోషించారు. పనివున్నా లేకపోయినా వాళ్ళ ఆఫీసులోనే కూర్చునేవాళ్ళం. అదే వాళ్ళకి మహదానందం.
ఇకపోతే పాటలు ఫైనలైజ్ చెయ్యడంతోపాటు మాటలు, పాటలు కూడా మూవియోలో చెక్ చెయ్యాలి.
రికార్డు వెయ్యడం - దాంతోపాటు, అది లేకుండా కూడా నేను చెవికోసిన మేకపిల్లలా అరవడం (పాడడం)...
శ్రీశ్రీగారా పాటలు రాసేలోగా నా చేత మూడు చెరువుల నీళ్ళు తాగించారు. శ్రీశ్రీగారితో కలసి పనిచెయ్యడం ఇంత కష్టమా అనిపించేశారు. ఆ పాటలరాయటం కూడా ఎంతో కష్టం -
"ఎందుకలా పోట్లాడుకుంటా"రని ప్రొడ్యూసరడిగితే, అది పోట్లాట కాదు సార్! మా విషయం మీరు పట్టించుకోకండి. అన్న టైముకి మీ పని పూర్తి చేస్తున్నామా లేదా అనే చూడండి. మీ పిక్చర్ మా బుర్ర తినేస్తోంద"ని వాళ్ళతో చెప్పేదాన్ని.
"ఇలాగైతే ఏం దారండీ" - అని శ్రీశ్రీగారి దగ్గర గోలపెట్టేదాన్ని?
* * *
శ్రీశ్రీగారు కొట్టిన దెబ్బ
అర్ధంలేని వాదన, చిరాకు, నిముషానికో మూడ్...
మొత్తం మీద శ్రీశ్రీగారితో వేగడం కష్టమే అనే భావన ఏర్పడింది.
ఏం చేస్తాం? ఎక్కడైనా ఎవరి దగ్గరైనా పనిచేయాల్సిందే. ఈ బాధలు ఎవరితోనైనా తప్పవు ఆ పడే బాధలేవో ఈయనతోనే పడదాంలే! - అని ఎప్పటికప్పుడే సర్దుకుపోయేదాన్ని.
మూడ్ వస్త్ఘే ఆరు నెలల పని ఆరు రోజులలో చేసేసి ఆశ్చర్యపరచేవారు లేదా 'అసలు ఏమిటీ మనిషని?' - అనిపించేలా ప్రవర్తించేవారు. అది కూడా అందరి దగ్గరా కాదు. నా దగ్గరే అలా వుండేవారు.
"ఏమిటండీ! అసలు మనిద్దరం ఎందుకిలా పోట్లాడుకుంటున్నాం? కారణం ఎవరు?" అనడిగితే.
"నువ్వే! నీవల్లే మనకీ దెబ్బలాట" - అనేవారు.
"నేనేం చేశానండి? రాయమంటాను. 'వీడు పిక్చర్ తీసేదేమిటి?' రికార్డింగ్ పెట్టే వేళకి పాట ఇవ్వలేకపోతానా?' - అంటూ ఆలస్యం చేసి ఆఖరి నిమిషం సతమతమై పోవడం ఎందుకంటాను. అందుకేనా మీకా చిరాకు?" అని నేనంటే.
"అవును సరోజా! అదే నా కిష్టం లేదు. నాకు తెలీదూ! ఎప్పుడు ఏ పని చెయ్యాలో, నువ్వు చెప్పాలా? నీ పని నువ్వు చూసుకో, నన్ను వదిలేయ్" - అనేవారు.
"మిమ్మల్ని వదిలేస్తే ఈ పిక్చరయినట్లే, ఈ ఒక్క పిక్చర్, దయచేసి ఎలాగో ఒడ్డెక్కించండి" - అని ప్రాధేయపడేదాన్ని.
ఒకవేళ పిక్చర్లు వచ్చినా, ఈ పద్దతిలో ఎన్ని పిక్చర్లని చెయ్యగలం? అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లో శని వుందన్నట్లు ఇతనికి మూడ్స్ ఎక్కడినుంచి దాపురించాయనిపించేది.
ఓసారి - "సరోజా! పాటలన్నీ రెండు కాపీలు తీసేశావుగా" - అని అడిగారు.
"తీశానండి" - అని ఎదురు ప్రశ్న వెయ్యకుండా చచ్చినట్టు సమాధానం చెప్పాను. లేకుంటే మళ్ళీ ఆయన మూడ్ ఎక్కడ పోతుందో అని భయం. ఏదో విధంగా రాసేసి నా ముఖాన పారేస్తే తర్వాత నా అవస్థలు నేను పడొచ్చులే అన్న తాపత్రయం వల్ల ఖచ్చితంగా సమాధానం చెప్పడం ప్ర్రారంభించాను.
"ఏదీ నాకో కాపీ ఇచ్చి నువ్వొకటి తీసుకో. రికార్డు పెట్టి...ఈ పాట అరవంలో ఎవరు పాడారు?" అనడిగారయన.
"టి.ఎమ్.ఎస్. పాడారండి" - అన్నాను. (అంటే టి.ఎమ్. సౌందర రాజన్)
"ఆ ట్యూన్ జాగ్రత్తగా పట్టు. మొదటి పాట తియ్యి. అది ముందు రాసేద్దాం.
ఒకటికి రెండు సార్లు విని ట్యూన్ ని జాగ్రత్తగా గమనించేను.
"ఆ ట్యూన్ కి 'తననా'లు చెప్పు" అన్నారు.
"నాకు తెలీదండి" అంటే,
"ఇదిగో ఇలాగ" - అని ఆయనే చెప్పేశారు.
"ఏదీ పల్లవి.... 'తేడి వందేనే పుళ్ళిమానే'.....అర్ధం చెప్పు" అన్నారు.
"లేడిపిల్లను వెతుక్కుంటూ వచ్చానే అని అర్ధం" - అన్నా.
"గుడ్.....ఏదీ మళ్ళీ పాడు" - అన్నారు. పాడాను.
'గుడ్ పల్లవి చెప్తాను రాయి.
తేడి వందేనే పుళ్ళిమానే
లేడి పిల్లేదీ పారిపోయే" అని చెప్పేసరికి నాకు మతిపోయింది.
అరవంలో కొంతమంది ఆర్టిస్టుల లిప్ కి 'వ' అనే అక్షరం మీద మ,ప,బ - అక్షరాల్లో ఏది వేసినా చక్కగా సరిపోతుంది.
అంతవరకూ మనసులోనే మధనపడుతున్న నేను అంతా మరచిపోయి, 'అబ్బా! పల్లవి ఎంత బాగుందండి. లిప్ బ్రహ్మాండంగా వుందండి" - అని వారి ముఖం చూశాను. 'అలాగా' అన్నట్టు హుషారుగా కనిపించారు.
అంటే అప్పుడప్పుడు బాగుందని అంటూ వుంటే ఇంకా ఉత్సాహంగా త్వరగా రాస్తారని అర్ధం చేసుకున్నాను.
అలా అన్న దాన్ని ఊరుకోవచ్చుగా.